24, జూన్ 2021, గురువారం

రాజకీయ దత్తతలు - భండారు శ్రీనివాసరావు

 “ఒక కుర్రాడు నేరేడు చెట్టుకింద నిలబడి వున్నప్పుడు నిగనిగలాడే నల్లటి నేరేడు పండు కింద పడుతుంది. వంగి దాన్ని తీసుకుని రుచి  చూస్తాడు. బ్రహ్మాండం అనుకుంటూ ఉండగానే మరోటి రాలి పడుతుంది. వంగి చేతిలోకి తీసుకుంటాడు. అలా ఒకటి కాదు పాతిక నేరేడు పండ్లు  నాలుక ముదురు నీలం రంగుకు మారే వరకు, ఆవురావురుమని నోరారా  తింటాడు. ఇంతలో  మళ్ళీ ఒకటి రాలుతుంది. ఈసారి బద్దకంగా వంగి తీసుకుంటాడు. మునుపటి రుచి లేదేమిటి అనుకుంటాడు. ఇంకోటి , మరొకటి తిన్న తరువాత నేరేడు పండు మీద యావ తగ్గిపోతుంది.

“దీన్ని ఇంగ్లీష్ వాడు డిమినిషింగ్ రిటర్న్స్ (Diminishing Returns) అంటాడు”

ఇలా సాగేది చతుర్వేదుల రామనసింహం గారి పాఠం.

ఇలా కధలు కధలుగా పాఠాలు చెబుతుంటే విద్యార్ధులు వినకేం చేస్తారు? మా బీ కాం తరగతి వాళ్ళే కాదు, మిగిలిన తరగతుల వాళ్ళు కూడా వచ్చి కూర్చుని వినేవారు. ఆయన క్లాసులో అటెండెన్స్ రిజిస్టర్ కూడా వుండదు. అయినా ఒక్కళ్ళు కూడా డుమ్మా కొట్టరు. రామనరసింహం గారు పాఠం చెప్పే తీరు అలాంటిది.

ఎస్సారార్ కాలేజీలో రామనరసింహం గారు మాకు లెక్చరర్. క్లాసు నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా వారి మాటలు బాగా గుర్తుండిపోయేవి. యాభయ్ ఏళ్ళు దాటిన తదుపరి కూడా అవి అలా మనసులో వుండిపోయాయి.

రాజకీయ దత్తతలు అని మొదలు పెట్టి ఈ నేరేడు పండ్ల కధ ఏమిటి అనుకుంటున్నారా! అక్కడికే వస్తున్నాను.

ఇప్పుడు మరో పాఠం చెప్పుకుందాం.

“గ్రామస్తుల మధ్య ప్రేమ భావం వుండాలి. పోలీసు కేసులు ఉండొద్దు. కేసులు వున్నా వాటిని వెనక్కి తీసుకోండి. ఒకళ్ళ నొకళ్ళు దూషించుకోవడం ముందు మానేయండి. అందరం ఒకటే అనుకోండి.

“అంకాపూర్ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోండి. అక్కడివాళ్లు బంగ్లాలు కట్టుకుని హాయిగా వుంటున్నారు. ఆ వూరి గ్రామ కమిటీ చెబితే సుప్రీం కోర్టు చెప్పినట్టే. నలభయ్ ఐదేళ్ల నుంచి ఆ ఊరిలో ఒక్క పోలీసు కేసు లేదు. మీ ఊళ్ళో

రెక్కల కష్టం మీద బతికే వారిని గురించి తోటి గ్రామస్తులు ఆలోచించాలి. మీ ఊళ్ళో పనిచేయగలిగిన  వాళ్ళందరూ వాళ్ళ రెండు చేతులతో వారానికి రెండు గంటలు ఉచితంగా శ్రమిస్తే మీ ఊరిలో మీరే అద్భుతాలు సృష్టించగలరు” 

ఈ సుద్దులు చెప్పింది తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్. ఎవరితో? తాను దత్తత తీసుకున్న వాసాలమర్రి గ్రామస్తులతో.

ఇంకా చాలా చెప్పారు.

ఆ వూరిలో పదో తరగతి  అమ్మాయి సుప్రజకు   డాక్టర్ చదువు పట్ల వున్న మమకారం వున్నా ఆర్ధిక పరిస్థితులు సహకరించడం లేదని  తెలుసుకుని ఆ బాధ్యత తనదేని ఆ అమ్మాయి తండ్రికి హామీ ఇచ్చారు.

2600 మంది జనాభా కలిగిన వాసాలమర్రి  గ్రామాభివృద్ధికి నూట యాభయ్ కోట్లు ఖర్చు చేస్తామన్నారు. గ్రామ రూపురేఖలు సమూలంగా మార్చి వేయడానికి ఆ జిల్లా కలెక్టర్ నే ఆ వూరికి స్పెషల్ ఆఫీసర్ గా నియమిస్తున్నట్టు ప్రకటించారు.

గ్రామంలోని అందరి భూములకు డ్రిప్ ఇరిగేషన్ మంజూరు చేశారు.

జిల్లాలోని ప్రతి పంచాయితీకి పాతిక లక్షలు, భువనగిరి మునిసిపాలిటీకి కోటి, ఇతర మునిసిపాలిటీలకు యాభయ్ లక్షల చొప్పున అందచేస్తామని అన్నారు. 

ఇలా తను దత్తత తీసుకున్న వాసాల మర్రి గ్రామం మీద ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లులు కురిపిస్తూ పోయారు.

ప్రస్తుత రాజకీయ వాతావరణంలో ఎందుకిలా అనే ప్రశ్న తప్పకుండా ఉత్పన్నమవుతుంది. ప్రస్తుతం ఆ జిల్లాలో ఎన్నికలు లేవు. వాసాల మర్రి అంటే దత్తత తీసుకున్న గ్రామం కనుక అంతగా తప్పు పట్టడానికి ఏమీ ఉండక పోవచ్చు.

గ్రామాలను, లేదా కొన్ని ప్రాంతాలను దత్తత తీసుకున్న ఉదాహరణలు ఉమ్మడి రాష్ట్రంలోను  కనిపిస్తాయి.

మహబూబ్ నగర్ జిల్లాను అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దత్తత తీసుకున్నారు. పైకి దత్తత గురించి ప్రకటించక పోయినా ఖమ్మం జిల్లాలో జరిగి ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో ప్రతి ఒక్క ఇటుక మీద తన పేరే ఉంటుందని అలనాడు ముఖ్యమంత్రి జలగం వెంగళరావు చెప్పేవారు. అలాగే ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి హయాములో పులివెందులలో జరిగిన అభివృద్ధి ఎవరూ కాదనలేనిది. ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తన నియోజకవర్గం వారణాసిని దత్తు తీసుకున్న మాదిరిగానే అభివృద్ధి చేస్తున్నారు.

అయితే, రాజకీయ నాయకులు ప్రాంతాలను దత్తు తీసుకోవడం అనే అంశం చర్చకు వచ్చినప్పుడు మన పార్ల మెంటు సభ్యుల నిర్వాకం గురించి కూడా చెప్పుకోవాలి.

నరేంద్ర మోడీ మొదటి సారి ప్రధాన మంత్రి అయినప్పుడు దేశంలోని ప్రతి ఎంపీ తన నియోజకవర్గంలో ఒక వెనుకబడిన గ్రామాన్ని దత్తత తీసుకుని దాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేసే ఒక పధకం ప్రకటించారు. అప్పుడు ఒకే ఒక ఎంపీ ప్రధాని ప్రశంసకు నోచుకున్నారు. ఆయన ఎవ్వరో కాదు, మాజీ కేంద్ర మంత్రి  అశోక్ గజపతి రాజు. పార్లమెంటులోని మిగిలిన సభ్యులలో చాలామంది  ఈ పధకాన్ని పట్టించుకున్న దాఖలా లేదు.

(24-06-2021)

కామెంట్‌లు లేవు: