25, మే 2016, బుధవారం

భారతీయ యోగా


పొందలేని దాన్ని సాధించగలగడాన్ని యోగం అంటారు.  ఉదాహరణకు ఆత్మ సాక్షాత్కారం. దీన్ని సాధించడం అంత సులభం ఏమీ కాదు. సాధించాలంటే అందుకుతగ్గట్టుగా శరీరాన్ని  తయారు చేసుకోవాలి. ఈ సాధనే యోగా. ఈ సాధన చేసేవారిని పూర్వం యోగులు అనేవారు. యోగసాధన ద్వారా లక్ష్యాన్ని అంటే ఆత్మ సాక్షాత్కారాన్ని పొందగలిగిన వారిని యోగయుక్తులు అంటారు. లక్ష్యసాధన ఒక ఎత్తయితే, సాధించిన దాన్ని పదిలపరచుకోవడం మరో ఎత్తు. మొదటిది యోగం, రెండోది క్షేమం. ఈ 'యోగక్షేమాల' ప్రసక్తి భగవద్గీతలో కూడా వుంది. గీత తొమ్మిదో అధ్యాయం ఇరవై రెండో శ్లోకంలో  అంటాడు భగవానుడు అర్జునుడితో, " అనన్యాచింతయంతోమా యేజనాః పర్యూపాసతే,  తేషామ్ నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్" అని. అంటే  'వేరే ధ్యాస లేకుండా నన్నే తలుస్తూ, నన్నే ధ్యానిస్తూ పోతే వారి యోగక్షేమాలు నేను చూసుకుంటాను' అని స్తూలార్ధం. అలాగే,  'అధాతో బ్రహ్మ జిజ్ఞాసా' అనే దానితో 'బాదరాయణ బ్రహ్మ సూత్రాలు' మొదలవుతాయి. ( ఈ బ్రహ్మ సూత్రాలు వేద వ్యాస విరచితమనీ, కాదు బాదరాయణుడు రాశాడనీ కొన్ని వాదాలు వున్నాయి. ఆ ఇద్దరూ ఒకరనే వాదం కూడా వుంది, అది వేరే విషయం) బ్రహ్మసూత్రాలలో చెప్పిన  అధాతో అంటే 'అటు పిమ్మట...'. శరీరాన్ని యోగాతో ఆత్మసాక్షాత్కారానికి అనువుగా 'మార్చుకున్న పిమ్మట' అని భాష్యం చెప్పుకోవచ్చు. శంకర భాష్యాన్ని ప్రముఖ పండితులు పుల్లెల రామచంద్రుడు తెనిగించి  పుణ్యం కట్టుకున్నారు. అందులోని జిజ్ఞాస అధికరణంలో ఈ యోగ ప్రసక్తి వుంది. ఈ యోగ సూత్రాలను  పతంజలి మహాముని  వెలికితీసి ఒకచోట గుదిగుచ్చి పంచాంగాలతో, కర్మ యోగము, రాజ యోగము, భక్తి యోగము, ధ్యాన యోగము, జ్ఞాన యోగములతో కూడిన 'యోగ దర్శనం'   తయారు చేశారు. అదే పతంజలి యోగశాస్త్రంగా ఈనాటికీ మన్ననలు అందుకుంటోంది.  పతంజలి యోగానికి ఇచ్చిన నిర్వచనం 'యోగసు కర్మ కౌశల్యం', 'చిత్తవృత్తి నిరోధం'. ఏ కర్మ (పని) చేసినా దాన్ని  నైపుణ్యంతో చేయడం, మానసిక చాంచల్యాలను జయించడం అని అర్ధం చెప్పుకోవచ్చు.


ఇందుకోసం ఆయన సాధన చతుష్టయాన్ని ప్రబోధించారు. నిత్యానిత్య వస్తువు వివేక జ్ఞానము, ఇహలోక పరలోక విషయం భోగ వైరాగ్యము, శమదమాది సాధన సంపద, మోక్షం పొందాలనే తీవ్రమైన వాంఛ- ఈ నాలుగు అలవరచుకుని యోగసాధన మొదలు పెట్టాలి. శమదమాది సాధన సంపద అంటే ఒకటి శమము( మనో నిగ్రహము), రెండు  దమము ( బాహ్య ఇంద్రియ నిగ్రహము ) మూడు  ఉపరతి (విషయాలనుంచి వెనక్కు మరలడం) నాలుగు తితిక్ష (సహనం), అయిదు  శ్రద్ధ (శాస్త్రాదుల పట్ల పరిపూర్ణ విశ్వాసం).  ఈ అయిదూ యోగసాధకుడికి అత్యవసరం. బ్రహ్మ సూత్రాలలో చెప్పిన మొదటి సూత్రం 'యధాతో బ్రహ్మ జిజ్ఞాస' అంటే అటు పిమ్మట అనేది, 'ఈ అయిదూ సాధించిన' పిమ్మట అనేది గ్రాహ్యం. తద్వారా  ఆత్మ సాక్షాత్కార సాధన సులభం అవుతుంది. ఈ నైపుణ్యం అలవరచుకోవడం కోసం కర్మయోగాది పంచ యోగాలు ఉపయోగపడతాయి. కర్మ, రాజ, భక్తి, ధ్యాన, జ్ఞాన యోగాలు కర్మతో మొదలయి జ్ఞానంతో అంతమవుతాయి.  ఈ జ్ఞాన సాధనతో యోగి యోగయుక్తుడు/ యోగసిద్ధుడు కాగలుగుతాడు.
పతంజలి చెప్పిన అష్టాంగయోగంలో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి విభాగాలు వున్నాయి.
ఇవన్నీ సరే, మామూలు మనిషికి ఇవన్నీ యెందుకు అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది.

మానవ శరీరం శాశ్వితం కాదు. ఎప్పుడో ఒకప్పుడు నశించి  పోయేదే. జీవుడు శాశ్వితం. అతడికి నాశనం లేదు. కానీ శరీరాన్ని ఆవహించుకుని వున్న జీవుడికి ఆ తాత్కాలిక ఆవాసం మీదనే మోజు. తద్వారా సంప్రాప్తించిన సుఖ దుఃఖాలతో మునిగితేలుతుంటాడు.  ఈ అజ్ఞానం తొలగగానే లౌకిక  వ్యవహారాలను  నిర్లిప్త వైఖరితో పరికించే స్తితి వస్తుంది. ఇట్టి స్తితికే ముక్తి,  కైవల్యం, అపవర్గం అని పేర్లు. ఇలాటి స్తితిని దేహం వుండగానే చేరుకోగలిగితే అది జీవన్ముక్తి అనిపించుకుంటుంది. ఈ యావత్ యోగ సాధన అంతా ఈ స్తితికి చేరుకోవడం కోసమే.

కామెంట్‌లు లేవు: