13, జూన్ 2021, ఆదివారం

పెట్రో ధరలు – రాజకీయ విన్యాసాలు - భండారు శ్రీనివాసరావు

 సూటిగా ....సుతిమెత్తగా.....

పెట్రో ధరలు – రాజకీయ విన్యాసాలు భండారు శ్రీనివాసరావు
(పదకొండు సంవత్సరాల క్రితం రాసింది)
(Published in SURYA Daily)

పెట్రో ధరలు మరోసారి పెరిగాయి. కాదు పెంచారు. వడ్డన కూడా కొంత భారీగానే వుంది.ఒక్క పెట్రోలుతో సరిపెట్టకుండా, పనిలో పనిగా డీసెలు, కిరోసిన్, గ్యాస్ ధరలను కూడా ఒకేసారి పెంచి అనేకసార్లు ఆందోళనలకు దిగే పని లేకుండా ప్రతిపక్షాలకు కొంత వెసులుబాటు కల్పించారు. టీవీ ఛానల్లకే కొంత నిరాశ. పలుమార్లు చర్చలకు అవకాశం లేకుండా పోయింది. ఈ ధరల పెరుగుదల ఈ నాలుగింటితో ఆగిపోదు, ఈ ప్రభావం పలురంగాలపై పడుతుందన్నది అందరికి తెలిసిందే. ఏతావాతా సామాన్యుడి జీవితం, అలాగే అదనపు ఆదాయానికి ఏమాత్రం అవకాశంలేని స్తిర వేతన జీవుల జీవితం అస్తవ్యస్తమవుతాయి. అసలు ఆదాయాలే ఎరుగని నిరుపేదలకు ఈ ధరల పెరుగుదల గొడవే పట్టదు. పొతే, ఈ విషయంపై హోరాహోరి చర్చలు జరిపిన వాళ్ళు, తమ తమ పార్టీల విధానాలకు అనుగుణంగా విమర్శలు, ప్రతివిమర్శలు చేసినవాళ్ళు యధావిధిగా టీవీ స్తుడియోలకు ఏసీ కార్లలో వెళ్ళివస్తుంటారు. ధర్నాలు, రాస్తా రోఖోలు ఎటూ తప్పవు. ధరల పెరుగుదలతో వాస్తవంగా దెబ్బతినే కష్ట జీవులను ఈ ఆందోళనలు మరింత కష్టపెడతాయి. కానీ, ఇది ఎవరికీ పట్టదు.

ధరలు పెంచినప్పుడల్లా ప్రభుత్వం తను చెప్పాల్సిన లెక్కలు చెబుతుంది. ఎందుకు పెంచాల్సి వచ్చిందో, ఏ పరిస్థితుల్లో పెంచాల్సి వచ్చిందో వివరిస్తుంది. దరిమిలా, పాలక పక్షానికి చెందిన ప్రతినిధులు టీవీ తెరలపై వాలిపోయి, ఇప్పుడు ఇలా అడ్డగోలుగా విమర్శిస్తున్న ప్రతిపక్షాలు అధికారంలో వున్నప్పుడు ఎన్నిసార్లు పెంచిందీ, యెంత ఎక్కువగా పెంచిందీ గణాంకాలతో సహా వివరించి వారి నిర్వాకాన్ని ఎండగట్టడం ఆనవాయితీగా మారింది. విపక్షాలు కూడా ఇదే అదనని, ఎడ్ల బళ్ళు, రిక్షా బళ్ళు ఎక్కి వూరేగింపులు నిర్వహిస్తూ తమ నిరసనను ఒకటి రెండు రోజుల్లో ముగిస్తారు. ఏనాడూ మార్కెట్ కు వెళ్ళి కూరగాయలు, వెచ్చాలు కొనని వాళ్ళ తాలూకు ఆడంగులు కొందరు బుల్లి తెరలపై ప్రత్యక్షమై, ‘ఏమీ తినేట్టు లేదు-ఏమీ కొనేట్టులేదు’ అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతారు. పెట్రోలు బంకుల దగ్గర టీవీ చానళ్ళకు ఇంటర్వ్యూ లు ఇచ్చేవాళ్ళు ‘ఇదే ఆఖరుసారి బైకు పై తిరగడం’ అన్న తరహాలో మాట్లాడుతారు. ఆటోవాళ్ళు మాత్రం ఇదేమీ పట్టించుకోరు. ప్రయాణీకుల ముక్కు పిండి, పెరిగిన ధరలకు రెండింతలు చార్జీలు వసూలు చేస్తారు.

ధరలు పెరిగినప్పుడల్లా ఇదే తంతు. తెల్లారితే మళ్ళీ అన్ని వాహనాలు రోడ్లమీదే. ట్రాఫిక్ జాములు మామూలే. ప్రత్యక్షంగా భారం పడ్డవాళ్ళు పది రోజుల్లో మరచిపోయి మామూలుగా మనుగడ సాగిస్తుంటారు. పరోక్షంగా భారం పడ్డవాళ్ళు మౌనంగా భరిస్తుంటారు. ప్రతిదీ రాజకీయం చేసేవాళ్ళు ప్రజలభారం అంతా మోస్తున్నట్టు నటిస్తుంటారు. పెంచి కూర్చున్న సర్కారువారు మాత్రం అంతా అదే సర్దుకు పోతుందిలే అన్న నిర్వికార ధోరణి ప్రదర్శిస్తూవుంటారు.

ఇదంతా ఎందుకు జరుగుతోంది ?

మన చేతుల్లో వున్నదాన్ని పక్కవాళ్ళ చేతుల్లోపెట్టి బాధ్యత నుంచి తప్పించుకోవాలనుకోవడంవల్ల.

వున్న దానితో సర్దుకుపోవడం మాత్రమె కాకుండా ఎంతో కొంత వెనకేసుకునే పాత తరం నుంచి, వున్నదంతా ఖర్చుచేసుకుంటూ జల్సాగా బతకాలనే మరో తరం నుంచి, ఖర్చులకు తగ్గట్టుగా సంపాదన పెంచుకోవాలనే ఇంకో తరం నుంచి, అలా పెంచుకోవడానికి అడ్డదారులతో సహా ఏ దారయినా సరయిన దారే అని అనుకునే ప్రస్తుత తరం దాకా విషయాలను విశ్లేషించుకోగలిగినవారికి ఇదేమంత వింతగా తోచదు. అమ్మేటప్పుడు ధర పలకాలి, కొనేటప్పుడు చవుకగా దొరకాలి అనే తత్వం నుంచి బయటపడగాలి. ధరలన్నీ చుక్కలు తాకుతున్నాయి, ఎగష్ట్రా ఇవ్వకపోతే యెట్లా అనే ఆటో డ్రైవర్ – సిటీ బస్సుల స్ట్రయిక్ అనగానే చార్జీలు అమాంతం పెంచడం అందరికీ తెలిసిందే. అంటే, అవకాశం దొరికితే ఏదో ఒక విధంగా డబ్బు సంపాదించడం తప్పుకాదనే ధోరణి ప్రబలుతోంది. ఇది సమాజం లోని అన్ని వర్గాలకు వర్తిస్తుంది, కానీకి టిఖానా లేని దరిద్రనారాయణులకు తప్ప.

తోకటపా: నేను పెట్రో ధరల పెరుగుదలకు వ్యతిరేకిని. అయితే, రాజకీయ పార్టీలు సమయానుకూలంగా, అధికారంలో లేనప్పుడు చేసే విమర్శలకు, నిరసన ప్రదర్శనలకు, ప్రభుత్వంలో వున్నప్పుడు సమర్ధించుకుంటూ చేసే ప్రకటనలకు కూడా వ్యతిరేకిని.
(25-06-2010)

కామెంట్‌లు లేవు: