25, ఏప్రిల్ 2021, ఆదివారం

మృదు భాషణకు మారుపేరు జస్టిస్ రమణ

 (Published in both Andhra and Telangana editions of Andhra Prabha today, 25-04-2021)

అవి నేను మాస్కో నుంచి వచ్చిన కొత్త రోజులు. సంజీవ రెడ్డి నగర్ లో ఉంటున్న మా మాస్కో మిత్రుడు ఒకరిని కలవడానికి వెళ్లి అక్కడికి దగ్గరలోనే  జస్టిస్ రమణ ఇల్లు వుందని జ్ఞాపకం వచ్చి ఫోన్ చేశాను. అప్పుడే హైకోర్టు నుంచి వచ్చినట్టున్నారు. వేరెవరో కాకుండా ఆయనే స్వయంగా ఫోన్ రిసీవ్ చేసుకున్నారు. పలానా అని చెప్పి ఇప్పుడు కలవడానికి  వీలుపడుతుందా అని అడిగాను. ‘భలే వాళ్ళే రండి. చాలా రోజులయింది కలిసి అంటూ ఆప్యాయంగా ఆహ్వానించారు. వెళ్లి కలిసాను. అంతకు ముందు పెద్ద పరిచయమేమీ లేదు. అయినా  ఆయన పలకరించిన తీరు అదీ నేను ఇప్పటికీ మరిచిపోలేను. అప్పటికే ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు  తాత్కాలిక ప్రధాన  న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు.  నేను రేడియో విలేకరిని మాత్రమే. ముందు అప్పాయింట్ మెంటు తీసుకోకుండా కలవ్వచ్చా  అని నేను ఆలోచించలేదు. చిత్రం ఏమిటంటే,  ముందుగా చెప్పాపెట్టకుండా  నన్ను కలవడానికి ఆయన కూడా  తటపటాయించ లేదు. భేషజాలు లేని మనిషి అనిపించింది.

మనిషి ఆకారం చిన్న. కానీ చేసిన ఉద్యోగాలు పెద్ద హోదా కలిగినవి. అయినా నిరాడంబరంగా వుండడం మరింత విచిత్రం.  ఆయనతో  గడిపింది కాసేపే అయినా హాయిగా మాట్లాడారు. మాస్కో జీవితం గురించి అడిగారు. పుస్తకాలు అంటే రమణ గారెకి చాలా చాలా  ఇష్టం  అని అప్పుడే తెలిసింది. తెలుగు అంటే మరెంతో ఇష్టం అని కూడా.

తరవాత కలవడం అనేది చాలా ఏళ్ళ తరువాత జరిగింది. హిందూ రెసిడెంట్ ఎడిటర్, కీర్తిశేషులు హెచ్. జే. రాజేంద్ర ప్రసాద్ రాసిన పాత్రికేయ అనుభవాల పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమంలో  జస్టిస్ రమణను  మరోసారి కలిసే అవకాశం లభించింది. అప్పటికి ఆయన  ఢిల్లీ   హైకోర్టు  ప్రధాన న్యాయమూర్తి.

ఏదో మొక్కుబడి ప్రసంగం  కాకుండా రాజేంద్ర ప్రసాద్ రాసిన పుస్తకం గురించి, ఆయన గురించి లోతుల్లోకి వెళ్లి మాట్లాడారు. తెలుగులో ఆయన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది.  ఒక సీనియర్ పాత్రికేయుడి పుస్తకం కాబట్టి ఆవిష్కరణ కార్యక్రమానికి దేవులపల్లి అమర్ మొదలయిన సీనియర్ జర్నలిస్టులు చాలామంది హాజరయ్యారు. జస్టిస్ రమణ తన ప్రసంగంలో ఆ మాట కూడా చెప్పారు. ఇంతమంది  జర్నలిస్ట్  మిత్రులను కలుసుకోవచ్చనే ఉద్దేశ్యంతోనే తను ఈ కార్యక్రమానికి వచ్చినట్టు చెప్పారు. సభికులలో కూర్చుని వున్న జర్నలిస్టులను ఆయన పేరు పెట్టి ప్రస్తావించడం మరింత ఆశ్చర్యం అనిపించింది. బహుశా న్యాయవాద వృత్తిలోకి రాకపూర్వం కొన్నాళ్ళు ఓ ప్రముఖ  తెలుగు వార్తా పత్రికలో పనిచేసిన అనుభవం వల్ల కావచ్చు, జస్టిస్ రమణకు జర్నలిస్టులు అంటే సానుకూల భావం.

నిజానికి న్యాయమూర్తులకు, పాత్రికేయులకు చుక్కెదురు. పత్రికల వారితో ముచ్చటించే విషయాలు వారికి ఆట్టే వుండవు. కానీ జస్టిస్ రమణ  ఆ రోజు ఆయన అనుకున్న సమయానికి మించి ఎక్కువసేపు అక్కడ గడిపారు. ప్రోగ్రాం ముగిసిన తరువాత కూడా జర్నలిష్టులతో  మాటామంతి కొనసాగించారు.

తక్కువ మాట్లాడడం, మాట్లాడిన నాలుగు ముక్కలూ మృదువుగా మాట్లాడడం, వాటిల్లో వ్యంగ్యం లేకపోవడం, అన్నింటికీ మించి ఆధిక్యతా ధోరణి రవంత కూడా  కనబడకపోవడం జస్టిస్ రమణకున్న సహజ  లక్షణాలని ఆయన్ని ఎరిగున్న ఎవరైనా ఇట్టే చెప్పగలరు.

ఇప్పుడాయన దేశ సర్వోన్నత న్యాయస్థానానికి సర్వోన్నత న్యాయమూర్తి. ఒక తెలుగు వ్యక్తి అంతటి అత్యున్నత స్థానానికి ఎదగడం తెలుగువారందరికీ గర్వకారణం. (EOM)






     

కామెంట్‌లు లేవు: