నా యోగ శాస్త్ర ప్రావీణ్యం గురించి మంచి కితాబులే దక్కాయి. ఆ సంతోషంలో ఇది రాస్తున్నాను.
ఉద్యోగం నుంచి రిటైర్ అయి ఇప్పటికి పదహారేళ్ళు. ఇంగువ కట్టిన గుడ్డ ఎన్ని సార్లు
ఉతికినా ఆ వాసన ఎక్కడికి పోతుంది.
సోమవారంనాడు అంతర్జాతీయ యోగ దినోత్సవం ఏదైనా
ఆర్టికిల్ రాయమన్నారు ఓ పత్రిక వారు. సోమవారం
పత్రికలు ఆధ్యాత్మిక బాట పడతాయి. ఆ రోజు జనరల్ ఆర్టికిల్స్ వేయరు. రాయమనడమే
ఆలస్యం, రాసి పంపించాను. అడిగి రాయించుకున్నది
కనుక వేస్తారో లేదో అనే అనుమానం అక్కరలేదు.
పైగా ఒకరోజు ముందే వేసేశారు. వేసిన
సంగతి బెంగుళూరు నుంచి తెలిసింది. అక్కడి ఉత్సాహి అనే ఓ యోగా ఫౌండేషన్ వాళ్ళ నుంచి ఫోను. వాళ్ళల్లో
ఒకరికి కాస్త తెలుగు చదవడం వచ్చు. ఆదివారం సాయంత్రం ఓ అంతర్జాతీయ సదస్సు యోగా మీద జూమ్
లో పెడుతున్నాం, మీరు కూడా కాస్త మొహం
చూపించండని. రాయడం,
మాట్లాడడం ఇదే కదా తెలిసిన పని. అంచేత
తలూపేసాను. దానికి ఓ కారణం కూడా వుంది. ఆ కార్యక్రమం వివరాలలో నాకు తెలిసిన పేరు ఒకటి కనిపించింది. ముప్పయ్యేళ్లు దాటిపోయాయి ఆయన్ని చూసి.
ఆయన గారు ఎవరంటే :
ముప్పయ్యేళ్ళ
కిందట నేను పూర్వపు సోవియట్ యూనియన్ రాజధాని మాస్కోలో, రేడియో
మాస్కోలో ఉద్యోగం వెలగబెడుతున్న రోజులు.
రష్యన్ టీవీ నేషనల్ ఛానల్ ప్రైం టైంలో నాటి కమ్యూనిష్ట్ పార్టీ అధినేత, ఆ దేశాధ్యక్షుడు అయిన మిహాయిల్ గోర్భచెవ్ తో సమానంగా
టెలివిజన్ తెరపై గంటలు గంటలు కనిపించే అవకాశం దక్కిన ఏకైక వ్యక్తి ఒక సాధారణ
భారతీయుడు అంటే నమ్మశక్యం కాకపోవచ్చు. కానీ ఇది నిజం. ఆయన పేరు లక్ష్మణకుమార్ గారు. తెలుగు బాగా తెలిసిన కన్నడిగుడు. భారత
రాయబార కార్యాలయం నడిపే ఇండియన్ స్కూలులో యోగా టీచరు. మా ఇద్దరు పిల్లలు ఆయన
విద్యార్ధులు. ఇదొక బాదరాయణ సంబంధం. ఆయన ప్రతి రోజూ టీవీ ద్వారా రష్యన్ పౌరులకు
యోగా పాఠాలు బోధించేవారు. ఆ ప్రోగ్రాం కి దేశ వ్యాప్తంగా మంచి ఆదరణ వుండేది.
రష్యన్లు ఆయన్ని గురూజీ అని గౌరవంగా పిలిచేవాళ్ళు. దీన్ని బట్టి భారతీయ యోగాకి అప్పట్లోనే విదేశాల్లో వున్న ఆదరణ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. సరే
ఇదొక అంశం.
ఆయన్ని చూడాలనే అభిలాషతో ఈ సదస్సులో అంటే ఇంట్లోనే కంప్యూటర్ ముందు ఈ
సాయంత్రం మఠం వేసుకుని కూర్చున్నాను. దేశ విదేశాల నుంచి యోగా నిపుణులు
పాల్గొన్నారు. రాసిన వ్యాసం తప్ప యోగా గురించి అక్షరం ముక్క తెలియని వాడ్ని
నేనొక్కడినే అందులో.
విలేకరికి అన్నీ తెలియాలని లేదు. తెలుసుకోవాలని వుంటే చాలు అనే వారు
కలం కూలీ ప్రముఖ పాత్రికేయుడు శ్రీ జీ. కృష్ణ గారు. నాకు యోగా గురించి ఏమీ తెలియకపోయినా తెలిసిన
వాళ్ళను అడిగి నోట్స్ రాసుకుని ఆ వ్యాసం రాసాను. దానికే నాకు యోగి అనే బిరుదు
ఇచ్చేశాడు మిత్రుడు పద్మనాభస్వామి.
విలేకరులు సర్వజ్ఞ సింగ
భూపాలురు కాదని ముందే మనవి చేసుకున్నాను. ఒకసారి హైదరాబాదులో International Conference on Plants నిర్వహించారు. ఆ ప్రెస్ మీట్ పెట్టిన ఫైవ్ స్టార్ హోటల్
నుంచి రిపోర్ట్ ఇచ్చేసి తదనంతర కార్యక్రమాల్లో మునిగిపోయాను.
వారం తర్వాత ఒక ఉత్తరం వచ్చింది. కాస్త ఇంగ్లీష్ తెలిసిన
వాడిని పంపించండి ప్రెస్ కాన్ఫరెన్సులకు అని ఓ ఉచిత సలహా జోడిస్తూ. జవాబు రాయాలి
కదా. పాత కపిల కట్ట ( న్యూస్ బులెటిన్లు) విప్పే వెతికితే అతడు చెప్పింది నిజమే
అని అనిపించింది. హైదరాబాదులో అంతర్జాతీయ మొక్కల సదస్సు అని హెడ్ లైన్స్ లో
వెళ్ళిపోయింది. అనువాదకుడు దాన్ని అంటే ప్లాంట్స్ ని మొక్కలు గా ముక్కలు ముక్కలు
చేశాడు. అక్కడ ప్లాంట్స్ అంటే నిజానికి పెద్ద పెద్ద కర్మాగారాలు.
ఇలా వుంటాయి విలేకరుల పాట్లు.
చివరికి నేను చెప్పేది ఏమిటంటే మేము అంటే
విలేకర్లం, బయట ఎక్కడెక్కడో తిరిగి సమాచారం సేకరించి దాన్ని ముక్కున పెట్టుకుని వచ్చి వార్తల్లో వమనం చేసుకున్న
విషయాల్లో మాకంత ప్రావీణ్యం లేదని, ఏదో సూతుడు శౌనకాదిమునులకు చెప్పగా వాళ్ళలో ఒకడు చెప్పిన
సంగతులుగానే వాటిని భావించాలని.
ప్లస్, ఎమోజీలో ఏదో అంటారు, అంతగా తెలవదు,
నాలుగు నవ్వు బొమ్మలు అదనం.
ఇతి వార్తాః
(20-06-2021)
4 కామెంట్లు:
Plants అంటే పెద్ద పెద్ద కర్మాగారాలు అనే అర్థం కూడా ఉన్నప్పటికీ “మొక్కలు” అనేదే జనబాహుళ్యంలో అధికంగా వాడుకలో ఉన్న అర్థం.
పాపం ఆ విలేకరి తప్పేం లేదు, తమ సమావేశానికి ఆ పేరు పెట్టిన ఆ నిర్వాహకులదే తప్పంతా 😁😁.
2విన్నకోట : విలేకరి రిపోర్ట్ ఇంగ్లీష్ లో ఇచ్చాడు. ఆ విలేకరిని నేనే. పొతే అనువాదకుడి పొరబాటు వల్ల ఇలా జరిగింది. మొక్కల మీద అంతర్జాతీయ సదస్సు ఏమిటి అనే సందేహం కలిగి వుంటే ఇది జరిగేది కాదు
@భండారు శ్రీనివాసరావు
International Conference on Plants - అంటే మొక్కల పైన అంతర్జాతీయ సదస్సు అన్నదొక్కటే కరెక్ట్ హెడ్డింగ్. It certainly can't be construed otherwise. ఇక్కడ అనువాదకుడి తప్పు నాకేం కనబడ్డం లేదు. ఇదేదో మిమ్మల్ని విమర్శించడానికో, లేక మరో ఇతర గిల్లికజ్జాలకో రాయడం లేదు కానీ, ఆర్గనైజర్స్ పెట్టిన తప్పుడు టైటిల్ ని మీ రిపోర్ట్ లో సరిదిద్ది పంపాల్సిన బాధ్యత రిపోర్టర్ గా ఖచ్చితంగా మీదే. Iinternational Conference on Industrial Plants అని మార్చకుండా అదే టైటిల్‌ని మీరు అలాగే పంపడం సరి కాదు కదా! అనువాదకుడు టైటిల్ తో పాటు లోపలి కంటెంట్ కూడా చూడాల్సిన బాధ్యత ఉంటే అప్పుడు అతను కూడా బాధ్యుడే. Hope you will agree sir. Seriously no offence meant (just sticking to the fact). With high regards.
"మొక్కల మీద అంతర్జాతీయ సదస్సు ఏమిటి అనే సందేహం కలిగి వుంటే ఇది జరిగేది కాదు" - ఇక్కడ సందేహానికి తావు కూడా లేదు ఎందుకనంటే మొక్కల మీద అంతర్జాతీయ సదస్సు జరగకూడదని ఏమీ లేదు కదా!?
కామెంట్‌ను పోస్ట్ చేయండి