17, మే 2016, మంగళవారం

ఒక విలేకరి కధ


ఈ తరం జర్నలిష్టులకు అంతగా తెలియని పత్రికారచయిత జీ.కృష్ణ గారు. అక్షరాలా కీర్తిశేషులు. కీర్తి మినహా ఏమీ సొంతానికి మిగిల్చుకోకుండా దాటిపోయిన ‘కలం కూలీ’. ఇక, శ్రీ సామల సదాశివ. గొప్ప రచయిత. ఈయనా కృష్ణ గారి బాపతే. అందుకే ఇద్దరికీ అంత స్నేహం. కృష్ణ గారు రాసిన జ్ఞాపకాల సమాహారం – ‘విలేఖరి లోకం’ గ్రంధానికి, ‘అతనికి దిగులెక్కడిది?’ అనే ముందు మాట రాశారు సదాశివ గారు. అందులో..... రాసిన  కొన్ని వాక్యాలు.  (బ్రాకెట్లో నేను రాసినవి – సులభంగా అర్ధం కావడానికి)
“ఇంతకుముందు అతని (కృష్ణ గారి) కోసం ఎవరేది చేస్తానన్నా ఒప్పుకున్నాడా? వల్లమాలిన స్వాభిమానమాయే! మాజీ ముఖ్యమంత్రి అంజయ్య గారు (అధికారంలో వున్నప్పుడు) ఇల్లో ఫ్లాటో ఇస్తానంటే, ‘యెందుకు’ అని ఎదురు ప్రశ్న వేసినాడట. పోనీయండి.  ముఖ్యమంత్రి గారు (అప్పుడు చంద్రబాబు నాయుడు గారు) అతనికి (వైద్యపరంగా) చాలా సహాయం చేసాడని, చేస్తున్నాడని విన్నాను. ముఖ్యమంత్రి గారి దృష్టికి అతని పరిస్తితి తెచ్చిన పుణ్య పురుషుడు ధన్యుడు. ‘ఎవరి రాజ్యంలో కళాసాహిత్యవేత్తలు నిర్ధనులై కష్టపడతారో ఆ దోషం రాజుది’ అన్నాడు భర్తృహరి. ముఖ్యమంత్రి గారు ఈ ఒక్క సత్కార్యంతో ఆ దోషం తమకంటకుండా తొలగించుకున్నారు. ‘ముఖ్యమంత్రిగారు నా గదిలో ప్రవేశిస్తూ ‘ఏమండీ ఈ మాత్రం డబ్బు కోసం బెంగ  పెట్టుకుంటే యెలా? నేనున్నానుగా’ అని నాలో జీవితాశ కలిగించినారు’ అని కృష్ణ నాతో అన్నాడు. ‘మరి, మీ ఇంటికి సిరి వచ్చిన జాడ కనిపించదే’ అంటే ఎమిల్ జోలా కధ చెప్పినాడు” 
సదాశివ ఇంకా ఇలా రాశారు.
“కృష్ణ, కావ్యకంఠ గణపతిముని శిష్యుడు.
‘రంజ్ సే ఖోగర్ హువా ఇన్సాన్ తొ మిట్ జాతా హై రంజ్ - ముష్కిలే ఇత్నీ పడీ ముజ్ పర్ కే ఆసా హోగయీ – బాధలకు అలవాటు పడ్డ మనిషికి ఏదీ బాధ అనిపించదు. ఎన్ని కష్టాలు అనుభవించినానంటే ఇప్పుడు నాకేదీ కష్టమనిపించడం లేదు’ అన్నాడు మీర్జా గాలిబు. గాలిబుకు జీ. కృష్ణకు కొన్ని పోలికలున్నాయి. కృష్ణ కష్టాలకు అలవాటు పడ్డాడు. కాని బాధ పడ్డట్టు కనిపించలేదు. ‘మనసా ధారయన్ దుఃఖం’ అన్నారు రామున్ని గురించి. కృష్ణ ధీరుడే కాని దీనుడు కాదు.
“జీ కృష్ణకు హిపోక్రసీ నచ్చదు. దాపరికం లేని విలేఖరి. స్పష్టంగా తెలియని దోషాలు తమకు తెలిసినట్టు ఆరోపిస్తూ ఎవరినీ ఎండగట్టకూడదు. విలేఖరిగా కృష్ణ కొన్ని విలువలు పాటించాడు.తాను రాసే వాక్యాలకు జవాబుదారీ వహించే రాస్తాడు. బాధ్యతారహితంగా రాసే వాళ్లకి  ఈ ‘విలేఖరి లోకం’ రవంత వెలుగు చూపిస్తే సంతోషం.”


(ఒకనాటి ప్రెస్  క్లబ్ కార్యక్రమంలో కృష్ణగారిని సాదరంగా పలకరిస్తున్న నాటి ఆర్ధికమంత్రి శ్రీ రోశయ్య, క్లబ్  కార్యదర్శి ఎం.ఎస్. శంకర్, యూ.ఎన్.ఐ. విలేకరి శ్రీ పార్ధసారధి, వారి నడుమ క్లబ్ ఉపాధ్యక్షుని  పాత్రలో నేను) 



తోకటపా: నేను నార్లగారి స్కూలు కనుక ‘విలేకరి’ అనే రాస్తాను. ‘ఖరి’ అంటే ‘ఆడగాడిద’ అనేది వారి ఆంతర్యం.  

6 కామెంట్‌లు:

శ్యామలీయం చెప్పారు...

>నేను నార్లగారి స్కూలు కనుక ‘విలేకరి’ అనే రాస్తాను. ‘ఖరి’ అంటే ‘ఆడగాడిద’ అనేది వారి ఆంతర్యం.

భండారు వారూ, వైఖరి అన్న మాటలో కూడా 'ఖరి' ఉంది కదా - అక్కడ ఆడగాడిద ఏది? ఒక మాటలోని కొన్ని అక్షరాలకు ప్రత్యేకమైన అర్థం చెప్పకూడదండీ. ఆకలి లో కూడా కలి ఉందనీ, అశనిపాతంలో శని, పాత అన్నవి ఉన్నాయనీ, మరమరాలు లో మరి ఉందనీ, రమ ఉందనీ ఎంచటం సమంజసమా? అదొక వాదన. ఆ ప్రకారం చూస్తే మీకు నార్లవారు (లేదా వారి శిష్యులు నార్లవారి మాటగా) అలా చెప్పి ఉంటే అది నిశ్చయంగా పొరపాటేను.

అసలు 'విలేకరి' అన్న పదం తప్పు కావటమే కాదు 'విలేఖరి' అన్న పదమే తప్పుడు మాట. సరైన పదం విలేఖకుడు. లేఖరి అన్నప్పుడు వ్రాయసకాడు అన్న అర్థం రావటానికి అభ్యంతరం లేదు కాబట్టి విశిష్టమైన లేఖరి అన్న విగ్రహవాక్యం చెప్పటానికి అనువుగా విలేఖరి అనటం తప్పుడు అభిప్రాయమే. ఎందుకంటే లేఖరి అన్నది కూడా సరైన మాట కాదు కాబట్టి. లేఖకుడు అన్నది మాత్రమే సరైన రూపం ఉద్దిష్టభావానికి. లేఖకపాఠకోత్తముల్ అని పెద్దనగారి ప్రయోగం గుర్తుకు రావాలి మనకు. అందుచేత వైశిష్ట్యాన్ని అంటించి మరీ చెబుతే అది కాస్తా విలేఖకుడు అవుతుంది. అంతే కాని చచ్చినా విలేఖరి ఎట్టిపరిస్థితిలోనూ కాదు. కాని జనంలోని దూరిపోయి ప్రచారంలో జోరుగా ఉన్న అనేకానేక అపశబ్దాల్లో ఈ విలేఖరి అన్నదీ ఒకటి. దానికి తోడు ఆ విలేఖరిలో నార్లవారి కళ్ళు, ఆడో మగో, గాడిదల్ని వెదికితే విడ్డూరమేను!

Zilebi చెప్పారు...



మరీ చోద్యం ఏమిటంటే విలేకరి అన్న పదం ఆంధ్ర భారతి నిఘంటువు లో లేదు (విలేకరుల సమావేశం అన్న పదం ఉంది :)


విలేఖరి అన్న పదం ఉంది -

లేఖకుడు : తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990

.

శ్యామలీయం చెప్పారు...

>విలేఖరి అన్న పదం ఉంది
ఈ పదం ఆంధ్రభారతి వారి నిఘంటువుల సైట్‍లో కనిపించిన చోట 'వ్యావహారికము' అని కూడా ఉంది. సరైన పదాలు కానివి వ్యవహారంలో చాలానే ఉన్నాయి. ఈ సంగతిని నేనూ నా వ్యాఖ్యలో ప్రస్తావించాను. విలేఖరి పదానికీ ఒక అసందర్భమైన సవరణ కారణంగా ఆపదాలను గురించి కొంత వివరించవలసి వచ్చింది. మీకేమైన నా వివరణలో లోపం కనిపించిందా?

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

ఆంధ్రజ్యోతి లోనే కాదు ఇప్పటి అనేక పత్రికల్లో సొంత భాషా ప్రయోగాలు అనేకం చూస్తున్నాం. నార్లగారికి 'యొక్క' అనే పదం నిషిద్ధం. పైగా 'యొక్క' తెలుగు భాషకు 'బొక్క' అనేవారు. అలాగే 'నుంచి' అని రాయాలి, 'నుండి' అని కాదు. 'కూడా' అని రాయాలి, 'గూడా' రాయకూడదు. ఈ ప్రయోగాలను ఇప్పుడు 'STYLE BOOK' అని ముద్దుగా పిలుచుకుంటున్నారు. 'విలేకరి' కరక్టా, 'విలేఖరి' కరక్టా అన్నది కాదు, ఆరోజుల్లో వుండే విశేషాన్ని ఆ విధంగా తెలియచేయాలని అనుకున్నాను తప్ప, ఒకళ్ళ తప్పొప్పులను ఎంచడానికి కాదు.

శ్యామలీయం చెప్పారు...

భండారు వారూ, మీ మనస్సును నొప్పించి ఉంటే మన్నించండి. తప్పెంచటం కాక భాషావిషయకంగా నాకు తోచినది చెప్పటమే నా ఉద్దేశం. అపప్రయోగాలు ముద్దువచ్చే రోజులు వస్తే చెట్టుచేడే కాలానికి కుక్కమూతి పిందెలు అనుకోవటం తప్ప చేయగలది లేదు కదా.

తెలుగుభాషలోనే కాదు సాధారణంగా షష్ఠీవిభక్తి ప్రత్యయం అంత అవసరపడదు. రాజకీయుల ఉతపదంగా మారి పోయింది యొక్క అనే‌ మాట.

మీరు 'నుంచి' అని రాయాలి, 'నుండి' అని కాదు. అన్నారు. అది పొరపాటు అభిప్రాయం. నుండి అన్నదే సరైన ప్రయోగం.


Zilebi చెప్పారు...



@శ్యామలీయం -


మీకేమైన నా వివరణలో లోపం కనిపించిందా?
17 మే, 2016 5:37 [PM]

జవాబు

లేదు

జిలేబి