13, మే 2016, శుక్రవారం

ప్రాప్తి

పండ్లకు రారాజు ‘మామిడి పండు’ అని వికీపీడియా చెబుతోంది.
అయితే, ఈసారి సీజనులో  తెలుగు రాష్ట్రాల్లో ఈ రాజుల రాక చాలా బాగా తగ్గిపోయిందని మీడియా ఘోషిస్తోంది.
సీజనులో తినడం సరే ఏడాది పొడుగునా తినే ఊరగాయ పచ్చళ్ళు జాడీల్లో నిండుగా వుండాలంటే సీజను తప్పిపోకముందే ఆవకాయ కారాలు పెట్టేసుకోవాలి. అంచేత ఏ ఇంట్లో చూసినా ఈ కొత్త కారాల గుబాళింపులే. అమ్మలక్కల నోట్లో కారాల గురించిన ముచ్చట్లే.
ఈసారి సీజనులో ఇంట్లో కాకుండా ఆసుపత్రిలో ఎక్కువ రోజులు వుండడం వల్ల ఈ కొత్త కారాల బాధ్యతను మా ఆవిడ భుజం మీద నుంచి మా ఒదినె, మేనకోడళ్ళు తమ భుజాలకు ఎత్తుకున్నారు. ఆ విధంగా మా ఇంట్లో పెట్టని కొత్త  ఆవకాయ కారాలు మూతులు బిగించి, వాసెన కట్టిన జాడీల్లో మా ఇంట్లో కొలువు తీరాయి.




అంచేత మాకు మరో బాధ్యత కూడా తప్పిపోయింది. చిన్న చిన్న హార్లిక్స్ సీసాల్లో రకరకాల మామిడికాయ కారాలు (ఆవకాయ, మెంతి కాయ, వెల్లిపాయ, నూగాయ, మాగాయ, నీళ్ళావ వగైరా వగైరా అన్నమాట) పెట్టి తెలిసిన వాళ్ళందరికీ పంపి ‘ఎలా వున్నాయని’ కొత్త కారాల రుచులు గురించి వాకబు చేసే అవసరం ఈసారి మాకులేకుండా పోయింది.
(రుచికరంగా వాటిని తయారు చేసి పంపిన మా మేనకోడలు వనం విజయలక్ష్మి, మా రెండో ఒదినె గారు భండారు విమలాదేవి, మేనకోడలు, కోడలూ అయిన రేణు సుధలను, ఆ కారాలు కలుపుకు తిన్నప్పుడు తలుచుకోవడమే మాకు మిగిలింది)

ఒక్కోసారి కొన్ని ఇలా కలిసివస్తాయి కాబోలు.    

కామెంట్‌లు లేవు: