6, మార్చి 2021, శనివారం

పదాలను ఎలా పలకాలి? – భండారు శ్రీనివాసరావు

 ఎలా పలికినా పర్వాలేదు అనుకునే టీవీ యాంఖర్లకు, ఎలా రాసినా ఏమీ కాదు అనుకునే పత్రికారచయితలకు ఏమాత్రం కొరత లేని ఈ రోజుల్లో Suneel Satti ఒక పెద్దమనిషి వ్యక్తుల, ప్రాంతాల పేర్లను ఎలా ఉచ్చరించాలి అని ఫేస్ బుక్ లో అనునిత్యం ప్రయత్నం చేస్తూనే వున్నారు కానీ అది అరణ్య రోదనేమో అనిపిస్తోంది. (ఫేస్ బుక్ లో ఎప్పుడు పోస్టింగ్ పెట్టినా ఆయన పేరు ఇంగ్లీష్ లోనే వుంటుంది. దాంతో ఆయన ఇంటి పేరును (SATTI ని ఎలా రాయాలో తెలియక అంటే, ‘సత్తి’ అనాలా, సట్టి’ అనాలా అనే అయోమయంలో పడి) అలాగే యధాతధంగా ఇంగ్లీష్ లోనే రాశాను. ఎందుకంటే సునీల్ గారు ఉచ్చారణను, స్పెల్లింగులను చాలా సీరియస్ గా తీసుకుంటారు. అనేక పత్రికల్లో అనుదినం వచ్చే వార్తలలోని విదేశీ, స్వదేశీ వ్యక్తుల పేర్లను పత్రికల వాళ్ళు తెలిసీ తెలియక ఎలా భ్రస్టు పట్టిస్తున్నదీ సోదాహరణంగా వివరించడానికి, పాఠకులకు అవగాహన కలిగించడానికి సునీల్ గారు తీసుకుంటున్న శ్రమదమాదులు అభినందనీయం. అందుకే ఆయన అంటే నాకు అమిత గౌరవం.

వారు ఇస్తున్న కొన్ని ఉదాహరణలను చూస్తుంటే మనం ఇన్నాళ్ళ బట్టి ఇంత అజ్ఞానంతో పదాలను పలుకుతున్నామా, రాస్తున్నామా అనే భావన కలగడం తధ్యం.

ఆలిండియా రేడియోలో జాతీయ, అంతర్జాతీయ వార్తలు చదివే వారికి ఇటువంటి విషయాల్లో చక్కని అవగాహన కల్పించేందుకు ఒక ప్రత్యేక విభాగమే వుంది. ఎందుకంటే మన దేశాన్ని సందర్శించే విదేశీ ప్రముఖుల పేర్లను తప్పుగా ఉచ్చరించడం సరైన పద్దతి కాదు.

సునీల్ గారు రాస్తున్న విషయాలను పత్రికల వాళ్ళు, మీడియా వాళ్ళు గమనంలో ఉంచుకోగలిగితే బాగుంటుంది.

తోక టపా:

(ఉచ్చారణలో ‘చ్చా’ కు వత్తు పెట్టి  మహబాగా ఉచ్చరించాం అనుకునేవారు కూడా వున్నారు. నిజానికి ఆ పదంలో ‘వత్తు’ లేదు. వత్తి వత్తి పలకక్కర లేదు, రాయక్కర లేదు)

8 కామెంట్‌లు:

సూర్య చెప్పారు...

ఇంతకీ ఉద్ధరించడం లో వత్తు ఉంచాలా లేక తీసేయ్యాలా?

sistla చెప్పారు...

వయః పరిమితి అనే పదాన్ని వయోపరిమితి అని రాయడం పత్రికలు ఏనాడో ప్రారంభించారు

విన్నకోట నరసింహా రావు చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
విన్నకోట నరసింహా రావు చెప్పారు...

చాలా భ్రష్టు పట్టిస్తున్నారు. నేను గమనించిన అనేక వాటిల్లో నాకు ఎక్కువ హాస్యాస్పదంగా అనిపించే ఉదాహరణ - బ్రయాన్ (Brian) అనే పేరుని ఎన్ని రకాలుగా వక్రీకరించవచ్చో అన్ని రకాలుగానూ వక్రీకరిస్తుంటారు. బ్రియాన్ అంటారొకరు. బ్రెయిన్ అంటారు మరొకరు.

వీళ్ళు రోజులో కనీసం ఓ పావుగంట బిబిసి నో, ఏదన్నా అమెరికన్ టీవీ వార్తలో వింటేనన్నా కొంత బాగు పడుతుంది. కానీ అదేం చేస్తున్నట్లు లేదు.

విదేశీ పేర్లే కాదండి. మన దేశపు పేర్లు కూడా అలాగే భ్రష్టు పట్టిస్తుంటారు. ఉదాహరణకు దేవధర్ అనే పేరుని ఉత్తర భారతీయులు, మహారాష్ట్రీయులు ఆంగ్లంలో D e o dhar అని వ్రాస్తారు. దాన్ని పట్టుకుని మన మీడియావారు “డి యో ధర్” అని వలకడం, వ్రాయడం తరచూ కనిపిస్తూనే ఉంటుంది.

అసలు ఇదంతా ఎందుకండీ - ఈ రోజుల్లో పదాల ఉచ్చారణ కోసం ఆన్ లైన్‌లో గూగుల్లో ఆడియోలు కోకొల్లలు. పోనీ మన మీడియా ఘనులు వాటి సహాయం అయినా తీసుకుంటారా అన్నది సందేహమే.

పైన చివర్లో మీరిచ్చిన ఉదాహరణ తెలుగుభాషకు పట్టిన దరిద్రం. “చ్చ” పలకడం తాము “డిఫరెంట్” గా కనబడాలనే తాపత్రయంతోనో అలా పలకడం ఫాషన్ అని అనుకునో ఏ సినిమా నటీ”మణు”లో, ఎవరైనా తెలుగు అరకొరగా.నేర్చుకున్న తెలుగేతరులో పట్టించిన భ్రష్టుత్వం అని నా అనుమానం. దాన్ని పెంచి పోషిస్తున్నారు మీడియా వారు. ఇదేమీ తగ్గే అవకాశాలు లేవండి ఎందుకంటే మగపిల్లలు కూడా అలాగే పలుకుతున్నారు, తల్లులు కూడా అదే వరస (ఫాషన్ అనుకునేమో? అతిశయాలకు పోవడం ఎలాగూ అలవాటేగా?), ఇంకేం తగ్గుతుంది?

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

పేర్లను ఎలా పలకాలి అన్నదొకటే సమస్య కాదండి. తెలుగు భాషకే ఏదో జాడ్యం పట్టుకున్నట్లుంది.

పైన చెప్పిన "చ్చ" ఉచ్చారణ ఒకటే కాదు, అవగాహన లేకుండా అనవసరమైన చోట కూడా “ష” పలకడం మరొక జాడ్యం. వయసులో పెద్దవారు కూడా పట్టిపట్టి అలవాటు చేసుకుంటున్నట్లు తోస్తోంది.

అవగాహనాలేమి వలనే కాబోలు ఇటీవల మరొక ధోరణి కూడా మొదలైందండోయ్ - "సహకారం ...మవసరం", 'సహాయం...మందించారు", "సాయంకాలం... మయింది" వగైరా వగైరా.

మూడు నాలుగు అక్షరాల కన్నా ఎక్కువున్న పదాలను పలకడానికి మన మీడియా ఏంకర్ల నాలిక అష్టవంకరలు తిరుగుతుందని అనుమానం. ఉదాహరణకు - నిన్న ఓ ఏంకరిణి "ఉపా ఎన్నికలు" అని పలుకుతోంది పదే పదే. ఉపా ఎన్నికలు ఏమిటో, ఖర్మ ఖర్మ?

ఇక ఆంగ్ల మిశ్రమం సంగతి మీకు తెలిసినదే కదా. నిన్న మరో ఏంకరిణి డిటైల్స్ సెండ్ చెయ్యండి (send) అంది పలుమార్లు. అది విని మా ఇంట్లోని ఓ నాలుగేళ్ళ పిల్లవాడు సెండ్ చెయ్యండి ఏమిటి, పంపించండి అనాలి కదా అని నా వెంట పడ్డాడు (భ్రష్టు పట్టిన తెలుగు మాట్లాడడం వాడికి ఇంకా అలవడలేదు లెండి 🙂).

ఏదో పాత సినిమాలో పాటలాగా “చరిత్ర యెరుగని మహాపాతకము మా దేశానికి పట్టినదా” అనుకోవడం మాత్రమే మిగిలింది 😒.

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

నేనేదో నిష్ణాతుడను కాను గానీ కాస్త అప్పటి తరం వాడిని.
మన మీడియా ఏంకరీ యాంకరులను Dag Hammarskjöld అనే పేరు పలకమని ... అదాటుగా ... అడిగి చూడాలని అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది 🙂.

(1960 దశాబ్ద ప్రారంభంలో విమాన ప్రమాదంలో మరణించిన అప్పటి ఐ.రా.స. సెక్రటరీ-జనరల్)

Zilebi చెప్పారు...



ఏమండీ భండారు వారు

మీరో మాట చెప్పి ఛా, నల్ లో దేన్లో నైనా వినరా వారి ఓ ఇంటర్ వ్యూ ఈ సబ్ జెక్ట్ పైన వచ్చే టట్టు చేద్దురూ


జిలేబి



విన్నకోట నరసింహా రావు చెప్పారు...

ఎందుకు “జిలేబి” గారు, నా పేరుని నా ఇంటిపేరుని కూడా పలకడంలో భ్రష్టు పట్టించడానికా.
థాంక్స్, బట్ నో థాంక్స్.