24, జూన్ 2021, గురువారం

ఆంధ్ర అభ్యసన పరివర్తన

 ఇంగ్లీష్ భాషలో వున్నవి ఇరవై ఆరు అక్షరాలే. అంచేత కాబోలు ఇతర భాషలలోని ముఖ్యంగా లాటిన్ వంటి భాషలోని  పదాలను చేర్చుకుని ఆ భాష పరిపుష్టం అయిందంటారు.

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తున్న కొద్దీ కొత్త కొత్త పదాలు అనుభవంలోకి వస్తుంటాయి. ఇది తప్పనిసరి పరిణామం.

ఓ యాభయ్ ఏళ్ళ క్రితం నేను ఒక తెలుగు దినపత్రికలో పనిచేస్తున్నప్పుడు ఘెరావ్, ధర్నా అనే పదాలు మొదటిసారి వాడుకలోకి వచ్చాయి. మొదట్లో వీటిని రకరకాలుగా రాసేవారు. ఘెరావో, ధరణ ఇలా. అవి తెలుగు పదాలు కావు కాబట్టి ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పలికేవాళ్ళు, రాసేవాళ్ళు. తొలి రోజుల్లో వీటిని  తెలుగులోకి అనువదించే ప్రయత్నం జరిగింది. కానీ అది సఫలం కాలేదు. దరిమిలా, కాలం గడిచిన కొద్దీ అవి వ్యావహారిక పదాలుగా మారిపోయాయి. ఇలాటి ఉదాహరణలు చాలా వున్నాయి. రైలు స్టేషన్, సిగ్నల్, బస్ స్టాండ్, సిటీ బస్సు, ఆటో ఇలా చాలా చెప్పుకోవచ్చు. పైన తెనిగించినట్టు “ఆంధ్ర అభ్యసన పరివర్తన” మాదిరిగా అదే పత్రికలో ఈ పదాలను తర్జూమా చేసి రాస్తున్నారా! లేదే! లేనప్పుడు ఈ కొత్త పదసృష్టి దేనికోసం? ఎవరి కోసం?

నేను మొదటి నుంచి చెబుతున్నది ఒక్కటే. మీరు తెలుగులో అనువాదం చేయండి. కానీ చదువరికి అర్ధం అవుతుందా లేదా అని ఒక్క క్షణం ఆలోచించండి. ఇలా అనువాదాలు చేసేవాళ్ళు ఏసీ గదులు వదిలి, బొత్తిగా ఇంగ్లీష్ తెలియని పల్లె ప్రాంతాలలో వాటిని ఎలా పలుకుతున్నారో అధ్యయనం చేయండి. ఉదాహరణకు మా చిన్నప్పుడు పల్లెటూళ్ళలో కిరోసిన్ ను మట్టినుంచి తీసే నూనె కాబట్టి  మట్టి నూనె (చమురు) అనేవారు. అలాగే పొగబండి. ఇప్పుడా ఇంజిన్లతో నడిచే బండ్లు లేవు కాబట్టి రైలు అనక తప్పదు. విశాఖ పట్నంలో డ్రెడ్జింగ్  యంత్రాలతో పనిచేయిస్తున్నప్పుడు అక్కడి పని వారు దాన్ని తవ్వోడ అని పిలిచేవారని కలం కూలీ జి. కృష్ణ గారు చెప్పేవారు. పాశం యాదగిరిని అడిగితె లక్ష ఉదాహరణలు చెబుతాడు. ఒక తెలుగు వాక్యంలో ఒక్కటంటే ఒక్క తెలుగు పదం లేని వాక్యాలు తెలుగునాట అందరూ పలుకుతుంటారని సోదాహరణంగా పేర్కొంటాడు.

ఈ విధంగా పల్లెల్లో పుట్టే పలుకుబడులను ఈ అనువాద మేధావులు పట్టించుకోరు. పైగా అనువాదం కోసం అనువాదం అనే పద్దతిలో తెలుగును నానా హింస పెడుతున్నారు.

“ఆంధ్ర అభ్యసన పరివర్తన” వంటి ప్రయోగాలతో తెలుగును క్లిష్టతరం చేయడం, ఇదేమైనా భావ్యమా! అని మనం ప్రశ్నిస్తే తప్పేమిటి?



(24-06-2021)  

కామెంట్‌లు లేవు: