14, సెప్టెంబర్ 2021, మంగళవారం

బెడ్రూంకు డ్రాయింగ్ రూమ్ కు తేడా లేకుండా పోతోంది

 (అను సుదీర్ఘ సొంత సుత్తి)

వెతకబోయిన తీగె కాలికి తగిలిందన్న సామెత జీవితంలో అతి కొద్ది సందర్భాలలో మాత్రమే నిజమవుతుంది. నా విషయంలో మాత్రం ఈ మినహాయింపు వున్న దాఖలా నాకెప్పుడూ కనబడలేదు. అదేమిటో ఇంటి తాళాలు కూడా వెతక్కుండా ఏనాడూ కళ్లబడలేదు. అయితే ఈ వెతుకులాటలో కూడా ఒక ప్రయోజనం లేక పోలేదు. వెతికేవి కనబడవు కానీ, ఎప్పుడో, ఎక్కడో దాచినవి, దాచి మరచిపోయినవి హఠాత్తుగా దర్శనమిస్తుంటాయి. అల్లా దొరికిందే ఇదిగో ఈ ఇంటర్వ్యూ.

ప్రసిద్ధ రచయిత శ్రీ మల్లాది వెంకట కృష్ణమూర్తి సంపాదకత్వంలో చాలా ఏళ్ళ క్రితం (19-02-2006) ‘శృంగారం డాట్ కామ్’ (www.srungaram.com) అనే వెబ్ పత్రికలో శ్రీ దోర్బల శర్మ నాతో జరిపిన ఇంటర్వ్యూ అది. వృత్తి జీవితంలో నేను అనేకమందిని ఇంటర్వ్యూ చేసివుంటాను కాని నన్ను మరొకరు చేయడం మాత్రం అదే తొలిసారి. బహుశా ఆఖరుసారి కూడా. అప్పట్లో ఇంట్లో కంప్యూటర్, ఇంటర్నెట్ లేని కారణంగా దాన్ని కళ్ళారా చూసే భాగ్యం కలగలేదు. కాకపొతే ఆ వెబ్ పత్రిక ఎగ్జిక్యూటివ్ ఇంచార్జ్ శ్రీ ఎస్. రామకృష్ణ పోస్ట్ లో ఆ ఇంటర్వ్యూ ప్రతిని పంపారు. ఇన్నేళ్ళ తరువాత దేనికోసమో వెతుకుతుంటే అదిప్పుడు నా కళ్ళబడింది. మానవ సహజమయిన బలహీనతతో దాన్ని యధాతధంగా ఈ బ్లాగులో వుంచుతున్నాను. ఇందులోని మంచిచెడ్డలు చదువరులకే వొదిలేస్తున్నాను. - భండారు శ్రీనివాసరావు

 

ఇంటర్వ్యూ కు ముందు దోర్బల శర్మ గారి ఉపోద్ఘాతం :

తెలుగు పత్రికారంగంలో దిగ్గజం వంటివారయిన నార్ల వేంకటేశ్వర రావుతో కలసి పనిచేసిన ప్రముఖ పాత్రికేయుల్లో ఒకరు భండారు శ్రీనివాసరావు. ప్రస్తుతం దూరదర్శన్ లో న్యూస్ ఎడిటర్ గా వున్న ఆయన 1945 డిసెంబర్ లో కృష్ణాజిల్లా కంభంపాడులో జన్మించారు. జగమెరిగిన భండారు పర్వతాలరావు ఆయనకు స్వయానా పెద్దన్నయ్య. జర్నలిస్టుగా మూడున్నర దశాబ్దాల అనుభవం కలిగిన శ్రీనివాసరావు – రేడియో, దూరదర్శన్ లలో అనేక ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించి ఎందరో జాతీయ స్తాయి నాయకులను ఇంటర్వ్యూ చేశారు.

సుదీర్ఘమయిన తన పాత్రికేయ వృత్తిలో మరచిపోలేని అనుభవాలుగా – మదర్ థెరిస్సా, గాంధీలతో తన ఇంటర్వ్యూలను ఆయన పేర్కొంటారు. మదర్ థెరిస్సా హైదరాబాద్ సందర్శించినప్పుడు ఆమెను ఇంటర్వ్యూ చేసే అదృష్టం కలిగిందని, అల్లాగే ఎన్టీయార్ ముఖ్యమంత్రిగా వుండగా భద్రాచలం అడవుల్లో రాజీవ్ గాంధీతో జరిపిన ప్రత్యేక యాత్ర కవరేజీని మరచిపోలేనని ఆయన అంటారు.

ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ (ఐ.ఐ.ఎస్.) అధికారి అయిన శ్రీనివాసరావు విద్యాభ్యాసం ఖమ్మం, విజయవాడల్లో జరిగింది. ఖమ్మం ఎస్.ఆర్.అండ్ బీ.జీ.ఎన్.ఆర్. డిగ్రీ కాలేజీలో పీయూసీ చదివారు. బీకాం విజయవాడ ఎస్.ఆర్. ఆర్. కాలేజీలో. ప్రసిద్ధ సినీ దర్శకుడు, జంధ్యాల కాలేజీలో తనకు బెంచ్ మేట్ గా గుర్తుచేసుకున్నారు. 1971 లో విజయవాడ ఆంధ్రజ్యోతిలో సబ్ ఎడిటర్ గా చేరి 1975 దాకా అక్కడే పని చేశారు. అప్పటినుంచి 1987 దాకా హైదరాబాద్ ఆకాశవాణిలో న్యూస్ కరస్పాండెంట్ గా పనిచేశారు. తరువాత నాటి యు.ఎస్.ఎస్.ఆర్. (సోవియట్ రష్యా)కు చెందిన మాస్కో రేడియో తెలుగు విభాగంలో న్యూస్ రీడర్ గా పని చేయడానికి మాస్కో వెళ్లారు. సుమారు అయిదేళ్ళు అక్కడేవున్న ఆయన నాటి సోవియట్ యూనియన్ పతనాన్ని స్వయంగా చూశారు. తర్వాత తిరిగి హైదరాబాద్ వచ్చి ఆకాశవాణిలో చేరి న్యూస్ ఎడిటర్ గా 2004 దాకా కొనసాగారు. అప్పటినుంచి దూరదర్శన్ లో న్యూస్ ఎడిటర్ గా విధులు నిర్వహిస్తున్నారు. విధి నిర్వహణలో భాగంగా దేశ విదేశాల్లో అనేక ప్రాంతాలు సందర్శించిన ఆయనకు అన్ని సామాజిక, దేశీయ సమస్యలపై మంచి అవగాహన వుంది. మలేషియా, సింగపూర్, అమెరికా వంటి దేశాలు సందర్శించారు.

పత్రికా రచయితగా భండారు శ్రీనివాసరావు 1974 – 75 మధ్య కాలంలోనే ఆంధ్రజ్యోతిలో ‘వాక్టూనులు’ పేర నిర్వహించిన శీర్షిక మంచి పాఠక జనాదరణ పొందింది. ఆకాశవాణిలో ఆయన పదేళ్ళపాటు నడిపిన ‘జీవన స్రవంతి’ కార్యక్రమం విననివాళ్లు వుండరు. ‘ప్రజాతంత్ర’ వారపత్రికలో కిందటేడాది ‘అమెరికా అనుభవాలు-అనుభూతులు’ శీర్షికన ఆయన ఒక సీరియల్ రాశారు. ‘నడచి వచ్చిన దారి’ శీర్షికన ఒక ఆటోబయాగ్రఫీని, ‘మార్పు చూసిన కళ్ళు’ పేరుతొ తాను చూసిన ఆ నాటి సోవియట్ యూనియన్ అనుభవాలను సీరియల్ గా రాయాలన్న తలంపు వున్నట్టు తన మనసులోని మాటను వెల్లడించారు. పెద్దన్నయ్య భండారు పర్వతాలరావే తనకు వృత్తిలో స్పూర్తినిచ్చారని చెప్పే శ్రీనివాసరావు ‘శృంగారం డాట్ కామ్’ కోసం- ‘బెడ్ రూమ్ కు డ్రాయింగ్ రూమ్ కు తేడా లేకుండా పోయిందం’టూ సీనియర్ పాత్రికేయుడు దోర్బల శర్మకు ఇచ్చిన ఇంటర్వ్యూ ని ఇక్కడ చదవండి – సంపాదకుడు.

హైదరాబాదులోని ఎర్రమంజిల్ ప్రాంతంలో ప్రధాన రహదారి పక్కనే వున్న క్వార్టర్ అది. ఇంటి ముందు ‘భండారు శ్రీనివాసరావు, దూరదర్శన్’ అనే నేమ్ ప్లేట్ వుంది. ఆ రోజు ఉదయం పదిన్నర గంటలకల్లా ఆ ఇంటికున్న చిన్న గేటు తీసుకుని లోనికి వెళ్లి కాలింగ్ బెల్ నొక్కగానే ఆయనే వచ్చి నన్ను ఆహ్వానించారు. నన్ను నేను పరిచయం చేసుకున్నాక ఇంటర్వ్యూ ప్రారంభించాను. ‘శృంగారం గురించి నేనేం మాట్లాడగలను?’ అని తొలుత సందేహించిన భండారు – ఆ తరువాత నేను అడిగిన ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాలు లోతయిన విశ్లేషణతో కూడుకుని వున్నాయి. ఈ తరం విధిగా తెలుసుకోవాల్సిన విషయాలను ఆయన వెల్లడించారు.

ప్ర) శృంగారం అనగానే ఎందుకంత వెనుకంజ వేసారు?

జ) నేనే కాదు. సాధారణంగా ఆ మాట వినగానే మనలో చాలామంది వెనుకంజ వేస్తారు. ఎందుకంటె మన మైండ్ సెట్ ఆ విధంగా తయారయింది. చిన్నతనం, యుక్త వయస్సు, వృద్ధాప్యం – ఇలా యే ప్రాయంలోనయినా సరే దాని గురించి స్వేచ్చగా మాట్లాడే తెగువని చాలామంది చూపలేరు. కనుకే వెంటనే మాట్లాడడానికి కాసింత భయమేసింది.

ప్ర) దాన్ని భయమంటారా?

జ) జంకు కావచ్చు. శృంగార విషయాలను స్వేచ్చగా చర్చించుకునే అవకాశం మన సంస్కృతిలో లేకపోవడమే దీనికి కారణం. దాన్ని గోప్యంగా వుంచేలా మనమంతా ‘ట్యూన్’ అయివున్నాం. ఈ నేపధ్యంలో ‘తెర’ తీసేదెవరు? ‘తెర తీయగరాదా’ అనే ధైర్యం కూడా సాంప్రదాయపరులలో చాలామందికి లేదు.

ప్ర) దీన్నిబట్టి సెక్స్ గురించి చాలామందికి తెలియదనుకోవచ్చా?

జ) సెక్స్ గురించి మన సమాజంలో చాలామందికి సంపూర్ణంగా తెలియని మాట నిజమే. దీన్ని ఇలా గోప్యంగా వుంచడం వల్లనే అలా తెలియకుండా పోతుందన్నది ఒక కారణం కావచ్చు. అయితే మన చుట్టూ వున్న చాలామందికి ‘సెన్సెక్స్’ గురించి తెలిసినంతగా ‘సెక్స్’ గురించి తెలియదనవచ్చు. వ్యాపారానికి సంబంధించిన లావాదేవీల్లో ‘సెన్సెక్స్’ అనే మాటను మనం చాలాసార్లు వింటూ వుంటాం. కానీ ‘సెక్స్’ అన్న మాటను అనడానికీ, వినడానికీ అనేకులు మొహమాట పడతారు.

ప్ర) మనం సెక్స్ ప్రాధాన్యాన్ని తెలుసుకోవడం లేదా?

జ) అనే చెప్పాలి. మనిషి జీవితానికి సెక్స్ యెంత అవసరమో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒక విశ్లేషణ ప్రకారం మానవుని ఆయుర్దాయం నూరేళ్ళు అనుకుంటే అందులో సగటున ఒక ఇరవై ఏళ్లకు మించిన కాలమయినా శృంగారానికి కేటాయిస్తున్నట్టు లేదు. ఎవరికయినా యుక్త వయస్సు వచ్చేసరికి పరిస్తితి ఎలా వుంటుందంటే – ‘అప్పటికి ఒక పదేళ్ళ కిందటి వరకు సెక్స్ గురించి తెలవదు. ఆ తరువాత పదేళ్లకు సెక్స్ అవసరం వుండదు.’ దీన్ని బట్టి శృంగారానికి లభిస్తున్న ప్రాధాన్యం అర్ధం అవుతోంది.

ప్ర) మధ్య వయస్కులు శృంగారానికి దూరం అవుతున్నారంటారా?

జ) అలా అని నిర్దిష్టంగా చెప్పలేం. సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. ఈ మధ్య ‘ప్లస్ ఫార్టీ’ శృంగారం అని ఒకటి వచ్చింది. ఇది నలభై నుంచి యాభై ఏళ్ళ వయస్సులోని వారికి వర్తిస్తుంది. ఈ రకమయిన శృంగార పోకడ భార్యాభర్తల మధ్య వున్నప్పుడు ఓకే. కానీ ఇది అలా కాకుండా వివాహేతర సంబంధాలకు దారి తీస్తున్నట్టు వింటున్నాం. ఒక పెళ్ళయిన వ్యక్తి, చివరికి పిల్లాపాపలున్న స్త్రీలు సైతం సమాజం లోని నియమాలను తోసిరాజంటూ ఇలాటి శృంగార సంబంధాలకు సిద్ధపడుతున్నట్టు వినవస్తోంది. శృంగారం లోని ఆనందాలను అనుభవించడానికి అదొక మంచి అవకాశంగా వారు భావిస్తున్నట్టున్నారు.

ప్ర) ఇలా వివాహేతర సంబంధాలను పెట్టుకోవడం ఎంతవరకు మంచిది?

జ) మంచీ చెడు నిర్ణయం అన్నది ఎవరికి వారు చేసుకోవాల్సిందే. ఒకరికి మంచి మరొకరికి చెడు కావచ్చు. ఆయా వ్యక్తుల విచక్షణ, పరిస్తితులకు దీన్ని వొదిలేయాల్సిందే. మంచి చెడుల విచక్షణలో ఆయా వ్యక్తుల అభిరుచులు, కాలమాన స్తితిగతులు ఇవన్నీ పరిగణనలోకి వస్తాయి. ఉదాహరణకు ఒకప్పుడు నాగయ్య నటించిన సినిమాలే మంచివి, నిన్నటి నాగేశ్వరరావు సినిమాలు చెడ్డవి అనలేం. యే కాలానికి తగ్గట్టు ఆ రకమయిన పద్ధతులు, నియమాలు వుండడం సహజం. కాకపొతే అన్నింటికీ విలువలు ముఖ్యం అని మరచిపోకూడదు. విలువలకు అతీతంగా, వాటికి భంగం కలగకుండా చూసుకోవడం ప్రధానం.

ప్ర) పై పరిస్తితిని విలువలు దిగజారడంగా భావించవచ్చా?

జ) అలా జనరలైజ్ చేయడానికి లేదు. అప్పట్లో విలువలతో కూడిన సంపాదనలు వుండేవి. ఇప్పుడు ప్రతిదానికి డబ్బు సంపాదనే ప్రధానమయినది. విలువలు లేని సంపాదనలు ఎక్కువయ్యాయి. ఇలాటి చోట సెక్స్ లోను విలువలు వుంటాయని అనుకోలేం.

ప్ర) సెక్స్ పట్ల నేటి యువత స్పందన యెలా వుంటోంది?

జ) ఇప్పుడు ఓ మోటార్ బైకు పై ఓ అమ్మాయి, ఓ అబ్బాయి చాలా తేలిగ్గా తిరిగేస్తున్నారు. వారిలో అపోజిట్ సెక్స్ పట్ల, స్పర్శ పట్ల ఒక సున్నితత్వం లేకుండా పోయింది. అప్పట్లో అబ్బాయి అమ్మాయి ఒకరినొకరు తాకడానికే జంకేవారు. శారీరకంగా స్పర్శిస్తే ఒక గగుర్పాటు కలిగేది. కానీ ఇప్పటివారిలో ఈ స్పందన కానరావడం లేదు. చాలా ఈజీగా ఒకరికొకరు షేక్ హాండ్లు ఇచ్చుకోవడం, ఇద్దరు మగవాళ్ళ మధ్య ఒక అమ్మాయి స్వేచ్చగా తిరగడం జరుగుతోంది. పాతకాలంతో పోల్చుకుని దీన్ని తప్పుపట్టడం కూడా సరికాదు.

ప్ర) అసలు నేటి యువత ప్రధాన లక్ష్యం ఏమిటి?

జ) వారి ప్రధాన లక్ష్యం డబ్బు. దాన్ని యెలా సంపాదించాలి? ఇంతే. వారి ప్రాధాన్యాలు ఇప్పుడు కెరీర్, సంపాదన. ఇవే. వీటి గొడవలో పడి అసలు సెక్స్ కు ఇవ్వాల్సిన గౌరవం, స్తానం ఇవ్వడం లేదు. ఒక అబ్బాయి ఒక అమ్మాయి తేలిగ్గా ప్రేమించుకోవడం, కలసి తిరగడం, పెళ్ళయితే సరి. లేకపోతే అంతకంటే తేలిగ్గా మరచిపోవడం. ఇదంతా చాలా సులభంగా చేసేస్తున్నారు. ఒకరికోసం ఒకరు తపించడాలు, మనసులు బరువెక్కడాలు వంటి సన్నివేశాలు లేనేలేవు. ఒక్క మాటలో చెప్పాలంటే నేటి యువతరానిది టేకిట్ ఈజీ పాలసీ. ప్రతి దాన్నీ తేలిగ్గానే తీసుకుంటారు, ఒక్క సంపాదన విషయాన్ని మినహాయిస్తే.

ప్ర) పెళ్లి కాకుండా భార్యాభర్తల్లా వుండడం ఎంతవరకు సబబు?

జ) ‘పెళ్లి’ అనేది ఇద్దరు స్త్రీ పురుషులు కలసి వుండడానికి చేసుకునే ఒప్పందం అనుకున్నప్పుడు సమాజం పెట్టిన వివాహం అనే కట్టుబాటు కొందరికి నచ్చకపోవచ్చు. అలాటివారు పెళ్లి చేసుకోకుండానే భార్యాభర్తల్లా కలసి వుంటారు. అందులో తప్పు పట్టడానికి ఏమీ వుండదు.

ప్ర) మీరు పెళ్లి ఆర్భాటాలకు వ్యతిరేకం అని విన్నాను. నిజమేనా?

జ) నిజమే! నాకు టీనేజ్ వచ్చేసరికే దాదాపు పదిహేను ఇరవై మంది మేనకోడళ్లను బుట్టల్లో ఎత్తుకెళ్ళి పెళ్లి పీటల మీద కూర్చోబెట్టాను. నాకు ఏడుగురు అక్కయ్యలు. వాళ్ళలో చాలామంది ఆడపిల్లల పెళ్ళిళ్ళను నేను దగ్గరుండి మరీ గమనించాను. నాకు ఇరవై ఏళ్ళ వయస్సు వచ్చేదాకా అనేక పెళ్ళిళ్ళు చూసి చూసి ఒకరకంగా చికాకు ఏర్పడింది. నా పెళ్లి వరకు వచ్చేసరికి ఆ పెళ్లి తంతు శుద్ద దండగమారి ఆర్భాటంలా అనిపించింది. అందుకే నేను ఆ రకమయిన అట్టహాసమేదీ జరుపుకోలేదు.

ప్ర) వివాహ వేడుక లోని అనుభూతిని కోల్పోయినట్టు ఫీలవుతున్నారా?

జ) బాపు తీసిన ‘పెళ్లి పుస్తకం’ లాటి కళాత్మక సినిమాలు చూస్తున్నప్పుడు ఆ తంతులో ఇంత గొప్ప అనుభూతి వున్నదా అనిపిస్తుంది. నిజమే. ఇప్పుడు అలా అనిపిస్తున్న సంగతి ఒప్పుకుని తీరాల్సిందే. కానీ, నాకు అప్పట్లో పెళ్లి లోని అనవసర ఖర్చులు, ఆర్భాటాలు కనిపించినంతగా, శాస్త్రోక్తమయిన ఆ శుభ కార్యంలో వధూవరులకు లభించే అనుభూతి కానరాలేదు. దానిని మిస్ అయ్యానేమోనని ఇప్పుడు అనిపిస్తున్న మాట నిజమే.

ప్ర) పెళ్లి వద్దనుకున్న వాళ్లకు పెళ్ళాం మాత్రం ఎందుకంటారు?

జ) మేం వద్దనుకున్నది ఆ ఆడంబరాలు, అట్టహాసాలనే కాని మొత్తంగా పెళ్లాన్నే కాదుగా. అందుకే నేను అప్పట్లో ‘పెళ్లి వద్దు, పెళ్ళాం కావాలి’ అనే నినాదాన్ని కూడా వినిపించాను. అలాగే దీనితో పాటు ‘ఉద్యోగం వద్దు – ఉపాధి కావాలి’ అనీ అన్నాను. అప్పట్లో మామీద ఆనాటి సమకాలీన సమాజ స్తితిగతుల ప్రభావం ఎక్కువగా వుండేది. నాలాటి యువతలో ఇలాటి భావాలు రావడానికి అదే కారణం. అందుకే ఈ నాటి తరం భావజాలాన్ని సమర్ధించడానికి కూడా అప్పట్లో నాలాటి వాళ్లు ప్రదర్శించిన తిరుగుబాటు ధోరణే కారణం కావచ్చు. నేను లేవనెత్తిన ఈ రెండు నినాదాల్లో ఒకదాన్ని పాటించగలిగాను. రెండో దాని విషయంలో పాక్షిక సర్దుబాటు చేసుకుని జర్నలిజం లోకి దిగాను.

ప్ర) ప్రేమ ప్రణయం – వీటిపట్ల మీ కవితాత్మక భావనలు కొన్ని చెబుతారా?

జ) వృత్తి రీత్యా జర్నలిస్ట్ నే అయినా నేనూ కొంత ప్రేమ కవిత్వం రాశాను. అంతా వయసు మహిమ. ఉదాహరణకు:

 

రాత్రి ఒక నక్షత్రం రాలి పడింది.

తెల్లారి చూస్తే అది నువ్వే”

 

ఊహల్లో నేనూ

వూహించుకుంటూ నువ్వూ

వర్తమానాన్ని నష్ట పోతున్నాం”

 

వీటికి ఒక అర్ధం అంటూ లేదు. మనసుకు తోచింది ఇలా రాస్తూ పోయాను.

 

ప్ర) అప్పటికీ ఇప్పటికీ వచ్చిన సాంస్కృతిక మార్పు ఏమిటి?

జ) ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు బెడ్రూం కు డ్రాయింగ్ రూమ్ కు తేడాలేదు. బెడ్ రూమ్ విషయాలన్నీ టీవీ ద్వారా డ్రాయింగ్ రూమ్ లోకి వచ్చేశాయి. మార్పు సహజమే. ఒప్పుకోవాలి. మాట వరసకు ఇప్పుడు జర్నలిష్టులు పది రూపాయలు ఇస్తే కానీ పేరా వార్త రాయడం లేదని వింటున్నాం. ఇలాటి పెడధోరణి ఇదివరకూ లేకపోలేదు. అప్పట్లోనే పెగ్గు పడితే కాని వార్త రాయని వాళ్ళను ఎందర్ని చూడలేదు. అప్పుడూ ప్రమాణాలు పడిపోవడం చూసాము. కాకపొతే, ఇప్పుడు ప్రమాణాలే లేవు. ఇది యెంత దూరం పోతుంది అంటే – పెండ్యులం అన్నది వూగి వూగి ఎక్కడో ఒకచోట ఆగుతుంది. అంతదాకా ఎదురుచూడక తప్పదు.”

అంటూ ఆయన తన ఇంటర్వ్యూ ముగించారు. (19-02-2006)


7 కామెంట్‌లు:

అప్పరసు శ్రీనివాసరావు చెప్పారు...

నిర్మొహమాటంగా చెప్పారు, భండారు గారూ!

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

అప్పరసు శ్రీనివాసరావు గారికి (రెండు మార్లు) ధన్యవాదాలు - భండారు శ్రీనివాసరావు

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

నిరాడంబరంగా పెళ్ళి చేసుకోవడం గురించి మీ అభిప్రాయమే నా అభిప్రాయమున్నూ. కాకపోతే మీరు సాధించుకో గలిగారు, నేను సాధించుకోలేక పోయాను. మనలో మన మాట మీది ప్రేమ వివాహం అనిన్నీ, అందువల్లే మీ మాట నెగ్గించుకోగలిగారనిన్నీ నేను అనుకుంటున్నాను. నాలాగా అరేంజడ్ పెళ్ళి చేసుకున్న వాళ్ళు రిజిష్టర్డ్ పెళ్ళి అని పట్టుబట్టినా ఇరుపక్షాలనీ ఒప్పించగలగడం సాధారణంగా (90%) జరగదు. సంస్కరణ మార్గంలో మీరు సాధించిన ప్రగతిని తక్కువ చెయ్యడం లేదు, పట్టుదల నెగ్గించుకోలేక పోయానని ఏదో నా స్వఘోష అంతే.

ఇక ఈ కాలానికొస్తే పాశ్చాత్య సంస్కృతి, ఇటీవల పెచ్చు మీరి పోయిన వ్యాపార సంస్సృతి, సినిమాల్లో బాధ్యతారహితంగా చూపించే ఆర్భాటపు పెళ్ళిళ్ళు (పెళ్ళిచూపుల కార్యక్రమాన్ని కూడా ఫైవ్-స్టార్ లెవెల్లో చూపిస్తున్నారు) బాగా బుర్రకెక్కిపోయిన ఈ తరం కుర్రకారుకు నిరాడంబరత విలువ తెలియదు, పట్చించుకోరు కూడా. ఎంత షో చేస్తే అంత గొప్ప. ఎంత “డిఫరెంట్” గానూ “వెరైటీ” గానూ చేస్తే అంత గొప్ప, అన్ని “లైకులు”.

తతిమ్మా అంశాలు కూడా మీరు బాగా ప్రస్తావించారు.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

విన్నకోట నరసింహారావు గారికి ధన్యవాదాలు

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

విన్నకోట నరసింహారావు గారికి : 1971 డిసెంబరు 15 వ తేదీ రాత్రి మద్రాసు నుంచి అంబాసిడర్ కారులో తిరుపతి ప్రయాణం. దారిలో భోరున వాన. అట్లా ఇట్లా కాదు, ఉరుములు, మెరుపులు, పిడుగులు. మధ్యమధ్యలో ఆగుతూ తెల్లారేలోపునే తిరుమల చేరాము. ఎస్వీ కాటేజీలో పైన గదులు తీసుకున్నాము. పురోహితుడు ఎలా దొరికాడో తెలవదు. మా ఆవిడ పిన్నివసుంధర కొన్న నీలం రంగు ఫారెన్ నైలెక్స్ చీరె పెళ్లి చీరె. నేను ధోవతి కట్టుకున్నానో, ప్యాంటు షర్టు తో పెళ్లి చేసుకున్నానో గుర్తు రావడం లేదు. ఎందుకంటే సందర్భం, సన్నివేశం అలాంటివి. తొమ్మిదీ పది గంటల నడుమ పెళ్లి జరిగిపోయింది. వెంటనే వెళ్లి బాలాజీ దర్శనం చేసుకున్నాము. ఇప్పట్లోలా క్యూ లైన్లు లేవు. కొండ దిగి వచ్చి భోజనం చేసి వచ్చిన కారులోనే మళ్ళీ మద్రాసు వెళ్ళాము. మా ఆవిడ స్నేహితులు టీ నగర్ హోటల్లో విందు ఇచ్చారు. అటునుంచి మా మామగారి వద్దకు వెళ్లాం. కూతుర్ని చూసి కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు. “నీకు ఏం తక్కువ చేస్తానని అనుకుని ఇలా పెళ్లి చేసుకున్నావని మా ఆవిడను అడిగారు. కన్నీళ్ళే జవాబు.
రిజర్వేషన్ల గొడవ లేని రోజులు. అంచేత 16 వ తేదీ రాత్రి బయలుదేరి రైల్లో మర్నాడు ఉదయం బెజవాడ చేరుకున్నాము. మా పెద్దన్నయ్య ఇంటికి వెళ్ళాము. మా అమ్మగారు కూడా అక్కడే వుంది. మమ్మల్ని చూసి కళ్ళ నీళ్ళు పెట్టుకుంది. కాళ్ళకు దణ్ణం పెట్టగానే దగ్గరకు తీసుకుని మనసారా ఆశీర్వదించింది.
‘పెళ్లోద్దు పెళ్ళాం కావాలి’ అనే నా మొండి పట్టుదల ఫలితం మా పెళ్లి. ఇరువైపుల పెద్దల చేత కళ్ళనీళ్ళు పెట్టించింది కూడా. బహుశా అదే ఆఖరిసారి కావచ్చు.
మా పెళ్ళికి పెద్దల ఆమోదం లభించింది అన్న సంతోషంలో ఆంద్ర జ్యోతి ఆఫీసుకు వెళ్లి ఎడిటర్ నార్ల వెంకటేశ్వరరావు గారిని కలుసుకుని మా పెళ్లి వృత్తాంతం తెలియచేశాము. ఆయన మా ఇద్దర్నీ మెచ్చుకోలుగా చూస్తూ, ‘రోజూ ఎన్నో ఆదర్శాలు వల్లె వేస్తుంటాము. నువ్వు చేసి చూపించావు. వెళ్ళండి. హాయిగా కాపురం చేసుకోండి. మళ్ళీ వచ్చి ఉద్యోగంలో చేరుతున్నాను, అని చెప్పేవరకు నీకు సెలవు ఇస్తున్నాను. ఇదే మీకు నా పెళ్లి కానుక’ అన్నారాయన.

తోకతపా: ఇలాంటి పెళ్లిళ్లకు ఫోటోలు వుండవు, జ్ఞాపకాలు తప్ప.
(16-12-2016)

అజ్ఞాత చెప్పారు...

శ్రీనివాసరావు గారు,
౧. ఆడ మొగ పిల్లలు ఒకళ్ళనొకరు ముట్టుకోకుండా ఉండి పెళ్ళిసమయానికి వారి స్పర్శ వల్ల వచ్చే అనుభూతిని, మనం ఒకరికొకరు ప్రత్యేకం, ఒకరికొకరు బద్దులం, పెళ్లయిన తర్వాత మరో వ్యక్తిని చూడకూడదు అన్న నియమాలని ఏర్పరిచిన ధర్మాన్ని విస్మరించాం. దాని వల్ల జీవితానికి ఏది ముఖ్యమో తెలియకుండా పోయింది.
౨. మీ పెళ్లి వివరాలు ఇంతకు ముందు కూడా వ్రాసారు. ఈసారి చెప్పిన ముఖ్య విషయం - జ్ఞాపకాలు. ఫోటోలు లేవని మీరు ఏమూలో విచారపడ్డట్టున్నారు. కానీ దాని కంటే జ్ఞాపకాలే చాలా సుఖం. ఇప్పటి పరిస్థితి చూడండి. ఎక్కడ చూసిన ఫోటోలు, వీడియోలు మనస్సు మరెక్కడో. వాటిని చూసే నాథుడు కూడా లేదు. తక్కువ ఉంటేనే అపురూపం అవుతాయేమో!

ఎప్పటి లాగే మీ వ్యాసం, ఇంటర్వ్యూ చాలా బావున్నాయి.

అజ్ఞాత చెప్పారు...

మదర్ థెరిస్సా, గాంధీలతో తన ఇంటర్వ్యూలను ఆయన పేర్కొంటారు

ఈ ముఖాముఖి విషయాలు పోస్ట్ చేయండి.

2 సెక్స్ గురించి చాలామందికి తెలియదనుకోవచ్చా?

తెలియకుండానే భారతదేశ జనాభా ఇంత ఉందంటారా ?