12, ఏప్రిల్ 2021, సోమవారం

సత్యం రామలింగరాజు రాయని డైరీ!

 

ఈరోజు అంటే ఈరోజని కాదు. ఆరేళ్ల క్రితం ఇదే రోజున సాక్షిలో ఒక కధనం వచ్చింది. ఒక పేరా బాగా నచ్చింది.
సాక్షి కధనంలో సత్యం రామలింగ రాజు చెప్పిన కొన్ని భాగాలు:
".....పేరు కోసం పరుగు, పేరు నిలుపుకోవడం కోసం పరుగు. పరువు గురించి పట్టించుకోలేనంత పరుగు. చివరకు ఇక్కడ (చెర్లపల్లి జైలు) వరకు తెచ్చిన పరుగు..."
"...ఈ మనసు, ఈ శరీరం ఇప్పటికే అలవాటు పడ్డాయి, ఒక్క టీవీకి తప్ప. జైలుకు వచ్చీ రాగానే అధికారులను అభ్యర్ధించాను, టీవీ లేని బ్యారక్ లోకి మార్చమని. సాధ్యం కాదన్నారు. టీవీ లేని బ్యారక్స్ జైల్లో లేవట. కానీ దేవుడు దయ తలిచాడు. ఓ బ్యారక్ లో టీవీ పనిచేయడం లేదు. నన్ను అందులోకి మార్చారు. అంతకన్నా అదృష్టం ఉంటుందా!"
"మానస సరోవరంలో దోమలు ఉంటాయా?! ‘‘ఇక్కడవి మామూలే’’ అని, అతి మామూలుగా అన్నాడు జైలు వార్డెన్. వెనకా ముందూ అతడు నాకేం గౌరవాలు తగిలించలేదు. ఖైదీలకు కనీస సంబోధనా పూర్వక మానవ మర్యాదలను ఆశించే హక్కు ఉంటుందా? ఆ మర్యాదలను ఇచ్చే అవసరం వార్డెన్‌కు ఉండాల్సిన అవసరం లేకుండా ఉంటుందా? చట్టంలో ఎలా ఉందో మరి. అయినా గౌరవ మర్యాదలతో ముఖ విలువను, వాటావిలువను పెంచుకోవలసిన కంపెనీలు ఇప్పుడు నా చేతిలో ఏమున్నాయి కనుక. ముందు సీబీఐ ఇచ్చిన ఈ స్పైరల్ బౌండు కేసు పూర్వాపరాల కాపీలో ఏముందో చూడాలి. దీన్ని చదివి, అర్థం చేసుకునేందుకు ఏడేళ్ల కాలం సరిపోతుందా! ఇంటి నుంచి తెచ్చుకున్న పుస్తకాలు.. వాటినెప్పుడు చదవాలి?
"నేనున్నది మానస సరోవర్ బ్లాకు. దోమలు ఉత్సాహంగా గుయ్యిమంటున్నాయి. కొత్త ఖైదీని దొరికాను కదా! మస్కిటో కాయిల్ తెప్పించి వెలిగించుకున్నాను. దోమలకు ముందుగా నేను అలవాటు పడతానా లేక మస్కిటో కాయిల్స్ అలవాటవుతాయా అన్నది త్వరలోనే తేలిపోవచ్చు. ఇది కోర్టులు నిర్ణయించే విషయం కాదు కాబట్టి.
"ఒకరోజు గడిచింది. చంచల్‌గూడా జైలుకు, చర్లపల్లి జైలుకు నాకేం పెద్ద తేడా కనిపించడం లేదు. అక్కడి స్పెషల్ కేటగిరీ, ఇక్కడి సాధారణ ఖైదీగిరీ రెండూ ఒకేలా ఉన్నాయి. జీవితంలోని ఎత్తుల్నీ, పల్లాల్నీ చూసినవాడికి బిర్యానీ అయితే ఏమిటి? మిర్యాల చారు అయితే ఏమిటి? నా డ్రెస్ నేను వేసుకుంటే ఏమిటి? జైలువాళ్లిచ్చే తెల్ల చొక్కా పైజమా అయితే ఏమిటి?
"ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి కిచిడి. మధ్యాహ్న భోజనంలోకి చపాతీ, అన్నం, పప్పు, రసం, అప్పడం. రాత్రి డిన్నర్‌లోకి మళ్లీ ఇదే వరుస. కానీ ఇక్కడ లంచ్‌టైమ్‌లో లంచ్, డిన్నర్‌టైమ్‌లో డిన్నర్ ఇలా కాదు. పావు తక్కువ తొమ్మిదికి బ్రేక్‌ఫాస్ట్ అయ్యాక.. పదిన్నరకి లంచ్. సాయంత్రం నాలుగింటికి డిన్నర్! సత్యం రోజులు గుర్తొస్తున్నాయి. ఉదయం ఇంత తిని, మధ్యాహ్నం తిన్నాననిపించి, సాయంత్రం తినీతినకుండా, రాత్రి తింటే తిని... ఎంత అక్రమబద్ధంగా గడిచాయి!
"ఈ మనసు, శరీరం అన్నిటికీ అలవాటు పడ్డాయి. టీవీకి తప్ప! జైలుకు వచ్చీరాగానే జైలు అధికారులను అభ్యర్థించాను నన్ను టీవీలేని బ్యారక్‌లోకి మార్చమని. సాధ్యం కాదన్నారు. టీవీ సెట్ లేని బ్యారక్సే జైల్లో లేవట! కానీ దేవుడు దయతలిచాడు. ఓ బ్యారక్‌లో టీవీ పనిచేయడం లేదు. నన్ను అందులోకి మార్చారు. ఇంతకన్నా అదృష్టం ఉంటుందా?" (12-04-2015)
NOTE: ప్రతి మనిషిలో పైకి కనపడని ఓ కవి హృదయం వుంటుంది. స్వయంగా నిర్మించుకున్న అతి పెద్ద వ్యాపార సామ్రాజ్యంలో క్షణం తీరిక లేకుండా గడిపిన రాజుగారిలోని కవిని, రచయితను ఈ వ్యాసంలో చూడవచ్చు. తన మనసులోని మాటను అభివ్యక్తీకరించిన తీరు నన్ను విశేషంగా ఆకట్టుకోవడమే దీన్ని పదిలంగా దాచుకోవడానికి కారణం.
రామలింగరాజు గారికి కృతజ్ఞతలతో

కామెంట్‌లు లేవు: