1, ఏప్రిల్ 2021, గురువారం

లీకు వీరులు – భండారు శ్రీనివాసరావు

 ఇది రాసే ముందు జర్నలిజం ప్రొఫెషనల్ ఎథిక్స్ గురించి ఆలోచిస్తూ కాసేపు  తటపటాయించాను. కానీ ఈరోజుల్లో అవి కలికానికి కూడా కనపడడం లేదని గుర్తుకొచ్చి మళ్ళీ కంప్యూటర్ ముందు కూర్చొన్నాను.

ఇటు రాజకీయులకు, అటు జర్నలిస్టులకు లీకులు అనేవి కొత్తవి కావు. వారిరువురి నడుమా బంధాలు, అనుబంధాలు పెనవేసుకుని పోవడానికి బాగా తోడ్పడేవి నిజానికి లీకులే. పొగడ్తలతో కూడిన గొప్ప వార్తలు, వ్యాసాలు రాయడానికి చాలామంది వుంటారు. రాజకీయ ప్రయోజనాలకోసం కొన్ని కట్టుడు కధలు పత్రికల్లో/ మీడియాలో రావడం వాళ్లకి ప్రధానం.

అయితే ఈ కధనాలు వాళ్ళు చెప్పినట్టే రావాలి కానీ వాళ్ళు చెప్పినట్టు ఎక్కడా బయటకి రాకూడదు. అలా బయటకు వచ్చిన లీకులపై విస్తృతంగా చర్చ జరిగిన పిమ్మట ‘ఆ వార్తలు మీడియా సృష్టి, నాకేమీ సంబంధం లేదు అని ఖండన ఇచ్చుకునే విధంగా వుండాలి. అలా అని ఆ వార్తలో పూర్తిగా  నిజం వుండకూడదనీ కాదు. అలా అని అసలు నిజం లేదనీ కాదు.  ఆ లీకు వీరుడి పేరు ఎటువంటి పరిస్థితుల్లో  వెల్లడి కారాదు. (సోర్స్  చెప్పాల్సిన  అవసరం మాకు లేదు’ అనే unwritten హక్కు గురించి మాట్లాడేది ఇలాంటి సందర్భాలలోనే). ఇన్ని షరతులతో లీకులు బయటకి వస్తాయి కాబట్టే వాటికి అంతటి డిమాండ్.

ఇంతకీ ఈ లీకులు ఏమిటి? ఎలా పురుడు పోసుకుంటాయి?

ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించేరోజుల్లో అధికార పక్షంలోని అసంతృప్తులే ఈ లీకుల్ని విలేకరులకు ఉప్పందించేవారు. ఆ తరువాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ సాంప్రదాయం కొనసాగుతూనే వచ్చింది. తదనంతర కాలంలో ఇవి పతాక స్థాయికి చేరి ఏది నిజమో ఏది అబద్ధమూ తెలియనంతగా మారిపోయి పాత్రికేయ ప్రమాణాలను, విశ్వసనీయతను దెబ్బతీసే విధంగా విశ్వరూపం దాలుస్తున్నాయి.

ముఖ్యమంత్రుల కార్యాలయాల్లో పనిచేసే పౌర సంబంధాల అధికారులు ఈ లీకు వ్యవహారాలను చూస్తుంటారు. అల్లాగే మంత్రుల దగ్గర పనిచేసేవాళ్ళు.

ఒక ఉదాహరణ చెప్పుకుందాం.

ఓ ఉదయం (అప్పటికి మీడియా విస్తృతి ఇంత లేదు. పత్రికలే రాజ్యం చేస్తున్నాయి, ఇప్పటికీ వాళ్ళదే రాజ్యం. అందుకే పలానా పత్రిక కావాలని రాసింది అని రాజకీయులు అంటుంటారు. ప్రింటులో వచ్చే వార్త ఖచ్చితం అని నమ్మేవారు ఉండడమే ఇందుకు కారణం) ఓ పత్రికా విలేకరికి  ముఖ్యమంత్రి కార్యాలయంలోని సోర్స్ నుంచి ఫోన్ వస్తుంది. సంభాషణ ఇలా నడుస్తుంది.

‘ఏమిటి సంగతులు ఏమైనా కొత్త విషయాలు ఉన్నాయా!’

‘మా దగ్గర వార్తలు ఏముంటాయి? మీరిస్తేనే కదా మాకు వార్తలు

‘అలా అంటావు కానీ మీరు రాసేవే మాకు వార్తలు. మొన్న చెప్పాను కదా! ఆయన ఆ పెద్దాయన్ని కలిశాడు అంటున్నారు. నీకేమైనా తెలుసా?

‘తెలియదే. ఎప్పుడు?’

‘నేనూ విన్నదే! కనుక్కోని చెప్పు

ఇక అక్కడినుంచి ఆ విలేకరి పని మొదలవుతుంది. ‘ఆయన అంటే ముఖ్యమంత్రి. మరి పెద్దాయన ఎవరు?

‘ఆయన డ్రైవర్ నెంబరుకు ఫోను చేశాడు. వీ ఐ పీ రాకపోకలు కనుక్కోవాలంటే పోలీసులు, డ్రైవర్లను మించి విలేకరులకు మంచి సోర్సు దొరకదు.

డ్రైవర్ దొరికాడు కానీ కావాల్సిన సమాచారం రాలేదు. కాకపొతే ఓ విషయం చెప్పాడు. ఆ రోజు ‘ఆయన అధికారిక వాహనం కాకుండా వేరే కారులో వెళ్ళిన మాట ధృవీకరించాడు. వెంట ఎవరు వెళ్లిందీ చెప్పాడు. ఆ వెంట వెళ్ళిన వాళ్ళను పట్టుకుంటే ‘ఆ పెద్దాయన ఎవరో తెలిసింది.

ఇవన్నీ జరిగిన సంగతులు. తర్వాత కావాల్సిన విధంగా మసాలాలు దట్టించి  వార్తను వండి వార్చడమే.

‘అధిష్టానంపై తిరుగుబాటుకు పావులు కదుపుతున్న ముఖ్యమంత్రి!’

‘కేంద్రంలో చక్రం తిప్పుతున్న ఓ సీనియర్ మంత్రిని రహస్యంగా కలుసుకుని చర్చలు జరిపిన  ముఖ్యమంత్రి’

ఇది హెడ్డింగు. అసలు వార్త అనేక సోయగాలు అద్దుకుని అక్షరాల రూపంలో మర్నాడు పత్రికలో మొదటి పేజీలో దర్శనం ఇస్తుంది.

దానితో పాటే ముఖ్యమంత్రి కార్యాలయం జారీ చేసిన ‘ఖండన’ ప్రకటన కూడా ఆ పత్రిక కార్యాలయానికి చేరుతుంది.    

ఇతి వార్తాః   

కామెంట్‌లు లేవు: