19, సెప్టెంబర్ 2021, ఆదివారం

సోషల్ మీడియా పౌరులకు ఓ విజ్ఞప్తి

 కల్లోల కడలిలో పడవ ప్రయాణం

సమకాలీన రాజకీయ అంశాలపై విశ్లేషణ వంటి ప్రయత్నం చేయడం నిజంగా కత్తి మీది సామే. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో. ఎందుకంటే జుకర్ బర్గ్ సృష్టించిన  ఈ కృత్రిమ సమాజం, బయట మనం జీవిస్తున్న సమాజం కంటే వేయి రెట్లు ఎక్కువగా విభజితమై వుంది, పార్టీల వారీగా, నాయకుల వారీగా, కులాల వారీగా, మతాల వారీగా. ఆఖరికి దేవుళ్లవారీగా.

నేను ఈ ఈ మీడియాలో రాయడం మొదలు పెట్టి ఏళ్ళు గడిచాయి. మొదట్లో ఏ అంశంపై అభిప్రాయం రాయాలన్నా ఎలాటి ఇబ్బంది వుండేది కాదు. ఇప్పుడలా కాదు, నచ్చని అభిప్రాయాన్ని ఖండఖండాలుగా ఖండించడం నిత్యకృత్యమై పోయింది. దీన్ని కూడా  తప్పు పట్టాల్సిన పనిలేదు. అందరి అభిప్రాయాలు ఒకే మాదిరిగా వుండాలని రూలేమీ లేదు.

ఎవరైనా రాసిన దానిలో కొన్ని విషయాలు మనం మనసులో అనుకునే వాటికి దగ్గరగా ఉండవచ్చు. మరి కొన్ని నచ్చనవి ఉండవచ్చు. ఒక కుటుంబంలోని వారే అనేక విషయాల్లో విభిన్నంగా ఆలోచిస్తూ వుంటారు. వ్యక్తిగతమైన అభిరుచులు, రాజకీయపరమైన  ఆలోచనలు వేర్వేరుగా వుండే అవకాశాలు మెండుగా  వుంటాయి. అక్కడ సర్దుకుపోయే మనుషులు ఇక్కడ అందుకు విముఖత చూపుతారు. అదేమి చిత్రమో!

నా అభిప్రాయాలతో పొసగని వ్యాఖ్యలను కూడా ఆహ్వానిస్తాను. కొన్నిసార్లు తెలిసో తెలియకో చేసే పొరబాట్లు దిద్దుకోవడానికి కూడా ఈ మీడియా చక్కని అవకాశం ఇస్తోంది. అది ఒక కారణం.

ఈ సందర్భంలో నాదొక మనవి.

నా వ్యాసాలతో విబేధించే విభిన్న వ్యాఖ్యలకు కూడా నేను లైక్ కొడతాను. వీలయితే, అదీ అవసరం అనుకుంటే ఓ చిన్న వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అలా కాకుండా, తమకు పొసగని వ్యక్తుల ప్రస్తావన వచ్చిన సందర్భాలలో కొందరు వారిని ఉద్దేశించి వాడు, వీడు అంటూ అసభ్యకర వ్యాఖ్యలు చేస్తుంటారు. వాటిని నేను పట్టించుకోను అనడానికి ఒకటే సంకేతం. అదేమిటంటే, ఆ వ్యాఖ్యలకు నానుంచి ఎలాంటి స్పందనా వుండదు. కనీసం చూసినట్టు లైక్ కూడా వుండదు.

ఒక పక్క రాజకీయ నాయకులు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు అంటూ విమర్శలు చేస్తాము. మరి ఆ చేత్తోనే ఇలాంటి మాటలు రాస్తే వారిని విమర్శించే హక్కు మనం కోల్పోయినట్టే కదా!

సద్విమర్శకు, ఉడుకుమోతు వ్యాఖ్యలకు ఉన్న తేడా గమనించి మసలుకుంటే అపార్థాల సీన్లు రావు.

ప్రసిద్ధ సంపాదకులు శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావు, ‘అప్పుడు - ఇప్పుడు’ అనే పేరుతొ, కీర్తిశేషులు, ప్రముఖ పత్రికా రచయిత శ్రీ జీ. కృష్ణ రచించిన గ్రంధానికి ముందుమాట రాస్తూ, ఒకానొక సందర్భంలో కృష్ణ గారు నుడివిన వ్యాఖ్యను అందులో ఇలా ప్రస్తావించారు.
“ స్వాతంత్ర్యానంతరం మన రాజకీయ నాయకులు నేర్చుకున్నదేమిటి? కృష్ణగారు అంటారు – ‘రెండే రెండు విద్యలు. ఒకటి గుడ్డిగా పొగడడం, రెండు గుడ్డిగా వ్యతిరేకించడం’.

ఇప్పుడది కాఫీ డికాక్షన్ లాగా ఈ వేదికలోకి కూడా దిగిపోయినట్టుంది.

తప్పదు, మా అభిప్రాయాలు మావి. మా భాష  మాది అనుకుంటే, ఎలాగూ మీ గోడ మీకు ఉండనే వుంది. రాస్తుండండి. నేను కూడా చదువుతూ వుంటాను.

ఇదొక వివరణ లాంటి విజ్ఞప్తి.  



(19-09-2021)

   

కామెంట్‌లు లేవు: