నిన్న ఎలా గడిచిందో ఈరోజు అలా, రేపు మళ్ళీ అలానే.
ధరలు పెరగవు, క్యూలు తరగవు. అదే వాతావరణం. ఇందులో మరో గమ్మత్తు. మన
దగ్గర ఎండ కాసినా రాత్రికి కొంత చల్లబడుతుంది.
అక్కడ చలి అలా కాదు. ఉదయం కంటే మధ్యాన్నం చలి కొంత తగ్గవచ్చు. రాత్రికి మరింత
తగ్గవచ్చు. లేదా పెరగవచ్చు. అందుకే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడే టీవీలో ఆనాటి
వాతావరణం ఎప్పుడు ఎలా వుంటుందో చూసుకుని,
తగిన దుస్తులు వేసుకుని బయలుదేరాలి.
హైదరాబాదు నుంచి మళ్ళీ
వెళ్లి అలాటి మార్పులేని మాస్కో జీవితంలో
పడ్డాము.
ఆఫీసుకు వెళ్ళడం రావడం.
చేతిలో సంచీ పట్టుకుని కనపడ్డ క్యూలో నిలబడి దొరికిన ప్రతిదీ కొనడం. ఇంటికి వచ్చి
ప్యాకెట్ ఓపెన్ చేసి చూసి, పనికొచ్చేది
అయితే వాడుకోవడం, పనికిరానిదయితే డస్ట్ బిన్ లో పడేయడం. డబ్బుకు చింత
లేదు. పొదుపు చేసి కూడబెట్టి లాభం లేదు.
రష్యన్ రూబుళ్ళు ఏ ఇతర దేశంలో పనికిరావు. పిలిపెంకో అనేవారు రూబుల్ తాయిలెత్ బూమాగా (టాయిలెట్ పేపర్) అని. ఇక్కడ ఒక మనవి.
నాకు రష్యన్ రాదు. మేము అక్కడ వున్నప్పుడు విన్న పదాలని నాకు బోధపడిన విధంగా,
గుర్తు చేసుకుని రాస్తున్నాను. రష్యన్ తెలిసిన వారు ఎవరైనా సరైన పదం చెబితే తగ్గట్టుగా సరిచేసుకుంటాను.
హైదరాబాదు నుంచి తిరిగి
మాస్కో వెళ్ళేటప్పుడు మా వాళ్ళు ఇచ్చిన కారాలు, పచ్చళ్ళు, క్రేన్
వక్కపొడి పొట్లాలు, కాఫీ పొడుం
పొట్లాలు, టీ ప్యాకెట్లు వగైరా వగైరా సూటుకేసుల నిండా సర్దుకుని తీసుకు వెళ్ళాము. టీ
ప్యాకెట్లు రష్యన్ మితృలకు చిరుకానుకలుగా ఇవ్వడానికి. వాళ్లకు ఇండియన్ టీ అంటే
మోజు. అలాగే చార్మినార్ కంపెనీ వారి చార్మ్స్ సిగరెట్లు కూడా తగని ఇష్టం. ఈ సారి
వెడుతూ వెడుతూ ఒక విస్తళ్ళకట్ట కూడా పట్టుకుపోయాను. విస్తరిని డ్రాయింగు రూములో గోడకి అతికిస్తే, చూసిన రష్యన్ మితృలు, ఈ హాండీ క్రాఫ్ట్ బాగుందని అడిగి పట్టుకుపోయేవారు.
ఒక సాయంత్రం మాస్కో
రేడియోలో పని ముగించుకుని ఆఫీసునుంచి బయలుదేరాలని అనుకునే సమయంలో నటాషా ఎదురుగా
వచ్చింది. రష్యన్ భాషలో ‘ట’ లు లేవు, ‘త’లు తప్ప
అనేవారు కలం కూలీ జీ. కృష్ణ గారు. కానీ, నేను మాత్రం కాస్త వత్తిపలికినట్టుగా వుంటుందని
‘నటాషా’ అని పిలిచేవాడిని. నా రష్యన్ భాషా ప్రావీణ్యం పేరు పెట్టి పిలవడం
వరకే. ఆ తరువాత ఏదో సినిమాలో జంధ్యాల చెప్పినట్టు ఆదివారం మధ్యాన్నం టీవీ వార్తలే.
అంటే కేవలం సైగలే.
నటాషా రష్యన్ భాషలో
గడగడా ఏదో చెప్పింది. ఆ చెప్పిన దాన్ని తెలుగు తెలిసిన నా రష్యన్ సహచరుడు
గీర్మన్ అనువదించి చెప్పాడు. ‘నతాషా ఇప్పుడు మీతో మీ ఇంటికి రావాలని
అనుకుంటోంది. మీ ఆవిడ హాండీ క్రాఫ్ట్స్ ఎలా చేస్తారో చూస్తుందట’. మా ఆవిడ ఈ విద్య
ఎప్పుడు నేర్చుకుందని నేను తటపటాయిస్తుంటే, మళ్ళీ ఆవిడే
గుట్టు విప్పింది. కిందటి వారం ఇంట్లో చేసిన కారప్పూస ఆఫీసుకు తెచ్చి సంతర్పణ
చేసాను. కారప్పూస
అలా చుట్టలు చుట్టలుగా ఒకదానిలో ఒకటి అలా లాఘవంగా ఎలా దూర్చామో చూడాలని నటాషా
కోరిక. ఓస్! ఇంత చిన్న కోరిక తీర్చడానికి ఇబ్బంది ఏముంది. ఇద్దరం కోట్లు
తగిలించుకుని మెట్రోలో పడి ఇంటికి చేరాము.
ఇక అప్పుడు మొదలయింది మా
వంటింట్లో కారప్పూస చేసే విధాన ప్రక్రియ ప్రదర్శన. మా ఆవిడ అప్పటికప్పుడు
పిండి తడిపి, ముద్దలు చేసి కారప్పూస గిద్దెల్లో కూరి, బాగా కాగిన నూనె మూకుడులో
వేస్తుంటే, నటాషా కళ్ళార్పకుండా, విభ్రమంగా ఆ యావత్తు
కార్యక్రమాన్ని దీక్షగా వీక్షించింది. చూస్తున్నప్పుడు ఆమె కళ్ళల్లో మెరిసిన
మెరుపులు, కారప్పూస తిన్నప్పుడు కళ్ళల్లో తిరిగిన కన్నీళ్ళలో
కలిసిపోయాయి. ‘ఎంత బాగున్నాయో’ అంది వెడుతూ వెడుతూ, అదేపనిగా కళ్ళు తుడుచుకుంటూ, ముక్కు
చీదుకుంటూ, రష్యను భాషలో, పదేపదే స్పసీబా (థాంక్స్) అని చెప్పుకుంటూ.
నేనున్న అయిదేళ్ళ కాలంలో
నేను గమనించింది ఏమిటంటే రష్యన్లు రోజు మొత్తంలో ఎక్కువ వాడే పదం ఈ స్పసీబా. అలాగే
ఇజ్వేనిచ్ పజాలుస్తా (సారీ! ప్లీజ్).
సంఘజీవనంలో తెలిసో, తెలియకో, మాటలతోనో, చేతలతోనో
సాటివారిని నొప్పించడానికి అవకాశాలెక్కువ. అందుకే, రష్యన్లు
కూడా, మాట మాట్లాడితే ‘ఇజ్వెనీచ్ పజాలుస్త’ (సారీ ప్లీజ్) అంటారు. క్షమించమని
కోరడం భారతీయ సంప్రదాయాల్లో భాగం. కానీ అన్ని సంప్రదాయాల్లాగే ఇది కాలక్రమేణా
కనుమరుగు అవుతోంది. కాలు తొక్కి ‘సారీ’ చెప్పేవాళ్ళ సంఖ్య పెరుగుతోంది.
థాంక్స్, స్పసీబా, ధన్యవాదాలు
ఏ భాషలో చెప్పినా దాని విలువే వేరు.
ప్రతి రోజూ మనం అక్షరాలా
పద్నాలుగువందల నలభయ్ నిమిషాలు ఖర్చు చేస్తున్నాము. వాటిల్లో నాలుగయిదు నిమిషాలను, మనకు ఈ జీవితాన్ని ప్రసాదించిన ఆ
సర్వేశ్వరుడికో, మనకు ఎంతోకొంత ఆనందాన్ని కలిగిస్తున్న తోటివారికో, సౌకర్యాలను అందిస్తున్న పనివారికో ధన్యవాదాలు తెలపడానికి
ఉపయోగిస్తే ఎంతో మంచిది. ఒక రకంగా ఇది మంచి భవిష్యత్తుకు మంచి పెట్టుబడి కూడా.
అంచేత మీకు సాయపడ్డ ప్రతివారికీ కృతజ్ఞతలు తెలపడం మరిచిపోకండి. డబ్బు వెదచల్లినా
కాని పనులు మంచి మాటతో అవుతాయి.
కింది ఫోటో:
(ఇంకా వుంది)
1 కామెంట్:
//డబ్బు వెదచల్లినా కాని పనులు మంచి మాటతో అవుతాయి.//
నూఱు వరహాల మాట చెప్పారు 🙏
కామెంట్‌ను పోస్ట్ చేయండి