3, సెప్టెంబర్ 2021, శుక్రవారం

వై.ఎస్.ఆర్. సంస్మరణ సభ – భండారు శ్రీనివాసరావు

 ఏదైనా క్రతువు, కార్యక్రమం నిర్వహించిన తరవాత దాని నిర్వాహకులు మొదట అనుకునే మాట, ఎంతమందిని పిలిచాం, ఎంతమంది వచ్చారు? ఎవరు రాలేదు అని.

అలానే వై.ఎస్.ఆర్. సంస్మరణ సభకు వెళ్లి వచ్చాను అని తెలిసిన తర్వాత నాకు తెలిసిన వాళ్ళు అడిగింది కూడా ఇదే, ఎవరు వచ్చారు? ఎవరు రాలేదు?
వై.ఎస్. తో అంతో ఇంతో పరిచయం వున్న నా బోటి జర్నలిస్టులు, బాగా చనువు వున్న పాత్రికేయులు, ఆయనతో కలిసి పనిచేసిన అధికారులలో చాలామంది, అలాగే వివిధ రంగాలలో ప్రసిద్ధులైన వాళ్ళు ఈ సభలో కనపడ్డారు. అలాగే, వై.ఎస్.తో చక్కటి అనుబంధం కలిగిన కేవీపీ, ఉండవల్లి అరుణ్ కుమార్, రఘువీరారెడ్డి ఇత్యాదయః.
రానివాళ్ళు ఎవ్వరు అనేదానిపైనే సహజంగా జనాలకు ఆసక్తి. పైగా, పైకి చెప్పకపోయినా, ఇంతో అంతో రాజకీయ వాసనలు కలిగిన సమావేశం కావడంతో ఈ ప్రశ్న చర్చనీయాంశం అయింది. వై.ఎస్. రాజశేఖర రెడ్డి చనిపోయి పన్నెండేళ్లు అయిన తరువాత, ఇప్పుడు, అందులోనూ హైదరాబాదులో ఈ సంస్మరణ సభ ఏమిటి అనేది వినిపించిన మరో ప్రశ్న. ప్రముఖ సంపాదకులు శ్రీ కె. రామచంద్రమూర్తి యాదాలాపంగా చెప్పిన ఓ సమాధానం బాగుంది.
“పన్నెండేళ్లు అంటే పుష్కరం. నదులకు పుష్కరాలు కూడా పన్నెండేళ్లకు ఒకసారి వస్తాయి. వై.ఎస్.ఆర్. కు రైతులు అంటే మహా అభిమానం. పొలాలకు నీళ్ళు అందించాలనే సదుద్దేశ్యంతో ఆయన జలయజ్ఞం పధకాన్నే అమలుచేసారు. గోదావరి, కృష్ణా నదుల అనుసంధానాన్ని తలపెట్టారు. ఆ రోజుల్లో ఆయన్ని అపర భగీరధుడు అన్నారు. ఆయన చనిపోయి పన్నెండేళ్లు గడిచాయి కనుక ఆయన్ని స్మరించుకుంటూ ఈ సభ జరపాలనే ఆలోచన చేసి ఉండవచ్చు”
విషయాలను తేలిగ్గా తీసుకునే వారికి ఈ జవాబు సంతృప్తి కలిగిస్తుంది. కానీ ప్రతిదీ రాజకీయ కోణంలో చూసేవారికి మరికొన్ని సందేహాలు రావడం సహజం. ‘దేవుడు ఎక్కడ ఉంటాడు అని తండ్రి హిరణ్యకశిపుడు అడిగిన ప్రశ్నకు జవాబుగా ‘ఎందెందు వెదకి చూసిన అందందే కలడు’ అంటాడు ప్రహ్లాదుడు. ఈనాడు రాజకీయం చొరలేని ప్రదేశం లేదు. శ్రీహరి వెదికితే కనపడతాడు అని చెప్పాడు ప్రహ్లాదుడు. కానీ నేటి రాజకీయం వెతకకుండానే సర్వత్రా కనిపిస్తుంది.
ఒకప్పుడు అంటే ఉమ్మడి రాష్ట్రంలో వై.ఎస్. ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు చాలామంది రాజకీయ నాయకులు ఆయనతో కలిసి పనిచేశారు. వాళ్ళు ఉభయ రాష్ట్రాల్లోనూ వున్నారు. ఇటు తెలంగాణాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి , అటు ఆంద్రాలో రఘువీరారెడ్డిని మినహాయిస్తే గుర్తించదగిన నాయకులు ఎవ్వరూ ఎందుకు రాలేదు?
అభిమానులు వేరు. రాజకీయ నాయకులు వేరు. అభిమానులకు అధిష్టానాలు వుండవు. కానీ రాజకీయ నాయకులకు అలా కాదు కదా!. పైగా పూర్వం ఉమ్మడి రాష్ట్రంలో వై.ఎస్. మంత్రివర్గంలో వున్న వాళ్ళు, పదవులు అనుభవించిన వాళ్ళు ఇప్పుడు కాలమాన పరిస్థితులకు అనుగుణంగా వేర్వేరు పార్టీల్లో చేరిపోయారు. దానితో వారి అధిష్టానాలు కూడా మారిపోయాయి. కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ తక్కువ అనే అపప్రథ ఉన్నప్పటికీ ఇటువంటి సందర్భాలలో ఆ పార్టీలో మిగిలిన అన్ని పార్టీల కంటే కట్టుబాట్లు మెరుగు అనిపిస్తుంది. దేశానికి అయిదేళ్ళు సుస్థిర ప్రభుత్వాన్ని అందించిన పీ.వీ. అంత్యక్రియలు జ్ఞాపకం ఉన్నవారికి ఇదేమంత పెద్ద విషయం అనిపించదు. నిన్నటి సభ ప్రారంభానికి ముందు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం తరపున వెలువడిన ప్రకటనతో వద్దామని గట్టిగా అనుకుని, వై.ఎస్. అభిమానిగా వెళ్లి తీరతానని అంతకు ముందు టీవీల్లో బల్ల గుద్ది చెప్పిన వాళ్ళు కూడా మొహం చాటేశారు. ఆ పార్టీలో చాలామంది ‘వంగోమంటే పారాడే’ బాపతు.
అయితే, ఆ పార్టీకి చెందిన మాజీ ఎంపీ ఎం.ఏ. ఖాన్, బీజేపీ నుంచి మాజీ ఎం.పీ. జితేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ లు సమావేశానికి వచ్చారు.
అయితే మిగిలిన రాజకీయ పార్టీలు ఇందుకు మినహాయింపు ఏమీ కాదు. కాంగ్రెస్ కనీసం ‘విప్’ లాంటి ఆదేశం అన్నా ఇచ్చింది. ఇతర పార్టీలలో వున్న ఒకప్పటి కాంగ్రెస్ నేతలు ఎలాంటి బహిరంగ ఆదేశాలు లేకపోయినా అధిష్టానం అంతరంగాన్ని వాళ్ళే బేరీజు వేసుకుని తగ్గట్టుగా వ్యవహరించారు.
రాజకీయాల్లో ఎదగాలని అనుకుండేవారికి చాలా వనరులు కావాలి అనేది వాస్తవం. కానీ అక్కరలేనిది మాత్రం ఒక్కటే.
అది ‘మనసు’.



(03-09-2021)

కామెంట్‌లు లేవు: