17, ఏప్రిల్ 2021, శనివారం

కాళ్ళు పట్టుకున్నాకే ఉద్యోగం

 ఓ నలభయ్  ఏళ్ళ క్రితం, మా పెద్దన్నయ్య భండారు పర్వతాల రావు గారు విజయవాడ పౌర సంబంధ శాఖలో ఉద్యోగం చేస్తున్న రోజుల్లో అనేక మంది నిరుద్యోగులు గెజిటెడ్ ఆఫీసర్ సంతకం కోసం ఆయన దగ్గరకు వస్తుండేవారు.

అలా వచ్చిన వాళ్ళలో ఒక వ్యక్తి మా స్వగ్రామం పక్కనే మరో ఊరివాడు కావడంతో కాస్త చనువు తీసుకుని తను చదువుకున్న డిగ్రీ చదువుకు ఏదైనా ఉద్యోగం ఇప్పించమని అడిగాడు. వాళ్లది ఒకప్పుడు కలిగిన మోతుబరి కుటుంబమే. ఊళ్ళో  తగువుల్లో ఇరుక్కుని కోర్టు ఖర్చులు, లాయర్ల ఫీజులకోసం ఆస్తి హారతి కర్పూరంలా కళ్లెదుటే కరిగిపోయింది.  దాంతో కుటుంబ పోషణకు ఏదో ఒక ఉద్యోగం అవసరమయ్యింది.

మా అన్నయ్య ఆ కుర్రాడితో అంటుంటే విన్నాను.

‘సరే! ఎవరికైనా చెప్పి చూస్తాను. కానీ నాది ఓ సలహా. సర్కారు ఉద్యోగంలో పై మెట్టు ఎక్కడం నీ చేతుల్లో లేదు. కానీ ప్రైవేటు రంగంలో శ్రద్ధ పెట్టి పని చేస్తే  మంచి అవకాశాలు వుంటాయి. ఇంత ఎందుకు? నువ్వు ఏ  సంస్థలో చేరినా దానికి అధిపతి అయ్యేంత కసి పెట్టుకుని పనిచేయాలి. అప్పుడు ఆకాశమే హద్దు”

ఈ మాటలు ఏమి అర్ధం అయ్యాయో తెలియదు కానీ ఆ కుర్రాడు తల ఊపాడు.

మా అన్నయ్య అతడ్ని ఓ చెప్పుల దుకాణానికి తీసుకు వెళ్ళాడు, అక్కడ ఏదైనా పని ఇప్పిద్దామని. ఆ షాపు ఓనరు అతడ్ని ప్రశ్నలు ఏమీ అడగలేదు కానీ, ఆ కుర్రాడిని ఎగాదిగా చూస్తూ,  తన కాళ్ళు పట్టుకొమన్నాడు. అతడు ఏమాత్రం సంకోచించకుండా ఓనరు కాళ్ళు పట్టుకున్నాడు.

‘సహభాష్!  నాకు ఇలాంటి కుర్రాడే కావాలి. చెప్పుల షాపులో ఉద్యోగం చేసేవాడు వచ్చిన ప్రతివాడి కాళ్ళు పట్టుకోవాలి. పట్టుకోను అని భేషజాలకు పొతే ఇక్కడ కుదరదు” అని అతడ్ని వెంటనే పనిలో పెట్టుకున్నాడు.

కొన్నేళ్ళు గడిచాయి. ఆ కుర్రాడు సొంతంగా షాపు పెట్టుకుని తర్వాత రోజుల్లో ఓ   షూకంపెనీ తెరిచి మా అన్నయ్యను పిలిచాడు.

బహుశా, ప్రైవేటు రంగంలో అవకాశాలను ఎలా అంది పుచ్చుకోవాలో అనే విషయంలో గతంలో  మా అన్నయ్య చెప్పిన  మాటలను ఆ కుర్రాడు చాలా సీరియస్ గా తీసుకున్నట్టున్నాడనిపించింది.      

కామెంట్‌లు లేవు: