23, సెప్టెంబర్ 2021, గురువారం

ఆశా నిరాశేనా మిగిలేది చింతేనా! – భండారు శ్రీనివాసరావు

 ఒక కధ చెబుతాను. నిజానికి ఇది కధ కాదు, ప్రతి చోటా జరుగుతున్న కధే.

అనగనగా ఒక ఊరు. ఉన్నట్టుండి ఆ ఊరికి ఓ వ్యాపారి వచ్చి ఓ దుకాణం తెరిచాడు. దాన్నిండా రకరకాల స్టీలు సామాన్లు. ఒకటి కొంటే మరోటి ఉచితం అన్నాడు. ఇంకేం జనం ఎగబడ్డారు. కొన్ని రోజులకు పోలీసులు లాఠీలు ఝలిపించాల్సినంతగా క్యూ లైన్లు పెరిగిపోయాయి.

అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ వ్యాపారి కష్టమర్లతో నమ్మకంగా చెప్పాడు. ఉత్తర హిందూ స్థానం నుంచి తెచ్చిన సరుకు అంతా అయిపొయింది. మళ్ళీ స్టాక్ వస్తోందని కబురు వచ్చింది. అప్పటివరకు మీరు డబ్బులు చెల్లిస్తూ వుండండి. సరుకు రాగానే రసీదు చూపించి వస్తువులు తీసుకువెళ్ళండి అని. అంతకు ముందు కొనుక్కుని లాభ పడ్డవాళ్ళు, కొనుక్కోవాలని చూసి నిరాశ పడ్డవాళ్ళూ మళ్ళీ ఎగబడి డబ్బులు కట్టారు.

అలా కొంత కాలం గడిచిన తర్వాత అతడు గుడారం ఎత్తేశాడు. జనం లబోదిబో అన్నారు.

 ఒక విలేకరి వెళ్లి ఓ పోలీసు అధికారిని అడిగాడు, ఆ వ్యాపారి షాపు ఓపెన్ చేసి ఇలా ఒకటికి మరోటి ఫ్రీ అని ఆశ పెట్టినప్పుడే చర్య తీసుకుని వుంటే బాగుండేది కదా! అని.

ఆయన చిద్విలాసంగా ఒక నవ్వు విసిరేసి ఇలా అన్నాడు.

“నిజమే! మాకు ఎవరైనా ఫిర్యాదు చేస్తే కదా! చర్య తీసుకునేది”

అప్పటి స్టీలు సామాను నుంచి, పువ్వు మీ అదృష్టం చెప్పును, పన్నెండు బ్యాండ్ల రేడియో ఉచితం అనే లూధియానా ప్రకటనల నుంచి, గల్లీల్లో చీట్లు వేసేవారి నుంచి,  అర్ధ శాతం అధిక వడ్డీ ఎక్కువ ఇస్తామని భ్రమ పెట్టే ప్రైవేటు గిడిగిడి బ్యాంకుల నుంచి, అది కట్టిస్తాం, ఇది కట్టిస్తాం, ముందు డబ్బు కట్టండి అని  పత్రికల్లో ఆకర్షణీయమైన ప్రకటనలు గుప్పించే వారి నుంచి, ఇదిగో ఇప్పటి సైబర్ మోసాల వరకు పరిస్థితి ఇంతే! ఏమీ మారలేదు. జనమూ మారలేదు. అలాగే మోసపోతూనే వున్నారు. పోలీసులూ మారలేదు, అప్పటిలాగే కంప్లయింట్ ఎక్కడా అని అడుగుతూనే వున్నారు.

Prevention is better than cure అంటూ నీతి పాఠాలు చెప్పేవాళ్ళు చెబుతూనేవున్నారు.

పుణ్యభూమి కళ్ళు మూసుకుని చూస్తూనే వుంది, ఆశ చచ్చినా, దురాశ పుట్టినా ఆ మనిషి చచ్చినవాడితో సమానం అనే సూక్తిని మౌనంగా మననం చేసుకుంటూ.


NOTE: Courtesy Image Owner  


(23-09-2021)      




కామెంట్‌లు లేవు: