రాజకీయ నాయకుల విగ్రహాలు మన రాష్ట్రంలో ఏమూలకు పోయినా కానవస్తాయి. ఎవరి మీది అభిమానంతో ఈ విగ్రహాలు ప్రతిష్టిస్తున్నారో వారి కనీస పోలికలు చాలా వాటిల్లో మచ్చుకు కూడా కానరావు. కొన్నింటిని ప్రతిష్టించి ఆవిష్కరించాల్సిన వీఐపీకి తీరుబడి దొరకలేదనే కారణంతో వాటికి ముసుగుకప్పి నడిబజారులో ముసుగు వీరుల్లా వొదిలేస్తారు. వారి భక్తి తాత్పర్యాలు విగ్రహం తాలూకు నాయకుడి మీదో, సమయం దొరకని ప్రస్తుత నాయకుడి మీదో తెలియక దారినపోయే దానయ్యలు తలలు పట్టుకుంటారు. ఆ విగ్రహాల కారణంగా సామాన్య జనజీవనానికి ఏమైనా అసౌకర్యం కలుగుతోందా అన్న విషయం కూడా వారికి పట్టకపోవడం మరో దౌర్భాగ్యం.
'విగ్రహారాధన కూడదు' అని ప్రబోధించిన గౌతమ బుద్దుడు జన్మించిన పుణ్య భూమి మనది. అయినా విగ్రహాలకు
మాత్రం ఏమాత్రం కొరత లేదు. విగ్రహాలు వద్దన్న బుద్దుడి విగ్రహాలే భారీ సైజుల్లో దేశం నలుమూలల్లో కానవస్తాయి. ఇక ప్రసిద్ధ హిందూ ఆలయాల్లో
కొలువై వున్న దేవతా విగ్రహాలు చాలావరకు స్వయంభూవిగ్రహాలుగా అవతరించాయని చెబుతారు.
ఇవి కూడా జన సంచారానికి దూరంగా అధిక భాగం కొండలు, కోనల్లో వెలిశాయి. కాలక్రమేణా ప్రసిద్ధ ఆలయాలుగా ప్రాచుర్యం
పొందాయి. లౌకిక వ్యవస్థకు పెద్ద పీట వేసిన స్వతంత్ర భారతంలో ఆయా మత విశ్వాసాలకు
తగిన ఆలయాలు అనేకం వున్నాయి. దైవానికి ఒక రూపం అంటూ లేదని నమ్మే మతాలవారు కూడా
విగ్రహాలు లేని ప్రార్ధనా మందిరాలు అనేకం ఏర్పాటుచేసుకున్నారు. ఈ ఆలయాలను
సందర్శించే యాత్రీకుల సంఖ్య
సయితం నానాటికీ బాగా పెరుగుతూ వస్తోంది.
గతంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయాల పుణ్యమా అని కుల మతాలకు ప్రాధాన్యం
పెరుగుతోంది. తమ అవసరాలకోసం రాజకీయ పార్టీలు కూడా ఈ సంస్కృతిని పెంచి
పోషిస్తున్నాయి. మతం అనేది ఒక జీవన విధానంగా రూపుదిద్దుకున్న దేశంలో, ఈనాడు మతం దేశాన్ని ముక్కలుచేసే ప్రతీప శక్తిగా మారుతూ వస్తోంది.
రాజకీయాల రణగొణ ధ్వనుల్లో ఈ సంకేతాల సవ్వడులు వినరాకుండా పోతున్నాయి.
మత
ప్రాతిపదికగా దేవాలయాల్లో వుండే ఈ విగ్రహాలవల్ల జనాలకు కలిగే ఇబ్బంది ఏమీ లేదు.
కానీ రాజకీయ నాయకుల విగ్రహాలు అనేవే ఇటీవలి కాలంలో వివాదగ్రస్తం అవుతున్నాయి.
ఒకప్పుడు మూడుపూలు ఆరుకాయలుగా ప్రాభవం పొంది మహనీయులుగా, మానవీయులుగా వెలుగొందిన
వ్యక్తుల విగ్రహాలు తదనంతర కాలంలో వారు నడిపిన రాజకీయాలకు కాలం చెల్లగానే, ఆ విగ్రహాలు కూడా చెల్లని కాసుల్లా తయారవుతున్నాయి. మన దేశంలోనే కాదు ప్రపంచంలో అనేక దేశాల్లో ఇటువంటి పరిణామాలు పలుచోట్ల చోటు
చేసుకున్న సందర్భాలు వున్నాయి. మునుపటి సోవియట్ యూనియన్ లో, స్టాలిన్ శకంలో ఊరూరా వెలిసిన అయన విగ్రహాలకు తదనంతర కాలంలో పట్టిన
దుస్తితి చరిత్ర రికార్డుల్లో నమోదయివుంది.
ఆఖరికి లెనిన్ మసోలియంలో
అయన భొతిక కాయం సరసనే భద్రపరచిన స్టాలిన్ శరీరాన్ని వెలికి తీసి వేరే చోట ఖననం చేయడం కూడా జరిగింది. కేవలం అధికారాన్ని అడ్డుపెట్టుకుని
అడ్డగోలుగా రాజకీయాలు చేసిన వాళ్ళకు వర్తమానం మినహా భవిష్యత్తు ఉండదని
చరిత్రచెప్పే పాఠాలు తలకెక్కించుకునే విజ్ఞత లోపిస్తోంది. కొందరు మరణించిన తరువాత కూడా జీవిస్తారు. కొందర్ని జీవించి ఉండగానే
జనం జ్ఞాపకాల్లో వారి ఆనవాళ్ళు లేకుండా
చేస్తారు. రాజకీయానికి జాలీ దయా వుండవు.
మాయావతి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలో 'విగ్రహారాధన' అంబరాన్ని తాకింది. నాటి గౌతమ బుద్దుని నుంచి మొదలుకుని బడుగు బలహీన వర్గాల నాయకులు రవిదాస్, నారాయణ గురు, జ్యోతీరావు పూలే, షాహూజీ మహారాజ్, పెరియార్ రామస్వామి, బాబా సాహెబ్ అంబేద్కర్, బీ.ఎస్.పీ. సంస్థాపకుడు కాంషీరామ్ విగ్రహాలను కూడా మాయావతి
ప్రభుత్వ ఖర్చుతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో నెలకొల్పారు. మరీ విచిత్రం ఏమిటంటే
తన విగ్రహాల ఏర్పాటు పట్లకూడా మాయావతి మక్కువ ప్రదర్శించడం. 2007 నుంచి రెండేళ్ళ కాలంలో
మాయావతి ఈ నాయకుల స్మారక
చిహ్నాల నిర్మాణాలపై వందలకోట్లు ఖర్చు చేసారు.
ఇక
మీరట్ లో అఖిల భారత హిందూ మహాసభ, ఓం శివ మహాకాల్ సేవా సమితి కలిసి ఏకంగా నాధూరాం
గాడ్సే విగ్రహ స్థాపనకు నడుం బిగించాయి. మహాత్మా గాంధీని హత్య చేసిన గాడ్సే
విగ్రహం ఏర్పాటు అయితే అది మొత్తం దేశంలోనే మొట్టమొదటి గాడ్సే విగ్రహం అవుతుంది. మీరట్ లో ఇందుకు సంబంధించి భూమి పూజ కార్యక్రమం పోలీసు బందోబస్తు నడుమ ఇటీవల పూర్తయింది కూడా.
కేరళ లోని కోజికోడ్
పట్టణానికి ఏకంగా విగ్రహాల నగరం అనే పేరు కూడా వుంది.
ప్రస్తుతం తెలంగాణా రాష్ట్రానికి రాజధాని నగరంగా వున్న హైదరాబాదు
ఒకప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు కూడా రాజధాని. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు
ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా వున్న కాలంలో ఆయనకు ఒక భారీ బుద్ధ విగ్రహాన్ని
ఏర్పాటు చేయాలనే సంకల్పం కలిగింది. హుస్సేన్ సాగర్ సరస్సు మధ్యలో జిబ్రాల్టర్ రాక్
అనే పేరు కలిగిన ఒక రాతి గుట్ట మీద ఆ విగ్రహాన్ని ప్రతిష్టించాలని సంకల్పించారు.
ఇందుకోసం జిబ్రాల్టర్ రాక్ పై పదిహేను అడుగుల ఎత్తులో ఒక వేదికను నిర్మించారు.
భారీ విగ్రహానికి కావాల్సిన ఏకశిలను నల్గొండ
జిల్లాలో స్థపతులు ఎంపికచేసి విగ్రహ నిర్మాణం మొదలు పెట్టారు. వందలాదిమంది
పనివారలు, శిల్పుల
సాయంతో అయిదేళ్లపాటు శ్రమించి స్థపతి గణపతి ఆ రాతిని తొలిచి యాభై ఎనిమిది అడుగులు
ఎత్తయిన భారీ బుద్ధ విగ్రహాన్ని చెక్కారు. అనేక వ్యయప్రయాసల అనంతరం మూడువందల యాభై
టన్నుల బరువున్న ఆ విగ్రహం సుమారు నలభై మైళ్ళు ప్రయాణించి హైదరాబాదు చేరుకుంది.
విగ్రహ ప్రతిష్టాపనకు అవసరమైన భారీ క్రేన్లు స్థానికంగా లభ్యం కాకపోవడంతో వాటిని
ముంబై నుంచి తెప్పించారు.
ఈలోగా సంభవించిన రాజకీయ పరిణామాల ఫలితంగా విగ్రహ వ్యూహకర్త ఎన్టీ
రామారావు పదవి నుంచి దిగిపోయారు. కొత్త ప్రభుత్వం దీనిపట్ల పెద్ద ఆసక్తి చూపలేదు.
విగ్రహ ప్రతిష్టాపన కాంట్రాక్ట్ తీసుకున్న ఏబీసీ కంపెనీ ఈ పని పూర్తిచేసే పనికి
పూనుకుంది. 1990, మార్చి
పదో తేదీన విగ్రహాన్ని హుస్సేన్ సాగర్ జలాలమీదుగా తరలిస్తుండగా వంద గజాల దూరం
దాటకుండానే ప్రమాదవశాత్తు విగ్రహం నీటిలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో పదిమంది
మరణించారు. దానితో బుద్దవిగ్రహ ప్రతిష్టాపన వాయిదా పడింది. కల్మషం ఎరుగని బుద్ధ
భగవానుడు కల్మష జలాలలో దాదాపు రెండేళ్ళు ఉండిపోయాడు. చిట్టచివరకు 1992 డిసెంబరు ఒకటో తేదీన తధాగతుడు జలసమాధి నుంచి బయటపడి తనకోసం
సిద్ధంగా వుంచిన విశాలమైన వేదికమీద నిటారుగా నిలబడగలిగాడు. 2006 లో బౌద్ధ గురువు దలై లామా బుద్ధుడి విగ్రహానికి సంప్రోక్షణ నిర్వహించారు.
హైదరాబాదు టాంక్ బండ్ మీద ఎన్టీయార్ హయాములోనే తెలుగువెలుగుల
విగ్రహాలు వెలిశాయి. మొత్తం ముప్పై మూడు విగ్రహాలను ఒకే వరుసలో రాకపోకలకు అంతరాయం
కలగని రీతిలో ఏర్పాటు చేసిన విధానం హర్షణీయం. అనుసరణీయం. అయితే ఆ విగ్రహాలకు ఎంపిక
కూడా వివాద గ్రస్తం అయింది. ఒక ప్రాంతానికి చెందిన గొప్ప వ్యక్తులను
పట్టించుకోలేదన్న విమర్శలు తారాస్థాయికి చేరాయి. ప్రత్యెక రాష్ట్ర ఉద్యమ సమయంలో
మరోసారి ఈ అంశం వెలుగులోకి రావడమే కాకుండా విభజనవాదులు వాటిల్లో కొన్నింటిని
విధ్వసం చేసేవరకు విషయం ముదిరిపోయింది.
అభివృద్ధి చెందిన అనేక
దేశాల్లో రోడ్ల కూడళ్ళలో కాకుండా రహదారికి ఒక పక్కగా విగ్రహాలు ఏర్పాటు చేస్తారు. దీనివల్ల ట్రాఫిక్ అంతరాయాలు లేకపోవడమే కాకుండా
చూపరులకు కంటికి విందు గొలుపుతాయి. అద్భుతమైన శిల్ప సౌందర్యం ఉట్టిపడే విగ్రహాలు
ప్రపంచంలో వివిధనగరాలకు ప్రధాన
పర్యాటక ఆకర్షణలుగా విలసిల్లుతున్నాయి.
విగ్రహాలకు సుదీర్ఘ చరిత్ర వుంది. పాత రాతి యుగం నుంచి విగ్రహారాధన
ఏదో ఒక రూపంలో సాగుతూనే వస్తోంది. అతి పురాతన విగ్రహం ముప్పయి వేల సంవత్సరాల
నాటిదని చరిత్ర కారులు గుర్తించారు. ఇప్పటివరకు ప్రపంచం మొత్తంలో ఎత్తయిన విగ్రహం, అదీ గౌతమ బుద్దుడి విగ్రహం చైనాలో వుంది. ప్రస్తుతం ఆ రికార్డు మోడీ
ప్రభుత్వం స్వంతం చేసుకుంది. గుజరాత్ లో అతి
ఎత్తయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ఏర్పాటు చేసింది. నర్మదా డామ్ ఎదురుగా
ఏర్పాటయిన ఈ స్టాట్యూ ఆఫ్ యూనిటీ విగ్రహం యావత్ ప్రపంచంలో అతి ఎత్తయిన విగ్రహంగా పరిగణించబడుతోంది.
అనేక చారిత్రిక ఘట్టాలకు ఆనవాలుగా విగ్రహాలను ప్రతిష్టించడం
ఆనవాయితీగా వస్తోంది. అలాగే సమాజాన్ని బాగా ప్రభావితం చేసిన మహనీయుల పట్ల గౌరవ
సూచకంగా విగ్రహాలను ప్రతిష్టించడం పరిపాటి. అమెరికా
అధ్యక పదవి రేసులో దేశాన్ని చుట్టబెడుతున్న రోజుల్లో ప్రెసిడెంట్ ఒబామా ఇలినాయిస్
రాష్ట్రంలోని, మెట్రోపాలిస్
నగరంలో ఏర్పాటు
చేసిన హాలీవుడ్ చిత్ర కధానాయకుడు 'సూపర్ మ్యాన్' విగ్రహం ఎదుట నిలబడి ఫోటో తీయించుకుని మరీ తన ముచ్చట
తీర్చుకున్నారు. న్యూయార్క్ లోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ పర్యాటక ఆకర్షణకు మరో మచ్చు
తునక. లండన్
లో వున్న మైనపు విగ్రహాల మ్యూజియం సంగతి చెప్పక్కరలేదు. అందులో తమ బొమ్మ
చూసుకోవడానికి ఎందరెందరో సెలబ్రిటీలు ఎంతో ముచ్చటపడుతుండడం కద్దు.
ఇలా విగ్రహాలు ఆహ్లాద కారకాలుగా వుంటే పర్వాలేదు.
వివాద కేంద్రాలుగా మారకూడదు.
ఇప్పుడు కొత్తగా టిప్పు సుల్తాన్ విగ్రహం మరో వివాదం రేపుతోంది.
ఇది టీవీ చర్చల వరకు పరిమితం అయితే పర్వాలేదు. ఏ రూపం తీసుకుంటుందో చూడాలి.
(18-06-2021)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి