16, సెప్టెంబర్ 2021, గురువారం

ఒకనాటి మోడీ

 

(సెప్టెంబర్ 17 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టిన రోజు)

నిజాలు ఒక్కోసారి నిజమేనని నమ్మలేనంత విడ్డూరంగా వుంటాయి.
1990 సంవత్సరం.
అంటే సుమారు కొంచెం అటూ ఇటుగా ముప్పయ్యేళ్ల పై చిలుకు ముచ్చట.
ఇద్డరు యువతులు ఢిల్లీ వెళ్ళడానికి లక్నోలో రైలెక్కారు. ఆ మరునాడే మళ్ళీ వాళ్ళు అహమ్మదాబాదు వెళ్ళాలి. రైలు కదిలేముందు ఇద్దరు బడా నేతలు అదే బోగీలోకి ఎక్కారు. వారితో పాటే బిలబిలమంటూ మరో డజను మంది వారి అనుచరులు కూడా జొరబడ్డారు. ఆ యువతుల్ని సామాన్లమీద కూర్చోమని అంటూ వాళ్ల బెర్తుల్ని దర్జాగా ఆక్రమించుకున్నారు. అంతటితో ఆగారా. పక్కన ఆడవాళ్ళు వున్నారు అనే సోయ కూడా లేకుండా పెద్ద గొంతుకతో అసభ్య పదజాలంతో సంభాషణ సాగించారు. వారి ధోరణితో ఆ యువతులు బిక్కచచ్చిపోయారు. ఢిల్లీ చేరేంతవరకు ప్రాణాలు అరచేతపెట్టుకుని ప్రయాణం చేశారు.
మరునాడు రాత్రి ఢిల్లీ నుంచి అహమ్మదాబాదు వెళ్లేందుకు ఆ యువతులు రైలెక్కారు. మళ్ళీ 'మరో' ఇద్దరు నేతలు అదే బోగీలో కనబడ్డారు. రాత్రి అనుభవం ఇంకా మనసులో పచ్చిగా వుండిపోవడంతో యువతుల భయం రెట్టింపు అయింది. అయితే చిత్రం. ఆ కొత్త వారిద్దరూ ఆ ఇద్దరు ఆడవాళ్లని చూడగానే జరిగి సర్దుకు కూర్చుని చోటిచ్చారు. అనుచరగణం కూడా లేకపోవడంతో తరువాత ప్రయాణం సాఫీగా సాగిపోయింది.
మరునాడు ఉదయం రైలుదిగి ఎవరిదోవనవాళ్లు వెళ్ళబోయేముందు ఒక యువతి డైరీ తెరచి పట్టుకుని ' నేనూ నా స్నేహితురాలు ఇద్దరం రైల్వేలో ప్రొబేషనరీ అధికారులుగా పనిచేస్తున్నాము. నా పేరు లీనా శర్మ. శిక్షణకోసం ఈ ప్రయాణం పెట్టుకున్నాము. మీవంటి వారు తోడుగా వుండడం వల్ల రాత్రి మా ప్రయాణం ఎలాటి ఇబ్బంది లేకుండా సాగిపోయింది. ధన్యవాదాలు' అంటూ వారి పేర్లు అడిగింది.
వారిలో ఒకతను జవాబు చెప్పాడు.
'నా పేరు శంకర్ సింగ్ వాఘేలా, ఇతడు నా రాజకీయ సహచరుడు నరేంద్ర మోడీ'
(ఈ కధనం పూర్తి పాఠం 01-06-2014 తేదీ హిందూ దినపత్రిక 'ఓపెన్ పేజ్' లో ప్రచురించారు




కామెంట్‌లు లేవు: