9, మే 2016, సోమవారం

ఆత్రం


యువరాజు పెరిగి పెద్దవుతున్నకొద్దీ పెద్ద మహారాజుకు మనాది పెరుగుతూ వస్తోంది.
యువరాజు పుట్టినప్పుడు అందరి పిల్లల మాదిరిగా మామూలుగానే వున్నాడు. ఏడు మీద పడుతున్న కొద్దీ  అతడి పెరుగుదలలో కొంత అవకరం కనిపిస్తూ వచ్చి, ఒక ప్రాయం వచ్చేసరికి అది చూడ వికారంగా తయారయింది. యువరాజు కాళ్ళు ఏడాదికి బెత్తెడు పెరుగుతూ పోతున్నాయి. శరీరంలో మిగిలిన అవయవాల ఎదుగుదల సాధారణంగానే వుంది. పొడగరి కాళ్ళ పిల్లవాడు అనుకోవడానికి వీల్లేకుండా అతగాడి కాళ్ళు బాగా పెరిగిపోయి నిచ్చెన మీద నిలబడ్డ పిల్లాడిలా తయారయ్యాడు.


మహారాజుకి కంట నిదుర లేకుండా పోయింది. దేశదేశాల నుంచి వైద్యులను  రప్పించారు. వాళ్ళు పిల్లాడ్ని చూసి పెదవి విరవడం తప్ప పెదవి విప్పి ఒక్క తరుణోపాయం కూడా చెప్పలేకపోయారు. దాంతో మంత్ర వైద్యులు రంగ ప్రవేశం చేశారు. వాళ్ళలో ఒకడు, యువరాజు కాళ్ళు కురచగా చేస్తానని చెప్పడంతో రాజు మనసు కుదుట పడింది.  అయితే కొన్ని షరతులు అంటూ  మంత్రం గాడు సన్నాయి నొక్కులు నొక్కాడు. ఏమిటన్నాడు రాజు గారు. తనదగ్గరో గాడిద పిల్ల వుందని, చూడడానికి మామూలు గాడిదే కాని అపూర్వ మంత్రం శక్తులు దానికి  వున్నాయని చెప్పాడు. యువరాజు ఆ గాడిద దగ్గరికి వెళ్లి తనని పెళ్లి చేసుకోమని మూడుసార్లు అడగాలని, అది చేసుకోనని అంటుందని, అలా ఒక్కసారి అనగానే యువరాజు కాళ్ళు అడుగు మందం తగ్గిపోతాయని చెప్పాడు. యువరాజు సరేనని ఆ గాడిద పిల్ల వద్దకు వెళ్లి తనని పెళ్లి చేసుకోమని అడిగాడు. గాడిద చేసుకోను అని స్పష్టంగా చెప్పింది. విచిత్రం. మంత్రగాడు చెప్పినట్టుగానే యువరాజు కాళ్ళు అడుగు తగ్గిపోయాయి. ఇంకోసారి అనిపిస్తే మరో అడుగు తగ్గిపోయింది. ఇంకొకమారు అనిపిస్తే చాలు అతడి కాళ్ళు అందరిలాగే మామూలు స్థాయికి వచ్చేస్తాయి.
మహారాజుకి ఆశపెరిగింది. యువరాజుకి ఆత్రం పెరిగింది. గాడిద దగ్గరికి వెళ్లి ‘నన్ను పెళ్లి చేసుకో, పెళ్ళిచేసుకో’ అని గట్టిగా అడిగాడు. ఆ గాడిద కూడా అంతకంటే గట్టిగా 'చేసుకోను, చేసుకోను, చేసుకోను’ అంటూ ముమ్మారు చెప్పింది.

అంతే! యువరాజు కాళ్ళు నడుము వరకు లేకుండా పోయాయి. 
  
NOTE: COURTESY IMAGE OWNER          

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

Is it pappu ...:)