21, ఏప్రిల్ 2021, బుధవారం

ఒక రోగి ఆత్మ కధ

ఏడాది కిందటి మాటే! అవి లాక్ డౌన్ పూర్తిగా అమలు అవుతున్న రోజులు. మా బంధువు ఒకరు కరోనాతో ఆసుపత్రిలో చేరారు.  లక్షణాలు కనబడగానే  జాగ్రత్త  పడివుంటే పరిస్థితి ఆసుపత్రి వరకు వచ్చేది కాదేమో. కానీ ఈ కొత్త రోగం గురించి రోజుకో కొత్త సంగతి బయటకు వస్తున్న రోజులు కావడంతో ముందు భయంతో కొన్ని రోజులు తటపటాయించారు. పాజిటివ్ రాగానే డాక్టర్లు ఇచ్చిన మందులు శ్రద్ధగా వేసుకోకపోవడం, రుచి తెలియక సరిగా ఆహారం తీసుకోకపోవడం ఇవన్నీ అందుకు  కారణాలే.

చివరికి తెలిసిన వారి సాయంతో ఒక  మధ్య సైజు  కార్పొరేట్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడు. అప్పటి పరిస్థితి దృష్ట్యా నేరుగా ఐ.సీ.యు. లో చేరాల్సి వచ్చింది. ఆ హాల్లో ఎటు  చూసినా కరోనా రోగులే.

ఇక్కడి నుంచి అతడు నాకు చెప్పిన సంగతులు అతడి మాటల్లోనే:

“మొదటి రెండు మూడు రోజులు  నాకు ఏమి జరుగుతున్నదో  తెలిసేది కాదు. కొద్దిగా మందులు వంట బట్టిన తరువాత  కొద్ది కొద్దిగా  పరిస్థితులు అర్ధం అవడం మొదలయింది. అంతవరకూ ఇంట్లో భార్యా పిల్లల మధ్య ఉంటూ వచ్చిన నాకు అక్కడి వాతావరణం చూసి ఒక్క సారిగా గుండె జారిపోయింది. ఐ.సీ.యు. ఎలా వుంటుంది అనే  విషయంలో నాకు కొంత అవగాహన వుంది. కానీ ఇక్కడి పరిస్థితులు పూర్తిగా భిన్నంగా వున్నాయి. రోగులు తప్ప డాక్టర్లు అరుదుగా కనిపిస్తున్నారు. అప్పుడప్పుడూ నర్సులు వచ్చి చుట్టూ అమర్చిన మిషన్ల వంక చూసి ఏదో రాసుకుని వెళ్లి పోతున్నారు. పైగా తెల్లటి ఉడుపుల్లో కనిపించే వైద్య సిబ్బంది, మొహమూ, శరీరమూ కప్పివుంచే  అవేవో నీలం రంగు దుస్తులు ధరించి వుండడంతో పరిస్థితి మరింత భయానకంగా అనిపించింది.

వయసు అరవై దాటినా ఇంతవరకు పెద్ద రోగాలబారిన పడి ఆసుపత్రి పాలు కాలేదు. ఐ.సీ.యు. లో అన్ని రోజులు  వుండడం అనేది  పూర్తిగా కొత్త. టైముకు బ్రేక్  ఫాస్టు, ఆహారం తెచ్చి పెడుతున్నారు. మందులు ఇచ్చి వెడుతున్నారు. ఆ వాతావరణంలో తిండి సయించలేదు. తిండి సరిగా తినకపోవడంతో నీరసం ఆవహించింది. గెలికి పారేసినట్టు వున్న భోజనం ప్లేటు గమనించిన ఓ నర్సు ఈ పేషెంటు బొత్తిగా తిండితినడం లేదని డాక్టరుకు చెప్పింది.

డాక్టరు వచ్చి గట్టిగానే చెప్పాడు.

“మేము ఇస్తున్న మందులు పనిచేయాలి అంటే తిండి సరిగా తినాలి. తినకపోతే  గొంతులో  గొట్టం వేసి  ఆహారం ఇవ్వాల్సి వుంటుంది జాగ్రత్త

అప్పుడు ఆలోచించుకున్నాను. పూర్తి స్వస్టత చిక్కి ఇంటికి వెళ్లి మళ్ళీ భార్యాపిల్లల్ని చూడాలి అనుకుంటే ఇష్టం వున్నా లేకపోయినా పెట్టింది తిని తీరాలి. గత్యంతరం లేదు అని అర్ధం అయింది.

ఆరోజు నుంచి నాలో కొంత మార్పు వచ్చింది. అన్నంతో పాటు రోజుకు మూడు సార్లు ఉడకబెట్టిన గుడ్లు ఇచ్చేవాళ్ళు. అవి ఎప్పుడూ తినలేదని కాదు కాని  అలా మూడేసి గుడ్లు ముప్పూటా  తినడం అలవాటు లేని పని. అయినా సర్దుకున్నాను. మందులతో పాటు కాస్త ఆహారం కూడా పడడంతో మూడు నాలుగు  రోజుల్లో కొంత ఓపిక వచ్చింది. 

ఓపికతో పాటే లేనిపోని ఆలోచనలు. నిద్ర పట్టేది కాదు. ఇంట్లో వాళ్ళు ఎలా వున్నారో అనే భయం పట్టుకుంది. ఆసుపత్రి నిబంధనల ప్రకారం సెల్ ఫోన్ కు అనుమతి లేదు. కొందరు పేషెంట్లు, చేరిన కొత్తల్లో పరిస్థితులకు భయపడిపోయి  వీడియోలు తీసి బయటకు పంపుతూ ఉండడంతో అవి వైరల్ అయి చెడ్డపేరు వస్తోందని వాళ్ళు ఈ ఆంక్షలు పెట్టారట.

ఒక రోజు డాక్టరును నిలదీసాను. సెల్ ఫోన్ లేకపోతే నా సంగతి సరే, ఇంట్లో వాళ్ళు ఏమయ్యారో ఎలా వున్నారో నాకు తెలియడం ఎలా! అని. (నిజానికి వాళ్ళు ప్రతిరోజూ ఆసుపత్రికి ఫోను చేసి నా యోగక్షేమాలు విచారిస్తూనే వున్నారు. ఆ సంగతి నాకు తెలియదు. లాక్ డౌన్ వల్ల వాళ్ళు ఆసుపత్రికి రాలేరు)

అప్పుడు ఒక మనిషిని చూపెట్టాడు. ‘అతడిని అడగండి. మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడిస్తాడు’ అని చెప్పాడు.

ఇదొక కార్పొరేట్ మోసం అనిపించింది. మన దగ్గర సెల్ లేకుండా చేసి బయట వ్యక్తి ఫోన్ వాడుకోమని చెబుతున్నారు అంటే ఇందులో ఏదో మతలబు వుందనిపించింది. అతడ్ని దగ్గరకు పిలిచాను. అతడూ డాక్టర్ల మాదిరిగానే పూర్తిగా కరోనా రక్షణ కవచం దుస్తుల్లోనే వున్నాడు. ఒక్క  కళ్ళజోడు తప్ప ఆయన్ని గుర్తు పట్టే అవకాశమే లేదు.

వచ్చి ‘నెంబరు చెప్పండి, కలిపి ఇస్తాను’ అన్నాడు. మళ్ళీ సమస్య.  ఒక్క నెంబరూ గుర్తుకు రాలేదు. అన్నీ ఫీడ్ చేసుకుని ఫోన్లు చేసే పద్దతికి అలవాటు పడడంతో పిల్లల నెంబర్లు కూడా గుర్తు పెట్టుకోవడం మరచిపోతున్నాము. అప్పుడు గుర్తుకు వచ్చింది.  ఎప్పుడో మాంధాతల కాలంలో పెట్టించి, ఇప్పుడు మూగ నోము పట్టి ఇంట్లో ఒక వస్తువుగా మారిపోయిన లాండ్ లైన్ నెంబరు చెప్పాను. కానీ అది ఇంట్లో వాళ్ళు ఎత్తుతారా అని మరో సందేహం. ఈలోగా మరో అనుమానం. ఇప్పుడు ఇతడికి డబ్బులు ఇవ్వడం ఎలా! నా దగ్గర పర్సు కూడా లేదు. అతడితో అదే విషయం చెప్పాను. చివర్లో బిల్లు సెటిల్  చేసేటప్పుడు  మీ డబ్బులు కూడా మా వాళ్ళు ఇస్తారు, పరవాలేదా అని.

అతడు నవ్వి (నవ్వు కనపడలేదు, వినపడింది) అన్నాడు.

‘సారూ. ఇప్పుడు మీరు కోలుకోవాలి. అది ముఖ్యం. డబ్బుల సంగతి ఎందుకు ఆలోచిస్తారు అన్నాడు.

మొత్తం మీద ఇంటికి ఫోన్ చేసి మాట్లాడాను. నా గొంతు వినగానే వాళ్ళు బోలెడు సంతోషపడ్డారు. నాకయితే ఆకాశంలో తేలుతున్నట్టు అనిపించింది. మా వాళ్ళు తెలివిగా, నేను ఫోన్ చేసిన మొబైల్ కు కొన్ని నెంబర్లు పంపారు. వాటిని ఒక కాగితం మీద రాసి ఇమ్మని అతడినే అడిగాను. అతడు, ‘అక్కర లేదు ఈ నెంబర్లు నేను ఎరెజ్ చేయకుండా దాచి పెడతాను. కావాల్సినప్పుడు  వీడియో కాల్ చేసి  మాట్లాడుకోండి, రెండు నిమిషాలే సుమా! ఎందుకంటే  ఇక్కడి  పేషెంట్లు అందరూ ఆత్రుతగా  నాకోసం ఎదురు చూస్తుంటారు.’

నిజంగా మహానుభావుడు. ఓపిక చేసుకుని చేతులు జోడించి దణ్ణం పెట్టాను.

తరువాత అతడి గురించి తోటి పేషెంట్లు వివరాలు చెప్పారు.

అతడొక ముస్లిం. ఆ ఆసుపత్రి దగ్గరలోనే ఏదో చిన్న దుకాణం. అతడూ కరోనా బాధితుడే. మా లాగా ఆసుపత్రిలో చేరి ఇంట్లో వాళ్ళతో మాట్లాడలేక అవస్థలు పడ్డవాడే. జబ్బు నయమయ్యాక,  అతడు ఆసుపత్రి వారి దగ్గర పర్మిషన్ తీసుకుని, రోజూ ఒక టైములో వచ్చి  ఇక్కడి పేషెంట్లకు ఉచిత సేవ చేస్తున్నాడు.

మా బామ్మ చెప్పినట్టు భగవంతుడు మన చుట్టూ వుండే మనుషుల రూపంలోనే ఉంటాడు.

ఆసుపత్రి భోజనానికి అలవాటు పడ్డాను. మందులు పనిచేస్తున్నాయని నర్సులు చెబుతున్నారు. ఇంట్లో వాళ్ళతో వీడియో కాల్ చేసి అందర్నీ చూస్తూ మాట్లాడడానికి ఆ ముస్లిం సోదరుడు వున్నాడు. చుట్టూ కోలుకుంటున్న పేషెంట్లు వున్నారు. మొదట్లో వున్న భయాలు, సంకోచాలు పోయాయి.

ఒకరోజు డాక్టరు వచ్చి మిమ్మల్ని రేపో ఎల్లుండో డిశ్చార్జ్ చేస్తాము అనే శుభ వార్త చెప్పారు. వెంటిలేటర్ లేకుండా ఆక్సిజన్ సరిపడా అందుతోందో లేదో నిర్ధారణ చేయడానికి ఒక రోజు ఆసుపత్రి గదిలో వుంచి తర్వాత ఇంటికి పంపుతారట. ఇది తెలిసి ఇంట్లో వాళ్ళ సంతోషం చెప్పనలవి కాదు. నేను పుట్టక ముందు మా నాన్నగారు స్వాతంత్ర సమరంలో పద్దెనిమిది నెలలు  జైల్లో వున్నారు. విడుదల అయి తిరిగి వచ్చిన రోజు ఇంట్లో బయటా సంబరాలు చేసుకున్నారని మా బామ్మ చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది. ఇప్పుడు కరోనా కోరల నుంచి బయట పడే నా గురించి కూడా మా ఇంట్లో అవే సంబరాలు.

ఐ.సీ.యు. నుంచి గదికి తీసుకు వెళ్ళగానే నర్సును ముందు అడిగిన మాట ఒక్కటే.

‘బాత్ర్రూం ఎక్కడ? స్నానం చేయాలి

‘సరే కాని జాగ్రత్త! లోపల గడియ పెట్టుకోవద్దు. మీరింకా  నీరసంగానే వున్నారు. మేము గది బయటే ఉంటాము. అవసరం అనిపిస్తే పిలవండి అని జాగ్రత్తలు చెప్పి బయటకు వెళ్ళింది.

బాత్‌రూం అద్దంలో కమిపించిన ఆకారం చూసి వెన్నులో వణుకు పుట్టింది. నేను మరీ బొద్దు మనిషిని కాకపోయినా అంత నాజూకు మనిషిని కూడా కాదు. మరి ఇలా పుల్లలా అయిపోయానేమిటి?

తోకటపా: పదహారు రోజులు ఆసుపత్రిలో వుండి, మృత్యువు నోట్లో తలపెట్టి వెనక్కి వచ్చిన రోగిగా నేను చెప్పేది ఒక్కటే!

‘కరోనా అనగానే భయపడకండి. మనం భయపడితే మరింత భయపెడుతుంది. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే మీ జోలికే రాదు. ఒకవేళ వచ్చినా దానికి ముకుతాడు వేసే మందులు వున్నాయి. డాక్టర్లు వున్నారు, నర్సులు వున్నారు. మీకు వెన్నంటి ధైర్యం చెప్పే కుటుంబం వుంది. అన్నింటికీ మించి సేవాభావంతో సేవ చేసే ముస్లిం ఫ్రెండ్ వంటి వ్యక్తులు వున్నారు.

ఒక కరోనా రోగిగా చెబుతున్నాను.

‘ధైర్యంగా వుంటే కరోనాను జయించడం కష్టం కాదు

(21-04-2021)          

కామెంట్‌లు లేవు: