20, మే 2016, శుక్రవారం

వెరీ ఇంపార్టెంట్ స్ట్రీట్ ఇన్ కలకత్తా
(ఒక విన్నపం: 2012 లోరాసిన వ్యాసం చదవడానికి  ముందు కొంత సమయం కేటాయించి కింది ఫోటోలు చూడండి, దీన్ని మళ్ళీ ఇప్పుడు మళ్ళీ  పోస్ట్ చేసిన సందర్భం ఏమిటో చెప్పాల్సిన పనిలేదు)

కోల్ కటా అని ఇప్పుడు పేరు మార్చుకున్న కలకత్తా నగరంలో వున్న అనేక వేల వీధుల్లో ఇది ఒకటి. దాని పేరు హరీష్ చంద్ర స్ట్రీట్.
కాశీ యాత్రకు వెడుతూ మార్గ మధ్యంలో కలకత్తాలో ఆగినప్పుడు పనికట్టుకుని చూసివచ్చిన వీధి ఇదొక్కటే.



ఓపెన్ డ్రైనేజీ. మురుగుకాలువ. వీధిలోనే స్నానాలు.  ఇంటి ఆకారం కూడా లేని టార్పాలిన్ తడికెల నడుమ కాపురాలు. వీధి కుక్కల స్వైర విహారాలు. చూడగానే వికారం కలిగించే చిరుతిండ్ల అంగళ్ళు.










కలకత్తాలోనే కాదు దేశంలో బస్తీలో చూసినా ఇలాటి వీధులు అనేకానేకం కానవస్తాయి. అటువంటప్పుడు వెరీ ఇంపార్టెంట్ స్ట్రీట్ అని సన్నాయి నొక్కులెందుకు అనే ప్రశ్న సహజంగానే ఉద్భవిస్తుంది.
అదే. అది చెప్పడానికే ఉపోద్ఘాతం.
పై ఫోటోలను కొంత క్షుణ్ణంగా పరిశీలిస్తే అందులో ఒకదానిలో బెంగుళూరు పెంకులు  కప్పిన ఒక సాదా సీదా ఇల్లు కనిపిస్తుంది. (నా వెంట యాత్రకు వచ్చిన  వేమూరి విశ్వనాధ శాస్త్రి గారు చేతి సైగతో చూపిస్తున్న ఇల్లు)


ఇంట్లో వుండే వ్యక్తి మాత్రం అంత సాదా సీదా సాధారణ మనిషి కాదు. కొన్ని దశాబ్దాలపాటు అవిచ్చిన్నంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని పాలించిన మార్క్సిష్టులకు, లెఫ్ట్ పార్టీలకు అధికార పీఠాన్ని  దూరం చేసిన అత్యంత సాదా సీదా రాజకీయ నాయకురాలు, తృణమూల్ అధినేత్రి  ‘దీదీమమతా బెనర్జీ - ముఖ్యమంత్రి హోదాలో నివసిస్తున్నది ఇంట్లోనే అంటే పట్టాన నమ్మడం కష్టం. కానీ కళ్ళతో చూసిన దాన్ని నమ్మక తప్పదు కదా.
మమతా దీదీ నివసిస్తున్న ఇల్లూ, ఇల్లు వున్న వీధినీ చూస్తుంటే ఇలాటి రాజకీయ నాయకులు కూడా వుంటారా అనిపించడం అంతే సహజం.  కానీ ఒక ముఖ్యమంత్రి వుండే వీధే అలా వుంటే ఇక మిగిలిన వాటి సంగతేమిటిదీనికి జవాబు కూడా అంతగా  అర్ధం కాని హింగ్లీ  (హిందీ-బెంగాలీ) భాషలో వీధిలో వుండే వ్యక్తి నుంచే లభించింది. కోల్ కటా లోని అన్ని వీధులు బాగుపడ్డ తరువాతే తన వీధిని బాగు చేసే పనికి పూనుకోవాలని దీదీ హుకుం జారీ చేసారట. ఇందులోని నిజానిజాలు వీధికి ఎదురుగా వుండే మరో వీధిలో కొలువున్న మరో దేవత కలకత్తా కాళీనే చెప్పాలి.
దీదీ సాదా సీదా వ్యవహార శైలి తెలిసిన వాళ్లకు వీధి వ్యవహారం  అంత ఆశ్చర్యం కలిగించకపోవచ్చు. కాకపొతే,
పోలీసు పటాలాలు, స్టెన్ గన్లు ధరించి పహరా కాసే  అంగరక్షకులు, అడుగడుగు బారికేడ్లు ఇవన్నీ ఏమీ లేకుండా ఒక ముఖ్యమంత్రి అంత సాధారణ జీవితం గడుపుతున్న తీరుతెన్నులు గమనిస్తే రాజకీయ ప్రముఖుల రక్షణ కోసం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించడం అంత అవసరమా అన్న సందేహం తలెత్తక మానదు. (19-03-2012)                


కామెంట్‌లు లేవు: