21, జూన్ 2021, సోమవారం

దూరదర్శన్ చేయాల్సిన పని – భండారు శ్రీనివాసరావు

 ఈ రాత్రి టీవీ రిమోట్ తిప్పుతుంటే దూరదర్శన్ (యాదగిరి) ఛానల్ తగిలింది. మదర్ ఇండియా సినిమాలో నర్గీస్ పాట  వస్తోంది. అంతే! అక్కడే ఆగిపోయాను. తర్వాత దిలీప్ కుమార్, దేవానంద్, రాజ్ కపూర్(ఆవారా), షమ్మీకపూర్ ఇలా ఎందరో ఆనాటి తారలు. వారి ద్వారా ప్రేక్షకుల గుండెల్లోకి పాకిన రసధునులు.

ఓహో! ఈరోజు అంతర్జాతీయ సంగీత దినోత్సవం అని ఈ కార్యక్రమం ప్రసారం చేశారేమో తెలియదు. లేక కొత్త ప్రోగ్రాములు అందుబాటులో లేక ఈ పాత కార్యక్రమం రిపీట్ చేశారేమో తెలియదు. కానీ ప్రేక్షకులకు వీనుల విందు చేసిన మాట వాస్తవం.

ఈ పోటాపోటీ యుగంలో రకరకాల ఛానల్స్ పురుడు పోసుకుంటున్న ఈ తరుణంలో వాటితో పోటీ పడాలంటే ఇలాంటి కార్యక్రమాలే అవసరం. ఈనాడు దేశ జనాభా తీసుకుంటే యువతీ యువకులతో  కూడిన నవతరమే ఎక్కువ. వాళ్లకు దూరదర్సన్ కార్యక్రమాలు నచ్చే అవకాశం అసలు లేదు. ఇక జనభాలో పెరుగుతున్న శాతం వృద్దులది. వారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు. పైగా పెరుగుతోంది.  

కాబట్టి ఈ సెగ్ మెంటును దూరదర్సన్ పట్టుకోవాలి. పైగా వృద్ధ ప్రేక్షకులు ఇటువంటి కార్యక్రమాలను ఇష్టంగా చూస్తారు. కానీ వారి గురించి అఆలోచించే వాళ్ళు నేటి మీడియాలో లేరు. గతంలో కొంతవరకు ఈటీవీ ఇటువంటి కార్యక్రమాలు ప్రసారం చేసేది. ఇప్పుడు వాళ్ళూ మానుకున్నారు. ప్రతివారికీ రేటింగులు ప్రధానం.

ఈనేపథ్యంలో దూరదర్సన్ కు మిగిలిన ఏకైక మార్గం ఇదొక్కటే.

వయసుమళ్ళిన వారిని ఇలాటి కార్యక్రమాలతో కట్టి పడవేయగలిగితే చాలు. ఉనికి కాపాడుకోవడానికి వేరే లాయలాస అనవసరం.(21-06-2021)   

కామెంట్‌లు లేవు: