18, సెప్టెంబర్ 2021, శనివారం

బీదరికంలో మరణించిన మొదటి దళిత ముఖ్యమంత్రి

 (దామోదరం సంజీవయ్య శత జయంతి సంవత్సరం పురస్కరించుకుని)

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ గా పనిచేసిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు చక్రపాణి గారు ఒక సందర్భంలో చెప్పిన ఒక పాత విషయం స్పురణకు వస్తోంది.

అప్పుడు జవహర్ లాల్ నెహ్రూ ప్రధాన మంత్రి.

ఆనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న నీలం సంజీవరెడ్డి ఆ పదవికి రాజీనామా చేసారు. ఆయన స్థానంలో దామోదరం సంజీవయ్యను ముఖ్యమంత్రిగా నియమించాలని నెహ్రూ నిర్ణయించారు. అగ్రకులాల ఆధిపత్యం అధికంగా ఉన్న రాష్ట్ర కాంగ్రెస్ లోని కొందరు నాయకులు ఒక దళితుడు ముఖ్యమంత్రి కావడాన్ని సహించలేక పోయారు. సంజీవయ్య అవినీతిపరుడని, అక్రమంగా లక్షలాది రూపాయలు కూడబెట్టారని అధిష్టానానికి అనేక ఫిర్యాదులు వెళ్లాయి. సంజీవయ్య నీతి, నిజాయితీ తెలిసిన నెహ్రూ ఆ ఫిర్యాదులను కొట్టి పారేశారు. అయినా, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మొండిపట్టు పట్టారు.

నెహ్రూ ఓ నాయకుడిని ఆంధ్రాకు వెళ్లి సంజీవయ్య మీద రహస్య విచారణ చేసి నివేదిక ఇవ్వమని కోరారు. ఆయన హైదరాబాద్ వచ్చి అప్పటి కాంగ్రెస్ యువనాయకుడు చక్రపాణి గారిని కలిసి వచ్చిన పని చెప్పారు. సంజీవయ్య గారి గూర్చి బాగా తెలిసిన చక్రపాణిగారు నిర్ఘాంతపోయి ఆ నాయకుడిని చివాట్లు పెట్టారు. కానీ ప్రధాని ఆదేశం. చేసేది లేక ఢిల్లీ నాయకుడిని వెంటబెట్టుకుని కారులో సంజీవయ్య గారి గ్రామానికి వెళ్లారు. గ్రామ పొలిమేరలలో ఒక పూరి పాక ముందు కారు ఆపారు చక్రపాణి. ఆ పాక బయట ఒక వృద్ధురాలు కట్టెల పొయ్యిపై మట్టి కుండతో అన్నం వండుతున్నది. పొగగొట్టంతో మంటను ఊదుతూ చెమటలు కక్కుతున్నది. "ఏమిటి ఇక్కడ ఆపారు?" ప్రశ్నించాడు ఢిల్లీ నేత.

"సంజీవయ్య గారి ఇల్లు ఇదే. ఆ వృద్ధురాలు ఆయన అమ్మగారు. కారు దిగండి" అన్నారు చక్రపాణి. నాయకుడు నివ్వెరపోయాడు. చక్రపాణి ఆమెకు నమస్కరించి "అమ్మా...ప్రస్తుతం మంత్రి గా ఉన్న మీ అబ్బాయి రాష్ట్ర ముఖ్యమంత్రి కాబోతున్నారు" అన్నారు.

ఆమె చెమటలు తుడుచుకుంటూ "అయితే మా వాడి జీతం ఏమైనా పెరుగుతుందా నాయనా! ఈ కట్టెల పొయ్యి మీద వంట చెయ్యడం కష్టంగా ఉంది. ఒక బొగ్గుల కుంపటి కొనిపెట్టమని ఎన్నాళ్ళ నుంచో అడుగుతుంటే, డబ్బులు లేవు అంటున్నాడు" అన్నది.

నాయకుడి నోట్లోంచి మాట రాలేదు. "సార్.. గ్రామం లోకి వెళ్లి విచారణ చేద్దామా?" అడిగారు చక్రపాణి. "అవసరం లేదు. కారును హైద్రాబాద్ కు పోనీయండి" అన్నాడు నాయకుడు.

ఆ తరువాత వారం రోజుల్లో సంజీవయ్య ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి అయ్యారు.

సంజీవయ్య గారిది కర్నూలు జిల్లా కల్లూరు మండలం లోని పెద్దపాడు గ్రామం.

ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఒకసారి తల్లిని చూడడానికి స్వగ్రామానికి వెళ్ళారు.

తిరిగివస్తూ ఓ వందరూపాయల నోటు ఖర్చులకు వాడుకోమని ఇచ్చారు.

నాకు సరే నువ్వున్నావు, డబ్బులు ఇవ్వడానికి, కానీ ఎలాంటి ఆసరాలేని  బీదా బిక్కీ సంగతేమిటి అని ఆమె అనడం సంజీవయ్య గారిలో ఆలోచనలు రేకెత్తించింది.

ఫలితమే ఆయన ప్రభుత్వం ప్రవేశపెట్టిన వృద్ధాప్య పింఛను పధకం. 

నిశ్శబ్దం రాజ్యమేలిన ముఖ్యమంత్రి సభ

ఈ విషయం చెప్పే ముందు దీంతో సంబంధం ఉన్న మరో విషయంతో మొదలు పెడతాను.

మా రెండో అన్నయ్య భండారు రామచంద్ర రావు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ జనరల్ మేనేజర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆ స్థాయికి చేరడానికి ముందు ఎక్కిన అనేకానేక నిచ్చెన మెట్లలో నెలకు పాతిక రూపాయల ‘విలేకరి కొలువు’ కూడా వుంది.

ఖమ్మంలోని ఎస్సార్ అండ్ బీజీ ఎన్ ఆర్ కాలేజీలో ఆయన డిగ్రీ పూర్తిచేశారు. రామ్మోహనరావు గారు ఆ కాలేజీలో లెక్చరర్. వారి నాన్నగారికి పత్రికల ఏజెన్సీ కూడా వుంది. అప్పట్లో ఆ ఏజెంట్లే పత్రికా విలేకరుల పాత్ర కూడా పోషించేవారు. మా అన్నయ్యకు తెలుగులో ఉన్న ప్రావీణ్యం గమనించి ‘నెలకు ఓ పాతిక ఇస్తాను, నీకు పాకెట్ మనీగా పనికి వస్తుంది, నువ్వు ఆంద్రజ్యోతి పత్రికకు వార్తలు రాస్తుండు. వాళ్ళు వేస్తె వేస్తారు, లేకపోతే లేదు, కానీ నీకు మంచి కాలక్షేపంగా వుంటుంది’ అని ప్రోత్సహించడంతో మా అన్నయ్య ఒప్పుకున్నాడు.

ఇక అసలు విషయానికి వస్తాను.

నాటి ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య ఖమ్మం జిల్లా పర్యటన ఖరారు అయింది. అప్పటికే జిల్లాలోని కాంగ్రెస్ ముఖ్య నాయకులు అందరూ రెండు వర్గాలుగా విడిపోయివున్నారు. జలగం వెంగళరావు, శీలం సిద్దారెడ్డి వంటి అతిరధులు కలిగిన ప్రధాన వర్గం అప్పటివరకు ముఖ్యమంత్రిగా ఉన్న నీలం సంజీవ రెడ్డికి అనుకూలం. మరో వర్గం సంజీవయ్య వైపు. దీనికి మాకు బాబాయి వరుస అయిన బొమ్మకంటి సత్యనారాయణ నాయకులు. ఖమ్మం జిల్లాకు సంబంధించినంతవరకు ఆయన ముఖ్యమంత్రి సంజీవయ్యకు కుడి భుజం. సంజీవయ్యకు సంఘీభావం తెలిపేందుకు గోకినేపల్లిలో జిల్లా దళిత మహా సభ ఏర్పాటు చేశారు. ఈ సభను కవర్ చేయడానికి పాతిక రూపాయల విలేకరి అయిన మా అన్నయ్యను పురమాయించారు రామ్మోహన రావు గారు.

సభ బాగా జరిగింది. ముఖ్యమంత్రి ప్రసంగించడానికి మైకు ముందు నిలబడ్డారు. సంజీవయ్య స్వతహాగా మంచి వక్త. ఆయన ప్రసంగం మొదలు పెట్టారు.

నన్ను బాధ పెడుతున్న, నా మనసును కలచి వేస్తున్న ఓ విషయాన్ని మీకు చెప్పదలచుకున్నాను. ఇక్కడ పైనా కిందా కూర్చున్న మనుషులం అందరం ఒకే తీరున ఉన్నాము. ఒంట్లో పారే రక్తం రంగు అందరికీ ఎరుపే. కానీ మనలో చాలామందిమి సాటి మనిషిని మనిషిగా చూస్తున్నామా అంటే అనుమానమే. డబ్బున్న ఖామందులు పెంపుడు బొచ్చు కుక్క పిల్లల్ని తమ పక్కలపై పడుకోబెట్టుకుంటారు. ముద్దు చేస్తారు. అదే సాటి మనిషిని తాకడానికి కూడా వారికి అస్పృశ్యత అనే అనాచారం అడ్డం వస్తుంది. కుక్కలపాటి చేయరా ఈ మనుషులు? ఎందుకీ వ్యత్యాసం? ఎందుకీ వివక్ష?’

రెండు చేతులూ గట్టిగా గాలిలో ఊపుతూ మాట్లాడుతున్న ముఖ్యమంత్రి స్వరం బొంగురుపోయింది. పైకిలేపిన చేతులను అలాగే వుంచి ఆయన కాసేపు మౌనంగా వుండిపోయారు.

సభకు హాజరై ప్రసంగం వింటున్న యావన్మంది చేష్టలు ఉడిగి వుండిపోయారు. అంతటా నీరవ నిశ్శబ్దం.

సరే! ఆ రోజు సభ ముగిసింది. తిరిగి హైదరాబాదు వెళ్ళడానికి దామోదరం సంజీవయ్య అంబాసిడర్ కారు ఎక్కారు. ఆయన పక్కనే మా బాబాయి బొమ్మకంటి సత్యనారాయణ. ముందొక పోలీసు జీపు, వెనక మరో జీపు. అదీ ముఖ్యమంత్రి కాన్వాయ్ ఆ రోజుల్లో.

మా అన్నయ్య ఖమ్మం చేరుకున్న వెంటనే తన రిపోర్ట్ రాసి మర్నాడు పోస్టులో పంపారు. ఆ మరునాడు అది ఆంధ్రజ్యోతిలో వచ్చింది.

ముఖ్యమంత్రి దళిత సభలో రాజ్యమేలిన నిశ్శబ్దం’.

వార్తతో పాటు మా అన్నయ్య పెట్టిన హెడ్డింగ్ కూడా యధాతధంగా పత్రికలో రావడం కొసమెరుపు.

జవహర్ లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధి మంత్రి వర్గాల్లో పనిచేసిన దామోదరం సంజీవయ్య గారు అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు.

ఇన్ని పదవులు నిర్వహించిన సంజీవయ్య గారెకి చివరికి మిగిలిన ఆస్తి కేవలం వాళ్లూరులో వున్న ఆస్బెస్టాస్ రేకుల ఇల్లు. 1921 ఫిబ్రవరి 14 న మునిదాస్, సుంకులమ్మ దంపతులకు జన్మించిన సంజీవయ్య,

1972 మే ఏడవ తేదీన మరణించారు. అదే రోజు ఆయన పెళ్లి రోజు కావడం మరో విషాదం.

తోకటపా :  2018 లో కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధి కర్నూలు పర్యటనలో భాగంగా కీర్తిశేషులు మాజీ ముఖ్యమంత్రి దామోదరం ఒకప్పుడు నివసించిన గృహాన్ని సందర్శించడం ఓ విశేషం



(2021)

 

కామెంట్‌లు లేవు: