16, సెప్టెంబర్ 2021, గురువారం

ఇల్లాలి ముచ్చట్లు అనే జ్ఞాపకాల తెరలు

 “1968 ప్రాంతాల్లో నేను (అంటే మా ఆవిడ నిర్మల) బెజవాడ మాంటిసోరి స్కూల్లో చదివేదాన్ని.  సరస్వతి వొదినె గారి పిల్లలు సత్యవతి, విజయ అంతా ఆ స్కూలే. ఆ స్కూల్లో పిల్లల్ని చదివించడం అనేది ఆ రోజుల్లో చాలా గొప్పగా వుండేది. దానికి కారణం ప్రిన్సిపాల్  కోటేశ్వరమ్మగారు. బెజవాడ కనకదుర్గమ్మ మాదిరిగానే  కోటేశ్వరమ్మ పేరు కూడా అంతే ప్రసిద్ధి.

తుర్లపాటి  హనుమంతరావు అన్నగారి మనుమడు, విజయ కుమారుడు (కార్తీక్) పుట్టినప్పుడు బారసాలకు కోటేశ్వరమ్మగారు కూడా వచ్చారు. మేమంతా ఆవిడ  స్టూడెంట్లం కాబట్టి భోజనాల సమయంలో (ఆరోజుల్లో ఎవరొచ్చినా నేల మీదనే భోజనాలు, పీటలు వేసి వడ్డించేవారు) ఆమె చుట్టూ కూర్చున్నాం. చాలా ఏళ్ళ తరువాత కలిసినా, ఆవిడ పేరు పేరునా అందర్నీ ఆప్యాయంగా పలకరించారు.

ఏం చేస్తున్నావని’  నన్నడిగితే,  హైదరాబాదులో అమ్మవొడిపేరుతొ చిన్నపిల్లల కోసం  కేర్ సెంటర్ నడుపుతున్నానుఅని చెప్పా. బహుశా ఆమె దగ్గర చదువుకున్నవాళ్ళల్లో  చదువులో ఎక్కిరానిదాన్ని నేనే అనుకుంటా. కానీ ఆవిడ మాత్రం నన్ను అభినందించారు. ‘స్త్రీలు స్వతంత్రంగా ఏదో ఒకటి చేయడం చాలా అవసరమ’ని చెప్పారు. నేను ఏదో మా అవసరాలకు కేర్ సెంటర్  పెట్టుకుంటే, ఆవిడ పెద్ద మనస్సుతో ఆశీర్వదించిన విధానం నేను మరిచిపోలేను.

"చివర్లో ఇంకో విషయం. తెలుగు సినిమా రంగంలో హాస్య బ్రహ్మగా పేరు తెచ్చుకున్న జంధ్యాల’ (జేవీడీఎస్ శాస్త్రి) కూడా మాంటిసోరి స్కూల్లో మా క్లాసుమేటు. దీనికి కొనసాగింపు లాంటి ముగింపు ఏమిటంటే జంధ్యాల తదనంతర కాలంలో బెజవాడ ఎస్సారార్ కాలేజీలో మూడేళ్ళు బీకాంలో మా వారికీ క్లాసుమేటు."

  


(మా ఆవిడ కీర్తిశేషురాలు నిర్మల)

కామెంట్‌లు లేవు: