21, జూన్ 2021, సోమవారం

సంగీతం మధుర సంగీతం -భండారు శ్రీనివాసరావు

 ఊరికే నస పెట్టడం తప్ప నాకు  సంగీతం గురించి కానీ, సరిగమ పదనిసలు గురించి కానీ బొత్తిగా తెలియదు. ‘జర్నలిస్ట్ అనేవాడు, తెలియదు అనకూడదు, తెలుసుకుని మరీ నలుగురికి తెలియచేయాలి’ అనేవారు మా గురువుగారు తుర్లపాటి కుటుంబ రావు గారు.

ఈరోజు అంతర్జాతీయ సంగీత దినోత్సవం కదా! కొన్ని ఆ కబుర్లు.  

'సంగీతము చేత బేరసారములుడిగెన్'

చిన్నప్పుడు సంగీతం నేర్చుకొందామనుకొనే వారందరికీ కాషన్ గా ఈ సామెత చెప్పేవారు. అయితే కొంతమంది పెళ్ళిచూపుల్లో అదనపు అర్హత కోసం చిన్నప్పుడు ఆడపిల్లలకి ఇళ్ళల్లో నాలుగయిదేళ్లపాటు సంగీతం చెప్పించేవారు. దొంగరాముడు సినిమాలో వీరభద్రయ్య {రేలంగి} తన కూతురుకి ఇలాగే పెళ్లి సంగీతం చెప్పిస్తాడు. పెళ్లి చూపుల్లో 'జార చోరా భజన చేసితిరా' అని 'దారిని తెలుసుకొంటి' అనే త్యాగరాజ కీర్తనలో చరణాన్ని పెళ్లి కూతురు చేత పాడిస్తారు దర్శకుడు కేవీ రెడ్డి గారు.

అదలా వుంచితే,

తెలుగునాట ద్వారం వెంకటస్వామి నాయుడు, చిత్తూర్ సుబ్రహ్మణ్య పిళ్లే, దాలిపర్తి పిచ్చిహరి, హరి నాగభూషణం, తూమాడ సంగమేశ్వర శాస్త్రి, పారుపల్లి రామకృష్ణయ్య పంతులు, మహావాది వెంకటప్పయ్య వంటి పాత తరానికి చెందిన సంగీత విద్వాంసులు ప్రసిద్ధి చెందారు. పోతే, సుసర్ల దక్షిణా మూర్తి గారు త్యాగరాజు శిష్య పరంపరలోని వారు. ఈ మహా విద్వాంసుల శిష్యకోటిలో తెలుగు వారికి అఖండ ఖ్యాతి తెచ్చిపెట్టిన వారు మంగళంపల్లి బాలమురళి కృష్ణ, శ్రీపాద పినాకపాణి, నేదునూరి కృష్ణ మూర్తి, వోలేటి వెంకటేశ్వర్లు, షేక్ చిన్న మౌలా, ఈమని శంకర శాస్త్రి . ఇంకా ఎందరో విద్వాంసులు కర్నాటక సంగీతంలో అగ్రశ్రేణిలో నిలిచారు. ఈ విషయంలో మనం ఎంత గొప్పవాళ్ళ మైనా తమిళులు కర్నాటక సంగీతం వాళ్లదేనని అనుకొంటారు. కొంత వాస్తవం కూడా. కర్నాటక సంగీతానికి తమిళనాట ఉన్నంత ఆదరణ మన ప్రాంతంలో లేదు. మద్రాసులో కచేరి చేసి అక్కడి వాళ్ళ చేత ‘సెహభాష్’ అనిపించుకొంటేనే ఇక్కడ కూడా గౌరవం. ‘ఇంట గెలిచి రచ్చ గెలవాలి’ అన్న సూత్రం ఇక్కడ పని చెయ్యదు. సంగీతంలో మాత్రం రచ్చ గెలిస్తేనే ఇంట్లో గౌరవిస్తాం. ఉదాహరణ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు.

ఫిడేలు నాయుడు గారి నుంచి ఈతరం మాండొలిన్ శ్రీనివాస్ దాకా కూడా ఇదే వరస, ఇదే బాణీ.

మార్గశిర మాసం వచ్చిందంటే చెన్నై వాసులకు ఓ పండగ. డిసెంబర్ పదిహేనో తారీకు నుంచి జనవరి ఒకటో తారీకు దాక చెన్నైలో సంగీతం తప్పితే ఏమీ వుండదు. నగరంలో నలుమూలలా కనీసం ఓ పది పదిహేను ప్రాంతాల్లో ప్రతి రోజూ హీనపక్షం అయిదారు సంగీత కచేరీలయినా జరుగుతూ వుంటాయి. ఎక్కడ చూసినా హడావుడే. ఎక్కడెక్కడినుంచో కర్నాటక సంగీత అభిమానులు చెన్నై చేరుకుంటారు. ప్రొద్దుట తొమ్మిది నుంచి రాత్రి పది దాకా కచ్చేరీలు వినడమే వారి పని. చెవుల తుప్పు వొదిలిపోతుంది. మరో ఏడాదికి సరిపడా ఆనందాన్ని మనస్సులో నింపుకుని సంగీతాభిమానులు తిరుగుమొగం పడతారు.

ఇక చెన్నైలో మ్యూజిక్ అకాడమీది ఓ ప్రత్యేకత. ఎనిమిది  దశాబ్దాలకు పైగా  విరాజిల్లుతోంది. నిజానికి పాశ్చాత్య ధోరణులు అన్ని రంగాలను ముప్పేటలా ముసురుకుంటున్న ఈ రోజుల్లో ఇది ఎంతో గొప్ప విషయం అనే చెప్పుకోవాలి.

అకాడమీలో కచేరి చెయ్యడం అంటే ఆర్టిస్టులకు అంతకంటే గొప్ప గౌరవం ఇంకోటి వుండదు. అలాగే సంగీత అభిమానులకు అకాడమీలో కచేరి వినడం కంటే గొప్ప అనుభవం వుండదు. జీవితంలో వొక్కసారైనా అకాడమీలో కచ్చేరి వినాలన్నది వారి నరనరాల్లో జీర్ణించుకుపోయే కోరిక. మంచి సంగీతం వినాలనుకునే వారికి మ్యూజిక్ అకాడమీ హాలు ఒక వరప్రసాదం లాటిది. ఎందుకంటె అక్కడి ఏర్పాట్లు అలాటివి. ఎక్కడ కూర్చున్నా కూడా చక్కగా, శ్రావ్యంగా వినిపించే సౌండ్ సిస్టం. మన రవీంద్ర భారతి అధికారులు ఓ సారి వెళ్లి చూడాలి. ఆ సీటింగ్ ఆరెంజిమెంటు, సౌండ్ సిస్టం దేనికదే ప్రత్యేకం. వాళ్ళను పొగడడం, మన వాళ్ళను కించబరచడం అని కాదు. మనకు కూడా ఇక్కడ అటువంటి చక్కటి అనుభూతి కలగాలని మాత్రమే.

(విషయ సేకరణలో తోడ్పడిన ఆర్వీవీ కృష్ణారావు గారెకి కృతజ్ఞతలు)

21-06-2021

 

కామెంట్‌లు లేవు: