21, సెప్టెంబర్ 2021, మంగళవారం

రూలంటే రూలే - భండారు శ్రీనివాసరావు

నిజమా! నిజంగా నమ్మలేం అనిపించే ఈ సంఘటన నిజంగా జరిగింది. ఒబామా అమెరికా ప్రెసిడెంట్ గా వున్నప్పుడు స్వయంగా చెప్పకపోతే అసలీవిషయం బయటకు పొక్కేదే కాదు. నమ్మడానికి వీల్లేని ఈ కధా కమామిషూ ఏమిటంటే- కొన్నేళ్ళ క్రితం న్యూ యార్క్ లో జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ సమావేశాల్లో పాల్గొనడానికి అమెరికా అధ్యక్షులవారు సతీ సమేతంగా ఆ నగరం చేరుకున్నారు. . ఓ రోజు వీలుచేసుకుని భార్యను వెంటబెట్టుకుని హోటల్లో భోజనం చేయడానికి వెళ్ళారు. మాట మంతీ చెప్పుకుంటూ భోజనం ముగించిన తరువాత బిల్లు చెల్లించడానికి క్రెడిట్ కార్డు తీసిచ్చారు. అది తీసుకువెళ్ళిన బేరర్ అంతే వేగంతో తిరిగొచ్చి, 'ప్రెసిడెంట్! మీ క్రెడిట్ కార్డు చెల్లదు' అని చావు కబురు చల్లగా చెప్పాడు. పక్కన భార్య ఉండబట్టీ, ఆవిడ తన కార్డు తీసి ఇవ్వబట్టీ ప్రెసిడెంట్ ఒబామా గారి పరువు ఆ పూటకు నిలబడింది.

క్రెడిట్ కార్డులు, వాటి భద్రత గురించి జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో మాట్లాడుతూ, మాటవరసకు ఈ విషయం స్వయంగా ఒబామా గారే వెల్లడించడంతో ఈ కధనం మీడియాలో హుషారుగా గింగిరాలు కొట్టింది.
అమెరికా ప్రెసిడెంట్ ఒబామా గారు భార్యతో కలిసి భోజనం చేయడానికి ఇతర సాధారణ పౌరుల మాదిరిగానే హోటల్ కు వెళ్ళారు. ఇది ఎవరికీ పట్టలేదు. అలాగే బిల్లు కట్టడానికి క్రెడిట్ కార్డు ఇచ్చారు. బిల్లులు కట్టడం అలవాటులేని రాజకీయ నాయకులను కన్న కర్మ భూమి కాబట్టి మన దేశంలో మీడియా కూడా ఆ విషయానికి పెద్ద ప్రాధాన్యత ఇవ్వలేదు. మీడియా గగ్గోలు పెట్టినదల్లా ఒక్క విషయానికే. అదేమిటంటే అమెరికా ప్రెసిడెంటు క్రెడిట్ కార్డు కూడా క్లోనింగుకు గురయిందనే. దాన్ని గురించి ఒకటే ఊదర.
ఈ సంఘటన నుంచి మన రాజకీయ నాయకులు, మీడియా నేర్చుకోవాల్సింది ఎంతో వుంది అంటే అపార్ధం చేసుకోరు కదా!



NOTE: Courtesy Image Owner

Source :

కామెంట్‌లు లేవు: