17, జూన్ 2021, గురువారం

సూటిగా...సుతిమెత్తగా

 అనే శీర్షికతో గతంలో వారానికి రెండు ఆర్టికిల్స్ చొప్పున ఓ దశాబ్దం పాటు సూర్య దినపత్రిక ఎడిట్ పేజీలో  వర్తమాన రాజకీయాలు గురించి వ్యాసాలు రాసేవాడిని. సుదీర్ఘ కాలం ఆకాశవాణిలో పనిచేయడం వల్ల కఠినంగా రాయడం అలవాటు కాలేదు. అంచేతే  ఈ శీర్షికకు అలా పేరు పెట్టుకున్నాను.

అయినా ఒక్కోసారి రాతల్లో, మాటల్లో ఒకింత  కాఠిన్యం, కాసింత  పరుషత్వం తొంగిచూడడం అనేది జరుగుతూనే వచ్చింది. అది ఈ నడుమ మరింత పెరిగిందేమో అనిపిస్తోంది. కారణం అనేక వాణిజ్య సంస్థల నుంచి వస్తున్న టెలిఫోన్ కాల్స్. ఆ కాల్స్ చేసేవారిపై నాకు మొదట్లో జాలి వుండేది. దానికి కారణం నా భార్య. ‘ఏదో వాళ్లకి అది ఉద్యోగం. కాసేపు వాళ్ళు చెప్పేది మీరు ఓపిగ్గా వెంటే  సరిపోతుంది కదా! అనేది.

నిజమే! కానీ ఈ కాల్స్ సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. రాసుకుంటున్నప్పుడు, భోజనం చేస్తున్నప్పుడు, నిద్ర పోతున్నప్పుడు వరసగా ఈ కాల్స్ వస్తుంటే ఎంత అణచి పెట్టుకుందామని అనుకున్నా చిరాకుగా ఉంటోంది. మళ్ళీ అనిపిస్తుంది, వాళ్ళు ఈ కాల్స్ చేసేది వాళ్ళ ఉద్యోగ బాధ్యతల్లో  భాగంగానే కదా అని. అది కాసేపే! కాల్ రాగానే ఈ ఆలోచన ఆవిరైపోతుంది. విసుగు వేసి ఏదో అనడం, తర్వాత అలా విసుక్కోకుకండా వుంటే బాగుండేదేమో అనుకోవడం.

ఈ కరోనా కాలంలో ఇది నిత్యకృత్యమైపోయింది.

(17-06-2021)

     

కామెంట్‌లు లేవు: