20, మే 2016, శుక్రవారం

ఆకాశంలో యుద్ధం

    
దిగ్దంతాలకు ఆవల ఎక్కడో
పరలోక వాసులు పోరు సాగిస్తున్న సంకేతాలు
అనంతాకాశంలో    
జవనాశ్వాల గిట్టల రాపిడితో
నల్లటి మబ్బుల్ని చీలుస్తూ
వెలుగులు చిమ్ముతున్న మెరుపు తీగెలు        
కనపడని  కొండలు కదిలిపోతున్నట్టు
గజదళం చేస్తున్న ఘీంకారాలతో
ప్రళయ ధ్వనులను తలపిస్తున్న  ఉరుములు
చెవులు చిల్లులు పడేలా పడుతున్న
పిడుగుల నడుమ సన్నగా వినిపిస్తున్న
‘అర్జున, ఫల్గుణ, పార్ధివ’ ఘోషలు 
రణక్షేత్రంలో  వైరిమూకలు    
విసురుకుంటున్న అక్షయ తూణీరాల వాన చినుకులు  
అరచేతుల్తో అడ్డుపట్టి  విదిలిస్తున్న
అదృశ్యసమీరాలు
ఓ దిక్కు నుంచి మరో దిక్కుకు మరలుతున్న
వర్షపు జల్లుల వయ్యారాలు
ఇంతా చేసి
ఓ అరఘడియే సాగింది ఈ ప్రకృతి  పారవశ్య నృత్యం!  
ఉరిమే మబ్బుల చాటున
జరిగినదంతా మౌనంగా చూసిన  సూర్యుడు
ముసిముసి నగవులతో
పశ్చిమాద్రిన మళ్ళీ  ప్రత్యక్షం!(COURTESY IMAGE OWNER)

కామెంట్‌లు లేవు: