10, జూన్ 2021, గురువారం

ఆప్త వాక్యం

 

'క్రమక్రమముగా కొలువుకూటము రణకూటమగుచున్నది, పదువురుండగనే నా మాటలాలకింపుడు' అంటాడు పాండవుల పనుపున దూతగా వచ్చిన శ్రీకృష్ణుడు కౌరవసభలో ధృతరాష్ట్రుడితో.

ఇప్పుడు నవ్యాంధ్ర ప్రదేశ్  రాష్ట్రంలో రాజకీయ రంగం సమరాంగణంగా మారుతోంది. మాటల తూటాలు పేలుతున్నాయి. ఆరోపణలు ఉవ్వెత్తుతున్నాయి. మీడియాలో చర్చలు, ఎవరివాదాన్ని వారు బలంగా వినిపించే ధోరణితో పేట్రేగిపోతూ దారితప్పుతున్నాయి. ఒకరు చెప్పేది మరొకరు వినిపించుకోరు. తమ మాటే వినాలని, తమ ప్రశ్నకే జవాబు చెప్పి తీరాలని, అ సమాధానం కూడా తమకు అనుకూలంగా వుండాలని పట్టుబట్టే పెడ ధోరణే జడలు విప్పుకుంటోంది.  మీడియా కూడా  పార్టీల వారీగా విడిపోయి ఒక వైపు మాత్రమే కొమ్ముకాసే  దురదృష్టకర పరిస్థితి  రూపుదిద్దుకుంటోంది. ఈ వేడిలో, వాడిలో వివేచన వెనక్కు తప్పుకుంటోంది. తప్పు మీదంటే మీదని బురద చల్లుకునే క్రమంలో తప్పు చేయడం అసలు తప్పేకాదన్న రీతిలో భాష్యాలు చెబుతున్నారు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్టు అనుచర గణాలు ఈ విషయంలో నాయకులను మించి గొంతులు పెంచి నానా యాగీ చేస్తున్నాయి.  కొంత కాలం క్రితం ఒక టీవీ ఛానల్ చర్చకు వచ్చిన ఒక రాజకీయ పార్టీ ప్రతినిధి నిస్సిగ్గుగా చెప్పాడు, 'ఈ విషయంలో జర్నలిష్టులయినా, విశ్లేషకులయినా ఎవరయినా సరే, ఏ ఒక్కర్నీ ఉపేక్షించవద్దు, గట్టిగా తిప్పికొట్టండి, మన వాదాన్ని బలంగా వినిపించండి' అంటూ తమ నాయకుడే తమను ఆదేశించాడని. నిజానికి ఏ నాయకుడు అలా చెప్పడు. ఆ పార్టీ ప్రతినిధి అమాయకంగా చెప్పాడో, కావాలని చెప్పాడో కాని అదే నిజమయితే ఆ పార్టీ నాయకుడికి అది యెంత అప్రదిష్ట.

రాళ్ళు కలిసిన బియ్యం వొండితే అన్నంలో రాళ్ళు పంటికి తగులుతాయి. జల్లెడ పట్టి రాళ్ళను వేరు చేస్తే వొండిన అన్నం నోటికి హితవుగా వుంటుంది. చదువూ సంధ్యాలేని గ్రామీణ ప్రాంతాల వాళ్లకు కూడా తెలిసిన ఈ నిజం నేటి రాజకీయ నాయకులు అర్ధం చేసుకోలేక పోతున్నారు. అర్ధం అయినా అవకాశం కోసం అర్ధం కానట్టు వుండిపోతున్నారు అనుకోవాలి.

ఏవిషయం వచ్చినా, సమస్య వచ్చినా ముందు రాజకీయం అనే రక్కసి అందులో చేరి పడగలు విప్పుతోంది. దాంతో ప్రతిదీ రాజకీయమయం అయిపోతోంది. ఎవడో ఒకడు ఒక నేరం చేస్తాడు. లేదా చట్టాన్ని ఉల్లంఘిస్తాడు. అతడు ఏదో ఒక పార్టీవాడు అయితే ఇక అంతే సంగతులు. పార్టీ అతడికి కొమ్ము కాస్తుంది. వెంటనే ఎదుటి పక్షం తన పల్లవి తాను అందుకుంటుంది. అధికారం అడ్డం పెట్టుకుని చేసిన తప్పుల నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నారని  ఎదురు ఆరోపణ చేస్తుంది. అంతటితో ఆగకుండా వ్యవస్థలను కూడా రంగంలోకి ఈడుస్తుంది. వ్యవస్థలను మేనేజ్ చేసేవారిని మానేజ్ చేస్తూ చట్టానికి దొరకకుండా తప్పించుకుంటున్నారని అంటూ రాజ్యాంగ వ్యవస్థల ప్రతిష్టను మసక బార్చే ప్రయత్నం చేస్తుంది.   ఇలా రాజకీయం రంగ ప్రవేశం చేయడంతో ఆ మనిషి చేసిన నేరం కాస్తా నేపధ్యంలోకి వెళ్ళిపోతుంది. ఇలాటి విషయాల్లో ఈ పార్టీ ఆ పార్టీ అని పేరు పెట్టి చెప్పాల్సిన అవసరం లేదు. అవకాశం వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు ప్రతి పార్టీ చేసే పని ఇదే. నేరం చేసిన వాడు పరాయి వాడు అయితే, 'చట్టం తన పని తను చేసుకు పోతుంది, చట్టానికి ఎవరూ అతీతులు కారు' అంటూ బుడిబుడి రాగాలు తీస్తారు. తమవాడే అయితే 'చట్టం పాలకుల చేతిలో చుట్టం' అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతారు. తప్పుచేసిన వాడిని పోలీసులు విచారిస్తే, అది సరికాదు, సీబీ సీ ఐ డీ దర్యాప్తు కోసం గగ్గోలు పెడతారు. సీబీ సీ ఐ డీ విచారణ చేస్తుంటే, అది ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మ, సీ బీ ఐ దర్యాప్తు అంటారు. సేబీఐ పరిస్తితీ ఇంతే, అది కేంద్రం చేతిలో ఆటబొమ్మ అంటారు. ఇలా వ్యవస్థలను భ్రష్టుపట్టించే అసంబద్ధ ఆరోపణలు చేస్తూ విచారణను నీరుకారుస్తారు. నేరారోపణలు ఎదుర్కున్న వ్యక్తులు కొన్నాళ్ళ తరువాత హాయిగా జనం మధ్యే తిరుగుతుంటారు. ఇదీ కొన్నేళ్లుగా జరుగుతున్న కధ. ఇప్పుడు నడుస్తున్న కధ. నడవబోయే కధ కూడా దానికి పొడిగింపే.

ముందు చెప్పినట్టు బియ్యంలో రాళ్ళు కలగలసిపోయినట్టు ఈ నాడు నేరాలు, రాజకీయాలు జమిలిగా ముడి పడిపోయాయి. వీటిని విడదీసే జల్లెడలు లేవు. వున్నా రాజకీయ పార్టీలకి వాటి అవసరం లేదు. వాళ్లకి కావాల్సిందల్లా తమ వాళ్ళను కాపాడుకోవడం, వాళ్లు నేరస్తులయినా ఒకటే, కాకపోయినా ఒకటే. ఎదుటివాడయితే చేతిలో వున్న అధికారాన్ని అడ్డుపెట్టుకుని కేసులు పెట్టడం. మనవాడయితే వాటినుంచి బయటపడవేయడం. ఇదే నేటి రాజకీయ ధర్మం. 'ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ఆ ధర్మం నిన్ను కాపాడుతుంద'ని ఉవాచ. రాజకీయ పార్టీలు కూడా తాము నమ్మిన ' ధర్మమే' తమను కాపాడుతుందని భావిస్తూ తాము పెంచి పోషిస్తున్న 'అధర్మాన్నే' సదా కాపాడుతూ పోతుంటారు.

రాజకీయ నాయకులు రెచ్చగొట్టే ప్రకటనలు చేసినా కొంపలు మునగవు. అయితే వారిని మెప్పించడానికి వారి అనుచరగణాలు అత్యుత్సాహంతో బుల్లితెర చర్చల్లో చేసే విపరీత వ్యాఖ్యానాలు జనంలోకి చేరిపోయి వారు కూడా రెచ్చిపోతేనే అసలు సమస్య. ఏదైనా వివాదం వచ్చినప్పుడు పూర్తిగా ఒక వాదననే సమర్ధించడం అంటే సమస్యను మరింత జటిలం చేయడమే. పడిన ముళ్లు, లేదా తగిలించుకున్న ముళ్లు మరింత బిగిసిపోకముందే రాజకీయ నాయకులు కళ్ళు తెరవాలి. విజ్ఞతతో కూడిన సంయమనం నేటి అవసరం.

'చెడు వినకు, కనకు, మాట్లాడకు' అనే సూక్తికి తనదయిన రీతిలో బొమ్మ గీసిన మహానుభావులు, కీర్తిశేషులు 'బాపు'గారికి కృతజ్ఞతలతో

 

2 కామెంట్‌లు:

కురువాడ చెప్పారు...

"పడిన ముళ్లు, లేదా తగిలించుకున్న ముళ్లు మరింత బిగిసిపోకముందే రాజకీయ నాయకులు కళ్ళు తెరవాలి. విజ్ఞతతో కూడిన సంయమనం నేటి అవసరం."
విజ్ఞతకు,నేటి రాజకీయ నాయకులకు బహుదూరం.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@కురువాడ : వాళ్ళు చెవిన పెడతారనే నమ్మకం నాకూ లేదు, కానీ ఏదో ఆరాటం