12, ఏప్రిల్ 2021, సోమవారం

రఘురామ కృష్ణంరాజు గారు

 


తెలుగునాట బాగా ప్రాచుర్యం పొందిన పేరు. వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు. ఈ వృత్తుల్లో వున్నవాళ్ళు చాలామంది వుంటారు. కానీ రాజు గారి స్థాయిలో ప్రాచుర్యం లభించడం దుర్లభం.

నేను యాక్టివ్  జర్నలిజంలో వున్నప్పుడు వారితో నాకు పరిచయం లేదు. నిజం చెప్పాలి అంటే అప్పుడూ, ఎపుడూ ముఖపరిచయం కూడా లేదు. నాకు దశాబ్దాలుగా పరిచయం వున్న కేవీపీ గారి వియ్యంకులు అని తెలుసు. టీవీల్లో  తరచూ చూస్తుంటాను. ఆయన మాటల్లో సున్నితమైన వ్యంగం దోబూచులాడుతూ వుంటుంది. అంచేత ఏ విషయం చెప్పినా, అది మనకు నచ్చినా  నచ్చకున్నా ఒక చెవి అటు వైపు వేసి వింటూనే ఉండేలా చేసే శక్తి ఆయన మాటల్లో వుంది.

 ఉదయం ఓ మిత్రుడు ఫోన్ చేసి ఆయన మీ గురించి టీవీ లో రాత్రి నిందాపూర్వక వ్యాఖ్యలు చేశారు అని అంటే ఆశ్చర్యం వేసింది. నేనెవరో వారికి తెలియదు, అయినా అలా మాట్లాడారు అంటే (ఆ మిత్రుడు లింక్ కూడా పంపించారు) కొంత వింతగానే వుంది. అయినా వారిని తప్పుపట్టలేము. ఎవరైనా నేను రాసిన  రాతలకు చెడుగా వ్యాఖ్యలు పెడితే ఎంత సర్దుకు పోదామని అనుకున్నా మనసు మూలల్లో చివుక్కుమంటూనే వుంటుంది. అలానే ఒక వెబ్ ఛానల్ లో ఆయన్ని గురించి నేను మాట్లాడిన సంగతులు విన్నప్పుడు రాజుగారికి కూడా అలానే అనిపించి వుంటుంది. మనసు నొప్పించడానికి పరిచయాలు అక్కరలేదు కదా!

కాకపోతే నేనేదో డబ్బులకోసం అలా మాట్లాడుతున్నాను అనే అర్ధంలో రాజుగారు మాట్లాడడం నాకూ  బాధగానే వుంది. ఈ విషయంలో నాకు నేను వివరణ ఇచ్చుకోవడం బాగుండదు. అందుకని అదేదో ఆ సందేహాన్ని రాజుగారు తమ వియ్యంకుడు కేవీపీ గారెని అడిగి నివృత్తి చేసుకుంటే బాగుంటుంది.  ఎందుకంటే నా గురించి బాగా తెలినిన రాజకీయ ప్రముఖులు  కొద్దిమందిలో వారూ ఒకరు.

ధన్యవాదాలు రాజుగారు.

(12- 04- 2021)

మిత్రుడు పంపిన లింక్ ఇదే!

https://m.facebook.com/story.php?story_fbid=916764009147663&id=100024422183203

కామెంట్‌లు లేవు: