ఒకానొక కాలంలో పనుల మీద వివిధ జిల్లాల నుంచి హైదరాబాదు వచ్చే ఆ నాటి కాంగ్రెస్ నాయకులకు ఆబిడ్స్ లో వుండే వసంత్ విహార్ హోటల్ ఒక విడిది. నాకు బాబాయి వరస అయ్యే నాటి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు బొమ్మకంటి సత్యనారాయణ రావు గారు ఎప్పుడు హైదరాబాదు వచ్చినా ఆ హోటల్లోనే దిగేవాడు. ఒక నెంబరు గదిని ఆయన కోసం ప్రత్యేకించేవారు. అంతే కాదు పీటలు వేసి విస్తరిలో భోజనం వడ్డించే వారు. మర్రి చెన్నారెడ్డి వంటి నాయకులు బొమ్మకంటిని కలుసుకోవడానికి ఆ హోటల్ కు వెళ్ళే వాళ్ళు. ఆ రోజుల్లో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ రాజకీయాలకు కేంద్ర బిందువుగా వుండడం వల్ల ఆయనకు ఆ గౌరవం. బొమ్మకంటి తెలంగాణాకు చెందిన రాజకీయ నాయకుడు అయినప్పటికీ సమైక్యవాది.
నేను
రేడియోలో చేరడానికి చాలా ముందుగానే నా మిత్రుడు వనం జ్వాలా నరసింహారావు పై చదువులు, ఉద్యోగం నిమిత్తం హైదరాబాదులోనే ఆయన
మకాము. చిన్నప్పటి నుంచి తన గ్రామ రాజకీయాల్లో
చాలా చురుగ్గా పాల్గొంటూ ఉండేవాడు. పాలిటిక్స్ అంటే తగని ఆసక్తి. నాకు ఆసక్తి ఎలావున్నా వృత్తిరీత్యా
రాజకీయ నాయకులను కలుసునే వెసులుబాటు వుండేది.
ఒకరోజు
జ్వాలా నన్ను ఆయన స్కూటర్ పై ఎక్కించుకుని
ఆబిడ్స్ లోని వసంత్ విహార్ కు తీసుకువెళ్లాడు.
అప్పటికే
జాతీయ పార్టీ కాంగ్రెస్ రెండుగా చీలిపోయింది. మాజీ ప్రధాని ఇందిరాగాంధి నాయకత్వంలో
కాంగ్రెస్ (ఐ) పార్టీ ఏర్పాటు అయింది.
కొత్త పార్టీ పట్ల రాష్ట్రంలోని పాత కాంగ్రెస్ నాయకులకు ఆట్టే గురి కుదరలేదు.
గుర్తింపు కలిగిన నాయకత్వం కొరత వుంది. చెన్నారెడ్డి అప్పటికి ఇంకా ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వ బాధ్యతలు తీసుకోలేదు.
ఈ
నేపధ్యంలో మేము వసంత్ విహార్ హోటల్లో బస చేసిన బొమ్మకంటి సత్యనారాయణ రావు గారెని కలుసుకున్నాము.
(మేము ఆయన్ని సత్యం బాబాయ్ అని పిలుస్తాము. ఆయన కుమారుడే బొమ్మకంటి శంకర రావు, ఐ.పి.ఎస్. పోలీసు ఇన్స్పెక్టర్ జనరల్ గా రిటైర్ అయ్యాడు)
మామూలుగా
కుటుంబ క్షేమ సమాచారాలు వగైరా మాట్లాడుకున్న తరువాత జ్వాలా ఆయన్ని నేరుగా
రాజకీయాల్లోకి దించాడు. ఇందిర పార్టీకి రాష్ట్రంలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో
సరైన నాయకుడు లేదు. మీరు ఆ బాధ్యత తీసుకోవచ్చు కదా! అని సూచనగా చెప్పాడు.
అప్పుడు
ఆయన నవ్వి ఇలా అన్నాడు.
“ఒర్రేయ్ నరసింహం! పార్టీ అంటే మాటలు కాదురా! అంత బరువు ఇప్పుడు ఎవడు మోస్తాడు? ఈ వయసులో అవసరమా చెప్పు”
అని ఎదురు ప్రశ్న వేసాడు.
ఇంకో
మాట కూడా అన్నాడు. ఆయనకు ఇందిరాగాంధి శక్తి సామర్ధ్యాల పట్ల అంత నమ్మకం వున్నట్టు
అనిపించలేదు. మరి ఆమె గురించి అన్నాడో సరిగా గుర్తు లేదు కానీ ‘గాంధారి గర్వ భంగం
అవుతుంది చూడండి అన్న మాట గుర్తుంది.
(05-09-2021)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి