ఒక ముని నదిలో స్నానం చేస్తున్నాడు. ఆ
సమయంలో ఒక తేలు ప్రవాహంలో కొట్టుకు పోవడం చూసి జాలిపడి దాన్ని ఒక ఆకులోకి తీసుకుని
ఒడ్డుపైకి విసిరివేసేలోగా ఆ తేలు తన స్వభావం కొద్దీ ముని చేతిపై కుట్టింది. దాంతో
అది చేతినుంచి జారి మళ్ళీ నీళ్ళల్లో పడింది. బాధను అణచుకుంటూనే ముని తిరిగి ఆ
తేలును రక్షించే ప్రయత్నం చేసాడు. తేలు మళ్ళీ కుట్టింది. తిరిగి నీళ్ళలో పడి
కొట్టుకుపోతున్న ఆ తేలును రక్షించే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ వృశ్చికం అడిగింది.
‘ఓ మునీశ్వరా! కుట్టడం నా స్వభావం అని తెలిసికూడా కుట్టిన ప్రతిసారీ నన్ను
నా మానాన వదిలివేయకుండా కాపాడుతూనే వున్నావు కారణమేమిటి?’
అందుకు జవాబుగా ఆ తపస్వి నవ్వి ఇలా
చెప్పాడు.
‘కుట్టడం నీ స్వభావం. సరే. మరి ఆపదలో ఉన్నవారిని కాపాడడం నా స్వభావం. జన్మతః
వచ్చిన నీ స్వభావాన్ని నువ్వు వదులుకోకుండా వున్నప్పుడు నాది నేనెలా వదులుకుంటాను
చెప్పు’
ఈ కధ ఎందుకు చెబుతున్నాను అంటే, మనలో ప్రతి ఒక్కరికి ఓ స్వభావం వుంటుంది. అలా ఎందుకు రాస్తారు, ఇలా ఎందుకు కామెంటు చేస్తారు అని అప్పుడప్పుడు తోటివారిపై కొంత అసహనం
ప్రదర్శించడం కద్దు. అది వారి స్వభావమని సరిపెట్టుకుంటే ఇక చిక్కేలేదు.
1 కామెంట్:
మంచి సందేశం.
కామెంట్‌ను పోస్ట్ చేయండి