14, మే 2016, శనివారం

ఊ...అంటే వస్తుందా....! ప్రత్యేక హోదా....


సూటిగా.....సుతిమెత్తగా.......
(PUBLISHED IN "SURYA" TELUGU DAILY ON 15-05-2016, SUNDAY)

స్నేహమేరా జీవితం అన్నారు. కానీ  జీవితమే స్నేహం కాదు. మరీ ముఖ్యంగా రాజకీయ పార్టీలకి వర్తించే నేటి వాస్తవం ఇది.  రాజకీయులు కలుస్తుంటారు, విడిపోతుంటారు. కలిపినా విడగొట్టినా ఒకటే కారణం. అది రాజకీయ  అవసరం.
రాముడు, ఆంజనేయుడు ఇద్దరూ  పురాణ పురుషులు. వీరిలో ఒకడు దేవుడు, మరొకడు ఆ దేవదేవుడికి పరమ వీరాగ్రేశ్వర భక్తుడు. కానీ చేసిన ప్రతిన కోసం ఒకరు, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం మరొకరు యుద్ధ భూమిలో తారసపడ్డట్టు లోగడ రామాంజనేయ యుద్ధం పేరుతొ నాటకాలు ఆడారు. సినిమా కూడా వచ్చింది.
కదన రంగంలో ఎదురయిన శ్రీరాముడికి ఆంజనేయుడు ధర్మం గురించి చెప్పబోతాడు. శ్రీరాముడు త్రుణీకరిస్తాడు. అంతేకాదు కఠినంగా మాట్లాడి పవన సుతుడ్ని చిన్నబుచ్చుతాడు. ’ధర్మము, ధర్మమటంచు వితండ వితర్కము లాడదీవు’ అంటూ, ‘మీ కోతి లక్షణం ఎక్కడికి పోతుంద’ని అంతటి వాడు కూడా మాట తూలతాడు. తన జాతిని చులకన చేయడంతో స్వామిభక్తిని కూడా మరచిపోయి  ఆంజనేయుడు రెచ్చిపోతాడు.
‘కోతి కోతి’ అంటూ మా వానర జాతిని చిన్న బుచ్చడం తగదు. ఆ కోతే లేకపోతే మీరెక్కడ. మీరనే  ఆ కోతే సీత జాడ కనుగొనక పోయివుంటే అసలు రామాయణమే లేదు, కోతులు  సేతు నిర్మాణం చేయకపోతే రామరావణ  యుద్ధమే లేదు,నేను  సంజీవని తేకపోతే లక్ష్మణుడు స్వర్గంలో వుండేవాడు, మా సాయం లేకపోతె రావణుడు ఇప్పటి వరకు రాజ్యం చేస్తూ వుండేవాడు’ అని ఎదురు  ఎద్దేవా చేస్తాడు.
రామాంజనేయ యుద్ధం నాటకంలోనిది ఈ దృశ్యాన్ని దశాబ్దాల క్రితం ఊరూరా ప్రదర్శిస్తుంటే జనాలు నోళ్ళు తెరుచుకుని చూస్తుండేవాళ్ళు.   ఆంజనేయ పాత్రధారి టంకసాల శ్రీరాములు, ‘సీతమ్మ జాడ మీ చెవి వేయమైతిమా నాటితో రామాయణంబు సున్న’ అంటూ తోక ఝాడిస్తూ రంగస్థలం మీద గంతులు వేస్తూ  పద్యాలు పాడుతుంటే ప్రేక్షకులు ఊగిపోయేవాళ్ళు.
గత రెండు రోజులుగా బుల్లి తెరలపై, తెలుగు దేశం, బీజేపీ సంబంధాలు గురించీ, ప్రత్యేక హోదా గురించీ  తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల నాయకుల నడుమ  అంతులేకుండా సాగిపోతున్న రాజకీయ చర్చలు, వాటిల్లో భాగంగా విసురుకుంటున్న ఎత్తి పొడుపులు   చూసేవారికి ఇప్పుడీ  ఈ ప్రస్తావన ఎందుకన్నది తేలిగ్గా అర్ధం అవుతుంది.
“హోదా ఇవ్వకపోవడం వల్ల   రాజకీయంగా వాటిల్లే నష్టం ఏమిటి? రాష్ట్రానికి జరిగే  నష్టం ఏమిటి? ప్రజలకు జరిగే నష్టం ఏమిటి?”
“ఇవ్వడం వల్ల రాజకీయంగా లబ్ది శాతం యెంత, నష్ట శాతం యెంత?”
ఈ  ప్రశ్నలకు దొరికే నిర్దిష్ట సమాధానాలను బట్టి రాజకీయ పార్టీలు పరిష్కార మార్గ అన్వేషణలో పడతాయి. ఆ పరిష్కారం కూడా రాజకీయ లబ్ది ఏమేరకు అనేదానిపై ఆధారపడి వుండాలని అవి కోరుకుంటాయి.
అందుకే, ముందే చెప్పినట్టు, ఇక ఈ  రెండు రాజకీయ పార్టీల నడుమ పొత్తు అనండి, రాజీ అనండి,  స్నేహం అనండి అది ఏదైనా సరే రాజకీయ లబ్ది ప్రాతిపదికపైనే కొనసాగడమో, విచ్చిన్నం కావడమో జరుగుతుంది.
ప్రత్యేక హోదా విషయంలో భారతీయ జనతా పార్టీ కుండబద్దలు కొట్టిందని మీడియాలో స్క్రోలింగులు సాగిపోతున్నాయి. నిజం చెప్పడమే కుండ బద్దలు కొట్టడానికి సంకేతం అనుకుంటే బీజేపీ కేంద్ర స్థాయి నాయకులు ఎప్పుడో ఇలాంటి కుండలు అనేకం బద్దలు కొట్టారు. నిజానికి ఈ చేదు నిజాన్ని పరోక్షంగా అనేక సందర్భాల్లో చెబుతూ వచ్చారు కూడా.
 రాజకీయ క్రీడలో ఇటువంటి వన్నీ అతి సాధారణమే. కానీ యేవో కొంపలంటుకు పోతున్నట్టు యాగీ చేయడం పార్టీలకి వెన్నతో పెట్టిన విద్య.  రచ్చ వల్ల మామూలు ప్రజలు ఇబ్బంది పడతారేమో కాని వారికి పోయేదేమీ లేదు. అందుకే అవసరం వున్నా లేకపోయినా ఏదో ఒక విషయంలో ఏదో ఒక యాగీ తప్పనిసరి. అదే జరుగుతోంది.  
అధికారంలోకి రావడానికి ముందు బీజేపీ  నాయకులు ఏం చెప్పారో అన్ని పార్టీల నాయకులు ఇప్పుడు పదే పదే   గుర్తు చేస్తున్నారు.  అధికారంలోకి వచ్చిన తరువాత  ఇచ్చిన మాటలన్నీ  కట్టగట్టి జమ్మి చెట్టు ఎక్కించారని ఆరోపిస్తున్నారు. ఇందులో నిజం లేకపోలేదు. కానీ గెలిచి అధికారపీఠం ఒకసారి ఎక్కి కూర్చున్న తరువాత,  అందులోను  తిరుగులేని మెజారిటీతో  సింహాసనం అధిష్టించిన పిదప, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఎవరైనా  గుర్తు చేస్తుంటే ఏ  పార్టీ మాత్రం సహిస్తుంది. పైగా అలా అడిగే పార్టీలు ఎన్నికల్లో తాము  ఇచ్చిన వాగ్దానాలను ఏ మేరకు నిలబెట్టుకున్నాయి కనుక? 
ఎన్నికలకు ముందు  వున్నపరిస్తితిని ఒక్క సారి గుర్తు చేసుకుందాం. అప్పుడు అధికారంలో  వున్న కాంగ్రెస్ సర్కారు ప్రతిష్ట అనేకానేక  కుంభకోణాలతో మసకబారి వుంది. అంతమాత్రం చేత ప్రజలు బీజేపీని నెత్తిన పెట్టుకుంటారన్న పూచీ అప్పట్లో ఏమీ లేదు. రాష్ట్రంలో ఇప్పుడు అధికారంలో  వున్నటీడీపీది  అప్పుడు దాదాపు అదే పరిస్తితి. ఈ నేపధ్యంలో రెండు పార్టీల నడుమ ఎన్నికల పొత్తు కుదిరింది. అదికూడా ఎందుకంటీ ఆనాటి ఎన్నికల్లో ఏమైనా సరే ఓడిపోకూడదు. గెలిచి తీరాలి. రెండు పార్టీలకి ఇదే లక్ష్యం. ఇదే బీజేపీని, టీడీపీని దగ్గరకు తీసింది.
అప్పటికే రాష్ట్ర విభజన నిర్ణయం జరిగిపోయింది. ఓపక్క  తెలంగాణా ప్రజలు సంబరాలు జరుపుకుంటూ వుంటే, సీమాంధ్ర ప్రాంతం వాళ్ళు పూర్తి నిరాశా నిస్పృహల్లో వున్నారు. ఆ రెండు పార్టీలకి ఇది కలిసి వచ్చింది. ఎన్నికల సమయం తొలి రోజుల్లో వున్న  ‘గెలుస్తామో లేదో’ అనే సందేహం తొలగిపోయి, రోజులు గడుస్తున్న కొద్దీ ‘ఏమో గెలుస్తామేమో’ అనే ఆశలు చిగురించిన స్తితిలో,  ఆ నమ్మకాల పునాదులను మరింత గట్టి  పరచుకోవడానికి ఆ రెండు పార్టీల అగ్ర నాయకులు ప్రత్యేక  హోదా విషయంలో ఒక అడుగు ముందుకు వేసి హామీలు గుప్పిస్తూ పోయారు.  రాష్ట్ర విభజనే అనూహ్యంగా జరిగిన నేపధ్యంలో, ప్రత్యేక హోదా అంటే ఏమిటో, దానివల్ల ఒనగూడే లాభాలు ఏమిటో అప్పటిదాకా ఎవ్వరికీ తెలియదు. కానీ నేతలు ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకుని ఆ లాభాల చిట్టా విప్పి ప్రజలకు  అవగాహన కలిగించి ఆ పుణ్యం కూడా మూట  కట్టుకున్నారు. మళ్ళీ ఇప్పుడు తమకు ఏ పాపం తెలియదని అదే నోటితో అంటున్నారు. తప్పంతా నాటి ప్రభుత్వాలదే అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. 
రెండేళ్ళ నుంచి రాష్ట్రానికి వచ్చిన ప్రతి కేంద్ర మంత్రి అవసరం వున్నా లేక పోయినా ప్రత్యేకంగా ప్రత్యెక హోదా ప్రస్తావన తెచ్చేవాళ్ళు. దానికి స్థానిక టీడీపీ  నాయకులు తందానా అనేవాళ్ళు. కాలం  గడుస్తున్న కొద్దీ ఇది ముడి పడే వ్యవహారం కాదని వారికీ తెలిసిపోయింది. దాంతో పల్లవి కొంత మారింది.
ఈలోగా,  పార్టీ ఫిరాయింపుల నేపధ్యంలో  దిక్కుతోచని స్తితిలో వున్న   ప్రధాన ప్రతిపక్షం వైఎస్ ఆర్ సీపీకి, మరోపక్క రాష్ట్ర విభజనకు కర్తా కర్మా క్రియా కాంగ్రెస్సే  అనే నింద మోస్తూ రాజకీయంగా  సర్వం కోల్పోయి తీరం చేర్చే  నావ కోసం ఎదురుచూస్తున్న ఆ జాతీయ పార్టీకి,  ఈ ప్రత్యేక హోదా అంశం తురుపు ముక్కలా  చేతికి తగిలింది.  ఆ ముక్క పట్టుకుని ఆందోళనకు దిగాయి. ఒక ప్రాంతీయ పార్టీని మరో ప్రాంతీయ పార్టీ, ఒక జాతీయ పార్టీని మరో జాతీయ పార్టీ ఒకే  బాణంతో కొట్టాలని ప్రయత్నాలు ప్రారంభించాయి. గత ఎన్నికల్లో లాభించిన పొత్తు, వచ్చే ఎన్నికల నాటికి గిట్టుబాటు కాదేమో అని లెక్కలు వేసుకుంటున్న సంకీర్ణ ప్రభుత్వ  పార్టీలు కూడా పునరాలోచనలో పడ్డట్టు తాజా పరిణామాలు తెలుపుతున్నాయి. ఒక ప్రయోజనం కోసం చేతులు కలపడం వల్ల ఏర్పడ్డ సంకీర్ణం బాలారిష్టాలు తట్టుకోవడం కష్టం. ఆ  అవసరం తీరిపోయిన తరువాత కూడా అది అలానే అంటిపెట్టుకుని వుంటుందని  అనుకోవడం భ్రమ. మనసులు కలిసినప్పుడు ఎవరు ఏమన్నా సరిపుచ్చుకుంటారు. అదే సరిపడకపోతే రామా అన్నా కూడా  వేరే విధంగా వినిపిస్తుంది. బహుశా ఈ రెండు అధికార పక్షాలు ఈ దశకు చేరుకున్నాయేమో అనిపిస్తోంది వారి వ్యాఖ్యలు వింటుంటే..              
రాజకీయ పార్టీల నడుమ స్నేహ సంబంధాలన్నీ  పరస్పరాధారిత అంశంపైనే ఆధారపడి వుండడం సహజం. ప్రభుత్వ మనుగడ మరొకరి దయాదాక్షిణ్యాల మీద  ఆధారపడి వున్నప్పుడు సంకీర్ణ ధర్మం ఒక రకంగా  వుంటుంది. ఆధారపడే పరిస్తితి లేనప్పుడు దాని రంగూ రుచీ వాసనా ఇట్టే మారిపోతాయి. దానితో వ్యవహార శైలే మారిపోతుంది.  ఫలితంగా తాత్కాలిక స్వార్ధ రాజకీయ ప్రయోజనాలు దీర్ఘ కాలికశాశ్విత  ప్రజా ప్రయోజనాలను పక్కకు నెడతాయి.
స్థూలంగా పరిశీలించినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జరుగుతోంది ఇదే.
అటులయిన సావిత్రీ మరొక్క వరమ్ము కోరుకొమ్ము, అదియును నీ పతి ప్రాణమ్ము దక్క’ అనే యమధర్మరాజు డైలాగు ఒకటుంది, ఒక తెలుగు సినిమాలో. అలనాటి పురాణ కధలో సతీ సావిత్రి యముడ్ని తన కోరికల చిట్టాలతో తికమక పెట్టి, చివరికి పోయిన తన పతి ప్రాణాలతో సహా అన్నింటినీ సాధించుకుంటుంది. సరే! అది కధో, పురాణమో కాబట్టి సావిత్రి పట్టిన పట్టు విడవక తన పంతం నెగ్గించుకుని ఉండవచ్చు. కానీ ఈ కలికాలంలో ఇలాటి కధ ఇలానే సాగే వీలులేదు.  కాబట్టే, ఆంధ్రప్రదేశ్ కు  ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలంటూ ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారీ విజ్ఞప్తులు చేస్తూ వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ‘హోదా అనేది ఏవన్నా సంజీవనా ?’ అంటూఓ సందర్భంలో అనాల్సివచ్చింది. ప్రత్యేక ప్యాకేజి మరింత మంచిది అనే ప్రకటనలు కూడా వచ్చాయి.
ఈ పరిణామాలన్నీ ఎప్పుడో చంద్రగుప్తుడి కాలంలోనో, క్రీస్తు పూర్వ కాలంలోనో జరిగినవి కావు. ఇంతా చేసి అంతా మూడేళ్ళు కాలేదు. అన్నీ ప్రజల మనస్సులో ఇంకా పచ్చిగానే వున్నాయి.  ప్రజలు గుర్తుంచుకున్న వాళ్ళ మాటల్ని వాళ్ళకే గుర్తు చేద్దాం. ఎక్కడో ఎప్పుడో విన్నట్టుగా వున్న కొన్ని మాటల్ని మళ్ళీ ఓసారి వినిపిద్దాం. గుర్తుకు వస్తుందో లేక గుర్తు రానట్టు నటిస్తారో చూద్దాం.
'విడిపోతున్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి'
'అయిదేళ్ళు కాదు పదేళ్లు ఇవ్వాలి'
'ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామనే హామీకి కట్టుబడి వున్నాం'
'ఈ విషయంలో మా చిత్తశుద్ధిని శంకించాల్సిన పనిలేదు, ప్రతిపక్షాలు కావాలనే మా మీద బురద చల్లుతున్నాయి'
'ప్రత్యేక హోదా సాధించేవరకు మేము నిద్రపోము'
'మేము అధికారంలోకి రాలేక పోవడం వల్ల గత పార్లమెంటు సాక్షిగా మేము ఇచ్చిన ఈ హామీని నిలబెట్టుకోలేకపోయాము. ఈసారి అధికారంలోకి రాగానే ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చి మా మాట నెరవేర్చుకుంటామనిమరోసారి  మరో హామీ ఇస్తున్నాము'
'ఇచ్చిన హామీని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం  నిలబెట్టుకోలేదు, కేంద్రంపై ఒత్తిడి తేవడంలో బీజేపీ మిత్రపక్షం అయిన టీడీపీ ఘోరంగా విఫలం అయ్యింది'
'పద్నాలుగవ ఆర్ధిక సంఘం సిఫారసుల మేరకు ఇప్పుడు ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్తితిలేదు. విభజన చట్టంలోనే ప్రత్యేక హోదాను కాంగ్రెస్ పొందుపరచి వున్నట్టయితే ఇప్పుడీ పరిస్తితి వచ్చేదే కాదు'
'మేము ఇవ్వలేదు సరే. ఇప్పుడు పార్లమెంటులో  ఏ బిల్లునయినా ఆమోదింపచేసుకోగల మెజారిటీ మీకు వున్నప్పుడు  ప్రత్యేక హోదాకు వీలు కల్పిస్తూ చట్ట సవరణ చేయవచ్చు కదా'
'ప్రత్యేక హోదా కుదరదు అన్న కేంద్ర మంత్రి ప్రకటన ఆంధ్రప్రదేశ్ కు వర్తించదు'
'ప్రత్యేక హోదా కుదరని పక్షంలో ప్రత్యేక ప్యాకేజీ ఇస్తాం'
'రాజీనామాల వల్ల ప్రత్యేక హోదా వచ్చేటట్టయితే అందుకు మేము సిద్ధం'
ఇవన్నీ అనేక రోజులుగా వినీ వినీ ప్రజల చెవులకు తుప్పు పట్టింది. అవే మాటలు పదేపదే  వింటూ రావడం వల్ల పట్టిన చెవుల తుప్పు ఒదిలిపోయింది కూడా. అందుకే ప్రజలకు ఇప్పుడు సర్వం అర్ధం అవుతోంది. రాజకీయ పార్టీల అసలు  తత్వం బోధపడుతోంది.
నిజానికి ఈ మాటలు అన్నీ పైకి చెప్పేవి. మన్  కీ  బాత్ అంటారు కదా! వారి  మనసులోని మాటలు వేరే.
'ప్రత్యేక హోదా  ఇవ్వచ్చు. కానీ దగ్గర్లో ఎన్నికలు లేవు.  ఇప్పుడు ఇస్తే ఏమిటి లాభం?'
'ఇప్పుడే ఇవ్వాలి. ఎన్నికలకు ముందు ఇస్తే మాకేమిటి లాభం'
'ఇవ్వడం వల్ల మా పార్టీకి ప్రస్తుతం ఎలాటి లాభం లేదు. పైగా నష్టం కూడా. కానీ రాజకీయ ప్రయోజనాలకోసం పోరాడక తప్పదు. రోడ్డెక్కక తప్పదు'
అసలు విషయం ఇదన్న మాట.
పొతే, మరో ముఖ్యమైన సంగతి ఒకటుంది.  ఆంద్ర ప్రదేశ్ కొత్త రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం, లేదా ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడం కేంద్రం చేతిలోని వ్యవహారం. ఇవ్వడం వల్ల అద్భుతాలు జరక్క పోవచ్చు. కానీ ప్రత్యేక హోదా అనేది ఒక భావోద్వేగ అంశంగా మారితే జరిగే పరిణామాలు  వేరుగా వుంటాయి. తెలంగాణా విషయంలో జరిగింది అదే. లక్షల కోట్ల ప్యాకేజీలు కూడా త్రాసులో వేసి తూస్తే తెలంగాణా అనే భావోద్వేగపు తులసి దళం పడగానే అవన్నీ సత్యభామ ఆభరణాల్లా తేలిపోయాయి. ఇలాటి వాస్తవాలను రాజకీయ పార్టీలు అహరహం గుర్తుంచుకోవాలి.
అదీ వాటి బాగు కోసం కాదు, ప్రజల బాగోగుల కోసం.
కానీ, స్వార్ధ ప్రయోజనాల ఆరాటంలో వున్న రాజకీయ పార్టీల నుంచి ఈ పరివర్తన ఆశించడం వృధా.  
ప్రతిపక్షాలు చేసే  ఆందోళనల వల్ల,  ధర్నాలవల్ల ప్రత్యేక హోదా వస్తుందా? ప్రజలకు అసౌకర్యం తప్ప’ అని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. అదీ. నిజమే. ధర్నాలవల్ల, ఆందోళనల వల్ల, నిరసనల వల్ల రాజకీయ నిర్ణయాలు ప్రభావితం కావు. నిర్ణయం తీసుకునే అవకాశం వున్న  ఏ రాజకీయ పార్టీ అయినా దానివల్ల కొద్దో గొప్పో లబ్ది వుంటుంది అనే నమ్మకం చిక్కిన తరువాతనే అటువంటి కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ‘ప్రజాస్వామ్య వ్యవస్థలో ధర్నాలు, ఆందోళనలు ఒక భాగం.  అవి సహజం’  అని ప్రతిపక్షంలో వున్నప్పుడు ప్రబోధించే పార్టీలే అధికార పీఠం ఎక్కగానే, తగవు తగవంటూ  ఇటువంటి నీతి పాఠాలు వల్లె వేస్తూ వుండడం వల్ల జనసామాన్యంలో వాటికి విలువ తగ్గిపోతూ వుంది.
అధికారంలోకి రావడానికి చెప్పే మాటలకి, అధికారం చేజిక్కించుకున్న తరువాత చేసే చేష్టలకి హస్తిమశకాంతరం తేడా ఉంటుందన్నది సర్వజన విదితమే. తిరుపతి వెంకన్న సాక్షిగా మాట ఇచ్చేటప్పుడు మోడీ కేవలం నరేంద్ర మోడీ. తరువాత దేశం యావత్తు పట్టం కట్టిన ప్రధానమంత్రి. తేడా ఉండదా అంటే వుండి తీరుతుంది. ఎందుకంత తేడా అని తప్పు పట్టలేము. ఆ రోజు అవసరార్ధం అనేకం చెబుతారు. అవన్నీ చేసి తీరాలని రూలేమీ లేదు. దేశ ప్రధాని పీఠం ఎక్కేంతవరకు, మోడీ  మహాశయులకు  ఆంధ్రప్రదేశ్  అనేది మొత్తం దేశంలో  ఒక ముఖ్యమైన  రాష్ట్రం. ఆ పీఠం అధిష్టించిన తరువాత దేశంలోని ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో అది కూడా ఒకటి. ఈ సూత్రం ఒక్క మోడీకే కాదు  జాతీయ స్థాయి  రాజకీయ నాయకులందరికీ వర్తిస్తుంది.
టీవీల్లో జరుగుతున్న చర్చల తీరుతెన్నులు చూస్తున్నప్పుడు ఓ విషయం గుర్తుకు వచ్చింది.
వెనుకటి రోజుల్లో ఇళ్ళల్లో నాయనమ్మలు, అమ్ముమ్మలు మునిమాపు వేళల్లో చిన్నపిల్లల్ని చుట్టూ కూర్చోబెట్టుకుని కధలు చెప్పేవాళ్ళు. పిల్లలు '' కొడుతూ, కధలు వింటూనే నిద్రలోకి జారుకునే వాళ్లు. అలాటి ఒక కధ ఇది.
'అనగనగా ఓ ఊళ్ళో ఓ ముసలామె వుండేది' కధ మొదలు పెట్టేది బామ్మ.
'' అనేవాళ్ళు పిల్లలు.
'ఆ ముసలావిడ ఓ రోజు బావి గట్టు మీద కూర్చుని బట్టలు కుడుతుంటే చేతిలో సూది జారి నూతిలో పడిపోయింది'
'' అనేవాళ్ళు పిల్లలు ఇంకా చెప్పు అన్నట్టుగా.
'ఊ అంటే వస్తుందా?' అనేది బామ్మ.
'' అనేవాళ్ళు పిల్లలు నోరు తెరిచి.
'' అంటే వస్తుందా' అడిగేది బామ్మ.
బావిలో పడ్డ సూది సంగతేమో కానిఆ కధ మాత్రం అలా  అనంతంగా సాగిపోయేది.
ఇక విషయానికి వస్తే-
ఆంధ్ర ప్రదేశ్ కు స్పెషల్ స్టేటస్ రావాలి. అంటే ఏం చేయాలి?
'వై ఎస్ ఆర్ సీపీ వాళ్ళు ఢిల్లీలో   ప్రధాని ఇంటి ముందు ధర్నా చేస్తే వస్తుందా?'
'ముఖ్యమంత్రి చంద్రబాబు స్పెషల్ ఫ్లైట్లలో ఢిల్లీ వెళ్ళి మహాజర్లు ఇచ్చి వస్తే వస్తుందా?'
‘కేంద్ర ప్రభుత్వానికి రాం రాం చెబితే వస్తుందా’ 
'రాష్ట్రానికి చెందిన బీజేపీ నాయకులు తమ అధిష్టానంపై ఒత్తిడి తెస్తే వస్తుందా’
'అసలు వస్తుందా రాదా? వస్తే ఎప్పుడు వస్తుంది?'
'ఎప్పుడా? బావిలో పడ్డ సూది ముసలమ్మ చేతికి  దొరికినప్పుడు'
ఉపశృతి
“ప్రమోషన్ రాగానే కంచి పట్టు చీరె కొనిపెడతామన్నారు. రెండేళ్ళయింది. అది ఒట్టి మాటేనా?”
“భలేదానివే. దాని విషయమే కదా నేను ఇన్నాళ్ళు ఆలోచిస్తోంది. కాకపోతే ఒక సంగతి చెప్పాలి. చీరెదేముంది, ఈరోజు కడతావు, కలరు మాసిపొతే  రేపు బయట పడేస్తావు. అదే నెక్లెసు కొన్నాననుకో. నాలుగు కాలాలపాటు వుంటుంది. నీకూ నలుగుర్లో గొప్పగా  వుంటుంది. ఏమంటావ్!” 

 (14-05-2016)

రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com  మొబైల్: 98491 30595 

1 కామెంట్‌:

Zilebi చెప్పారు...




జంతరు మంతరు జూడర
అంతము లేకయు జిలేబి అల్లాడెనుగా !
వింతయు గాదుర, సందే
హం తమరికి యేల! శుద్ధ హరణము తెలియన్!

జిలేబి