2, జూన్ 2021, బుధవారం

నడిచివచ్చిన దారి - భండారు శ్రీనివాసరావు

 పంతొమ్మిదివందల డెబ్బయి ఒకటి -ఆగష్టు నెల- ఇరవయ్యవ తేది. విజయవాడ, లబ్బీపేటలోని 'ఆంద్ర జ్యోతి' కార్యాలయం.

అందులో అడుగు పెట్టి - ఎడిటర్ నార్ల వెంకటేశ్వరరావు గారిని కలుసుకున్నాను.

ఆయన ఎగాదిగా చూసి, నా పరిచయం కనుక్కుని-

'మీ అన్నయ్య ఒకటే చంపేస్తున్నాడయ్యా! పైకి పో. ఉపేంద్ర వుంటాడు. నేను పంపానని చెప్పు' అన్నారు ఫోన్ మీద చేయి వేస్తూ.

అదే నా తొట్ట తొలి ఉద్యోగ నియామకపు ఉత్తర్వు.

ఉపేంద్ర గారిని కలిసాను. కూర్చోమని సైగ చేసారు. గుర్రపు నాడా ఆకారంలో వుండే మేజా బల్ల చివర్లో కూర్చున్నాను. పీ.టీ.ఐ., యు.ఎన్.ఐ. వార్తల్ని తెలుగులోకి తర్జుమా చేయమన్నారు. ఆ విధంగా మొదలయింది నా జర్నలిస్టు జీవితం.

ఆ రోజుల్లో సమాచార శాఖలో పనిచేస్తున్న మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారు మ్యూజియం రోడ్డు దగ్గరలో ఆఫీసర్స్  క్వార్టర్స్ లో వుండేవారు. ఉదయం  తొమ్మిది గంటలకల్లా భోజనం చేసి పత్రికాఫీసుకు బయలుదేరేముందు మా పెద్ద ఒదిన గారు ఓ రూపాయి నోటు చేతిలో పెట్టేది. PWD మైదానం దాటి వెడితే బస్ స్తాపు. రానూ పోనూ నలభై పైసలు టిక్కెట్ల ఖర్చు. లంచ్ టైంలో ఆంధ్రజ్యోతి బయట టీ స్టాల్లో ముప్పయి పైసలు పెడితే అరకప్పు టీ,  చిన్న సమోసా. సాయంత్రం ఇంటికి చేరేసరికి యెనిమిది గంటలు. ఇలా ఆదివారాలు అమావాస్య అని లేకుండా  మూడు నెలలు పనిచేస్తే నెలకు వంద రూపాయలు జీతం. అలా ఓ ఏడాది గడిచిన తర్వాత యాభయ్ పెంచారు. రేడియోలో చేరడానికి ముందు నా ఆఖరి నెల జీతం అక్షరాలా  నూట డెబ్బయి అయిదు రూపాయలు. కాకపోతే సమాజంలో గొప్ప పలుకుబడి. ఫోన్ చేస్తే కలెక్టర్ లైన్లోకి వచ్చే వైభోగం. సినిమాలు సరే. అన్నీ ఫ్రీవ్యూలే!

దాంతో ఈ కృత్రిమ జీవితమే నిజమనుకుని భ్రమ పడి, తాహతుకు మించి  నెలకు డెబ్బయి అయిదు రూపాయలు అద్దె పెట్టి పశువుల ఆసుపత్రి వద్ద ఆంధ్రజ్యోతికి దగ్గరలో ఓ రెండు గదుల వాటా తీసుకున్నాను. పెద్ద పిల్లవాడు సందీప్ పాల డబ్బాలు మద్రాసు నుంచి మా మామగారు ప్రతినెలా ట్రావెల్స్ లో పంపేవారు. ఆయన దగ్గర నుంచి మనీ ఆర్డర్లు కూడా వచ్చేవి కానీ ఎవరు పంపారు, ఎంత అని మా ఆవిడను అడిగేవాడిని కాను. సంపాదన లేని వాడికి సంజాయిషీలు అడిగే హక్కు లేదు.

అలా మూడు నెలలు గడిచాయి. జీతం విషయం నేను అడగను లేదు - వాళ్ళు చెప్పను లేదు. ఒక రోజు అటెండర్ నాగేశ్వరరావు నా దగ్గరకు వచ్చి అక్కవుంటెంట్ ని  కలవమని చెప్పాడు. వెడితే- ఓ ఓచర్ మీద సంతకం చేయించుకుని పది- పది రూపాయల నోట్లు - వంద నా చేతిలో పెట్టారు. అదే నా తొలి వేతనం.

ఉద్యోగం తప్ప వేరే ధ్యాస లేని రోజులవి. రాసిన ప్రతిదీ మర్నాడు పేపర్లో రాకున్నా- ప్రూఫ్ లో అచ్చయిన నా వార్తల్ని చదువుకుని మురిసిపోయేవాడిని. నేను చేరిన కొత్తల్లోనే నార్ల గారు హైదరాబాద్ వెళ్ళిపోవడం - నండూరి రామమోహనరావు గారు బాధ్యతలు  స్వీకరించడం జరిగిపోయాయి. ఎందుకో ఏమోగానీ, దిన,వార పత్రికలకు సంబంధిoచిన అన్ని అంశాలలో నాకు తర్ఫీదు ఇచ్చారు. ప్రతిరోజూ ఎడిట్ పేజీలో కార్టూన్ తో కూడిన నాలుగు వాక్యాల గేయాన్ని 'వాక్టూనులు ' అనే శీర్షికతో రాసేవాడిని. సినిమా సమీక్షలు, పుస్తక సమీక్షలు, ఆదివారాల్లో - పిల్లలకోసం ప్రత్యేక కధలు - బంగ్లాదేశ్ అవతరణకు దోహదం చేసిన పంతొమ్మిదివందల డెబ్బయి ఒకటి ఇండో-పాక్ యుద్ధంలో భారత సైన్యాల కదలికలను సూచించే మ్యాపులు - ఇలా అన్నింట్లో నేనున్నానంటూ వేలు పెట్టేవాడిని. శ్రీయుతులు తుర్లపాటి కుటుంబరావు,  ఉపేంద్ర, ఐ వెంకటరావు, కే.రామకృష్ణ, వీరభద్రరావు, ఎల్వీ రమణ, సత్యనారాయణ, ఆంజనేయులు, చంద్రశేఖర ఆజాద్ వంటి సహోద్యోగుల నడుమ నా ఆంధ్రజ్యోతి ఉద్యోగపర్వం నాలుగున్నర సంవత్సరాలపాటు ఇట్టే గడిచిపోయింది.

అన్నట్టు చెప్పడం మరిచాను. మొదట్లోనే నార్లగారు నాకో బ్రహ్మొపదేశం చేశారు. జర్నలిస్టు అనే వాడు ఎప్పుడూ, జేబులో రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకోవాలనే వారు. చాలా కాలంపాటు దాని పాటించాను కూడా. తర్వాతి రోజుల్లో రేడియోలో పనిచేస్తున్నప్పుడు ఏదో విషయంలో పేచీ వచ్చి,రాజీనామా ఇచ్చేసి ఇంటికి వచ్చేశాను. అంతే! నెలరోజులపాటు మళ్ళీ ఆఫీసు మొహం చూడలేదు. చివరికి ఎవరో పూనుకుని రాజీ చేయడం, ఉద్యోగంలో తిరిగి చేరడం జరిగిపోయాయి. అదో అధ్యాయం.

రాసిన రాతలు అచ్చులో చూసుకునే అవకాశం ఆంద్రజ్యోతి ద్వారా లభిస్తే- సొంత గొంతును తెలుగునాట నలుగురికీ వినిపించే వీలు రేడియోలో దొరికింది. వార్తాసేకరణ, కూర్పు, తెలుగులోకి అనువాదం ఇలాంటి ప్రక్రియలతో పాటు, రెగ్యులర్ న్యూస్ రీడర్లు రాని రోజున ఏకంగా స్టూడియోలోకి వెళ్ళిపోయి వార్తలు చదివేయడం- వారానికి రెండు మార్లు వార్తా వాహిని - ఒకసారి జీవన స్రవంతి (రోజువారి జరిగే ఘటనలకు కొంత హాస్యాన్ని జోడించి తయారు చేసిన ప్రత్యెక వార్తలు ) ఇలా అన్నిరకాలుగా నా రేడియో జీవితాన్ని పూర్తిగా ఉపయోగించుకున్నాను.

ఆ రోజుల్లో ఇన్ని పత్రికలూ లేవు. ఇంత మంది విలేకరులు లేరు. ముఖ్య మంత్రి నిర్వహించే విలేకరుల సమావేశానికే పది, పన్నెండు మంది హాజరైతే గొప్పగా వుండేది. నేను రేడియోలో చేరింది ఎమర్జెన్సీ రోజుల్లో కావడం వల్ల-వార్తల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాగం, రేడియోపై ఎక్కువగా ఆధార పడాల్సి రావడం- రేడియో విలేకరిగా నా ప్రాధాన్యతను కొంత పెంచింది.

ఈ క్రమంలో,  ఎందరో మంత్రులు, ఎంతోమంది ముఖ్యమంత్రులు, డీజీపీలు ,చీఫ్ సెక్రటరీలు, సీనియర్ ఐ.ఏ.ఎస్., ఐ.పీ.ఎస్. అధికారులు,  కేంద్రమంత్రులు,  ఎంపీలు,  శాసన సభ్యులు - ఇందరితో సాన్నిహిత్యాలు, విందులు, వినోదాలు, విమానయానాలు, విదేశీ ప్రయాణాలు, హెలికాఫ్టర్ చక్కర్లు - మాస్కో రేడియో ఉద్యోగ విజయాలు - ఓ విధమైన 'మత్తు'లో వృత్తి జీవితం గడిచిపోయింది.

మాస్కోలో వున్న కాలంలో ఇండియన్ ఎంబసీ ద్వారా నాకో లీగల్ నోటీసు వచ్చింది. విజయవాడలోని ఒక ప్రభుత్వ రంగ బ్యాంకుకు వడ్డీతో సహా లక్ష రూపాయలు ఖుద్దున చెల్లించాలన్నది దాని సారాంశం.  

నాకు ప్రధాని తెలుసు, నాకు ముఖ్యమంత్రి తెలుసు” అని  పాత తెలుగు సినిమాలో ఒక పాత్ర అంటూ వుంటుంది. అలాగే జర్నలిస్టులకు కూడా ముఖ్యమంత్రులు, సీనియర్ అధికారులతో వృత్తిగతమైన పరిచయాలు వుండడం సహజం. కానీ చాలామంది పాత్రికేయుల జీవితాలు పైకి కనిపించేటంత పట్టు పరుపులు కావు.  

1987  నుంచి దాదాపు అయిదేళ్లపాటు మాస్కోలో 'పిల్ల జమీందారు' లాగా వెలిగాను. దేనికీ లోటు లేని, లక్షాధికారులకు మాత్రమే సాధ్యం అయ్యే సుఖాలు, భోగాలు అనుభవించాను. నాలుగు గదుల అద్దె లేని ఇల్లు, కరెంటు, ఫోను, గ్యాసు పూర్తిగా ఉచితం. జీతం డబ్బులు ఏమి చేసుకోవాలో తెలియని పరిస్థితి.

వారాంతపు రోజుల్లో మాస్కోలో  మా ఇల్లు విందు కాలక్షేపాలతో వెలిగిపోయేది. మన దేశం నుంచి మాస్కో వచ్చే తెలుగువాళ్లే కాదు, భాష తెలియని వాళ్ళు కూడా మా ఇంటికి వచ్చి భోజనం చేసి అన్నదాతా సుఖీభవ అని ఆశీర్వదించి పోయేవారు. వారిలో క్యాబినెట్ మంత్రులు, కోటీశ్వరులైన వ్యాపారులు, జర్నలిస్టులు, సినిమా వాళ్ళు, ఇస్కస్ ప్రతినిధి బృందాల వాళ్ళు వుండేవారు. ఎందుకంటే అక్కడ దొరికే భోజనం మన వైపు నుంచి వచ్చేవాళ్ళకు నోటికి హితవుగా వుండేది కాదు. అన్నం, పప్పు, ఆవకాయ కారాలు, సాంబారు వంటివి కావాలంటే మా ఇల్లే వారికి చిరునామా.

ఇలా పెద్ద ఎత్తున భోజనాలు పెట్టడానికి పెద్దగా ఖర్చయ్యేది కాదు, పనిమనుషులు లేని దేశం కనుక శారీరక శ్రమ మాత్రం తప్పదు. ఆ బరువు మా ఆవిడ మోసేది కాబట్టి నేను భోజరాజులాగా మిత్రులతో కాలక్షేపాలు చేస్తుండేవాడిని.      

 అసందర్భంగా అనిపించినా మాస్కో జీవితం గురించి రాస్తున్నప్పుడు  నా వృత్తి జీవితం జ్యోతిలో మొదలయిన రోజులను కూడా నెమరు వేసుకోవడం తప్పనిసరి. జీతానికీ, జీవితానికీ పొంతన లేని ఆ  రోజుల్లో, బతుకు బండి నడపడం గగనంగా వుండేది. ప్రతి దానికీ ఇబ్బందే, కటకటే. ఆఖరికి, బియ్యం, నూనె వంటివి కూడా  ఏరోజుకారోజు కొనుక్కున్న హీనమైన రోజులు వున్నాయి. మా ఆవిడకు పుట్టింటి వాళ్ళు పెట్టిన నగలన్నీ కుదువ పెట్టి డబ్బు తెచ్చేవాడిని. వాటిని విడిపించే స్థోమత లేక అవి మాకు కాకుండా పోయాయి.

ఆ గడ్డురోజుల్లో ఒక రోజు రామారావనే ఆర్టిస్ట్ మా ఇంటికి వచ్చాడు. నా స్నేహితుడయిన లాల్ మోహన్ అనే మరో ఆర్టిస్ట్ అతడిని నాకు పరిచయం చేసాడు. ఒక విషయంలో నా సాయం కోరుతూ అతడు నా వెంట తిరుగుతున్నాడు. చెప్పాపెట్టకుండా అతడు రావడం నాకూ మా ఆవిడకూ ఆ క్షణంలో అంత బాగా అనిపించలేదు.  అతడు వచ్చిన సమయంలో మేమొక చిక్కు సమస్యతో కొట్టుమిట్టాడుతున్నాము. పిల్లవాడికి పాలు పట్టాల్సిన సీసా కడుగుతుంటే పగిలిపోయింది. రూపాయి ఖరీదు చేసే ఆ సీసా కొనడానికి ఇల్లు మొత్తం గాలించినా ఎర్ర ఏగాని కూడా దొరకలేదు. పిల్లవాడేమో ఒక పక్క గుక్క పట్టి ఏడుస్తున్నాడు. ఈ సీను చూసి అతడు నిశ్శబ్దంగా  వెళ్ళిపోయాడు. అమ్మయ్య వెళ్ళాడు కదా అని అనుకునేంతలో మళ్ళీ తిరిగి వచ్చాడు. ఆ వచ్చిన అతడి చేతిలో పాలసీసా కనబడగానే దేవుడే దిగివచ్చాడనిపించింది. పాల సీసా వెల తక్కువే కావచ్చు. కానీ ఆ క్షణంలో, దానికి ఖరీదు కట్టగల షరాబు లేడనిపించింది.

అన్ని రోజులుగా అతడు నన్నడుగుతున్నది ఒక్కటే. సొంతంగా హోర్డింగుల వ్యాపారం పెట్టాలనుకుంటున్నాడు. పది వేలు అప్పు కావాలి. జామీను ఇచ్చే వాళ్ళుంటే బ్యాంకు వాళ్ళు లోను ఇస్తామన్నారుట. ఆ రోజు అడగకుండా అతడు చేసిన సాయానికి ఏదయినా చేసి రుణం  తీర్చుకోవాలనిపించింది. నా అంతట నేనే వెళ్లి బ్యాంకులో అతడి రుణానికి జామీను పత్రంపై సంతకం చేసాను. ఆ తరువాత హైదరాబాద్ ఆకాశవాణిలో ఉద్యోగం రావడం , నేను విజయవాడ వొదిలిపెట్టడం జరిగిపోయాయి. ఆ తరవాత అతడు ఏమయ్యాడో తెలియదు. పదేళ్ళ అనంతరం, మాస్కోలో వున్నప్పుడు , ఇండియన్ ఎంబసీ ద్వారా నాకొక లీగల్ నోటీసు అందింది. ఆ పదిహేనేళ్ళలో ఆనాటి ఆ అప్పు పాపంలా పెరిగి లక్ష రూపాయలకు డిక్రీ అయింది. అదే నేనందుకున్న కోర్టువారి శ్రీముఖం. ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే డబ్బును  మంచి నీళ్ళలా ఖర్చు చేస్తూ మాస్కోలో పాలు, పెరుగు అమ్మే  ప్రొదుక్తి దుకాణంలో  లీటర్లకు లీటర్లు పాలను కొంటున్నప్పుడు,  నడిచి వచ్చిన దారిలో తొక్కుకుంటూ వచ్చిన ఇలాంటి ముళ్ళ బాటలు కళ్ళల్లో మెదిలేవి. అలనాటి దృశ్యాలు సినిమా రీలులా గిర్రున తిరిగేవి.

అందాల రాముడు సినిమాలో డబ్బున్న ఖామందు గారు సెక్రటరీని పిలిచి ' నేను ఎక్కే రైలుకు థర్డ్ క్లాసు బోగీలు తగిలించింది ఎవరు' అని గద్దిస్తాడు. ఆ సెక్రటరీ తెలివిగా, 'థర్డ్ క్లాసు వుంటేనే ఫస్ట్ క్లాసు విలువ తెలుస్తుందని తానే తగిలించా'నంటాడు.

నిజమేకదా. కష్టాలు లేకపోతే సుఖాలకున్న విలువేమిటి?

ఇక వృత్తి జీవితం చివరి రెండేళ్ళు – కే.ఎస్. శర్మ గారి పుణ్యమా అని హైదరాబాద్  దూరదర్సన్  వార్తా విభాగంలో ఆర్వీవీ గారి సారధ్యంలో దొర్లిపోయాయి. రెండువేల అయిదు డిసెంబరు ఆఖర్లో ఉద్యోగ విరమణ.

లోగడ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన మోహన్ కందా గారన్నట్టు- మనిషికి మరణం, ఉద్యోగికి రిటైర్మెంట్ రెండూ తప్పవు.

(02-06-2021)

కామెంట్‌లు లేవు: