20, జూన్ 2021, ఆదివారం

ఓ మొగుడి సెల్ఫ్ కన్ఫెషన్ – భండారు శ్రీనివాసరావు

 ఆదివారం, అమావాస్య, తోడుగా సుదీర్ఘ సూర్య గ్రహణం. అనగానే ఒకనాడు నేను నా భార్యను ఏ విధంగా చిత్ర హింస పెట్టింది గుర్తుకు వచ్చి మనసు వికలం అవుతుంది

దేవుడు నిజం, ఆయన చుట్టూ అల్లినవన్నీ నమ్మకాలు మాత్రమే అనే ధియరీ నాది. అయితే నా నమ్మకాలు నావరకు పరిమితం చేసుకుని వుంటే ఈరోజు ఈ పోస్టు పెట్టాల్సిన అవసరం వుండేది కాదు. నా కన్ఫెషన్ వినండి కాసేపు మీరే దేవుడు అనుకుని.

ఘోరమైన తప్పులు చేసి కూడా శిక్షలు పడకుండా తిరిగే ఘరానా నేరగాళ్ళు కొందరు మన మధ్యనే దర్జాగా తిరుగుతుంటారు. అలాంటి వారి జాబితా తీస్తే మొదటి పేరు నాదే.

కొంచెం అటూ ఇటూగా ముప్పయ్ ఏడేళ్ల కిందటి మాట. అప్పుడూ సంపూర్ణ సూర్యగ్రహణం వచ్చింది. మా ఆవిడ మొదటి బిడ్డను కడుపుతో వుంది. చీకటి గదిలో కదలకుండా పడుకోమని పెద్దవాళ్ళ మాట. అలా చేయకపోతే పుట్టే బిడ్డ అవకరంగా పుడుతుందని హెచ్చరిక లాంటి సలహా. ఇంటి మొత్తంలో చిన్నవాడ్ని నేనే అయినా నా మాటే చెల్లితీరాలనే మొండి వాళ్ళలో నేనే పెద్దవాడిని. ఎలా వింటాను? కానీ ఈ పంతాలు, పట్టింపుల్లో మానసికంగా నలిగిపోయేది మా ఆవిడే అనే సంగతి నేను పట్టించుకోలేదు. గదిలో పడుకోవద్దు అనే దగ్గర ఆగిపోతే నేను నేనెలా అవుతాను. పట్టుబట్టి గోధుమ పిండి కలిపించాను. రొట్టెలు చేయించాను. ఆ రోజల్లా అవసరం లేని చాకిరీ చేయించాను. అంటే బట్టలు ఉతకడం, వాటిని పిండి ఆరేయడం ఇలా అన్నమాట. నిజానికి ఈ పనులు చేయడానికి ఇంట్లో పని పిల్ల వుంది. కానీ నా యుద్ధం మూఢనమ్మకాలపైన. మా ఆవిడకు అది తొలి చూలు. సొంత బిడ్డపై ప్రయోగాలను ఏ ఆడది అయినా సహిస్తుందా! కానీ ప్రేమించి పెళ్ళాడినందుకు నేను పెట్టే ఈ రకమైన క్షోభను అంతా పంటి బిగువన ఓర్చుకుంది. నేను చెప్పినట్టే నడుచుకుంది. చుట్టపక్కాలు నా దాష్టీకాన్ని తప్పుపట్టారు. కానీ నా దారి నాదే. ఆరోజు అలా గడిచిపోయింది. కొన్ని  నెలల  గడిచాయి. పిల్లాడు పుట్టాడు ఎలాంటి శారీరక వైకల్యం లేకుండా. సూర్య గ్రహణం ఎలాటి ప్రభావం చూపనందుకు పెద్దవాళ్ళు సంతోషపడ్డారు.

కానీ నా మానసిక వైకల్యం మాటేమిటి?

పెళ్లి అనే ఒక బంధంతో ఆడదానిపై మగవాడికి సర్వహక్కులు వచ్చేస్తాయా! ఆమెకు ఒక మనసు ఉంటుందని గ్రహించలేని మగాడు మూఢాచారాలపై పోరాటం చేస్తున్నానని గొప్పలకు పోవడం వల్ల ప్రయోజనం ఏమిటి? ఈ రకమైన మానసిక చిత్ర హింసలకు శిక్షలు ఉండవా?

వుండవు. నేనే సజీవ సాక్ష్యం.


(2019 లో పరమపదించిన మా ఆవిడ నిర్మల)


(2020)

5 కామెంట్‌లు:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

మూఢనమ్మకాల మీద విశ్వాసం లేని వ్యక్తి తన వరకు తాను ఆ నమ్మకాలను అనుసరించకపోవడం అన్నది చెయ్యాలి గానీ ఎదుటి వారి మీద బలవంతంగా రుద్దడం ఏమిటి … అందులోనూ అటువంటి స్ధితిలో ఉన్న వ్యక్తి మీద? మీ మటుకు మీరు గ్రహణం సమయంలో బయట తిరిగుండవచ్చు; నల్ల కళ్ళజోడు పెట్టుకోకుండా తలెత్తి సూర్యుడిని చూసుండవచ్చు; అన్నం పెట్టుకుని భోజనం చేసుండవచ్చు. అంతే కానీ ఇంటి వారి మీద ఏమిటి?

ఏమనుకోకండి గానీ ….. ఎదురు చెప్పని వ్యక్తి దొరకడం మీ అదృష్టం అనాలి. మీ మాట నెగ్గడానికి అదే ముఖ్యకారణంమేమో?

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

గ్రహణం సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు అని పెద్దలు చెప్పిన దానికి cosmic rays ప్రభావం లాంటి శాస్త్రీయత ఉందని మీకు తెలిసే ఉండాలే?

M. Dharithri Devi చెప్పారు...

గ్రహణ సమయంలో వెలువడే కొన్ని కిరణాలప్రభావం గర్భస్థ శిశువుపై పడే అవకాశముందని శాస్త్రీయ కారణాలు చెబుతుంటారు. ఏదిఏమైనా, ఆసమయంలో జాగ్రత్తగా ఉండడమే ఉత్తమం ఇష్టం లేకపోయినా. ఏ ఇతర కారణాలవల్ల శిశువు అవకరంగా జన్మించినా దాన్నే కారణంగా చూపించి బాధ్యుల్ని చేసే ప్రమాదముంది. ఫలితం ! జీవితకాలం వేదన ! అపరాధభావన !!

Rao S Lakkaraju చెప్పారు...

"ఈ రకమైన మానసిక చిత్ర హింసలకు శిక్షలు ఉండవా?"

ఉంటాయి. ఏళ్ళ క్రిందట జరిగినదాని గురించి గుర్తు చేసుకుని బాధపడుతూ ఈ పోస్ట్ వ్రాశారు కదా !

Chiru Dreams చెప్పారు...

>>గ్రహణం సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు అని పెద్దలు చెప్పిన దానికి cosmic rays ప్రభావం లాంటి శాస్త్రీయత ఉందని మీకు తెలిసే ఉండాలే?

అలాంటివేమీ లేవండి. తన భార్యని ఎంత క్షోభపెట్టిందీ అనేది తలుచుకోని భండారుగారు గారు క్షోభపడుతున్నారు. అది ఆరోజే కాదు, ఏరోజు జరిగినా.. మరుపుకు రాని క్షోభ.