6, మే 2016, శుక్రవారం

కంటికే కెమెరా వుంటే.....


కొన్ని చూద్దామన్నా కంట పడవు. మరికొన్ని అనుకోకుండా కంటపడతాయి. చేతిలో సెల్ ఫోన్ సిద్ధంగా వున్నా, ఫోటో తీయలేని పరిస్తితి. తీస్తే  పపారజ్జీ (సెలెబ్రిటీలను వెంటాడి, వేటాడి ఫోటో తీసే బాపతు) కింద  జమకట్టే  ప్రమాదం కూడా వుంది మరి. కంటికే కెమెరా వుంటే యెంత బాగుండు అనిపిస్తుంది అల్లాంటప్పుడు.


ఈ మధ్యాన్నం మండుటెండలో బేగంపేట్ లోని సీజీహెచ్ఎస్ కి వెళ్లి తిరిగొస్తుంటే కేబీఆర్ పార్కు పక్కన చెట్ల నీడలో ఒక ముసలవ్వ, అవిటి వాడయిన తన పెనిమిటికి అన్నం ముద్దలు తినిపిస్తోంది. ఏమీ లేకపోయినా అన్నీ వున్న మనుషులు వాళ్ళు.
కాస్త దూరంలో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు మరో మనోహర  దృశ్యం. మోటారు సైకిల్  పై  ఓ యువ జంట. అతడి నెత్తిపై హెల్మెట్. వల్లెవాటు తలపై చుట్టుకున్న ఆ యువతి చేతిలో ఉల్లిపొర కాగితంలో చుట్టిన పిజ్జా, పిస్తా లాంటి ఓ ఆధునిక తినుబండారం. తనో ముక్క కొరికింది.  చెలుడి ఆకలి తెలిసిందేమో, హెల్మెట్ పై సుతారంగా తట్టింది. అతగాడు ప్రియురాలి మనసు తెలిసినవాడి మాదిరిగా హెల్మెట్ కొద్దిగా పైకి ఎత్తాడు. ఆ అమ్మాయి చేతిలో తినుబండారాన్ని అతడి పెదవుల వద్దకు చేర్చింది. అతడో ముక్క కొరికి చెలికి థాంక్స్ చెబుతున్నాడు. ప్రేమకు సజీవ సాక్ష్యంలాంటి జంట.
ఈ రెండు దృశ్యాలు ఆవిరి అయిపోతున్న ఆప్యాయతలకి, ఆనురాగాలకీ మారు రూపాలు.  

NOTE: COURTESY IMAGE OWNER        

కామెంట్‌లు లేవు: