కాకతాళీయం కావచ్చు. కానీ ఇలాంటివి మనసుకు స్వాంతన కలిగిస్తాయి. దామోదరం సంజీవయ్య
గారి గురించి నేను ఏనాడో రాసుకున్న జ్ఞాపకాన్ని సుప్రీం కోర్టు సీనియర్ మోస్ట్
న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నోటి వెంట వెలువడడం నిజంగా సంతోషం కలిగించే విషయమే!
దామోదరం సంజీవయ్య గారు - ఓ జ్ఞాపకం -
భండారు శ్రీనివాసరావు
అప్పుడు జవహర్ లాల్ నెహ్రూ ప్రధాన
మంత్రి.
ఆనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి
ముఖ్యమంత్రిగా ఉన్న నీలం సంజీవరెడ్డి ఆ పదవికి రాజీనామా చేసారు. ఆయన స్థానంలో
దామోదరం సంజీవయ్యను ముఖ్యమంత్రిగా నియమించాలని నెహ్రూ నిర్ణయించారు. అగ్రకులాల
ఆధిపత్యం అధికంగా ఉన్న రాష్ట్ర కాంగ్రెస్ లోని
కొందరు నాయకులు ఒక దళితుడు ముఖ్యమంత్రి కావడాన్ని సహించలేక పోయారు. సంజీవయ్య అవినీతిపరుడని, అక్రమంగా లక్షలాది రూపాయలు
కూడబెట్టారని అధిష్టానానికి అనేక ఫిర్యాదులు వెళ్లాయి. సంజీవయ్య నీతి, నిజాయితీ తెలిసిన నెహ్రూ ఆ ఫిర్యాదులను
కొట్టి పారేశారు. అయినా, రాష్ట్ర
కాంగ్రెస్ నాయకులు మొండిపట్టు పట్టారు.
నెహ్రూ ఓ నాయకుడిని ఆంధ్రాకు వెళ్లి
సంజీవయ్య మీద రహస్య విచారణ చేసి నివేదిక ఇవ్వమని కోరారు. ఆయన హైదరాబాద్ వచ్చి అప్పటి
కాంగ్రెస్ యువనాయకుడు చక్రపాణి గారిని కలిసి వచ్చిన పని చెప్పారు. సంజీవయ్య గారి గూర్చి బాగా తెలిసిన చక్రపాణిగారు నిర్ఘాంతపోయి ఆ నాయకుడిని
చివాట్లు పెట్టారు. కానీ ప్రధాని ఆదేశం. చేసేది లేక ఢిల్లీ
నాయకుడిని వెంటబెట్టుకుని కారులో సంజీవయ్య గారి గ్రామానికి వెళ్లారు. గ్రామ పొలిమేరలలో ఒక పూరి పాక ముందు కారు ఆపారు చక్రపాణి. ఆ పాక బయట ఒక వృద్ధురాలు కట్టెల పొయ్యిపై మట్టి కుండతో అన్నం వండుతున్నది. పొగగొట్టంతో మంటను ఊదుతూ చెమటలు కక్కుతున్నది. "ఏమిటి ఇక్కడ ఆపారు?" ప్రశ్నించాడు ఢిల్లీ నేత.
"సంజీవయ్య గారి ఇల్లు ఇదే. ఆ వృద్ధురాలు
ఆయన అమ్మగారు. కారు దిగండి" అన్నారు చక్రపాణి. నాయకుడు
నివ్వెరపోయాడు. చక్రపాణి ఆమెకు నమస్కరించి
"అమ్మా...ప్రస్తుతం మంత్రి గా ఉన్న మీ
అబ్బాయి రాష్ట్ర ముఖ్యమంత్రి కాబోతున్నారు" అన్నారు.
ఆమె చెమటలు తుడుచుకుంటూ "అయితే మా వాడి జీతం ఏమైనా పెరుగుతుందా నాయనా! ఈ కట్టెల పొయ్యి మీద వంట
చెయ్యడం కష్టంగా ఉంది. ఒక బొగ్గుల కుంపటి కొనిపెట్టమని
ఎన్నాళ్ళ నుంచో అడుగుతుంటే, డబ్బులు లేవు అంటున్నాడు" అన్నది.
నాయకుడి నోట్లోంచి మాట రాలేదు. "సార్.. గ్రామం లోకి వెళ్లి విచారణ చేద్దామా?" అడిగారు
చక్రపాణి. "అవసరం లేదు. కారును హైద్రాబాద్ కు పోనీయండి" అన్నాడు నాయకుడు.
ఆ తరువాత వారం రోజుల్లో సంజీవయ్య
ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి అయ్యారు.
(05-04- 2021)
2 కామెంట్‌లు:
నెహ్రూ మార్కు దొరతనం-కాంగ్రెస్ మార్కు డెమక్రసీ
నెహ్రూ మార్కు దొరతనం? How?
కామెంట్‌ను పోస్ట్ చేయండి