23, ఏప్రిల్ 2021, శుక్రవారం

పేరులో ఏముంది?

 

కొండల మీద, గుట్టల మీద వెలిసిన దేవుడి గుళ్ళకు వెళ్ళడానికి మెట్ల దారులు వుంటాయి. ప్రతి మెట్టు మీద దానికయ్యే ఖర్చు దానం చేసిన వ్యక్తి పేరు చెక్కించే వారు. అంత ప్రచారం అవసరమా అనేది నా సందేహం. ‘వాళ్ళు ప్రచారం కోసం అలా పేర్లు రాయించుకోలేదు, మెట్లెక్కి వెళ్ళే భక్తులు తమ పేర్లను తొక్కుకుంటూ వెడితే పుణ్యం’ అని ఓ వివరణ. సరే! బాగానే వుంది. మరి గుడిలో వుండే పంకాల మీద వాటిని విరాళంగా ఇచ్చిన వారి పేర్లు అవసరమా! ఈ ప్రశ్నకు జవాబు లేదు.

కుడి చేత్తో చేసే దానం ఎడమ చేతికి తెలియకూడదని అంటారు. కానీ రోజులు మారాయి. ప్రధాని/ ముఖ్యమంత్రి సహాయ నిధికి పలానా వారి విరాళం ఇంత అని ట్వీట్ ముందు, ఇవ్వడం తరవాత. అంటే ఏమన్నమాట. ప్రచారం లేకుండా ఏ మంచి పని చేసినా శుద్ధ దండగ అనే వారి సంఖ్య పెరుగుతున్న కాలంలో మనం జీవిస్తున్నాం.

కంచర్ల గోపన్న గారు ఎలాంటి ప్రచార యావ లేకుండా భద్రాచల రాముడికి గుడి కట్టించాడు. భక్త రామదాసుగా మారిన తర్వాత, తానీషా బందికానాలో వేసి పెట్టిన చిత్రహింసలు భరించలేక సీతమ్మ తల్లితో పాటు రామలక్ష్మణులకు, భరత శత్రుఘ్నులకు చేయించిన ఆభరణాలు గుర్తుకు వచ్చి, వాటిని చేయించేందుకు అయిన ఖర్చు అణాపైసలతో(వరహాలు, మొహరీలు) సహా లెక్కలు కట్టి పాటలు పాడుతూ చెప్పిన సంగతి తెలిసిందే.

తిరుమల దేవాలయానికి పునాది రాయి వేసింది ఎవరో తెలియక పోయినా, ఓ చిన్న కాలనీలో కట్టిన ఓ చిన్న గుడికి ఎవరు శంకుస్థాపన చేసారో, ఎవరు ప్రారంభోత్సవం చేసారో తెలిపే ఖరీదైన చలువరాతి ఫలకం గుడి ముఖ ద్వారం కంటే గొప్పగా కనిపించేటట్టు పెట్టడం తెలియని వాళ్ళు లేరు.

ఎవరిదో నాయకుడి పుట్టిన రోజు నాడు ఆసుపత్రులలో రోగులకు పళ్ళు పంచిపెడతారు. మంచి సంగతే.
ఆ ఫోటోలు పత్రికల్లో రావడానికి ఇచ్చే ప్రకటనల డబ్బులతో మరి కొన్ని ఆసుపత్రులలో ఇదే సత్కార్యం చేయవచ్చు కదా అని అడిగితే, ‘అలా ఎలా! పేరూ ఊరూ లేని పనులు చేయడానికి మాకు మరో పని లేదనుకున్నారా’ అన్నట్టు చూస్తారు.

ఇంతెందుకు! ఫేస్ బుక్ లో నేను రాసిన పోస్టును ఎవరో లేపేసి అతడి పేరుతొ పోస్టు చేసుకుంటే నా సొమ్మంతా పోయినట్టు నేనే ఎన్నిసార్లు గగ్గోలు పెట్టలేదు.

పేరులో ఇంత విషయం వుంది కాబట్టే పేరు కోసం ఇన్ని పాట్లు.
ఇదంతా ఇప్పుడు ఎందుకు అంటారా!

ఆక్సిజన్ ట్యాంకుల సరఫరా ఏర్పాట్లు గురించి వేర్వేరు పార్టీల అభిమానులు పోస్టించిన కధనాలే.
(23-04-2021)

కామెంట్‌లు లేవు: