ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం
భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్
‘న గాయత్ర్యాః పరం
మంత్రం నమాతు: పరదైవతం’ అన్నది జగత్ప్రసిద్ధమయిన వృద్ధవచనం
గాయత్రిని మించిన మంత్రం లేదు. తల్లిని మించిన దైవం
లేదు.
ఆదిశంకరాచార్యులు తమ భాష్యములో ఈ మంత్ర
ప్రాశస్త్యాన్ని వివరిస్తూ ‘గయాన్ త్రాయతే ఇతి గాయత్రీ’ అని పేర్కొన్నారు. ‘గయలు’
అంటే ప్రాణములు అని అర్ధం. అలాగే ‘త్రాయతే’ అంటే కాపాడడమని భావం. కాబట్టి
ప్రాణాలను రక్షించే మంత్రం గాయత్రి మంత్రమని శంకర భాష్యం.
ఈ మంత్ర శక్తిని గుర్తించిన వాడు కనుకనే వాల్మీకి
మహర్షి తన రామాయణ రచనలో గాయత్రి మంత్రంలోని బీజాక్షరాలను చక్కగా ఉపయోగించుకోవడం
జరిగిందన్నది పండిత ప్రకర్షుల ఉవాచ. రామాయణంలోని ప్రతి వేయి శ్లోకాలకు ఆరంభంలోనే
ఒక్కొక్క గాయత్రి మంత్రాక్షరాన్ని చేర్చి ఇరవై నాలుగు అక్షరాలతో మొత్తం ఇరవై
నాలుగువేల శ్లోకాలతో రామాయణాన్ని పూర్తిచేశారని ప్రతీతి.
గాయత్రి మంత్రంలోని ప్రతి అక్షరం ఒక బీజాక్షరం
మాత్రమే కాక మహా మహిమాన్వితమైనదన్నది మన పూర్వీకుల నమ్మకం. ఈ మంత్రంలోని ప్రతి
పదానికి ఒక అర్ధం వుంది. ఒక పరమార్ధం వుంది. దీన్ని జపించడం ద్వారా సమస్త దేవతలను
స్తుతించినట్టు కాగలదని పెద్దల భావన.
గాయత్రి మంత్రాన్ని శాస్త్రీయ కోణంలో నుంచి
పరిశీలించినా అందులో ఎన్నో అంశాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. సాంప్రదాయిక అనుసరణలలో ఈ
మంత్రంలో దాగున్న శాస్త్రీయ ప్రాధాన్యత కొంత మరుగునపడిపోయిందనే అనుకోవాలి.
ఆధునిక ఖగోళ శాస్త్రం చెబుతున్నదాని ప్రకారం మన
నక్షత్ర మండలాన్ని పాలపుంత లేక ఆకాశ గంగ అంటారు. ఈ పాలపుంతలో మన భూమండలం కంటే
లక్షల రెట్లు పెద్దవయిన లక్షల నక్షత్రాలు వున్నాయి.
ఈ నక్షత్రాలన్నీ మనకు నిత్యం కనబడే సూర్యుడి లాంటివే.
మళ్ళీ ఇందులో ఒక్కో నక్షత్రానికి మళ్ళీ ఒక్కో సౌరమండలం వుంది. చంద్రుడు భూమిచుట్టూ
తిరుగుతుంటే, ఆ
చంద్రుడితో పాటు భూమి సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తూ వుంటుంది. ఈ విధంగానే నక్షత్ర మండలంలోవున్న
లక్షలాది గ్రహాలన్నీ తమ నిర్దేశిత కక్ష్యలో గతితప్పక పరిభ్రమిస్తుంటాయి.
మనకు నిత్యం గోచరమయ్యే సూర్యుడు తన సౌర కుటుంబం లోని
ఇతర గ్రహాలతో కలసి పాలపుంతల కేంద్ర స్తానాన్ని ఒక్కసారి చుట్టి రావాలంటే ఇరవై
రెండు కోట్ల యాభయ్ లక్షల సంవత్సరాల కాలం పడుతుంది. ఈ అనంత విశ్వంలో ఈ పాల పుంతలు
పరిభ్రమిస్తున్న వేగం గమనిస్తే కళ్ళు తిరగక మానవు. సెకనుకు ఇరవై వేల మైళ్ల వేగంతో
అవి కదులుతున్నాయంటే ఓ పట్టాన నమ్మడం కష్టం.
ఈ నేపధ్యాన్ని దృష్టిలో వుంచుకుని గాయత్రీ మంత్రాన్ని
శాస్త్రీయ కోణం నుంచి పరిశీలిద్దాం.
• ఓం భూర్భు వస్వః -
భూర్ అంటే భూమి, భువః
– అంటే గ్రహాలు (సౌర కుటుంబం) స్వః - అంటే అసంఖ్యాక నక్షత్రాలతో కూడిన పాలపుంత
(గెలాక్సీ)
ఇక్కడ ఓ చిన్న వివరణ – మనం ఇళ్ళల్లో వాడుకునే సీలింగ్
ఫాన్ రెక్కలు నిమిషానికి తొమ్మిదివందల సార్లు తిరుగుతాయి. ఆ వేగానికే అది చేసే
చప్పుడు ఎలావుంటుందో అందరికీ అనుభవైకవేద్యమే. అలాటిది, ఈ అనంత విశ్వంలో
అంతులేని సంఖ్యలో గెలాక్సీలు సెకనుకు ఇరవై వేల మైళ్ల వేగంతో పరిభ్రమిస్తున్నప్పుడు
ఉద్భవించే శబ్దం ఏవిధంగా వుంటుందన్నది ఊహాతీతం.
గాయత్రి మంత్రంలో చెప్పిన - ఓం భూర్భుస్వః – అనే ఈ
బీజాక్షరాలు – ఈ చరాచర విశ్వంలోని గ్రహరాసులన్నీ కలసి తమ పరిభ్రమణ సమయంలో
సృష్టిస్తున్న మొత్తం ధ్వని ఓంకారాన్ని పోలివున్నదన్న వాస్తవాన్ని
తెలియచేస్తున్నాయి.
సృష్టికి ప్రతి సృష్టి చేయ సంకల్పించిన విశ్వామిత్ర
మహర్షి తపో దీక్షలో వున్నప్పుడు ఈ ధ్వనిని విని తన తోటి మునులకు దానిని గురించి తెలియచేసాడని
ఐతిహ్యం. అప్పుడు వారందరూ కలసి ఈ ధ్వనికి ‘ఓం’ అని నామకరణం చేశారు. త్రికాలాల్లో
వినవచ్చే శబ్దం కనుక భగవంతుడి పేరు మీద ఆ ధ్వనికి ఓం అని పేరు పెట్టారు.
కాబట్టి నిరాకారుడు,నిర్గుణుడు అయిన ఆ పరమేశ్వరుడుకి ఒక నిర్దిష్ట నామం
ప్రసాదించడం అన్నది మొదటిసారి జరిగిందని విశ్వాసుల విశ్వాసం. అప్పటిదాకా
భగవంతుడికి ఒక రూపం అంటూ ఏమీ లేదని అందరు నమ్ముతూ
వచ్చారు. అందుకే ఈ కొత్త వాస్తవాన్ని ఒక పట్టాన నమ్మడానికి ఎవరూ ముందుకు రాలేదు.
గీతాకారుడు కూడా అదే చెప్పాడు. “ ఓం ఏకాక్షరం బ్రహ్మ”
అంటే ఈ అనంత కోటి బ్రహ్మాండ నాయకుడి ఏకాక్షర నామమే ఓం.
అందుకే, ఋషులు ఈ శబ్దానికి ఉద్గితి అని కూడా పేరు పెట్టారు.
అంటే స్వర్గం నుంచి వెలువడే సంగీత ఝరి అన్నమాట.
ఋషులు మరో విషయం కూడా కనుక్కున్నారు. అదేమిటంటే అనంత
విశ్వంలో సెకనుకు ఇరవై వేలమైళ్ళ వేగంతో పరిభ్రమిస్తున్న గెలాక్సీలన్నీ కలిపి ½ MV2 కైనెటిక్ ఎనర్జీ ని
ఉత్పత్తి చేస్తున్నాయి. అంటే తద్వారా చరాచర విశ్వం లోని గ్రహరాసులన్నీ కలిపి
వినియోగిస్తున్న ఎనర్జీ ఏదో ఒక మేరకు సమతుల్యం కావడానికి ఇది దోహద పడుతోంది.
దీన్నే గాయత్రిలో ప్రణవంగా పేర్కొన్నారు. అంటే గెలాక్సీలన్నీ కలసి ఉత్పత్తిచేసే
ఎనర్జీకి స్టోర్ హౌస్ వంటిదన్నమాట.
తత్స వితుర్వరేణ్యం
తత్ అంటే ఆ (భగవంతుడు) సవితుర్ అంటే సూర్యుడు
(నక్షత్రం) వరేణ్యం అంటే వందనానికి, గౌరవానికి అర్హత కలిగివుండడం.
ఒక వ్యక్తి రూపం, పేరుతొ సహా తెలిసినప్పుడు ఆ వ్యక్తిని చూడగానే పలానా
అని అవగతమవుతుంది. రూపం, నామం
రెండూ తెలవడం మూలాన నిరాకారుడయిన ఆ దేవదేవుడిని గుర్తించడానికి సరయిన పునాది
దొరుకుతుందని విశ్వామిత్ర మహర్షి వాక్రుచ్చాడు.
ధ్వని ద్వారా (ఓంకార నాదం) కాంతి ద్వారా (సూర్యుడు, నక్షత్రాలు) మనకు
తెలియని, మనకు
కనబడని నిరాకారుడయిన భగవంతుడిని అర్ధం చేసుకోవచ్చు అని విశ్వామిత్ర మహర్షి
చెప్పాడు.
ఇది యెలా అంటే- ఒక గణిత శాస్త్రజ్ఞుడు x2+Y2=4; if x=2 అనే
కఠినమైన లెక్కకు ఇట్టే జవాబు చెప్పగలుగుతాడు. అలాగే, ఒక ఇంజినీర్ నది వొడ్డున నిలబడి తనవద్దవున్న ఉపకరణాల
సాయంతో ఆ నది వెడల్పును అంచనా వేయగలుగుతాడు. వారి వారి రంగాలలో వారికున్న
నైపుణ్యాన్ని బట్టి అది సాధ్యం అని ఎవరయినా ఒప్పుకుంటారు. విశ్వామిత్రుడు మనకు
చెప్పింది ఇదే.
గాయత్రి మంత్రం లోని తరువాయి భాగాన్ని ఇలా అర్ధం
చేసుకోవచ్చు.
భర్గో దేవస్య ధీమహి
భర్గో అంటే కాంతి; దేవస్య అంటే దేవత; ధీమహి అంటే ఉపాసించడం.
అందుబాటులో వున్న రూపంలో (సూర్య కాంతి) నిరాకారుడయిన
భగవంతుడుడిని కనుగొనవలసిందని విశ్వామిత్రుడు మానవాళికి బోధించాడు. ఓంకారాన్ని
జపిస్తూ
దేవుడిని పూజించాలని కూడా ఆయన చెప్పారు.
ఆయన చేసిన బోధ వినడానికి బాగానే వుంది. కానీ
ఎల్లప్పుడు చంచలంగా వుండే
మనసుకు ఇది సాధ్యపడే పనేనా. అందుకే భగవంతుడిని
ధ్యానించే విధానం కూడా గాయత్రి మంత్రంలో వుందని ఆ మహర్షే తెలియచేసాడు.
దియోయోనః ప్రచోదయాత్
ధియో (మేధావి), యో (ఎవరయితే),నః (మనమంతా), ప్రచోదయాత్ ( సరయిన తోవలో నడిపించే మార్గదర్శి) ఓ
భగవంతుడా! సరయిన మార్గంలో నడిచేవిదంగా మా మేధస్సు మాకు ఉపయోగపడేలా చేయి.
ఈ నేపధ్యంలో గాయత్రి మంత్రాన్ని శాస్త్రీయ దృక్పధంలో
చూసినట్టయితే అందులోని భావం ఇలా వుంటుంది.
భూమి(భుర్) గ్రహాలు (భువః) గెలాక్సీలు (స్వాః)
అపరిమితమయిన వేగంతో సంచరిస్తున్నాయి. అవి ఆ క్రమంలో కనీ వినీ ఎరుగని ధ్వనికి
కారణమవుతున్నాయి. నిరాకారుడయిన భగవంతుడుకి మరో రూపమే ఆ ధ్వని. దాని పేరే ఓం. ఆ
(తత్) భగవంతుడే లక్షల కోట్ల సూర్యుల కాంతి (సవితుర్) రూపంలో తిరిగి
ప్రభవిస్తున్నాడు. అలాటి దేవదేవుడు మన ఆరాధనకు (వరేణ్యం)అర్హుడు.
కాబట్టి, మనమందరం ఆ దేవతారూపమయిన (దేవస్య) కాంతి (భర్గో) ని
ధ్యానించాలి. అదే సమయంలో ఓంకారనాదంతో కూడిన భజనలు చేయాలి. (యో) అట్టి భగవానుడు మనం
సరయిన మార్గంలో (ప్రచోదయాత్) నడవగలిగే విధంగా మన (నః) మేధస్సు (ధియో) ఉపయోగపడేలా
చేయాలి.
ఆనో భద్ర క్రతవో యన్తు విశ్వతః –రిగ్వేద
(అన్ని దిక్కులనుంచి
మంచి ఆలోచనలు నాలోకి ప్రవేశించు గాక)
1 కామెంట్:
Many thanks for the insightful explanation. One of the best I have come across.
కామెంట్‌ను పోస్ట్ చేయండి