10, మే 2016, మంగళవారం

ఇంత రాజకీయం అవసరమా?


సూటిగా....సుతిమెత్తగా.....

ఇంత రాజకీయం అవసరమా?
దేశంలో పరిణామాలను గమనించేవారికి అసలు ఈ స్థాయిలో రాజకీయాలు, ప్రతి విషయంలో ఇంతంత రాద్దాంతాలు అవసరమా అనే సందేహాలు కలుగుతున్నాయి. అది ఉత్తరాఖండ్ వ్యవహారం కావచ్చు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విద్యార్హతల సంగతి కావచ్చు, అగష్టా హెలికాప్టర్ల కొనుగోలు కావచ్చు ప్రతి విషయమూ మరో వివాదానికి దారి తీసేలా వాదప్రతివాదాలు సాగుతున్నాయే తప్ప ఏ ఒక్క అంశంలోనూ వాస్తవిక దృష్టికోణానికి అవకాశం లేకుండా పోతోంది. సమస్యను పెద్దది చేసే ప్రయత్నం తప్ప అవసరమైన పరిష్కారం కనుగొనే దిశగా అడుగులు పడడం లేదు. ‘దారులు వేరయినా బారులొక్కటే’ అన్న చందంగా  ఈ విషయంలో అన్ని పార్టీలదీ ఒకే బాట. అందరిదీ ఒకే మాట. వివాదాన్ని మరింత పెంచి పరిష్కారానికి దూరంగా జరగడం. 
నరేంద్ర మోడీ  ఏ పేరు మీద డిగ్రీ తీసుకున్నారు, ఆ డిగ్రీ తీసుకుకున్నది నరేంద్ర మోడీనా వేరొకరా అనే వివాదం గురించి వింటున్నప్పుడు ఇలాటి నిర్వేదమే కలుగుతోంది. (మోడీ అనాలా, మోదీ అనాలా అనేదే ఇంకా తెగలేదు).
డిగ్రీ లేని మోడీ, డిగ్రీ వున్నట్టు చూపెట్టి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి వుంటే అది వేరే విషయం. ఈ పవిత్ర దేశంలో ప్రధాని, ముఖ్యమంత్రి వంటి పదవులకే కాదు అసలు ఎటువంటి రాజకీయ పదవులకు కూడా విద్యార్హతలతో నిమిత్తం లేదు. అలాంటి ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగిన ఈ గొప్ప దేశంలో ప్రధాని డిగ్రీ వ్యవహారం వివాదం కావడం చూస్తుంటే కాదేదీ రాజకీయానికి అనర్హం అనిపించక మానదు.
ఢిల్లీలో పాలన సాగిస్తున్న కేజ్రీ వాల్ అమ్ ఆద్మీ  పార్టీకి, కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న మోడీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారుకు   ఏమాత్రం  సరిపడదన్న విషయం సత్య దూరం కాదు. అయితే,  ఎన్ని వైరుధ్యాలు వున్నా, రాజకీయంగా ఎంతటి విబేధాలు వున్నా విమర్శల స్థాయి శృతిమించుతూ వుండడమే విషాదం.
ఈ వివాదానికి ఓ మూలం వుంది. అదేమిటంటే నరేంద్ర మోడీ ఎన్నికల అఫిడవిట్ లో తన విద్యార్హతలు పేర్కొన్నారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి బియ్యే పట్టా, గుజరాత్ యూనివర్సిటీ నుంచి ఎమ్మే పట్టా తీసుకున్నట్టు అందులో పేర్కొన్నారు. బియ్యే మార్కుల జాబితాపై వున్న  సంవత్సరం, డిగ్రీ సర్టిఫికేట్ పై వున్న సంవత్సరంతో సరిపోలడం లేదన్నది ఆప్ సంధిస్తున్న  ప్రశ్న. ప్రశ్నిస్తే సరిపోయేది అందులో కొంత ఎటకారం పాలు కూడా జోడించారు.
‘బియ్యే మార్కుల జాబితాపై 1978 సంవత్సరం వుంది. బియ్యే డిగ్రీ సర్టిఫికేట్ పై 1979  వుంది. బియ్యే మార్కుల జాబితాలో ‘నరేంద్ర కుమార్ దామోదర దాస్ మోడీ’ అని వుంటే ఎమ్మే పట్టాపై నరేంద్ర దామోదర దాస్ మోడీ’ అని వుందని ఆప్ నాయకులు వెల్లడించారు. ‘నకిలీ సర్టిఫికేట్లు సృష్టించడానికి కూడా బుర్ర కావాలి’ అనే ఆప్ నాయకుల హేళన సహజంగానే బీజేపీ నాయకులకు ఆగ్రహం తెప్పించింది.
ఆప్ నాయకుల ఆరోపణలని బీజేపీ జాతీయ అధక్షుడు అమిత్ షా, కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్  జైట్లీ  విలేకరుల సమావేశంలో  స్వయంగా ఖండించారు. దాన్నిబట్టే, ఆ పార్టీ వీటిని యెంత తీవ్రంగా పరిగణిస్తున్నది అన్న విషయం అవగతమవుతోంది. ప్రధాని మోడీ డిగ్రీ సర్టిఫికేట్, ఎమ్మే సర్టిఫికేట్ జిరాక్స్ కాపీలని విలేకరులకు అందచేశారు కూడా.
 అబద్ధాన్ని నిజంగా నమ్మించేందుకు, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కేజ్రీ వాల్ ప్రయత్నిస్తున్నారని వారు ఎదురు దాడి చేశారు.
ప్రధాన మంత్రి  మోడీ విద్యార్హతల వ్యవహారాన్ని రచ్చ చేయడానికి కూడా ఆప్ నాయకులకు ఒక కారణం వుంది. ఆ పార్టీకి చెందిన పలువురు ఎమెల్యేలు నకిలీ డిగ్రీలు కలిగి వున్నారన్న ఆరోపణలతో ప్రాసిక్యూషన్ ఎదుర్కుంటున్నారు. కిందటి ఏడాదే, అప్పుడు ఢిల్లీ ఆప్ ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రిగా వున్న తోమర్ ను నకిలీ సర్టిఫికేట్ల కుంభకోణంలో ఇరికించి, అరెస్టు చేయించి తమ పార్టీ పరువు తీసిన కోపం బీజేపీపై పెంచుకున్న ఆప్ నాయకులకు, మోడీ డిగ్రీల వ్యవహారం అందివచ్చిన అవకాశంగా దొరికింది.  రాజకీయ ప్రక్షాళన, పరిశుద్ధ రాజకీయాలు  అనే  ఎజెండాతో అరంగేట్రం చేసిన పార్టీ కయినా రాజకీయం చేయక తప్పని పరిస్తితి.
అందుకే అన్నది ఇంత రాజకీయం అవసరమా అని.        
ఇక అగస్తా హెలికాప్టర్ల వ్యవహారం. దీన్ని వ్యవహారం అనడం లేదు, కుంభకోణంగా పిలుస్తున్నారు. ఈ పదాన్ని తుచ్చమైన భావం వచ్చేలా వాడుతున్నందుకు ఆ ‘కుంభకోణం’ ఊరివాళ్ళు ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసితీరాలి. కానీ, ‘స్కాం’ అనే ఇంగ్లీష్ పదానికి కుంభకోణానికి  మించిన సమానార్ధక తెలుగు పదం తెలుగు మీడియాకు తట్టడం లేదు. అదో విషాదం.
చాలాకాలం క్రితం వాజ్ పాయ్ నేతృత్వంలో ఎన్డీయే సర్కారు సాగుతున్న రోజుల్లో మొదలయిన లేదా పురుడు పోసుకున్న ఈ హెలికాప్టర్ల కొనుగోలు ప్రతిపాదనలు అలా అలా సాగుతూ పోయి, మన్మోహన్ నాయకత్వంలోని యూపీఏ రెండో టరం నాటికి ఒక రూపానికి వచ్చాయి. ఇందులో మసి వుంది అనుకుంటే అది కొద్దో గొప్పో అందరికీ అంటాలి. కానీ విచిత్రంగా రాజకీయం తన అసలు రూపాలను అంత్యంత జుగుప్సాకరంగా  ప్రదర్శిస్తోంది. కుంభకోణం జరిగి వుంటే, దోషుల్ని పట్టుకోవాలి. ముడుపులు ఎవరయినా తిని వుంటే వారెవరో నిర్ధారించే ప్రయత్నం చేయాలి. వారిని గుర్తించి  కఠినంగా శిక్షించాలి. కానీ ఆరోపణలు, ప్రత్యారోపణలతోనే అటు పార్లమెంటు, ఇటు మీడియా దద్దరిల్లుతున్నాయి. అంతేకాని పరిష్కారం దిశగా ఒక్క అడుగు పడడం లేదు. వచ్చే ఎన్నికల నాటికి ఈ అంశం ఒక ప్రచారాస్త్రం అవుతుందేమో కాని, ముడుపులు ఆరగించిన భోక్తలు మాత్రం ‘వాతాపి జీర్ణం జీర్ణం’ అనుకుంటూ బొజ్జలు నిమురుకుంటూ వుంటారు. గతంలో దేశాన్ని కుదిపి వేసిన అనేకానేక స్కాముల జాబితాలో ఇది కూడా చేరిపోయి, భవిష్యత్తులో విశ్లేషకులు ప్రస్తావించడానికి పనికివచ్చే ఒక ముడిసరుకుగా మారిపోతుంది. మరి ఇది కూడా ఒక విషాదం అనుకోవాలేమో!           
ఇక ఉత్తరాఖండ్. భారత ప్రజాస్వామ్య వేదికపై సాగుతున్న మరొక ప్రహసనం. పార్టీ మార్పిళ్లకు పరాకాష్ట. పార్టీలు, సిద్ధాంతాలు పక్కనబెట్టి,  వాదానికి పనికివచ్చే అనేక ఉదాహరణలు పేర్కొంటూ అధికారమే పరమావధి అనే సిద్ధాంతానికి పెద్ద పీట వేసే  రాజకీయ అవకాశవాదానికి నిలువెత్తు ఉదాహరణ. కాంగ్రెస్, బీజేపీ ల నడుమ అధికార పోరుకు అందమైన ముసుగులు వేసి చర్చా వేదికలపై తలపడుతూ,  తమ వాదాన్ని నెగ్గించుకునేందుకు, ఎదుటి వాదాన్ని పూర్వపక్షం చేసేందుకు  ఆయా పార్టీలు ఆడుతున్న జగన్నాటకానికి చరమాంకం. పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీర్చిన చందంగా మొత్తం వ్యవహారం సుప్రీం అధీనంలోకి వెళ్ళిపోయింది. ప్రజలతో ఎన్నికయిన ప్రజాప్రతినిధులు ప్రజాస్వామ్య బద్ధంగా నిర్వర్తించాల్సిన కర్తవ్యాలను న్యాయ స్థానాలు నిర్దేశించే స్తితికి చేరుకోవడం మరో విషాదం.
తొమ్మిది మంది  తిరుగుబాటు ఎమ్మెల్యేలపై హైకోర్టు, సుప్రీం కోర్టు కూడబలుక్కున్నట్టు అనర్హత వేటు వేసాయి కాబట్టి, హరీష్ రావత్ నేతృత్వంలోని కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం విశ్వాస పరీక్షలో నెగ్గడం ఖాయం అని ముందే తెలిసిపోయింది.
కోర్టు ఆదేశం ప్రకారం ఉత్తరాఖండ్ శాసనసభలో ఈ పరీక్ష గత  మంగళవారం నాడు  సుప్రీం  పర్యవేక్షణలోనే   కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ  జరిగిపోయింది.  ముఖ్యమంత్రి హరీష్ రావత్  కు  అనుకూలంగా ఫలితం వున్నట్టు సంకేతాలు తెలుపుతున్నాయి. అయితే, అధికారికంగా నిర్దారించాల్సింది సుప్రీం కోర్టు కనుక, సీల్డ్ కవర్ లో ఆ ఫలితాన్ని అత్యున్నత న్యాయస్థానానికి నివేదించడం జరిగింది. దేశంలో  ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతున్న తీరుకు ఇది అద్దం పడుతోందని సంతోషపడాలా, లేక ఒక చట్ట బద్ధమైన వ్యవస్థ నడుచుకోవాల్సిన తీరును  మరో చట్ట వ్యవస్థ నిర్దేశిస్తోందని మధనపడాలా?       
సుప్రీం అధికార ప్రకటన తరువాత, ఉత్తరాఖండ్  కు ఉత్తరాధికారి ఎవరన్నది  నిర్ణయం అవుతుంది. బహుశా ఇప్పటికి అందుతున్న సమాచారాన్ని బట్టి హరీష్  రావత్ ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.  కానీ, నేటి రాజకీయాల తీరుతెన్నులు గమనించినప్పుడు  ఆ ముచ్చట ఎన్నాళ్ళు అనిపించక మానదు.
అధికార దాహంతో, ప్రత్యర్ధులను సమూలంగా నిర్మూలించాలనే ఏకైక ధ్యేయంతో రగిలిపోతున్న రాజకీయ  పారావారాలు మిన్నకుంటాయనే నమ్మకం లేదు. చట్టం చట్రంలో వున్న లొసుగులు ఏమిటో, వాటిని ఎలా అధిగమించాలో వారికి బాగా  తెలుసు. ఎందుకంటే వారే చట్ట నిర్మాతలు కాబట్టి. రాజకీయం అంటే అదే కదా!
సిద్ధాంతాలు త్రోసిరాజని, అధికారం ఒక్కటే పరమావధి అనే ఒకే ఒక   సూత్రంతో రాజకీయ పార్టీలు పనిచేస్తున్నంత కాలం – ఇంత రాజకీయం అవసరమా?  అనే సామాన్యుల సందేహం ఎన్నటికీ నివృత్తి కాదు.
రోజు కోసం ఎదురు చూడడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు.
ఆ రోజు వచ్చిన నాడు ఈ రాజకీయ పార్టీలు చేయగలిగింది కూడా ఏమీ వుండదు.

ఉపశృతి:

కుల, మతాలలోనే కాదు రాజకీయ పార్టీల్లో కూడా ఈ స్వపర బేధాలు ఎక్కువవుతున్నాయి. 'మా పార్టీ, మీ పార్టీ' అనే ప్రాతిపదికపై రాజకీయాలు సాగుతున్నాయి. మావాళ్ళు, మీ వాళ్ళు అనే ఈ బేధ దృష్టికి తొలి బీజం పడింది భగవద్గీత మొదటి శ్లోకంలోనే. కురుపాండవ యుద్ధం జరుగుతున్నప్పుడు అంధరాజయిన ద్రుతరాష్ట్రుడు, ‘యుద్ధభూమిలో ఏమి జరుగుతున్నదో చెప్పమ’ని సంజయుడ్ని అడుగుతాడు.

ధర్మ క్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః ।
మామకాః పాండవాశ్చైవ
 కిమకుర్వత సంజయ  1 

ఇక్కడ 'మామకాః పాండవాశ్చైవ' అంటే ' మా కుమారులు, పాండురాజు కుమారులు' అని అర్ధం.
నాటినుంచే వున్న ఈ 'మా, మీ  తేడాలు' ఈనాటికి కారడవిలా విస్తరించి సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయి. (11-05-2016)

రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com  మొబైల్: 98491 30595   


1 కామెంట్‌:

Jai Gottimukkala చెప్పారు...

ప్రస్తుత సుప్రీం కోర్ట్ తీర్పు బొమ్మై కేసు తరువాత అంత మైలురాయి వంటిది!