31, మార్చి 2025, సోమవారం

అయాం ఎ బిగ్ జీరో (131) – భండారు శ్రీనివాసరావు

 

వీధుల్లో రతనాలు రాశులుగా పోసి విక్రయించిన గుప్తుల స్వర్ణ యుగం గురించి పుస్తకాల్లో చదువుకున్నాము. నిజంగా అలాంటి యుగం ఒకటి ఉందా, వుండడం సాధ్యమేనా అని ఇప్పుడు అనిపిస్తుంటుంది. నా మాస్కో జీవితం అలాంటిదే. ఈ జన్మలో మరోసారి చూడలేనిది, కేవలం చెప్పుకోవడానికి మాత్రమే పనికి వచ్చేది. ఎందుకంటే   ఇప్పటి మాస్కో అప్పటి మాస్కో కాదు, జీవన శైలిలో, జీవనభారంలో పాశ్చాత్య దేశాలను మించి పోయింది.

ఇండియాకు వచ్చి ముప్పయి మూడేళ్లు దాటిపోతున్నా, ఇప్పటికీ వారానికో, నెలకో ఒకసారి మాస్కో వెళ్లి అక్కడ నేను నడయాడిన వీధులను చుట్టబెట్టి వస్తుంటా. ఇదో సరదా నాకు. ఇదెలాగా అంటారా!

ఏదో సినిమాలో ఒక చెంబు లాంటిది ఒకడు సముద్రంలోకి బలంగా  గిరవాటు వేస్తాడు. అది సముద్ర జలాల అలలతో ప్రయాణించి మరో దేశం చేరుతుంది. అలాగే ఈ సోషల్ మీడియా పోస్టులు. నా మాస్కో రాతలు ప్రస్తుతం  మాస్కోలో ఉద్యోగం చేసుకుంటున్న ఎన్.కె.హెచ్. ప్రసాద్ గారనే తెలుగువాడి కంటపడ్డాయి.

ఆయన పేరు నందగిరి ప్రసాద్. నిజానికి వీరితో నాకు పూర్వ పరిచయం లేదు. ఎప్పుడో నా బ్లాగులో,  నా ఒకప్పటి మాస్కో జీవితం గురించి చదివి, గట్టి పట్టుదలతో ప్రయత్నించి, నా ఫోన్ నెంబరు పట్టుకుని ఓ రోజు వీడియో కాల్  చేసారు.

ప్రసాద్ గారు నాకు పరిచయం లేని మనిషి అయినా కూడా, వీడియోల్లో చూస్తూ వచ్చాను కనుక ముఖ పరిచయం లేని మనిషి అని చెప్పలేను.

నిరుడు జులై లో ఒక రోజు ఉదయం ఫోన్ చేసి, హైదరాబాద్ వచ్చాను, సాయంత్రం నాలుగు గంటలకు మీ ఇంటికి వస్తున్నాను, లోకేషన్ షేర్ చేయమ’ని చెప్పి, అన్నట్టే వచ్చేసారు. గత కొన్ని నెలలుగా ఫోన్లో మాట్లాడుతూ వున్నా,  మేమిద్దరం ఒకరినొకరం కలుసుకోవడం ఇదే మొదటిసారి. రెండు గంటలు కూర్చుని మళ్ళీ ఆరు గంటలకు బయలు దేరి వెళ్ళిపోయారు. తాను మరో మూడు నాలుగేళ్లు మాస్కోలో వుంటానని, తాను కూడా (పెళ్లి కాలేదు కనుక) ఒంటరిగానే ఉంటున్నానని, తప్పకుండా వచ్చి తనతో వుండమని మరీ మరీ చెప్పారు. మేము మాస్కోలో వున్నప్పుడు తాను బెజవాడలో స్కూల్లో చదువుతున్నానని, తనకు ఇప్పటి మాస్కో తెలుసుకానీ, నలభయ్ ఏళ్ల క్రితం ఎలా వుండేది అన్నది నా రచనల ద్వారా తెలుసుకున్నానని చెబుతూ, ఇండియా వచ్చినప్పుడు తప్పకుండా కలవాలని అనుకున్నానని, అంచేత హైదరాబాద్ రాగానే మొదటి ఫోన్ మీకే చేసాను అని అన్నారు.

వెళ్ళే ముందు ఆయన్ని ఓ కోరిక కోరాను. ‘వారానికో, పది రోజులకో, నెలకో మీ ఇష్టం, మీరు మాస్కోలో మేము తిరిగిన ప్రదేశాలకు వెళ్లి అక్కడ నుంచి వాటిని చూపుతూ నాకు వీడియో కాల్ చేయండి’ అని. నాకంటే చిన్నవాడు, నా కంటే మంచివాడు అయిన ప్రసాద్ గారు నా మాట మన్నించి అడపా తడపా నాకు మాస్కోని లైవ్ లో చూపిస్తూనే వున్నారు. ఒకప్పుడు నేను అక్కడ వున్న అయిదేళ్ల కాలంలో చూసిన మాస్కోకు ఇప్పటి మాస్కోకు స్థూలంగా పెద్ద మార్పులు లేకపోయినా, ప్రజల జీవన శైలి, వస్త్ర ధారణల్లో వచ్చిన మార్పులు స్పుటంగా కనిపించాయి. మళ్ళీ ఒకసారి మాస్కో వెళ్ళాలనే నా తీరని కోరికను ఆయన ఈ విధంగా తీరుస్తూ వస్తున్నారు.

ఎవరైనా ఫోన్ చేస్తే మాటలు రికార్డు చేయడం, వీడియో రికార్డు చేయడం నైతికంగా తప్పు అనేది నా సిద్ధాంతం. అదీ కాక,  అంత సాంకేతిక ప్రావీణ్యం నాకు లేదు. బహుశా ఈ కారణం చేతనే దానికి ఒక సిద్ధాంతం రూపం ఇచ్చానేమో తెలియదు.

ఇత్యాది కారణాలతో ఆ వీడియోలు నా దగ్గర లేవు. కానీ కొన్ని ఫోటోలు పంపుతామని అన్నారు. చూడాలి.     

మాస్కో ఇండియన్ ఎంబసీలో పనిచేసేవారికి, ఆ రోజుల్లో  రకరకాల రాయితీలతో అనేక రకాల వస్తువులు చౌకలో లభించేవి. రష్యన్ రూబుళ్ళతో జీతాలు తీసుకునే మా వంటి వారికి అవి లభ్యం కావు. ఉదాహరణకు వి ఐ పి సూటు కేసులు మూడు పెద్దవీ, చిన్నవీ ఒకదానిలో ఒకటి అమిరేవి వున్న సెట్టు ఒక్కొకటి మూడువేల రూపాయలకు దొరికేది. ఇది కాక ఒక బ్రీఫ్ కేసు, లేడీస్ మేక్ అప్ బాక్సు కూడా వస్తాయి. దాంతో ఎంబసీ మితృలు దాసరి గారి సహకారంతో మేము రెండు సెట్లు తీసుకున్నాము.

స్టెయిన్ లెస్ స్టీల్ తో తయారుచేసిన బాయిలర్ సైజు  సమావర్లు వంటి రకరకాల సామాగ్రి కొనుగోలు చేయడానికి, కొంచెం ఖరీదుకే అనుకోండి, అయినా మన దగ్గర కంటే చౌకే, అప్పటికే మొదలైన గోర్భచేవ్  సంస్కరణలు కొంత సాయపడ్డాయి. అప్పటివరకు సోవియట్ పౌరులు ఏదైనా  రిపబ్లిక్ నుంచి మాస్కో రావాలి అంటే కొన్ని ఆంక్షలు ఉండేవి. మంచు కురిసే ప్రాంతం కాబట్టి, సరైన వసతి లేకుండా వస్తే, మన దగ్గర మాదిరిగా బస్ స్టేషన్లలో, రైల్వే ప్లాటు ఫారాలమీద రోజులు గడిపే వీలు వుండదని ఏవేవో కారణాలు చెప్పేవారు. మేము తిరిగి వచ్చే ఘడియ దగ్గర పడేసరికి వివిధ రిపబ్లిక్కుల నుంచి జనాల  రాకపోకలు బాగా పెరిగాయి.  వాళ్ళు వస్తూ పోతూ,  తమ వెంట తెచ్చిన తమ రిపబ్లిక్కులలో తయారైన  సరుకులను మాస్కో తీసుకువచ్చి  అమ్మడం మొదలైంది. ఆ విధంగా జార్జియా నుంచి కాబోలు మన దగ్గర స్టార్ హోటళ్ళలో కానవచ్చే పాతిక , ముప్పయి బల్బులు కలిగిన  షాండిలియర్ లు తెచ్చి అమ్ముతుంటే,  ఒకటి కొని ఇంట్లో పెట్టాము. తీరా తీసుకు వెళ్లి చిక్కడపల్లి ఇంట్లో తగిలించి (వెళ్ళేటప్పుడు అక్కడినుంచే వెళ్ళాము కనుక మరో ప్రాంతం గురించిన ఆలోచనే మాకు రాలేదు) స్విచ్చి వేస్తే, వీధిలో ఎలెక్ట్రిక్ పోల్ మీద ఫ్యూజు ఎగిరిపోతుందని మా ఆవిడ భయపెట్టింది. నిజమే మేము వెళ్ళే నాటికి హైదరాబాదులో విద్యుత్ సరఫరా పరిస్థితి అలాగే వుండేది. ఆ భయంతో డబ్బులు (పెద్ద ధర కాదనుకోండి) పోసి కొన్న ఆ షాండిలియర్ ను అక్కడే వదిలేసాం.  అదొక్కటే కాదు, అలాంటివి చాలా వరకు లగేజ్ సమస్య కారణంగా వదిలిపెట్టి వచ్చేసాం. అయినా మేము మా వెంట బెట్టుకుని వచ్చిన పెద్దపెద్ద  కార్టన్లతో   బొంబాయి (ఇప్పుడు  ముంబై) లోని మా రెండో అన్నయ్య రామచంద్ర రావు గారి స్టేట్ బ్యాంక్ అపార్ట్ మెంటు సగం నిండి పోయింది. మధ్యలో ఈ బొంబాయి ఏమిటంటారా?

మామూలుగా రేడియో మాస్కో వాళ్ళు,  మాస్కో నుంచి ఢిల్లీకి  ఎయిర్ టిక్కెట్లు ఏర్పాటు చేస్తారు, ఢిల్లీ రేడియో  అధికారులతో మాట్లాడితే, మీ ఉద్యోగం హైదరాబాదులో కదా, అక్కడకు వెళ్లి రిపోర్ట్  చేయండి అన్నారు. దాంతో, ఢిల్లీ కాకుండా  బొంబాయి మీదుగా హైదరాబాదుకు టిక్కెట్లు కావాలని అడిగాను, బొంబాయిలో అప్పుడు పనిచేస్తున్న  మా రెండో  అన్నయ్యవాళ్ళను దారిలో చూసిపోవచ్చని. ఎలాగూ మూసేసే దుకాణం అనుకున్నారో ఏమిటో, రేడియో మాస్కో వాళ్ళు కూడా నా గొంతెమ్మ కోర్కెలను ఒప్పుకున్నారు. ఆ విధంగా మాస్కో- బొంబాయి- హైదరాబాదు విమాన ప్రయాణం టిక్కెట్లు నా  చేతిలో పెట్టారు. మా అన్నయ్య అప్పుడు, ఇక నుంచి ముంబై అంటాను, అక్కడ స్టేట్ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో ఎండీ ఆఫీసులో పనిచేస్తున్నారు. బ్యాంకు దగ్గరలోనే అన్ని సదుపాయాలతో కూడిన ఉన్నతాధికారుల నివాస సముదాయం వుండేది. మాస్కో నుంచి ఏరోఫ్లోట్ విమానంలో దిగాము. అక్కడ వారం పది రోజులకు పైగానే ఉన్నాము. అంతవరకూ నేను ముంబై చూడలేదు. అంతా తిరిగి, అన్నీ చూసి మళ్ళీ ఎయిర్ ఇండియా విమానంలో హైదరాబాదు, బేగంపేట విమానాశ్రయంలో దిగాము. మా కుటుంబం యావత్తూ మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్ పోర్టుకి వచ్చారు.  లగేజీతో సహా వెళ్లి  పంజాగుట్ట ఆఫీసర్స్ క్వార్టర్స్ లో వుంటున్న మా పెద్దన్నయ్య ఇంటికి చేరాము.

మొత్తం మీద అయిదేళ్ళ ప్రవాసజీవితం ముగిసింది.

కానీ చిత్రంగా మరో కధ మొదలయింది.

ఈ లోగా ఏం జరిగిందో ఏమిటో, మా ఢిల్లీ ఆఫీసు వాళ్ళు హైదరాబాదు రేడియోలో నా స్థానంలో కొత్తగా రిక్రూట్ అయిన పవని విజయలక్ష్మి అనే అమ్మాయికి పోస్టింగు  ఇవ్వడం, ఆమె జాయిన్ కావడం  జరిగిపోయాయి. నన్ను కడప ఫీల్డ్ పబ్లిసిటీ అధికారిగా బదిలీ చేశారు.

ఇప్పుడు మాస్కో నుంచి వెంట తెచ్చిన బండెడు సామాగ్రి, ఓడలో వస్తున్న సామాను సంగతి ఏమిటి?

కింది ఫోటో :




ప్రస్తుతం మాస్కోలో వుంటున్న ప్రసాద్ గారితో హైదరాబాదులో వుంటున్ననేను.

 

(ఇంకా వుంది)

        

ఎదగాలంటే చదవాలి - భండారు శ్రీనివాస రావు

 

'చదివేది డిటెక్టివ్ నవలో, వేయిపడగలో అది వేరు మాట, ముందు చదవడం అలవాటు చేసుకో' అని మా పెద్దన్నయ్య పర్వతాల రావు గారి మాటతో, ఖమ్మం బ్రాహ్మణ బజారు చివర్లో పాత మునిసిపల్ ఆఫీసు దగ్గర వున్న జిల్లా గ్రంధాలయంలో వున్న శరత్ సాహిత్యం, జైనేంద్ర సాహిత్యం, విశ్వనాధ, చలం, శ్రీ శ్రీ, ఆరుద్ర, ముళ్లపూడితో మొదలుపెట్టి, పదో తరగతి పూర్తి కాకమునుపే అన్నీ పుక్కిట పట్టేసాను.
అంతే! మళ్ళీ బుద్దిగా ఒక్క పుస్తకం ఒకే విడతలో, ఏకబిగిన చదివితే ఒట్టు.
ఎన్నో దేశాలు తిరిగినా మ్యూజియాల జోలికి పోలేదు. అంచేత వాటిల్లో వుండిపోయి, అంతర్ధానానికి సిద్ధంగా వున్న 'చదివే అలవాటు' కూడా నా నుంచి దూరమై పోయింది.
చదవడం మానడం అంటే ఎదగడం ఆగిపోవడమే అని మా అన్నయ్య చెప్పిన మాట ఇప్పుడు జ్ఞాపకాల్లోనే మిగిలిపోయింది.

29, మార్చి 2025, శనివారం

అయాం ఎ బిగ్ జీరో (130) – భండారు శ్రీనివాసరావు

 లక్ష రూపాయల పాల సీసా

నేను మాస్కోలో వుండగానే,  ఒకానొక  సుముహూర్తంలో మాస్కో ఇండియన్ ఎంబసీకి నా పేరున ఒక లీగల్ నోటీసు వచ్చింది. బెజవాడలోని పలానా బ్యాంకు  వాళ్లకు నేను బాకీ వున్నానని, అసలు వడ్డీలతో సహా లక్ష రూపాయలు ఖుద్దున చెల్లించాలని కోర్టు వాళ్ళు ఇచ్చిన డిక్రీ అది.  

1987  నుంచి దాదాపు అయిదేళ్లపాటు మాస్కోలో 'పిల్ల జమీందారు' లాగా వెలిగిన నా జర్నలిస్టు జీవితం  1971  ఆగష్టులో విజయవాడ  ఆంధ్రజ్యోతిలో మొదలయింది. ప్రతి ముగింపుకు ఒక ఆరంభం వుంటుంది కదా!


 
అసందర్భంగా అనిపించినా, మాస్కో జీవితం గురించి రాస్తున్నప్పుడు,  అలనాటి పాత రోజులను కూడా నెమరు వేసుకోవడం తప్పనిసరి అనుకుంటున్నాను. అప్పుడు నా నెల జీతం యాభయి రూపాయలతో ఆరంభమయి వంద రూపాయలకు పెరిగి,  1975  లో జ్యోతిని వొదిలిపెట్టే నాటికి నూట యాభయి రూపాయలకు చేరింది. జీతానికీ, జీవితానికీ పొంతన లేని రోజుల్లో, మా పెద్ద పిల్లవాడికి పాలపొడి టిన్నులు కొనడం అనేది గగనంగా వుండేది. ఆ గడ్డు రోజుల్లో ఒక రోజు రామారావనే ఆర్టిస్ట్ మా ఇంటికి వచ్చాడు. నా స్నేహితుడయిన లాల్ మోహన్ అనే మరో ఆర్టిస్ట్ అతడిని నాకు పరిచయం చేసాడు. ఒక విషయంలో నా సాయం కోరుతూ అతడు నా వెంట తిరుగుతున్నాడు. చెప్పాపెట్టకుండా అతడు రావడం నాకూ మా ఆవిడకూ ఆ క్షణంలో అంత బాగా అనిపించలేదు.  అతడు వచ్చిన సమయంలో మేమొక గడ్డు సమస్యతో కొట్టుమిట్టాడుతున్నాము. పిల్లవాడికి పాలు పట్టాల్సిన సీసా కడుగుతుంటే పగిలిపోయింది. రూపాయి ఖరీదు చేసే ఆ సీసా కొనడానికి ఇల్లు మొత్తం గాలించినా యెర్ర ఏగాని దొరకలేదు. పిల్లవాడేమో ఒక పక్క గుక్క పట్టి ఏడుస్తున్నాడు. ఈ సీను చూసి అతడు వెళ్ళిపోయాడు. అమ్మయ్య వెళ్ళాడు కదా అని అనుకునేంతలో మళ్ళీ తిరిగి వచ్చాడు. ఆ వచ్చిన అతడి చేతిలో పాల సీసా కనబడగానే దేవుడే దిగివచ్చాడనిపించింది. పాల సీసా వెల తక్కువే కావచ్చు. కానీ ఆ క్షణంలో,  దానికి ఖరీదు కట్టగల షరాబు లేడనిపించింది.


అన్ని రోజులుగా అతడు నన్నడుగుతున్నది ఒక్కటే. సొంతంగా హోర్డింగుల వ్యాపారం పెట్టాలనుకుంటున్నాడు. అయిదు వేలు లోను కావాలి. జామీను ఇచ్చే వాళ్ళుంటే బ్యాంకు వాళ్ళు లోను ఇస్తామన్నారుట.

ఆ రోజు అడగకుండా అతడు చేసిన సాయానికి ఏదయినా చేసి ఋణం తీర్చుకోవాలనిపించింది. నా అంతట నేనే వెళ్లి బ్యాంకులో అతడి రుణానికి జామీను పత్రంపై సంతకం చేసాను. బహుశా మూడు వేలో, అయిదు వేలో అనుకుంటా. నూట యాభయ్  రూపాయల నెల జీతగాడికి అంత మాత్రం పరపతి దక్కినందుకు ఆనందపడ్డా కూడా. జర్నలిస్టులు జీతాల విషయంలో కుచేల సంతానమే కానీ, పరపతి విషయంలో కుబేరులే.

ఆ తరువాత హైదరాబాద్ ఆకాశవాణిలో ఉద్యోగం రావడం,  నేను విజయవాడ వొదిలిపెట్టడం జరిగిపోయాయి. ఆ తరవాత అతడు ఏమయ్యాడో తెలియదు . పదేళ్ళ అనంతరం, మాస్కోలో వున్నప్పుడు , ఇండియన్ ఎంబసీ ద్వారా నాకొచ్చిన  లీగల్ నోటీసు అదన్నమాట. ఆ పదిహేనేళ్ళలో ఆనాటి ఆ అప్పు పాపంలా పెరిగి లక్ష రూపాయలకు డిక్రీ అయింది. అదే నేనందుకున్న కోర్టువారి శ్రీముఖం. ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, మాస్కోలో ప్రోదుక్తిలో లీటర్లకు లీటర్లు పాలను, మంచి నీళ్ళలా డబ్బు ఖర్చు చేస్తూ కొంటున్నప్పుడు,  నడిచి వచ్చిన దారిలో తొక్కుకుంటూ వచ్చిన ముళ్ళ బాటలు కళ్ళల్లో మెదిలేవి. ఆనాటి దృశ్యాలు సినిమా రీలులా గిర్రున తిరిగేవి.

అందాల రాముడు సినిమాలో డబ్బున్న ఖామందు గారు సెక్రటరీని పిలిచి, ‘నేను ఎక్కే రైలుకు థర్డ్ క్లాసు బోగీలు తగిలించింది ఎవరు' అని గద్దిస్తాడు. ఆ సెక్రటరీ తెలివిగా,  'థర్డ్ క్లాసు వుంటేనే ఫస్ట్ క్లాసు విలువ తెలుస్తుందని తానే తగిలించా'నంటాడు.

నిజమేకదా. కష్టాలు లేకపోతే  సుఖాలకున్న విలువేమిటి?

కంప్యూటర్ మీద టిక్కు టిక్కుమంటూ కొట్టుకుంటూ, మధ్య మధ్య చేతులు నొప్పిపుట్టి మెటికలు విరుచుకుంటున్నప్పుడు చూసి మా ఆవిడ అంటుండేది, ఏమిటీ రాతలు? కూటికా, గుడ్డకా, సినిమాకా? అని.

ఈ రాతల ప్రయోజనం నిన్న తెలిసింది. ఎప్పుడో మాంధాతల కాలం నాడు, 1991లో, మాస్కోలో రమేష్ చంద్ర భార్య కాత్యాయని గారి  సీమంతానికి మా ఆవిడే కర్తా కర్మా క్రియ లాగా వ్యవహరించింది. ముప్పయ్ నాలుగేళ్ల కిందటి ఆ నాటి అపురూపమైన ఫోటోలను రమేశ్ చంద్ర అన్నగారు ఆకెళ్ళ పేరి శివకుమార్ గారు నాకు పదిలంగా  అందించారు. దాదాపు ప్రతి ఫోటోలో మా ఆవిడ నిర్మల వుంది. పక్కన వారి మాతృమూర్తి కమలా దేవి గారు కూడా వున్నారు. ఇంత విలువైన  మంచి జ్ఞాపకాన్ని ఇన్నేళ్ళు భద్రంగా దాచి, నా చేతికి ఇచ్చిన శివకుమార్ గారి రుణం ఎలా తీర్చుకోను. అందుకే నా కంటే వయసులో చిన్నవారయినా, వారికి శత కోటి వందనాలు.  

రాతల వల్ల ఎంత గొప్ప ప్రయోజనం వుందో తెలుసుకోకముందే, మా ఆవిడ తెలియని లోకాలకు తరలిపోయింది. ఎంత గట్టిగా అరచి చెప్పినా వినపడనంత దూరానికి. అందుకే మళ్ళీ ఈ రాతలు.

తోక టపా:

సీమంతం అంటే  గుర్తుకు వచ్చిన మరో జ్ఞాపకం.

2005 లో దూరదర్సన్ నుంచి రిటైర్ అయిన తర్వాత, గవర్నమెంటు  క్వార్టర్ ఖాళీ చేసి ఎల్లారెడ్డిగూడా లోని మధుబన్ అపార్ట్ మెంటుకు చేరాము. మా పక్కన ఒక చిన్న వాటాలో ఓ చిన్న పెళ్ళయిన ప్రేమ జంట దిగింది. ఆమె ప్రైవేటు స్కూలు టీచరు, ఆయన చిన్నపాటి నటుడు. వాళ్ళని చూస్తుంటే మాకు మా కాపురం మొదటి రోజులు గుర్తుకు వచ్చేవి. ఒకే గదిలో సర్దుకుని గుట్టుగా జీవనం సాగించిన రోజులు. ఆమె మా ఆవిడను అమ్మా అని పిలిచేది. ప్రేమ వివాహం, అందులోను కులాంతరం  కాబట్టి మొదట్లో తలితండ్రుల రాకపోకలు వుండేవి కావు. అంచేత  ఆ అమ్మాయి కడుపుతో వున్నప్పుడు, ఆమె సీమంతాన్ని మా ఆవిడ మా ఇంట్లోనే నలుగురు ముత్తయిదువులను పిలిచి శాస్త్రోక్తంగా చేసింది. పుట్టిన పిల్ల  కూడా మా ఇంట్లోనే పెరిగింది. ఎంతయినా అమ్మవొడి  నడిపిన అనుభవశాలి కదా!

 

కింది ఫోటోలు:

మాస్కోలో  కాత్యాయని గారి  సీమంతం ఫోటోలు. ఒక గ్రూపు ఫోటోలో నా పక్కన నిలబడిన సన్నటి  ఆరడుగుల బుల్లెట్ కథానాయకుడు రమేశ్ చంద్ర.

చివరి ఫోటో మధుబన్ లో చేసిన మరో సీమంతం తాలూకు. ఇందులో మా రెండో వదిన విమలాదేవి గారు కూడా వున్నారు. మా ఆవిడ చేసే ప్రతి పనికిఆమె మద్దతు వుండేది.  





















 

(ఇంకా వుంది)  

పుస్తకానికి సత్కారం – భండారు శ్రీనివాసరావు

ఈ వయసులో అసూయ పడడం  ఏమిటి నా మొహం అని నా మొహం మీదే  చాలా సార్లు అనుకోవాల్సివస్తోంది ఈ మధ్య. అదీ, నా కంటే వయసులో చిన్నవాడి మీద.

నాలో ఈ మాత్చర్యానికి కారకుడైన వాడు ఎవరో కాదు, నా స్నేహితుడే. 

ఒక నటికి అభిమానులు వుంటారు, ఒక నటుడికి అభిమానులు వుంటారు. ఒక రచయితకు అభిమానులు వుంటారు. కానీ ఒక పుస్తకానికి అభిమానులు ఏమిటి,  వింతకాకపోతే!

నిన్న ఉదయం ఒక పెద్దాయన ఫోను చేశారు. ఎలాగైనా ఆయన్ని కలవాల్సిందే అని అడిగారు. అదీ వెంటనే. పండగ వస్తోంది అందరూ బిజీ కదా అంటే, అయితే ఈ సాయంత్రం కలుద్దాము అడిగి చూడండి అన్నారు ఆ పెద్దాయన.

అడుగుతున్నది నిజంగానే పెద్దాయన. యూనివర్సిటీ ప్రొఫెసర్. అడగాల్సింది ఇప్పుడు  చెప్పానే, ఆ స్నేహితుడిని. ఆ చనువుతో, కొంచెం సంకోచంతోనే  అడిగితే, ఆ చిన్నాయన   పెద్దమనసుతో ఒప్పుకున్నాడు. 

చివరికి నిన్న సాయంత్రం కలిశాము.…

[1:11 PM, 3/29/2025] Bhandaru Srinivasa Rao: పుస్తకానికి సత్కారం – భండారు శ్రీనివాసరావు 

ఈ వయసులో అసూయ పడడం  ఏమిటి నా మొహం అని నా మొహం మీదే  చాలా సార్లు అనుకోవాల్సివస్తోంది ఈ మధ్య. అదీ, నా కంటే వయసులో చిన్నవాడి మీద.

నాలో ఈ మాత్చర్యానికి కారకుడైన వాడు ఎవరో కాదు, నా స్నేహితుడే. 

ఒక నటికి అభిమానులు వుంటారు, ఒక నటుడికి అభిమానులు వుంటారు. ఒక రచయితకు అభిమానులు వుంటారు. కానీ ఒక పుస్తకానికి అభిమానులు ఏమిటి,  వింతకాకపోతే!

నిన్న ఉదయం ఒక పెద్దాయన ఫోను చేశారు. ఎలాగైనా ఆయన్ని కలవాల్సిందే అని అడిగారు. అదీ వెంటనే. పండగ వస్తోంది అందరూ బిజీ కదా అంటే, అయితే ఈ సాయంత్రం కలుద్దాము అడిగి చూడండి అన్నారు ఆ పెద్దాయన.

అడుగుతున్నది నిజంగానే పెద్దాయన. యూనివర్సిటీ ప్రొఫెసర్. అడగాల్సింది ఇప్పుడు  చెప్పానే, ఆ స్నేహితుడిని. ఆ చనువుతో, కొంచెం సంకోచంతోనే  అడిగితే, ఆ చిన్నాయన   పెద్దమనసుతో ఒప్పుకున్నాడు. 

చివరికి నిన్న సాయంత్రం కలిశాము. ఈ పెద్దాయన ఆ చిన్నాయనకి దుశ్శాలువా కప్పి, ఒక పెద్ద  పుష్ప గుచ్చం అందించారు. అందించి చెప్పారు అయ్యా!  ఈ చిన్న సత్కారం మీరు రాసిన గొప్ప  పుస్తకానికి అని. 

ఆ పెద్దాయన ఈ పుస్తకాన్ని ఆన్ లైన్ లో కొనుక్కుని, ఆమూలాగ్రం చదివి, అమందానందపులకాంకితులై, మరో సారి, ఇంకోసారి చదివేసి ఇక వుండబట్టలేక, ఎలాగైనా దాని రచయితని కలవాలని గట్టిగా డిసైడ్ అయిపోయారు. అంతగా ఆ పుస్తకాన్ని ప్రేమించారన్న మాట. 

నాకిది ఎంతో సంతోషాన్ని కలిగించింది. పుస్తకాలకు మరణం లేదు అని ఆయన ఈ కోరిక నాకు గట్టి నమ్మకాన్ని కలిగించింది.

ఇంతకీ ఆ చిన్నాయన ఎవరంటే ఈమధ్యనే విట్టీ లీక్స్ అనే గ్రంధాన్ని వెలువరించి, మొదటి పుస్తకంతోనే పెద్ద పేరు తెచ్చుకున్న సీనియర్ జర్నలిస్ట్ సాయి శేఖర్. ఆ పెద్దాయన మాజీ ప్రొఫెసర్ ఆకెళ్ళ పేరి శివకుమార్.

నిజానికి వీళ్ళిద్దరూ నాకంటే వయసులో చాలా చిన్నవాళ్లు. కానీ ఆ తర్వాత వారిరువురి నడుమ జరిగిన సాహిత్య గోష్టి చూసిన తర్వాత,  ఓ చిన్నపిల్లాడిలా వారి మాటలు వింటూ వుండిపోయాను. చిన్న ఆకారంలో ఎప్పుడూ నాకేంటికి చిన్నవాడిగా కనిపించే సాయి శేఖర్,  నిన్న అమాంతంగా  వామనుడిలా పెరిగిపోయి తన విశ్వరూప ప్రదర్శన చేశాడు, తెలుగు పద్యాలతో, సంస్కృత శ్లోకాలతో. ఒక్క అక్షరం పొల్లు పోకుండా, ఒక్క స్ఖాలిత్యం రాకుండా.

మచ్చుకు, తానెప్పుడో చిన్ననాడు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో నాగమయ్య మాస్టారు  మహా కవి దండి విరచించిన  వామనావతార వర్ణనను సుష్పష్టమైన స్వరంతో ఇలా వినిపించాడు.  

బ్రహ్మాండచ్ఛత్ర దండ: 

శతధ్రుతిభవనాంభోఋహో నాళదండ: 

క్షోణీనౌకూపదండ: 

క్షరదమరసరిత్పట్టికా కేతుదండ: 

జ్యోతిశ్చక్రాక్షదండస్త్రిభువన విజయస్తంభోంఘ్రి దండ: 

శ్రేయస్త్రైవిక్రమస్తే వితరతు విబుధద్వేషిణాం కాలదండ:


ఇన్నినాళ్ళు ఇంత ప్రతిభ ఎచట దాగెనో అని పాడాలి అనిపించింది.

నేను కృష్ణదేవరాయలని కాదు కానీ, కాలికి  గండపెండేరం తొడగాల్సిన స్థాయి సాహితీ పాండిత్య ప్రదర్శన. 

సెహబాష్! సాయి శేఖర్! 

సాయి శేఖర్ ని కలవడానికి నా సంకోచం ఎందుకో చెప్పలేదు. ఆయన ఆ పుస్తకం రాసిన తర్వాత దాన్ని అందుకున్న మొదటి వరుసలో నేనున్నాను. దాన్ని గురించి రాయాలని అనుకుంటూ నా బిగ్ జీరో గొడవలో పడి, కాలయాపన జరుగుతూ వస్తోంది. ఈ లోగా ఈ కలయిక. ఈ సారి ఆలస్యానికి ఆయనే కారణం. ఇలా  విశ్వరూప ప్రదర్శన చేయకపోతే ఇది రాయకుండా ఆ  పుస్తకం గురించే రాసేవాడిని.

భలే సాకు చెప్పే అవకాశం ఇచ్చిన  మిత్రుడు సాయికి కృతజ్ఞతలు.  

కింది ఫోటోలు:

శివకుమార్, సాయి శేఖర్ లతో నేను. పుస్తకానికి సత్కారం 











(28-03-2025)

28, మార్చి 2025, శుక్రవారం

అయాం ఎ బిగ్ జీరో (129) – భండారు శ్రీనివాసరావు

 1987 లో మేము మాస్కో వెళ్ళింది నాలుగు సూటు కేసులతో. అవీ కోటీ మాల్.  అంతకు ముందు, బెజవాడలో, హైదరాబాదులో వున్నప్పుడు  పెద్దగా  ఇళ్ళు మారింది లేదు కానీ, ఎప్పుడు మారినా రిక్షాల్లోకి సరిపోయే సామాను మాత్రమే వుండేది. అలాంటిది ఇప్పుడు మాస్కో నుంచి  తీసుకువెళ్లాల్సిన సామాను చూస్తే మాకే కళ్ళు తిరిగాయి. అయిదేళ్లుగా కనబడ్డది కనబడ్డట్టు కొన్నాము కదా! అంచేత వాటిని మన దేశానికి తరలించాలి అంటే ఒక లిఫ్ట్ వ్యాన్ కావాల్సి వచ్చింది. మంచి టేకు కర్రతో చేసిన  లిఫ్ట్ వ్యాన్ సైజు ఒక రైల్వే బోగీ అంత వుంటుంది. దాన్ని  భారీ ట్రక్కులో మన ఇంటికి తెస్తారు. సామాను మొత్తం చక్కగా ప్యాక్ చేసి, పొట్టు బస్తాలో పొట్టు కూరినట్టు అందులోకి ఎక్కిస్తారు. తర్వాత దాన్ని రోడ్డు మార్గంలో, దేశంలో ఎక్కడో ఉన్న  ఓడరేవుకు చేర్చి అక్కడ నుంచి నౌకలో మద్రాసు (చెన్నై) చేరుస్తారు. ఇదంతా మూడు నాలుగు నెలలు పడుతుంది.

కొన్న ప్యాకెట్లు విప్పి చూస్తే మూడు వంతులు పనికి రానివి, అసలు అవేమిటో ఒక పట్టాన అర్ధం కానివి వున్నాయి. దుష్టాంగం ఖండించి శిష్టాంగాన్ని కాపాడినట్టు, పనికి రాదు అనుకున్న సామాను అంతా మరో మాట లేకుండా డస్ట్ బిన్ దగ్గర వదిలేసాము.

మా దగ్గర ఉన్న సోఫాలు, మంచాలు, పరుపులు, డ్రాయింగ్ రూమ్ ఫర్నిచర్, ఫోర్ బర్నర్ గ్యాస్ స్టవ్, ఫ్రిడ్జ్, డీప్  ఫ్రిడ్గ్జ్  (ఐస్ క్రీం షాపుల్లో వుండే పెద్ద ఫ్రీజరు), వాషింగ్ మిషన్, చాలా బరువు వుండే  చెకొస్లోవేకియా గ్లాస్ కట్లరీ, సోవియట్ సూవెనీర్లు, బట్టలు, కోట్లు, బూట్లు, ఎన్ని వేసినా, పుష్పక విమానం మాదిరిగా  అందులో కొంత  జాగా మిగిలి పోతోంది. అది ఫుల్ ప్యాక్ అయితే కానీ కుదరదు, ఏవో ఒక సామాను తీసుకురండి అని ట్రక్ వాళ్ళ గోల. లేని సామాను ఎక్కడినుంచి తేము?

దాంతో మా ఆవిడా నేను, పిల్లలం తలా ఒక టాక్సీ వేసుకుని వెళ్లి నానా చెత్త సామాను కొనుక్కువస్తే, అవి లిఫ్ట్ వ్యాన్ లో వేస్తే,  అప్పుడు బయలుదేరింది జగన్నాధరధం ముప్పయ్యారు టైర్ల ట్రక్కు మీద పొందికగా కూర్చుని. అంటే ఎటు అనుకున్నారు. మధ్యలో మరో పెద్ద పాము వుంది. దాని నోట్లో పడకుండా వుంటే పరమపద సోపానం చేరుతుంది. అదేమిటంటే, మాస్కో కష్టమ్స్. ఆ ఆఫీసు ఎక్కడో  మారుమూల వుంది. అక్కడ విదేశాలకు వెళ్ళే లిఫ్ట్ వ్యాన్లను  క్షుణ్ణంగా తరలిస్తారు. నేను, పిల్లలు  ఒక టాక్సీ తీసుకుని దాని  వెంబడే  వెళ్ళాము. అక్కడ ఎంత టైము పడుతుందో ఏమిటో అనుకుంటే వాళ్ళు అడిగింది ఒకే ఒక ప్రశ్న. ఈ లగేజీలో పాలు, పెరుగు వున్నాయా అని. నియత్ (లేవు) అనగానే, ఏమాత్రం  చెక్ చేయకుండా క్షణం ఆలస్యం చేయకుండా, కోపెక్కు (పైసా)  లంచం అడగకుండా ఆమోదముద్ర వేసి పంపేశారు. విదేశీయులు తిండి పదార్ధాలు పట్టుకుపోతే, తమ పౌరులకు ఇబ్బందని ఈ నిఘా పెట్టారని తర్వాత ఎవరో చెప్పారు.

ఒక్క లిఫ్ట్ వ్యాను నింపడానికే  మేము ఇంత హైరానాపడితే, కొందరు రెండు, మూడు లిఫ్ట్ వ్యానులు ఆర్డర్ పెట్టారు. మాస్కో నుంచి రష్యా కొనలో వున్న ఓడ రేవుకి, అక్కడ నుంచి సముద్ర మార్గంలో చెన్నైకి చేరవేయడానికి  ఒక్కో లిఫ్ట్  వ్యాన్ కి వసూలు చేసేది నామమాత్రం రవాణా చార్జి.  పైగా ప్యాకింగు బాధ్యత కూడా వాళ్ళదే. ఈ లెక్కన మాస్కో సగం ఖాళీ అయి వుంటుందని అనిపించింది. మా ఇల్లు ఖాళీ అయినా, చెత్తంతా వదలడంతో తెరిపిగా అనిపించింది. సామాను వెళ్ళిపోయింది సరే! మేము వెళ్ళే దాకా ఎలా. సమాధానం వాళ్ళే చెప్పారు. మేము వచ్చినప్పుడు ఎలా అన్నీ అమర్చి పెట్టారో అలాగే మళ్ళీ సెట్టింగు వేసి ఒప్పచెప్పారు. మళ్ళీ కృష్ణ దేవరాయల ఆస్థానం మొదలు. ఇప్పుడు ఆఫీసుకు పోయే పని కూడా లేదు. లిఫ్ట్ వ్యాన్ వెళ్ళిపోయింది కాబట్టి షాపింగ్ పని కూడా లేదు. వచ్చిన వాళ్లకు వండిపెట్టే  మా ఆవిడ పని మాత్రం షరా మామూలే.

కాస్త విశ్రాంతి దొరికింది కాబట్టి,  ముందు భాగంలో ప్రస్తావించి వదిలేసిన రమేశ్ చంద్ర గారి ముచ్చట చెప్పుకుందాం. అది చెప్పాలి అంటే కొంత నాందీ ప్రస్తావన వుండాలి కదా!

రష్యా కమ్యూనిష్టుల ఏలుబడిలోకి వచ్చిన తరవాత ఏడు దశాబ్దాల పై చిలుకు కాలం, ఆ దేశంలో మతమన్నది కనబడలేదు, మతమన్న మాట వినబడలేదు. అయితే, “మతం మత్తు మందు” అని నమ్మిన కమ్యూనిస్టు పాలకులు కూడా ఆ దేశంలో, ఏ చర్చినీ , మసీదునీ కూలగొట్టక పోవడం విచిత్రం.

సరికదా,  పైపెచ్చు వాటికి  ఏటేటా సున్నాలు, రంగులూ కొట్టి ముస్తాబుచేసి తాళాలువేసి వుంచేవారు. విదేశాలనుంచి వచ్చే గౌరవ ప్రభుత్వ అతిధులకి వాటిని ఎంతో గౌరవంగా చూపించేవారు కూడా. రేడియో మాస్కోలో పనిచేసే విదేశీయులకు కూడా సెలవు రోజుల్లో విహార యాత్రల పేరుతొ చర్చీలు, మసీదులను సందర్శించే వీలుకలిపించేవారు. నేను కూడా కుటుంబ సభ్యులతో కలిసి ఓసారి మాస్కోలోనూ, మాస్కో పొలిమేరల్లోను  ఉన్న పురాతన  ప్రార్ధనాలయాలను చూడడం జరిగింది. అయితే వాటిల్లో ఎక్కడా మతపరమైన కార్యకలాపాలు జరగడం లేదు. ముందే చెప్పినట్టు వాటిని ప్రతిఏటా ఎంతో ఖర్చుచేసి, మ్యూజియంలో మాదిరిగా  పదిలంగా ఉంచుతున్నారు.   

మేము మాస్కోలో వున్న రోజుల్లో ఓ వింత విషయం మా చెవిన పడింది.

మాస్కోలోని లెనిన్ స్కీప్రాస్పెక్త్ (లెనిన్ పేరు పెట్టిన ప్రధాన రహదారి) నిర్మాణ సమయంలోనో, లేదా ఆ రోడ్డును వెడల్పుచేసే సమయంలోనో, పాతకాలం నాటి ఒక చర్చి అడ్డం వచ్చిందట. దాన్ని కూలగొట్టడం లేదా కొన్ని లక్షల రూబుళ్ళు ఖర్చుచేసి  ఆ చర్చి భవనాన్ని పక్కకు జరపడం అనే రెండు ప్రత్యామ్నాయాలు అధికారుల ముందు నిలిచాయి. మతం పొడగిట్టని కమ్యూనిస్ట్ పాలకులకు, ఆ చర్చిని వున్నపలాన పడగొట్టడం చిటికెలో పని.

 అయినా వారు ఆ పని చేయకుండా చర్చి భవనం చుట్టూ కందకం మాదిరిగా తవ్వి, భూగర్భంలో దానికింద చక్రాలతో అమర్చిన  ఉక్కు పలకను ఉంచి, అంగుళం అంగుళం చొప్పున నెమ్మది నెమ్మదిగా ఆ మొత్తం చర్చి భవనాన్ని  ఏమాత్రం దెబ్బతినకుండా, వున్నదాన్ని వున్నట్టుగా దూరంగా జరిపి రోడ్డుపని పూర్తిచేశారని చెప్పుకునేవారు. ఇది నిజమైతే వింతల్లో వింత.

మేము మాస్కోలో వున్నప్పుడు భారత రాయబార కార్యాలయంలో పనిచేయడానికి రమేష్ చంద్ర అనే యువ అధికారి వచ్చారు. హైదరాబాదు వాసి. సీనియర్ జర్నలిస్ట్  వీజేఎం దివాకర్ పూర్వాశ్రమంలో కాలేజ్ లెక్చరరుగా పనిచేసే రోజుల్లో ఈ రమేష్ చంద్ర ఆయన విద్యార్ధి. ఐ.ఎఫ్.ఎస్.కు  సెలక్ట్ కాగానే ఈ తెలుగు యువకుడిని మొట్టమొదట మాస్కోలో పోస్ట్ చేసారు. ఎవరు చెప్పారో, ఎవరిద్వారా తెలుసుకున్నారో తెలియదు కానీ, మాస్కోలో దిగిన వెంటనే మా ఇంటికి ఫోన్ చేసారు. అప్పటికి ఆయన బ్రహ్మచారి. అంచేత వీలున్నప్పుడల్లా మా ఇంటికి భోజనానికి వచ్చేవారు. గొప్ప సాయి భక్తుడు. ఆయనకు ఎలాట్ చేసిన ఫ్లాట్ లో  ఓ గురువారం సాయంత్రం సాయి భజన పెట్టి మమ్మల్ని అందర్నీ పిలిచారు. ఆ తర్వాత  తెలుగువాళ్ళ౦దరి  ఇళ్ళలో ప్రతి శనివారం సాయంత్రం సాయి భజన ఒక  కార్యక్రమంగా మారిపోయింది. మాస్కో యూనివర్సిటీలో డాక్టరీ చదువుకోవడానికి వచ్చిన రవి అనే హైదరాబాదు విద్యార్ధి కూడా సత్యసాయి భక్తుడు కావడంతో అతడి ప్రోద్బలంతో మరికొంతమంది విద్యార్ధులు కూడా ఈ భజన బృందంలో చేరారు. రవి తల్లిగారు విశాలాక్షి హైదరాబాదు టెలిఫోన్స్ జనరల్ మేనేజర్ కార్యాలయంలో పనిచేసేవారు. మేము మాస్కోరావడానికి ముందు నుంచీ ఆ కుటుంబంతో పరిచయం వుండేది. బదరీనాద్ కాబోలు యాత్రకు వెడుతూ దారి మధ్యలో కొండ చరియలు విరిగి పడడంతో విశాలాక్షి దంపతులు దుర్మరణం చెందారు.

మధ్యలో రమేశ్ చంద్ర హైదరాబాదు వెళ్లి, పెద్దలు నిర్ణయించిన సంబంధం చేసుకుని భార్య కాత్యాయని గారిని తీసుకుని మాస్కో వచ్చారు. ఆవిడ గారు కూడా సాయి భక్తురాలే. రష్యాలో కాత్యా అనే పేరు గల ఆడపిల్లలు అనేకమంది తారసపడతారు. కాత్యాయని గారు మాస్కో వచ్చాక కాత్యా అయిపోయారు.

మా రష్యన్ స్నేహితుడు పిలిపెంకో, అయన భార్య కూడా రమేష్ చంద్ర, రవి బృందం నిర్వహించే ఈ సాయి భజనల్లో పాల్గొనేవారు. చక్కటి స్వరంతో వారు భజన గీతాలు ఆలపిస్తుంటే రష్యన్ జంట కూడా గొంతు కలిపేవారు. అంత భారీ మనిషి బాసిపెట్లు వేసుకుని, చేతులతో చప్పట్లు చరుస్తూ,   ‘సుబ్రహ్మణ్యం, సుబ్రహ్మణ్యం’ అని పిలిపెంకో వచ్చీరాని తెలుగులో పాడుతుంటే వినడానికి, చూడడానికి  చాలా విచిత్రంగా వుండేది. అన్నింటికంటే విచిత్రం కమ్యూనిస్టుల ఏలుబడిలో ఉన్న మాస్కో నగరంలో ఇలా వారానికి ఒకచోట సాయి భజనలు జరగడం.

ఆ భజనల మహత్యం, స్వయం ప్రతిభ  రెండూ కలిసి  రమేశ్ చంద్ర ఉద్యోగపర్వంలో అంచెలంచెలుగా ఎదిగి, నిరుడు నవంబరులో విదేశాంగ శాఖ అదనపు కార్యదర్శిగా రిటైర్ అయ్యారు.  

కింది ఫోటో:

భారత విదేశాంగ శాఖలో ఉన్నతస్థానంలో రిటైర్ అయిన శ్రీ రమేశ్ చంద్ర




 

 

(ఇంకా వుంది)