19, ఏప్రిల్ 2021, సోమవారం

పసునూరు శ్రీధర్ బాబు

 2005 లో నేను దూరదర్సన్ నుంచి రిటైర్ అయినదాకా  ప్రైవేట్ ఛానళ్ల వాళ్ళు చర్చలకు పిలిచినా వెళ్ళేవాడిని కాను. ఆ తరువాత మొట్టమొదట కుడి కాలు పెట్టింది మాత్రం HMTVలో. రామచంద్రమూర్తి గారి సారధ్యంలో నడుస్తుండేది. ఏ.ఎస్. రావు నగర్ లో స్టూడియో. నేను వుండేది ఎల్లారెడ్డి గూడాలో.

ప్రతి మంగళవారం నాకు అక్కడ ఉభయం. ఉదయం అయిదున్నరకల్లా టీవీ వారి ఇన్నోవా వాహనం మా ఇంటి ముందు రెడీగా వుండేది. పోవడానికి నలభయ్ అయిదు నిమిషాల పైమాటే. వచ్చేటప్పుడు ట్రాఫిక్ పెరుగుతుంది కాబట్టి  గంట పట్టేది.

అక్కడ మొదటి  పరిచయం శ్రీధర్ బాబుతో. చిదిమితే పాలు కారుతాయి అన్నట్టు వుండేవారు. పదహారేళ్ళు గడిచినా ఇప్పటికీ అలానే ఉన్నట్టున్నారు. ప్రశ్న అడిగితే సున్నితంగా వుండేది. మర్యాద ఉట్టిపడేది. ఆ రోజుల్లో ప్రతిరోజూ రాజకీయ నాయకులతో  పాటు విషయం విడమరిచి చెప్పడానికి  ఒకరిద్దరు విశ్లేషకులను కూడా  పిలిచేవాళ్ళు.


(పసునూరు శ్రీధర్ బాబు)



ప్రొఫెసర్  కోదండ రాం,  ప్రొఫెసర్ నాగేశ్వర్, తెలకపల్లి రవి, ఘంటా చక్రపాణి, వి. ప్రకాష్,  జ్వాలా నరసింహారావు  ఇలా అందరూ HMTV చర్చల్లో తారసపడేవారు. ఒక్కోసారి  వీలునుబట్టి  రామచంద్ర మూర్తిగారు సైతం చర్చలో కూర్చొనేవారు. ఇప్పుడు మంత్రులుగా వున్న అనేకమంది టీఆర్ ఎస్ నాయకులు కూడా పాల్గొనేవాళ్లు. ఆ రోజుల్లో తెలంగాణా ఉద్యమం తీవ్రస్థాయిలో  సాగుతుండేది. చర్చలది  కూడా అదే స్థాయి. కాకపొతే శ్రీధర్ బాబు గారి చాకచక్యం వల్ల ఎప్పుడూ హద్దులు దాటేవి కాదు.  కొన్నిసందర్భాలలో వారానికి ఒకసారి సాయంత్రం చర్చలకు కూడా పిలిచేవాళ్ళు. గంట ముందు బయలుదేరినా కూడా ట్రాఫిక్ లో చిక్కుకుని సమయానికి స్టూడియోకి చేరడం కష్టం అయ్యేది. అయినా ఆయన ఏమాత్రం  టెన్షన్  పడకుండా కారులో నుంచే నాతొ ఫోన్ ఇన్  లో మాట్లాడించి ఇబ్బంది లేకుండా చూసేవారు.

ఆ తర్వాత అయన మరి కొన్ని చానళ్ల్లలో పనిచేశారు. ప్రతి రోజూ ఒక ఛానల్ కు వెళ్ళే వారాలబ్బాయిగా నేనూ ఆ టీవీ చర్చలకు వెడుతుండే వాడిని. ఆ విధంగా బంధం గట్టిపడింది. తర్వాత ఢిల్లీ వెళ్ళిపోయారు, బీబీసీ తెలుగు ఆహ్వానం మేరకు.

నిన్న ఉదయం ఫోన్ చేశారు. స్వరంలో అదే మృదుత్వం. చాలా సేపు సంభాషణ నడిచింది. నా కంటే వేరే వ్యాపకం లేదు. కానీ ఆయన చేస్తున్నది బిజీ ఉద్యోగం కదా!

‘హైదరాబాదు ఎప్పుడు వచ్చారు?’ అని అడిగాను.

‘లేదండీ ఢిల్లీలోనే వున్నాను. మీతో మాట్లాడాలి అనిపించి ఫోన్ చేస్తున్నాను అన్నారాయన.

చాలా విషయాలు చెప్పారు. నేను చెప్పిన చాలా విషయాలు కూడా ఓపిగ్గా విన్నారు.

‘హైదరాబాదు వచ్చినప్పుడు కలుస్తాను అనే మాటతో ముగించారు.

ఎదిగినా ఒదిగి వుండడం చాలామందికి సాధ్యం కాని విషయం.

అదే శ్రీధర్ బాబులో నాకు నచ్చే విషయం.

(19-04-2021)

కామెంట్‌లు లేవు: