21, సెప్టెంబర్ 2021, మంగళవారం

సోషల్ మీడియా ప్రపంచంలో - భండారు శ్రీనివాసరావు

 ఇక్కడ అందరూ అందరికీ కావాల్సిన వాళ్ళే.

ఇక్కడ అందరూ ఎవరికి వాళ్ళే!

అందుకే ఇదొక చిత్రమైన ప్రపంచం.

అద్భుతంగా రాసేవాళ్ళు, అధ్వాన్నంగా గిలికేవాళ్ళు పక్కపక్కనే తారసపడతారు.



(Courtesy Image Owner)


పూర్వం పత్రికల్లో రాసేవాళ్ళు తక్కువ. చదివే వాళ్ళు ఎక్కువ. ఇక్కడ పూర్తిగా విభిన్నం.

గతంలో ఓ ప్రముఖ రచయితో, రచయిత్రో ఏదైనా రాస్తే అభినందిస్తూ ఆ పత్రికకి ఉత్తరాలు రాసేవాళ్ళు. నేను రేడియోలో పనిచేసే రోజుల్లో, అంటే చాలా పాత రోజుల్లో రేడియో కార్యక్రమాలను ప్రశంసిస్తూ గుట్టలు గుట్టలుగా ఉత్తరాలు వస్తుండేవి. వాటిల్లో చాలా కొన్నింటిని మాత్రమే ఆ రచయితలు, నిర్వాహకులు చూడగలిగే వాళ్ళు.

ఈ ప్రపంచం ముందే చెప్పినట్టు ఇందుకు పూర్తిగా విరుద్ధం. రాసేవాళ్ళు ఎక్కువ. చదివే వాళ్ళు తక్కువ. ఈ వాస్తవం ఎరుకలో పెట్టుకుంటే మా రచనలకు స్పందించడం లేదు అనే బాధ వుండదు. చాలామంది రాసే చాలా పోస్టులను నిజానికి చాలామంది చూస్తుంటారు. కానీ లైక్ కొట్టరు. అదేమీ నేరం కాదు. లైక్  కొట్టనంత మాత్రాన అది చదవలేదని కాదు.  మరీ బాగా నచ్చితే ఓ లైక్ కొట్టి ఊరుకుంటారు. ఇంకా బాగా మనసుకు హత్తుకునేలా వుంటే ఓ కామెంటు పెడతారు. రాజకీయ పోస్టులు అయితే పోస్టు చదవకుండానే వేరేవారి  కామెంట్లు చూసి వాటికి పై కామెంట్లు పెడతారు, అసలు పోస్టుతో సంబంధం లేకుండా.  ఇదంతా ఈ ప్రపంచంలో చాలా సహజంగా జరిగిపోతుంటుంది.

ఇలాంటి ఈ ప్రపంచం నాకెందుకు నచ్చుతుంది అంటే...

ఓ లేడీ డాక్టరు గారు తమ అనుభవాలను చాలా గమ్మత్తుగా హాస్యం జోడించి రాస్తారు.  వాటిని అభిమానించడానికి వారెవరో  అన్నది నాకు తెలియనక్కరలేదు. అలాగే ఓ కవి గారు, పెద్ద అధికారి కూడా, (ఆ విషయం ఆయన ఎక్కడా ఎప్పుడూ రాసుకోలేదు) రాసే కవితాత్మక విషయాలు పదేపదే చదవాలని అనిపించేలా వుంటాయి. దాచునేలా వుంటాయి. ఒకప్పుడు తన రచనలతో  యావత్ ఆంధ్ర దేశాన్ని ఉర్రూతలూగించిన ఓ ప్రసిద్ధ రచయిత కూడా ఈ లోకంలో మన చెంతనే వున్నారు. అలాగే వయసులో చాలా పెద్దవాళ్లు, జీవితంలో అనేక ఎగుడు దిగుడ్లు చూసిన వాళ్ళు తమ అనుభవాలను మనతో పంచుకుంటూ, మనం చూడని ఒకనాటి జీవన విధానాలను మనకు పరిచయం చేస్తున్నారు. పరాయి దేశంలో ఉంటూ కూడా అక్కడి విశేషాలను హృద్యంగా పంచుకునే వారిని నేను  తరచూ (వారి రాతలను) చూస్తూనే వున్నాను. మరొకరు వున్నారు. ఆయన రాసే చిన్ననాటి సంగతులు ఒకనాటి సమాజాన్ని మన కళ్ళ ముందు ఉంచుతాయి. జీవితంలో ఎదిగివచ్చిన క్రమాన్ని ఓ గృహిణి అలతి అలతివాక్యాలతో, ఎలాంటి భేషజం లేకుండా సరళమైన పద్దతిలో రాస్తూ వుండడం చూస్తున్నాము. వీళ్ళ పేర్లు కావాలనే నేను ప్రస్తావించడం లేదు. క్రమంతప్పకుండా ఫేస్ బుక్ ఫాలో అయ్యేవారికి వీరెవరో ఇట్టే తెలిసిపోతుంది. అన్నింటికీ మించి, తన శక్తి యుక్తులను చాటుకునే అపూర్వ అవకాశం ఆడవాళ్ళకు ఈ ప్రపంచం ఇచ్చింది. ఓ పక్క ఇంటికి సంబంధించిన తమ విద్యుక్త ధర్మాలను నిర్వర్తిస్తూనే అనేక ఆసక్తికరమైన అంశాలను, చాలామంది సోదరీమణులు  అందరితో పంచుకుంటున్నారు. 

బయటి ప్రపంచంలోని కుళ్ళూ కుతంత్రాలు, రాజకీయాలు ఇక్కడ కూడా ఉన్నమాట నిజమే. కానీ వాటిని ఏరివేయడం ఇక్కడ చాలా తేలిక.  

వెనక నేను రేడియోలో పనిచేసే రోజుల్లో ఒక పెద్ద మనిషి రేడియో స్టేషనుకు ఫోనుచేశాడు. "మీరు ప్రసారం చేసేవన్నీ చెత్త ప్రోగ్రాములే" అనేశాడు.

నేనన్నాను. 'పరిష్కారం మీ చేతుల్లోనే వుంది'

కోపంగా మాట్లాడబోయిన ఆ పెద్దాయన కాస్త తగ్గాడు.

'అదెలా' అని అడిగాడు.

'సింపుల్. మీ రేడియో నాబ్ ఎడమవైపు తిప్పండి. అంతే! అదే నోరు మూసుకుంటుంది' చెప్పాను.

ఆ పెద్దమనిషి గలగలా నవ్వేసాడు.

ఆ తర్వాత ఆయన నాకు స్నేహితుడిగా మారాడు. అప్పుడప్పుడూ ఫోను చేసి పలకరిస్తూ ఉండేవాడు.

ప్రపంచం ఇలా వుంటుంది. కాదు, ఇలానే వుంటుంది.

సమాజం అంటే ఒక సమూహం. అందరూ మనలాగే ఆలోచించాలి అనుకోకూడదు. మనకు ఇష్టమైనవే వాళ్ళూ ఇష్టపడాలి అని అస్సలు అనుకోకూడదు. అన్ని రకాలవాళ్ళు. ఎన్నో రకాల భావాలు. మరెన్నో రకాల అభిరుచులు. అన్నింటినీ సానుకూలంగా తీసుకోగలిగితేనే ఇలాంటి సాంఘిక మాధ్యమాల్లో నిశ్చింతగా కాలక్షేపం చేయగలం.

కాబట్టి, కావున మన పోస్టులకు స్పందించకపోతే  స్నేహితుల జాబితానుంచి తొలగిస్తాను సుమా అని హెచ్చరించడం అంత ఉచితం కాదు అనిపిస్తోంది.

ఎందుకంటే ఇదొక కృత్రిమ ప్రపంచం.

మన జాబితాలో ఉన్నంత మాత్రాన మన స్నేహితులు కాదు, లేనంత మాత్రాన కాకుండా పోరు.

(21-09-2021)

కామెంట్‌లు లేవు: