9, మార్చి 2025, ఆదివారం

అయాం ఎ బిగ్ జీరో (107) – భండారు శ్రీనివాసరావు

 

నువ్వు ఇక్కడ మాట్లాడకుండా బతకలేవు, అక్కడ మాట్లాడితే బతకలేవు ఎలా?

హైదరాబాదు నుంచి ఇనుపతెర (ఐరన్ కర్టెన్) దేశంగా పేరుపడిన సోవియట్ రష్యాకు వెళ్లబోయేముందు ఒక జర్నలిస్టు మిత్రుడు హాస్యస్పోరకంగా చేసిన హెచ్చరిక ఇది.

రష్యన్ గూఢచారి వ్యవస్థ కేజీబీ గురించి, ఎక్కడ ఏమి జరిగినా క్షణాల్లో పసికట్టగల ఆ సంస్థ సమర్ధత గురించి ఊహాగానాలతో కూడిన అనేకానేక కధనాలు అప్పటికే చాలా ప్రచారంలో ఉండేవి.

నేను మాస్కో వెళ్ళిన కొత్తల్లో పరిస్థితులు గమనిస్తే ఆ కధనాల్లో వాస్తవం ఉందేమో అనిపించేది.

మేము నివాసం వుంటున్న ఊలిచ్చ వావిలోవా నుంచి రేడియో మాస్కో ఆఫీసుకు వెళ్ళడానికి దగ్గరలో ప్రాఫ్తు యూజినయా అనే నోరుతిరగని మెట్రో స్టేషన్ వుండేది. అక్కడ మెట్రో ఎక్కితే సరిగ్గా పద్నాలుగు నిమిషాల్లో రేడియో స్టేషన్ చేరవచ్చు. మా అపార్ట్ మెంట్ వెనుక ఒక విశాలమైన మంచు మైదానం వుండేది. ఆ మంచు దారి మెట్రో స్టేషన్ కు అడ్డదారి. అలాకాకుండా మెయిన్ రోడ్డు దారిలో వెళ్ళాలి అంటే చాలా సమయం పట్టేది. అంచేత మా సహోద్యోగులు ఆ మంచు బాటనే వెళ్ళేవాళ్ళు. వాళ్ళ వెంట అడుగులో అడుగు వేసుకుంటూ నేను.

మాస్కో వెళ్ళిన మొదట్లోనే నన్ను, మాపిల్లలను హెచ్చరించారు, ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లో వేగంగా నడవ వద్దని. ఏ మాత్రం అజాగ్రత్తగా వున్నా కాలుజారడం తథ్యం. అందుకే సరదాగా అనేవాళ్ళు, మగవాళ్లు కూడా కాలు జారే ప్రమాదం మాస్కోలో వుందని. ఆఫీసుకు అని బయలుదేరి కాలో చేయో విరగగొట్టుకుని, ఆసుపత్రి పాలయిన వాళ్ళ కధలు చాలా చెప్పేవాళ్ళు. కాలు విరుగుతుందని భయం లేదు కానీ ఆ మంచులో నడక చాలా కష్టం. కాలు తీసి కాలు పెట్టినప్పుడు మోకాలు పై వరకు మంచులో దిగబడేది. అలా మంచులో కూరుకు పోయిన కాలిని పైకి లాక్కుని నడవడం నాకు ఇబ్బందిగా వుండేది. మరో సమస్య తెల్లగా మెరిసే ఆ మంచు. నల్ల కళ్ళ జోళ్లు లేకుండా బయటకు వెడితే  సూర్యరశ్మిలో ధగధగలాడే ఆ మంచు మైదానం కళ్ళు మిరుమిట్లు కొలిపేది. మరో విచిత్రం ఏమిటంటే అక్కడ ఎండ కూడా  చల్లగా వుంటుంది. మంచు కూడా ఆ ఎండకు కరగదు.  

ఈ బాధలు పడలేక నేను నెమ్మదిగా మరో రూటు ఎంచుకున్నాను. మా ఇంటి ముందే బస్ స్టాపు. ఒకటే బస్సు అరవై ఆరో నెంబరు. అది ఎక్కితే తరువాత రెండో స్టాపు నేను వెళ్ళాల్సిన మెట్రో స్టేషన్. ఆ రూట్లో ఒకరో ఇద్దరో   చాలా అరుదుగా కనిపించేవారు. దాదాపు నేను ఒక్కడినే ఆ బస్ స్టాపులో కనిపించే ప్రయాణీకుడిని. ఆ ఒక్క బస్సు తన చిత్తం వచ్చినప్పుడు వచ్చేది. అయినా నేను ఓపికగా నిలబడేవాడిని. మెట్రో స్టేషన్ దగ్గర దిగి మెట్రోలో కొంచెం ఆలస్యంగా రేడియో స్టేషన్ కు వెళ్ళేవాడిని.  అసలు ఇంగ్లీష్ తెలియని దేశంలో మెట్రో అనే పేరు ఎందుకు పెట్టారా అనే సందేహం నన్ను ఇప్పటికీ తొలుస్తూనే వుంది. మెట్రో స్టేషన్ వున్న ప్రాంతంలో మనకు ఎక్కడా స్టేషన్ కనపడదు. అక్కడ ‘ఎం’ అని ఇంగ్లీష్ అక్షరంతో ఒక బోర్డు వుంటుంది. అక్కడ అయిదారు ఎస్కలేటర్లు వుంటాయి. పాసు వున్న వారికి నేరుగా వెళ్ళే వీలు వుంటుంది. లేకపోతే అయిదు కోపెక్కులు (అయిదు పైసలు) మిషన్లో వేస్తే ఎస్కలేటర్ ద్వారం తెరుచుకుంటుంది. దాని మీదుగా కిందికి వెడితే అటూ ఇటూ మెట్రో  ప్లాటుఫారాలు కనిపిస్తాయి.

మూడు రూబుళ్ళు పెడితే నెల రోజులు వాడుకునే  ట్రావెల్ పాస్ దొరికేది. దీనికోసం ఎక్కడికో పోయి, ధరకాస్తులు పెట్టి, రుసుములు చెల్లించి కొనుక్కోనవసరం లేదు. ప్రతి చిన్న దుకాణంలో కూడా ఇవి దొరుకుతాయి. ఈ పాసు వుంటే, నెల మొత్తం ఎన్నిసార్లు అయినా, అది మెట్రో కావచ్చు, బస్సు కావచ్చు, ట్రాము కావచ్చు, కరెంటుతో నడిచే ట్రాలీ బస్సు కావచ్చు ఎందులో అయినా ఎంతదూరం అయినా, ఎంత సేపైనా  ప్రయాణం చేయవచ్చు. మరో సులువు ఏమిటంటే ఈ పాసును మనమే కాదు, మనకు అవసరం లేనప్పుడు మరెవరైనా వాడుకోవచ్చు.

రైలు వెళ్లి పోతోందే అని కంగారు అవసరం లేదు. నిమిషాల్లోనే మరో రైలు దాని వెంటనే వస్తుంది. భూగర్భం నుంచి బయటకి రాకుండానే వివిధ ప్రాంతాలకు వెళ్ళే మెట్రో  రైళ్లు మారే ఏర్పాట్లు చేశారు.  ఆ స్థాయిలో అనేక ప్లాటుఫారాలతో  జంక్షన్లు నిర్మించడం చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. పైన రోడ్ల మీద కార్లు, బస్సులు, ట్రాములు, ట్రాలీ బస్సులు తిరుగుతుంటే, వాటి కిందనే మెట్రో రైళ్లు ప్రయాణిస్తుంటాయి. మరో అద్భుతం ఏమిటంటే మనం భూగర్భంలో మెట్రోలో వెడుతుంటే మన పైనే మరో మార్గంలో మరో మెట్రో వెడుతూ వుంటుంది. ఆ విషయం మనకు తెలియదు.   (ఇప్పుడు మాస్కో నగరంలో మెట్రో రూట్ల సంఖ్య  రెట్టింపుకంటే  పైమాటే అంటున్నారు)  

వెళ్ళిన కొత్తల్లో మరో విషయం గమనించాను. రైళ్ళలో, కానీ మెట్రోల్లో కానీ సాధారణంగా ఎవరూ ఎవరితో మాట్లాడుకోరు. ఎక్కిన వెంటనే చేతి సంచీలో నుంచి ఒక పుస్తకమో , లేదా దినపత్రికో తీసి చదువుకుంటూ కూర్చుని, తమ స్టాపు రాగానే నిశ్శబ్దంగా దిగిపోయేవారు. దీనికి కారణం నిరంతర నిఘా అనేవారు.  

కేజీబీ అంటే ఎంత భయం అంటే మొగుడి మీద, భార్య, భార్య మీద మొగుడు నిఘా వేస్తారు అనే స్థాయిలో వుండడం,  ఎవరు కేజీబీ ఏజెంటో  అన్నది వాళ్ళకే తెలియకపోవడం ఇత్యాది కారణాలు ఈ నిశ్శబ్ద వాతావరణానికి దారి తీసింది అని నోళ్ళు నొక్కుకునే వారు. నేను వెళ్ళేటప్పటికే మిహాయిల్ గోర్భచేవ్ ప్రకటించిన గ్లాస్ నోస్త్ (దాపరికం లేకపోవడంగా అర్ధం చెప్పుకోవచ్చు) పెరిస్త్రోయికా విస్తృత ప్రచారంలో వున్నాయి. మెల్లమెల్లగా భయం సడలుతున్న రోజులు. అయినా మనసు మూలల్లో పైకి  చెప్పలేని అనుమానాలు. గతంలో ఎప్పుడో, బహుశా  స్టాలిన్ హయాములో కావచ్చు, ఇలాగే,  నా విధానాలు నచ్చని వాళ్ళు నిర్భయంగా  చేతులు పైకి ఎత్తండి, ఏమీ కాదు  అంటే ఆ సమావేశంలో వున్న అతి కొద్దిమంది భయం భయంగానే చేతులు ఎత్తారట. మరునాడు వారి జాడ కనిపించకుండా పోయిందట. సైబీరియాలోని కాన్సంట్రేషన్ క్యాంపులకు వారిని తరలించి ఉంటారని సందేహం. ఇలాంటి కధనాలకు లెక్కే లేదు.  

అయితే నేను వెళ్ళే నాటికి  పరిస్థితితుల్లో మార్పులు మొదలయ్యాయి. ముందు మందకొడిగా మొదలైనా కాలం గడిచే కొద్దీ మార్పులు క్రమంగా వేగం అందుకున్నాయి. ఆఫీసులో నా కొలీగ్ విక్టర్,  ముందు నసుగుతూ, తర్వాత గొణుగుతూ ఏవేవో చెప్పేవాడు. అర్ధం అయ్యేది కాదు. నాలుగేళ్లు గడిచేసరికి బహిరంగంగానే మాట్లాడ్డం మొదలుపెట్టాడు. ఒక రోజు ఏదో రష్యన్ పత్రికలో పడిన వార్తను గురించి నాకు చెప్పడంతో ప్రజల్లో భయసందేహాలు పూర్తిగా తొలగిపోయాయి అని నాకు అనిపించింది. ప్రజాస్వామ్య దేశాల్లో కూడా ఆ స్థాయిలో సాధారణ  పౌరుల నుంచి విమర్శలు రావడం అరుదు. (సోషల్ మీడియా లేని రోజులు అవి)

ఇంతకీ విక్టర్ చెప్పిన వార్త ఏమిటంటే, నిజానికి అది వార్త కాదు, లెటర్స్ టు ది ఎడిటర్ కాలంలో ఒక పాఠకుడు (పౌరుడు) సోవియట్ ప్రధానికి రాసిన బహిరంగలేఖ.

“అయ్యా గౌరవనీయులైన ప్రధాని గారూ! మొన్న ఒక టీవీ కార్యక్రమంలో మీరు కాలికి మేజోళ్ళతో కనిపించారు. అవి ఏ దుకాణంలో దొరుకుతున్నాయో చెప్పి పుణ్యం కట్టుకోగలరు”

ఇదీ ఆ ఉత్తరం సారాంశం. చలి దేశంలో మేజోళ్ళు వంటి నిత్యావసరాల కొరత గురించి ప్రభుత్వానికి తెలియచెప్పడానికి ఆ పౌరుడు  ప్రయోగించిన వ్యంగాస్త్రం అన్నమాట.

ఏ భయం అయినా కొద్ది రోజులే! మనుషులను అణచి వుంచడం అంత సులభం కాదు.         

 

ఉపశ్రుతి:

అన్ని దేశాల్లో ఇతర దేశాల దౌత్య సిబ్బందికి ప్రత్యేక హోదాలు, ప్రతిపత్తి వుంటాయి. అలాగే వారి మీద నిఘా కూడా అదేవిధంగా వుంటుంది. ఒకప్పటి కమ్యూనిష్ట్ రష్యాలో ఈ నిఘా మరింత ఎక్కువ. ఇండియన్ ఎంబసీలో పనిచేసే సిబ్బంది ఇంటినుంచి బయలుదేరి ఆఫీసుకు చేరేసరికి ఉజ్జాయింపుగా యెంత సమయం పడుతుందనేది రష్యన్ గూఢచారి సంస్థ కేజీబీ వాళ్ళు ముందుగానే లెక్క వేసుకునేవాళ్ళు. ఏ రోజున అన్నా, ఎవరయినా దౌత్య ఉద్యోగి ఆఫీసుకు చేరుకోవడం ఆలస్యం అయిందని తెలిస్తే చాలు, అతను ఆ సమయంలో ఎక్కడికి వెళ్ళాడు అనే దానిపై ఆరాలు మొదలయ్యేవి. అలాగే దౌత్య సిబ్బంది కుటుంబ సభ్యుల కదలికలపై కూడా కన్నేసి ఉంచేవారు.

ఇంటికి రాగానే తాళం వేసివుంటే, మా ఆవిడ ఎక్కడికి పోయిందో తెలుసుకోవడానికి అపార్ట్ మెంటు ముందు వున్న సెంట్రీని వాకబు చేస్తే సరిపోయేది, ఆవిడ ఏ సమయానికి ఏ షాపులో వుందో, ఆ సెంట్రీకి యిట్టే తెలిసిపోయేది’ అని ఇండియన్ ఎంబసీలో పనిచేసిన ఒక అధికారి ముచ్చట్ల మధ్యలో చెప్పేవారు. ఇందులో కొంత అతిశయోక్తి వుండవచ్చేమో కానీ వాస్తవ పరిస్తితికి అద్దం పడుతుంది.

దౌత్య సిబ్బంది ఇళ్ళల్లో పనిచేయడానికి రష్యన్ యువతులను ‘ఉపాదిక’ అనే రష్యన్ సంస్థ ఏర్పాటు చేసేది. వినడానికి సంస్కృత పదం మాదిరిగా వున్నా నిజానికి అది కాదు. ఆ రష్యన్ అమ్మాయిలతో యెంత జాగ్రత్తగా వుంటే అంత మంచిది. మన ఇళ్ళల్లో వాళ్ళు, వాళ్ళ పనులు చేసుకుంటూనే ఒక చెవి ఇటు, ఒక చెవి అటు పడేసేవాళ్ళు. రహస్యాలు చేరవేయడంలో సిద్ధహస్తులు అని చెప్పుకునేవాళ్ళు.

 కింది ఫోటో:

మెట్రో సింబల్  



 

(ఇంకావుంది)

కామెంట్‌లు లేవు: