7, మే 2016, శనివారం

జీవితమే ఒక పాఠశాల

సూటిగా....సుతిమెత్తగా..... భండారు శ్రీనివాసరావు

(PUBLISHED IN EDIT PAGE OF "SURYA" TELUGU DAILY ON 08-05-2016, SUNDAY)
NOTE: Roll down further when you open the link to read it with more clarity. Printed under editorial.
LINK:

జీవితం నేర్పే పాఠాలు

జీవించడానికే జీవితం కాదు, నేర్చుకోవడానికి కూడా ఉపకరిస్తుంది. బతుకు బాటలో కనిపించే దృశ్యాల నుంచి కనిపించని వాస్తవాలను చూడగలిగితే, మనిషి జీవితానికి ఒక సార్ధకత లభిస్తుంది. అందుకే ఈ వారం, ఆదివారం మామూలు షరా మార్గం  నుంచి కాస్త పక్కకు మళ్ళి చూడాలనిపించింది. రాయాలనిపించింది. అదే పోయిన వారం నేను  రాయని డైరీ  విశేషాలు.

ఆసుపత్రిలో బోధి వృక్షం 

పండక్కి పుట్టింటికి వచ్చినట్టుగా రెండేళ్ళ కోమారు  ......మా ఆవిడకు తప్పని ఆసుపత్రి సందర్శన.
ముక్కుచెవులకు అన్నింటికీ ఏడువారాల నగలు పెట్టుకున్నట్టు వొళ్ళంతా ఏవిటేవిటో ఆక్సిజన్ మాస్కులూఈసీజీ వైర్లూ. నిశ్శబ్దాన్ని మరింత  భయంకరం చేస్తూ లైఫ్  సేవింగ్ యూనిట్ల చప్పుళ్ళూ. క్షణం పాటు కూడా రెండు కాళ్లు ఒక చోట పెట్టకుండా అటూ ఇటూ తిరుగుతుండే మనిషి నిస్తాణగా ఆస్పత్రి మంచం మీద.  చూడలేక, చూడకుండా వుండలేక అదో రకమైన అర్ధం కాని  అర్ధం లేని మానసిక స్తితి. లోకంలోని జబ్బు మనుషులందరూ ఒక్క చోట చేరినట్టు వున్న  ఐసీయూ నుంచి బయట పడి....
ఆ వెయిటింగు గదిలో కూర్చున్న అందరి వదనాల్లో ఏదో తెలియని ఆందోళన. ఆత్మీయుల ఆరోగ్యం గురించిన మాటలు వినీ వినపడకుండా. ఎవడయినా సూపర్ మాన్ దుడ్డుకర్ర పట్టుకుని ఈ లోకం నుంచి రోగాలను అన్నింటినీ తరిమి కొడితే.... రోగాలు, రోష్టులు తెలియని ఓ చిన్న పాపఅక్కడే  ఆడుకుంటోంది.  తెలియని అందరి దగ్గరి దగ్గరకు వచ్చి తెలిసిన ఆరిందాలా పలకరిస్తోంది.  ఆ పాపాయి నవ్వుతో ఇంకా ఐసీయూలో మా ఆవిడతోనే  వుండిపోయిన   నా మనసు  కొద్దిగా తేరుకుంటోంది.
ఎవరో నలుగురు వచ్చారు. ఇద్దరు మగా మరో ఇద్దరు ఆడవాళ్ళు. వేసుకున్న దుస్తుల్ని పట్టి చూస్తే అంతా   మగవాళ్ళు మాదిరిగా వున్నారు. గలగలా కాకపోయినా కాస్త పెద్దగానే మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ రాకతో కొద్దిగా ఎబ్బెట్టుగా మారినట్టయింది అక్కడి వాతావరణం.
ఒకమ్మాయి అడుగుతోంది ఇంగ్లీష్ లో, కాఫీ కావాలా, టీ కావాలా అని. వారేమన్నారో తెలియదు. వారిలో ఫేషన్ గా జుట్టు వెనక్కి దువ్వి ముడి వేసుకున్న ఓ యువకుడు లేచాడు, కాఫీ కౌంటర్ వైపు కదిలాడు. అప్పుడు కనిపించింది అతడికో కాలు లేదు. ఆ స్థానంలో యంత్రం సాయంతో కదిలించగల స్టీల్ రాడ్. ఒక లిప్త పాటు మనసు అదోలా అయింది. కాలు లేకపోయినా అంత మామూలుగా ఎలా  వుండగలుగుతున్నాడు ? కాళ్ళూ చేతులూ వున్న ఓ మామూలు మనిషి లాగానే  తోటివారికి కాఫీ తేవడానికి ఎలా లేచాడు ? వెంట వచ్చిన వాళ్ళలో కూడా అతడో అవిటిమనిషి అన్న భావం ఏమాత్రం కానరాలేదు. కాలు లేకపోయినా కాఫీ  తెస్తాను అని లేస్తే అదో సాధారణ విషయం అయినట్టు కిమ్మనలేదు, ‘నువ్వేం తెస్తావు, కూర్చో’ అంటూ లేనిపోని సానుభూతి ఒలకపోయ్యలేదు.



మనిషితో పాటే అవస్థలు పుడతాయి. వాటిని చూసి బెదిరి పోవడం కంటే వాటితో సహజీవనం చెయ్యగలిగితే.....
అర్ధం చేసుకోవాలే కాని, ఆసుపత్రులు కూడా బోధి వృక్షాలే!

ఆసుపత్రి వైరాగ్యాలు

ఎక్కడ చూసినా, ఎటు చూసినా ఈసురోమంటూ రోగులు. చెరగని చిరునగవులతో వారి మధ్యలో తిరుగుతుండే  నర్సులు, గంజాయి పొలంలో తులసి మొక్కల్లా. 
నీరవ  నిశ్శబ్దం. వెలుతురూ, చీకటీ కాని మధ్యస్తపు వెలుతురులో ప్రాణం కొట్టుకుంటున్నట్టుగా ఒంటికి తగిలించిన మిషన్లు  చేసే చప్పుళ్ళు. యముని మహిషపు మెడ గంటల ధ్వనుల మాదిరిగా.
డబ్బులు వద్దు, తిని హరాయించుకోలేని సిరి సంపదలు అసలే  వద్దు, నా ముద్ద అన్నం నేను తినే ఆరోగ్యం ఇవ్వు చాలు దేవుడా!
లోకంలోని రోగాలన్నీ ఆసుపత్రుల్లోనే కొలువు తీరినట్టున్నాయి. ఈ రోగాలూ,  ఈ ఆసుపత్రులూ   అమాంతం ఈ లోకంనుంచి  మాయమయిపోతే యెంత బాగుంటుందో కదా!
కన్నుకింత, పన్నుకింత, గుండెకింత, నడవని కాలుకింత, మడవని కీలుకింత. బొమికగా మారని ఎముకకింత, ఒంట్లో పారే నెత్తురుకింత. అన్నింటికీ లక్షల్లో రేట్లు.  ఖరీదు కట్టని అవయవం అంటూ  ఈ దేహంలో  ఒక్కటయినా ఉందా? ఒక్క రూపాయి  కూడా మారు  అడగకుండా,  అమ్మ కడుపులో వుండగానే  మనిషికి  అన్నీ  అమర్చి,   ఈ భూమ్మీద పడేసిన అద్భుత శక్తికి యెంత ఇస్తే ఆ రుణం తీరాలి?

అంగుష్టపు మనిషి

ప్రెషర్ కుక్కర్ లో అన్నంలా కుతకుతలాడిన మనసులు, శరీరాలు ఒక్కసారిగా చల్లబడ్డాయి. లక్షల ఎయిర్ కండిషనర్లు ఏకబిగిన పనిచేసినా, కోట్ల కిలోవాట్ల కరెంటు ఖర్చయినా సాధ్యపడని విధంగా నగరం ఒక్క  వానతో చల్లబడింది. తను యెంత అల్పుడో, చీమ కంటే కూడా యెంత హీనమో  మనిషికి  తెలపడానికి బహుశా ప్రకృతి ఇలాంటి ట్రిక్కులు చేస్తుందేమో!
కానీ తెలుసుకుంటాడా అన్నదే జవాబులేని ప్రశ్న.

అల్పత్వం

కంటి చూపుతో కాల్చేస్తా, వొంటి చేత్తో ఇరగదీస్తా అనే మాటలు చప్పట్లు కొట్టించుకునే డైలాగులు మాత్రమే. నిజానికి ఈ శక్తి ఒక్క ప్రకృతికే వుంది.
మొన్న గురువారం అర్ధ రాత్రి జనాలు గాఢ నిద్రలో వున్నప్పుడు నగరంలో గాలి వాన సాగించిన బీభత్స దృశ్యాలు ఒక్కటొక్కటిగా బయట పడుతున్నాయి. ఆ రాత్రి మేలుకుని వుండే అవసరం పడి జరిగిన అనర్ధాన్ని బయటకి వెళ్లి కనులారా చూడలేకపోయినా, ప్రచండ వేగంతో వీచిన గాలికి తలుపులు, కిటికీలు టపటపా కొట్టుకున్న ధ్వనులు చెవుల్లో ఇంకా మారుమోగుతూనే వున్నాయి. వున్నట్టుండి పైన డాబా మీద  పిడుగు పడ్డ చప్పుడు. తెల్లారి లేచి చూస్తే, పైన వాటర్ ట్యాంక్ కు అమర్చిన ఇనుప నిచ్చెన విరిగి పడివుంది.  నలుగురు చేయి వేస్తేకాని కదల్చలేని బరువైన నిచ్చెన, ప్రకృతి ప్రకోపానికి చిగురుటాకులా యెగిరి పడింది.
మనిషి అల్పత్వానికి మరో ఉదాహరణ.




కంటికే కెమెరా వుంటే....

కొన్ని చూద్దామన్నా కంట పడవు. మరికొన్ని అనుకోకుండా కంటపడతాయి. చేతిలో సెల్ ఫోన్ సిద్ధంగా వున్నా, ఫోటో తీయలేని పరిస్తితి. తీస్తే  పపారజ్జీ (సెలెబ్రిటీలను వెంటాడి, వేటాడి ఫోటో తీసే బాపతు) కింద  జమకట్టే  ప్రమాదం కూడా వుంది మరి. కంటికే కెమెరా వుంటే యెంత బాగుండు అనిపిస్తుంది అల్లాంటప్పుడు.

ఈ మధ్యాన్నం మండుటెండలో బేగంపేట్ లోని సీజీహెచ్ఎస్ (కేంద్ర ప్రభుత్వ సిబ్బంది వైద్య శాల)కి వెళ్లి తిరిగొస్తుంటే కేబీఆర్ పార్కు పక్కన చెట్ల నీడలో ఒక ముసలవ్వ, అవిటి వాడయిన తన పెనిమిటికి అన్నం ముద్దలు తినిపిస్తోంది. ఏమీ లేకపోయినా అన్నీ వున్న మనుషులు వాళ్ళు.
కాస్త దూరంలో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు మరో మనోహర  దృశ్యం. మోటారు సైకిల్  పై  ఓ యువ జంట. అతడి నెత్తిపై హెల్మెట్. వల్లెవాటు తలపై చుట్టుకున్న ఆ యువతి చేతిలో ఉల్లిపొర కాగితంలో చుట్టిన పిజ్జా, పిస్తా లాంటి ఓ ఆధునిక తినుబండారం. తనో ముక్క కొరికింది.  చెలుడి ఆకలి తెలిసిందేమో, హెల్మెట్ పై సుతారంగా తట్టింది. అతగాడు ప్రియురాలి మనసు తెలిసినవాడి మాదిరిగా హెల్మెట్ కొద్దిగా పైకి ఎత్తాడు. ఆ అమ్మాయి చేతిలో తినుబండారాన్ని అతడి పెదవుల వద్దకు చేర్చింది. అతడో ముక్క కొరికి చెలికి థాంక్స్ చెబుతున్నాడు. ప్రేమకు సజీవ సాక్ష్యంలాంటి జంట.
ఈ రెండు దృశ్యాలు ఆవిరి అయిపోతున్న ఆప్యాయతలకి, ఆనురాగాలకీ మారు రూపాలు.

మహా మాయ

పొద్దున్న ఆరుగంటలు.
మంచం మీద నుంచి లేవాలంటే బద్ధకం. నిద్ర కళ్ళ అంచుల్లోనే వుంటుంది. ఓ అయిదే అయిదు  నిమిషాలు కళ్ళుమూసుకుని తెరిస్తే చాలు అదేమి  చిత్రమో! గడియారంలో టైం ఏడు గంటలు చూపెడుతుంటుంది.
సరే!  పడుతూ లేస్తూ  ఆఫీసుకు వెడతాం. ఆ కబుర్లూ ఈ కబుర్లూ చెప్పుకుని సీటులోకి చేరేసరికి సమయం పన్నెండు. ఈలోగా ఎక్కడలేని నిద్ర తన్నుకుంటూ, ముంచుకుంటూ వస్తుంది. పాపం, దాన్నికాదని యెలా!  మన ఆఫీసే కదా అనుకుంటూ,   అలా  అయిదంటే  అయిదే నిమిషాలు కళ్ళుమూసుకుంటాం. కళ్ళు తెరిచి చూస్తే   గడియారంలో   టైం మాత్రం మాత్రం నత్త నడక నడుస్తూ వుంటుంది. ఇంట్లో ఆ గడియారం ఉరుకులేమిటో తెలియదు. ఆఫీసులో ఈ  గడియారం పెళ్లి నడకలేమిటో......ఏమీ  అర్ధం కాదు.
అంతా మాయ. మహా మాయ. 
 
అగ్గిపెట్టె పది పైసలు

న్యూ ఇయర్  గిఫ్ట్ లకింద జర్బలిష్టులకు యెంత ఖరీదయిన డైరీలు వచ్చినా వాటిల్లో చాలామంది (వారి భార్యలు) రాసుకునేవి కిరాణా పద్దులే. ఎందుకంటే రాసేదంతా ఆఫీసులోనే రాసి వస్తారు కాబట్టి ఇక సొంత గోల రాసుకోవడానికి ఓపికా వుండదు. రాయడానికి విషయాలు వుండవు.
అలా 1973 లో మార్చి నెల 31   తేదీన మా ఆవిడ డైరీలో రాసిన ఒక రోజు ఖర్చు చిట్టా పాత కాగితాలు వెతుకుతుంటే దొరికింది. (అంటే  నలభయ్ మూడేళ్ళ కిందటి మాట)

నూనె : రు. 3-25
నెయ్యి: రు. 2-75
పెరుగు: రు.0-20
టమాటాలు: రు. 0.55
అగ్గిపెట్టె: రు. 0.10
సబ్బు: రు.1-00
రిక్షా:  రు. 0-50
వక్కపొడి పొట్లం: రు. 0-10

(నోటు: నూనె, నెయ్యి కూడా రోజువారీగా కొని సంసారం నడిపిందేమో తెలవదు. ఎందుకంటే జర్నలిష్టులకు ఇల్లు పట్టదు. అంతా నో సీ ఎం - నో పీఎం బాపతు







కామెంట్‌లు లేవు: