18, ఏప్రిల్ 2021, ఆదివారం

ఎందుకు రాశాను?

 

ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆ పుస్తకం రాసిన పెద్దమనిషి చెప్పిన సంగతులు ఇవి.

గ్రంధరచయిత ప్రసంగం ఇలా సాగింది. (ఇలానే అని కాదు, విన్న సంగతులు కాబట్టి కాస్త అటూ ఇటూగా)

ఈ పుస్తకం రాయడానికి నాకు చాలా కారణాలు వున్నాయి.

విసుగూ విరామం లేని ఉద్యోగం చేసి రిటైర్ అయి ఖాళీగా వున్నాను. మరీ అలా ఏ వ్యాపకం లేకుండా ఉండిపోతే ఇంట్లో ఆడవాళ్ళకు కూడా మొహం మొత్తుతుంది. మరి ఏం చేయాలి కాలక్షేపానికి అనుకుంటూ వుంటే ఓ పెద్దమనిషి తారసపడి, ఇంతవరకు ఏమాత్రం తీరికలేని ఉద్యోగాలు ఎన్నో చేసారు కదా! బోలెడు అనుభవాలు కూడా వుండే వుంటాయి. ఎంచక్కా ఓ ఆత్మకధ రాస్తే పనికి పనీ వుంటుంది,  కాలక్షేపం గానూ   వుంటుంది’ అని సలహా చెప్పాడు.

సలహా బాగానే వుందని పించింది. కాకపొతే చాలా అనుమానాలు వచ్చాయి.

తెలుగులో రాయాలా? ఇంగ్లీష్ లో రాయాలా?

తెలుగువాడినే కానీ తెలుగులో రాసేంత తెలుగు వచ్చా అన్నది అనుమానం. ఇంగ్లీష్ బాగానే వచ్చు కానీ తెలుగులో విషయాలు తెలుగు రాని వాళ్ళు చదివితే వారికి అర్ధం అవుతుందా అనే ఇంకో సందేహం.

పోనీ ఇటు తెలుగులో, అటు ఇంగ్లీష్ లో రెండింటిలో రాస్తే పోలా! భేషుగ్గా వుంది ఐడియా.

ఉత్తర హిందూ స్థానంలో ఎక్కువ కాలం ఉద్యోగం చేయడంఅనే కారణం చేత నా తెలుగు నాలుగు పొడి ముక్కలు మాట్లాడడానికి, ఇక్కడ అంతా క్షేమం లాంటి చిన్న చిన్న ఉత్తరాలు రాసుకోవడానికి సరిపడేలా కుదించుకు పోయింది.

అదో పెద్ద ఇబ్బందేమీ కాదు, నువ్వు చెబుతుంటే చక్కగా రాసిపెట్టే వాళ్ళు బోలెడు మంది వున్నారని ఆ పెద్దమనిషే మళ్ళీ ఇచ్చాడు భరోసా.

సరే! ఒక పెద్ద సమస్య తేలిపోయింది. మరి ఆత్మకధ అంటే కొన్ని చెప్పుకునేవి, కొన్ని చెప్పుకోలేనివి వుంటాయి. గాంధీ గారిలా అన్నీ రాసుకోవాలా లేదా కొన్ని రాసుకుని కొన్ని దాచుకోవాలా’

ఏ మసాలా లేకుండా రాముడు మంచి బాలుడు తరహాలో రాస్తే చదివేవాళ్ళు ఉంటారా!

అది పుస్తకం రాసిన తరువాత మాట. ముందు రాయడం మొదలు పెట్టమని ఆ పెద్దమనిషి గోల.

అదీ సరే. మొదలు పెట్టేస్తాను. భాష సమస్య తీరింది, మరి మా ప్రాంతపు రాయలసీమ యాసలో రాయాలా లేదా అన్ని ప్రాంతాలవారికి అర్ధం అయ్యేలా తెలుగు సినిమా భాషలో రాయాలా?’

ఓరి బాబోయ్ ఇన్ని అనుమానాలా. ఇన్ని కడుపులో పెట్టుకుని ఇన్నాళ్ళు ఇన్ని ఉద్యోగాలు ఎలా చేసావంటూ ఆ పెద్దమనిషి ఆక్రందన’

ఈ విషయాలన్నీ చెప్పిన ఆ పెద్దమనిషి నిజానికి చాలా చాలా పెద్ద మనిషి.

పేరు యాగా వేణుగోపాల రెడ్డి. వై.వీ.రెడ్డి అనేది అందరికీ తెలిసిన పేరు. సీనియర్ ఐ.ఏ.ఎస్. అధికారిగా పదవీ విరమణ చేశారు. 2003 – 2005 మధ్య రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా పనిచేశారు. ‘నా జ్ఞాపకాలు’ అనే పేరుతొ తమ అనుభవాలతో కూడిన ఒక గ్రంధం రచించారు.

 

కామెంట్‌లు లేవు: