13, జూన్ 2021, ఆదివారం

సన్ ఆర్ సన్ ఇన్ లా పాలసి

 నేను రేడియోలో చేరిన కొత్తల్లో సచివాలయంలో ఓ ఉన్నతాధికారి  పరిచయం అయ్యారు. మంచి స్నేహశీలి.  అడగడమే వాడిదే పాపం అన్నట్టు ఎవరు ఏది అడిగినా అది తన చేతిలో పనయితే వెంటనే చేసిపెట్టేవారు. అక్కడ మనవాడా పరాయి వాడా అనే వివక్ష చూపేవారు కాదు. ఉద్యోగం, బదిలీ ఇలా ఎవరు ఏ పని కోరినా,  ‘కాదు, కుదరదు’  అని చెప్పే అలవాటు ఆయనకు లేదు. అలా అని డబ్బు కోసం సాయం చేయడం ఇంటావంటా లేదు. నిక్కచ్చి మనిషి. నిజాయితీ పరుడు.

సాయం కోరి నా దగ్గరకు  వచ్చిన వారిని నేను ఆయన దగ్గరకు తీసుకువెళ్ళే వాడిని. ఏం కావాలో కనుక్కుని ఆ పని ఏమిటో  ఆ వివరాలు ఓ చిన్న పుస్తకంలో రాసుకునేవారు. ‘రేపు రండి చెబుతాను’ అనేవారు. ఎన్నిసార్లు ఆయన దగ్గరకు పోయినా ఇదే వరస. ‘రేపు రండి అని పంపించేసేవారు. మరునాడు వెడితే పనిచేసి పెట్టడమో, లేక ఆ పని అయ్యేది కాదు అని మొహం మీద చెప్పడమో జరిగేది.  చాలా సందర్భాలలో వచ్చిన వాళ్లకు ఆశాభంగం కలగకుండా  పనిచేసి పంపించేవారు. మరి, ఇంత మాత్రం దానికి రేపు రమ్మనడం దేనికి అనే  మీమాంస నన్ను వెంటాడేది.

తర్వాత విచారించగా తెలిసింది ఏమిటి అంటే ఆయనది  ‘సన్ ఆర్ సన్ ఇన్ లా  పాలసి’.

ముందు ఏ సాయం అయినా కొడుకు లేదా అల్లుడు. తర్వాతే ఎవరయినా అనేది ఆయన పెట్టుకున్న పద్దతి.

వచ్చిన వాడు బదిలీ అడిగాడు అనుకోండి. ఆ సాయంత్రం ఇంటికి వెళ్లి కొడుకు, అల్లుడు లేదా కోడలు, కుమార్తెతో సంప్రదించేవాడు. పనిమీద వచ్చిన వాళ్ళ పని చేసి పెడితే, దానివల్ల  తన పిల్లలకు ఏమైనా ఇబ్బంది ఉందా లేదా అనేది నిర్ధారణ చేసుకునే వారు. ఉదాహరణకు ఉద్యోగం అనుకోండి, అదే ఉద్యోగానికి తన కొడుకు, లేదా అల్లుడికి సాయం కోరినవారు  పోటీ అవరు అనేది తేల్చుకున్న తర్వాతనే, వారి పని చేసి పెట్టేవారు. అలాగే బదిలీ. బదిలీ అడిగిన వాళ్ళకు చేసిపెడితే దానివల్ల తన పిల్లలకు ఏమీ తభావతు రాదు అని నిర్ధారించుకున్న తర్వాత కానీ వచ్చిన వారి విషయం పట్టించుకునే వాడు కాదు. వినడానికి విడ్డూరంగా ఉండవచ్చు  కానీ ఈ నియమాన్ని ఆ అధికారి చాలా కాలం పాటించడం నాకు తెలుసు.

అడిగినవాడికి లేదనకుండా సాయం చేస్తూ వచ్చిన ఆయన, తనపై  ఏ మచ్చా పడకుండా ఉద్యోగ విరమణ చేశాడు. ఆ తర్వాత కొద్దికాలానికి ఆయన పోయినట్టు తెలిసింది. ఆయన వల్ల సాయం పొందిన అనేకమంది, తమ ఇంట్లో మనిషి పోయినట్టుగా  బాధ పడ్డారు. 

ధృతరాస్ట్రుడికే కాదు, పుత్రప్రేమ అనేది మనుషులకు పుట్టుకతోనే వస్తుందేమో. 

(13-06-2021)

కామెంట్‌లు లేవు: