3, జూన్ 2021, గురువారం

పెళ్లి చేసి చూడు, పార్టీ మారి చూడు

 పూర్వం పెళ్ళిళ్ళ పేరయ్య సంబంధాలు చెప్పాలి. ఫోటోలు  చూపించాలి. జాతకాలు చెప్పించాలి. ఏడు తరాల ఆరాలు తీసుకోవాలి. మంచి చెడ్డలు కనుక్కోవాలి. తర్వాత పెళ్ళికొడుకు తల్లీ తండ్రీ వచ్చి పిల్లను చూడాలి. తర్వాత కొన్ని రోజులకు పెళ్ళికొడుకు చెల్లెలు లేదా దూరపు చుట్టాలు వచ్చి చూడాలి. జాతకాలు వగైరా చూపించుకోవాలి. ఈలోగా కట్నం లాంఛనాల వంటి వాటి విషయంలో ఒక స్పష్టత రావాలి. ఆ తర్వాత పెళ్లి చేసుకునే వరుడు, స్నేహితులతో కలిసి  వచ్చి కాబోయే వధువును చూసి, పెద్దవాళ్ళతో మాట్లాడి ఏ విషయం కబురు చేస్తామని చెప్పాలి. అంతా అనుకున్నట్టు జరుగుతోంది అనే నమ్మకం కుదిరిన తర్వాత లగ్గాలు పెట్టుకోవాలి.

ఇంత తతంగం నెలలు, వారాల పాటు సాగితే కానీ పెళ్లి సంబంధం ఒక పట్టాన తేలేది కాదు, కుదిరేది కాదు, పెళ్లి పీటల దాకా వెళ్ళేది కాదు.

ఇప్పుడంటే పరిస్థితులు మారాయి.  అమెరికా సంబంధాలు వచ్చి పడి వారం పది రోజుల్లోనే పెళ్లి చూపులు,  మాట్లాడుకోవడాలు, పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోవడాలు చకచకా జరిగిపోతున్నాయి (కరోనా ముందు సంగతి అనుకోండి)

అలాగే, వెనక పార్టీ మారేవారు ఒక ప్రకటన చేసేవారు, పలానా పార్టీలో చేరినట్టు. పలానా పార్టీవాళ్లు మరో ప్రకటన చేసేవాళ్ళు పలానా నాయకుడిని తమ పార్టీలో చేర్చుకున్నట్టు. అంతే! ఆ కధ అక్కడికి చెల్లు.

మరి ఇప్పుడో!

అధినాయకుడు సరే కానీ చుట్టూ ఉన్నవారి మూలంగా పార్టీ ప్రజల్లో చులకన అవుతోందని ముందుగా ఒక  ప్రకటన చేయాలి. దానిమీద టీవీల్లో రెండు మూడు రోజులు చర్చలు జరగాలి. కొన్నాళ్ళు ఆగి ఏకంగా అధినాయకుడినే విమర్శిస్తూ తన పేరుతొ కాకుండా లీకు వదలాలి.  దానిమీద చర్చ పూర్తిగా జరగనిచ్చి మీడియాలో వచ్చిన వార్తలు తప్పుడుతడకలు అని ఓ గంభీర ప్రకటన చేయాలి. ఆఖరి శ్వాస వరకు తాను పార్టీని వీడేది లేదని బల్ల గుద్ది చెప్పాలి.

దాని మీద  సుదీర్ఘ కాలం జరిగే చర్చను మౌనంగా వీక్షించి మళ్ళీ మరో లీకు వదలాలి, అధినాయకత్వం తీరు మార్చుకోకపోతే తాను పార్టీని విడిచి పెట్టాల్సి వస్తుందని. మళ్ళీ దాని మీద టీవీల్లో విస్తృత చర్చ. మీడియా వక్రీకరించిందని  ఖండించాలి. అధినాయకుడికి తాను సర్వదా విధేయుడిని  చెప్పాలి.

కొన్ని రోజులు ఆగి పలానా పార్టీలో చేరబోతున్నట్టు మరో లీకు వదలాలి.  దాని మీద కొన్నాళ్ళు చర్చ. పలానా పార్టీ నాయకులతో రహస్య భేటీ అంటూ  మరో లీకు. దాని మీద మరో కొన్నాళ్ళు చర్చ. పార్టీ మారేది లేదని మరో ప్రకటన.

ఇంత తంతు ఓ  మూడు నెలలు సాగిన తర్వాత కూడా ఆయన పార్టీ మారాడా లేదా అనేది ఓ చర్చనీయాంశమే మీడియాకి.

ప్రతిరోజూ వార్తల్లో నానడానికి ఇదో మార్గం అని గిట్టని వాళ్ళ ఉవాచ.

(03-06-2021)

కామెంట్‌లు లేవు: