25, సెప్టెంబర్ 2021, శనివారం

నేనేనా !

 

మొన్న నా పోస్టు ఒకటి చూసి మీరేనా ఇది రాసింది అనే అర్ధం వచ్చేట్టు మురళీకృష్ణ గారు కామెంటు పెట్టారు. నిజమే. కొన్ని సార్లు జీవితంలో జరిగిన సంఘటనలను ఓసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మనమేనా ఇలా ప్రవర్తించింది అనిపిస్తుంది. మిగిలిన వాళ్ళ సంగతేమో కానీ నా వృత్తి జీవితంలో నా వ్యవహార శైలి గురించి తదనంతర కాలంలో తరచి చూసుకున్నప్పుడు అలా అనిపించిన సందర్భాలు బోలెడు.
ఆరేళ్ల క్రితం ఒకరోజు అనుకోకుండా మాజీ పోలీసు డైరెక్టర్ జనరల్, తమిళనాడు మాజీ గవర్నర్ శ్రీ పీ ఎస్ రామమోహన రావు గారిని కలుసుకోవడం జరిగింది. బహుశా దశాబ్దానికి పై చిలుకు మాటే వారిని కలిసి. ఎంతో ఆప్యాయంగా పలకరించి పాత సంగతులు గుర్తు చేసుకున్నారు. తన పక్కన వున్న పెద్దమనిషికి నన్ను పరిచయం చేస్తూ, ‘ఇతడు శ్రీనివాసరావు, హెల్మెట్ ఫేం ‘ అన్నారు సరదాగా.
అసలు సిసలు పోలీసు అధికారి పీ ఎస్ రామమోహన రావు గారితో కొన్ని మరచిపోలేని అనుభవాలు వున్నాయి. నేను మాస్కో వెళ్ళేటప్పుడు ఆయన డీజీపీ. అప్పటికే కొందరం జర్నలిస్టులం మొదలు పెట్టిన యాంటీ హెల్మెట్ ఉద్యమంతో సీనియర్ పోలీసు అధికారులు మా పట్ల మనస్తాపంతో వున్నారు. నన్ను అరెస్టు చేయడం, ఎన్టీయార్ ముఖ్యమంత్రిగా దర్యాప్తు కోసం వన్ మ్యాన్ కమిషన్ ఏర్పాటుచేయడం, ఆ వెంటనే నా మాస్కో ప్రయాణం, మా నడుమ సత్సంబంధాలలో పైకి కనబడని తేడా తీసుకువచ్చాయి. మాస్కో వెళ్ళబోయేముందు డీజీపీ రామమోహన రావు గారిని ఆయన ఆఫీసుకు వెళ్ళి కలిసాను. చాలా ఆప్యాయంగా పలకరించి క్షేమ సంచారాలు కనుక్కుని వీడ్కోలు చెబుతూ ఒక మాట అన్నారు. ‘మాస్కోలో పోలీసులతో జాగ్రత్త. మన దగ్గరలా హెల్మెట్ల విషయంలోలా ఠలాయిస్తే అక్కడ కుదరదు.’
వయసు అలాటిది మరి. నేనూ అలానే జవాబు చెప్పాను. ‘మాస్కో చాలా చలి ప్రదేశం అని విన్నాను. మంచు కురిసే రోడ్లపై ‘టూ వీలర్స్ ఎలౌ చేయరనుకుంటాను’
రామమోహన రావుగారు ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ గా వున్నప్పుడు ఖమ్మం బస్ స్టాండులో ఒక ఉద్యోగితో సీటు రిజర్వేషన్ విషయంలో పేచీ వచ్చింది. హైదరాబాదు రాగానే ఘాటుగా ఓ పిర్యాదు రాసి పంపించాను. మూడు రోజుల తరువాత అనుకుంటాను, అదే ఉద్యోగి మా మేనల్లుడిని వెంటబెట్టుకుని హైదరాబాదు వచ్చాడు.
‘ఏదో తెలియక చేసాడు, ఇప్పుడు ఎమ్డీ గారు నీ పిర్యాదు మీద ఇతడిని చాలా దూరం ట్రాన్సఫర్ చేశారు, నాకు బాగా తెలిసిన వాళ్లు. నువ్వే మళ్ళీ ఏదో సర్ది చెప్పి బదిలీ క్యాన్సిల్ చేయించు’ ఇదీ మా వాడి రాయబారం.
సరేనని ఆయన ఆఫీసుకు వెళ్ళి కలిసి విషయం చెప్పాను. అప్పుడాయన ఇలా అన్నారు.
‘మీరు కంప్లయింటు ఇచ్చారు. మీ మీద గౌరవం కొద్దీ విచారణ కూడా జరపకుండా బదిలీ చేసాను. అదీ నేను చేసిన పొరబాటు. ఇప్పుడు మీ మాట విని మరో పొరబాటు చేయడం ఇష్టం లేదు. బదిలీ క్యాన్సిల్ చేయడం చిటికెలో పని. కాని సంస్థలో డిసిప్లిన్ మాటేమిటి. ఎమ్డీ ట్రాన్స్ఫర్ చేస్తే నాకొక లెక్కా! ఒక్క రోజులో మళ్ళీ క్యాన్సిల్ చేయించుకున్నానని అందరితో చెప్పుకుంటాడు. క్రమశిక్షణ దెబ్బతింటుంది. ముందు పోయి వేసిన చోట జాయిన్ కమ్మని చెప్పండి. ఓ ఆరు నెలల తరువాత మళ్ళీ వెనక్కు వేస్తాను’
దట్ ఈజ్ రామ్మోహనరావు గారు!
తోకటపా: ఇప్పుడు మళ్ళీ ఓసారి మొదటి పేరా చదువుకోవాలన్నమాట.



23-09-2021

కామెంట్‌లు లేవు: